7, డిసెంబర్ 2012, శుక్రవారం

భారత చైనా సరిహద్దు ప్రహసనం

                        పునరావృత్తం’ అన్న దానికి సజీవ సాక్ష్యం భారత చైనా సరిహద్దు సంభాషణల ప్రహసనం. సోమవారం మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన పదిహేనవ విడత చర్చల సందర్భంగా ఈ వాస్తవం మరోసారి ధ్రువపడింది! సరిహద్దు వివాదం పరిష్కారంకోసం జరిగిన ఈ చర్చలలో ఎంతో ప్రగతి కనిపించినట్టు చైనా ప్రభుత్వ ప్రతినిధి దారుూబింగువో చేసిన ప్రకటన 2009 ఆగస్టులో ఆయన ఢిల్లీలో చెప్పిన మాటలకు ప్రతిధ్వని మాత్రమే! అప్పటి పదమూడవ విడత చర్చల సందర్భంగా భారత చైనా మధ్య ఎట్టి పరిస్థితిలోను యుద్ధం జరగబోదని బింగువో వాక్రుచ్చిపోయాడు! ఇప్పుడు మళ్లీ అదే మాటలను ఆయన పునరుద్ఘాటించారు! సరిహద్దు సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా దశాబ్దులుగా పడి ఉంది!     
             
                    2010లో చైనాలో జరిగిన పదునాలుగవ విడత చర్చలు కూడ ఇదే విధమైన ‘అద్భుతాల’ను సృష్టించింది! ‘ఉభయ దేశాల మధ్య గతంలో యుద్ధం జరగలేదు. ఇకపై జరగదు’ అన్న ద్వైపాక్షిక స్ఫూర్తి 1950వ దశకం నాటిది. అది అబద్ధమని 1962లో దురాక్రమణ జరపడం ద్వారా చైనా ఋజువుచేసింది. అందువల్ల, 1988 చివరిలో ఉభయ దేశాల మధ్య ‘పథభగ్న’ -పాత్ బ్రేకింగ్- మైత్రీ విధానం మొదలైనప్పటినుంచి భవిష్యత్తులో ఇక ఉభయ దేశాల మధ్య యుద్ధం జరగదని మాత్రమే చైనా ప్రతినిధులు పదే పదే ప్రకటిస్తున్నారు. మన ప్రభుత్వ ప్రతినిధులు కూడ వారితో గొంతులు కలిపి బృందగానాలు ఆలపించడమే అసలైన అద్భుతం! సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి చర్చలు 1990 దశకంనుంచి ఇప్పటివరకు చర్చలు కొనసాగుతుండడమే అద్భుతం! సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత 1990వ దశకంలోనే చైనా రష్యా తదితర పూర్వ సోవియట్ దేశాలలో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొంది. దశాబ్దుల తరబడి వివాదాన్ని పొడిగించలేదు. ఎందుకంటే వివాదం పరిష్కారం కావడంవల్ల చైనాకు కొత్త భూభాగాలు లభించాయి. కానీ మన దేశంలో సరిహద్దు వివాదం పరిష్కారం అయినట్టయితే చైనా తాను ఆక్రమించిన మన భూభాగాలను వదలిపెట్టవలసి వస్తుంది. ఈ సంగతి మనకూ తెలుసు. చైనా ప్రభుత్వానికీ తెలుసు! అందువల్ల నిరంతరాయంగా నిరవధికంగా సరిహద్దు చర్చలను కొనసాగించడమే చైనా వ్యూహంలోని భాగం! వివాదం పరిష్కరించుకోవడంలో చిత్తశుద్ధి ఉన్నవారు ఏదో విధంగా పరిష్కారం సాధించడానికి కృషిచేయాలి. కానీ మొక్కుబడిగా సంవత్సరానికి రెండురోజులపాటు జరిపే ఇలాంటి విందు సమావేశాలకు ‘చర్చలు’అని పేరు పెట్టుకోవడం దారుూబింగువో నుడివినట్టు ఉభయదేశాలు కలిసి సాధిస్తున్న అద్భుతం! పదమూడవ విడత తరువాత జరిగిన ప్రగతి ఏమిటి? నిరంతరం చైనా దళాలు సరిహద్దు రేఖలను అతిక్రమించి మన సీమలలోకి చొరబడడం!!
 
              ఈ చైనా చొరబాట్లను నిరోధించడానికి ఇప్పుడు ఉమ్మడి ‘కార్యాచరణ యంత్రాంగాన్ని’ రూపొందిస్తారట! ఇలాంటి యంత్రాంగాన్ని రూపొందించాలన్నది 2005లో కుదిరిన విస్తృత అంగీకారంలో భాగం! ఆ యంత్రాంగం పనిచేసిన జాడలేదు. ఆ తరువాతనే చైనా దళాలు దాదాపు ప్రతిరోజు ఎక్కడో అక్కడ మన భూభాగంలోకి చొరబడడం ఊపందుకొంది! మన భూభాగంలోకి చొరబడడం, రాళ్లపైన చెట్లపైన నినాదాలు వ్రాయడం, గుడారాలు వేసి అనేక రోజులపాటు తిష్ఠవేయడం వంటి పనులను చైనా దళాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇలాంటి చొరబాట్లకు ఏకైక కారణం చైనా దురాక్రమణ బుద్ధి!


               కానీ ఉభయదేశాల మధ్య సరిహద్దు రేఖ వాస్తవ ‘్భగోళిక స్థితి’ గురించి అవగాహనలో ఏర్పడి ఉన్న అంతరం వల్ల మాత్రమే చైనా దళాలు మన భూభాగంలోకి చొరబడుతున్నాయని గతంలో మన ప్రభుత్వం తేల్చివేసింది! అంటే మన భూమిని తమ భూమిగా భావించి చైనా దళాలు చొచ్చుకొని వస్తున్నాయన్నమాట! మన ప్రభుత్వమే ఇలా చైనా తరపున ప్రాతినిథ్యం వహించి వాదించడం మరో అద్భుతం! 
అలాంటప్పుడు ఉభయ దేశాల ప్రతినిధులు కలసినపుడు ఈ సంగతి ప్రస్తావనకు రానేరాదు! కానీ ‘అవగాహన’లో ఉన్న ‘అంతరం’ కారణంగా మన దళాలు చైనా భూభాగంలోకి ఎప్పుడూ కూడా ఎందుకని చొచ్చుకొని పోలేదు? చైనా దళాలు మాత్రమే ఎందుకని ప్రతిసారీ చొరబడుతున్నాయి? అన్న అనుమానం మన ప్రభుత్వానికి కలగకపోవడం అన్నింటికంటే గొప్ప అద్భుతం! అసలీ చర్చలు ఇప్పుడు జరపడమే మరో పరమాద్భుతం! ఎందుకంటే ఈ చర్చలు గత ఏడాది నవంబర్‌లో జరిగిపోయి ఉండాలి! కానీ పదిహేనవ విడత చర్చలు జరగడానికి రెండు రోజుల ముందు టిబెట్ బౌద్ధ గురువు దలైలామా ఢిల్లీకి వస్తున్నట్టు వెల్లడి కావడంతో చైనా నిరసన తెలిపింది. చర్చలను వాయిదా వేసింది! ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మన ప్రభుత్వం నిరసించకపోవడం మరో అద్భుత వైపరీత్యం!
                      చైనాతో మనకున్న అతి ప్రధానమైన సమస్య సరిహద్దు సమస్య! కానీ ఇది మూలపడిపోవడం బింగువో చెప్పినట్టు ‘ఉభయ దేశాలు కలిసి సృష్టించిన’ మహాద్భుతం. 1989 ఆరంభంలో మన ప్రభుత్వం ఈ అద్భుతానికి అంకురార్పణ చేసింది. సరిహద్దు సమస్యతో నిమిత్తం లేకుండా చైనాతో మైత్రిని, వాణిజ్య సంబంధాలను, సాంస్కృతిక, దౌత్య సహవాసాన్ని పెంపొందించుకోవాలన్నది ఈ కొత్త విధానం. 1962లో చైనా మన సరిహద్దులను వెన్నుపోటు పొడిచిననాటినుంచి మనకు అతి ప్రధాన లక్ష్యం దురాక్రమణలు గురయిన మన భూమిని విముక్తం చేయడం! కానీ ఈ లక్ష్య సాధన పథాన్ని మన ప్రభుత్వం 1988లో వదలిపెట్టింది! సరిహద్దుతో నిమిత్తం లేని కొత్త విధానాన్ని రూపొందించింది. అందువల్లనే నిజంగా ఇది ‘పాత్ బ్రేకింగ్’ విధానం. ఈ కొత్త బాటన సాగుతున్న భారత చైనా మైత్రి వాణిజ్య శిఖరంపైకి దూసుకొని పోతోంది. బింగువో సోమవారం అన్నట్టు ఇంకా ‘శిఖరంపైకి చేరలేదు’ కానీ గొప్ప ప్రగతి జరిగిపోయింది. ఏమిటా ప్రగతి? చైనా మనకు ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఇంతవరకు ఈ స్థానాన్ని పొందిన అమెరికా రెండవ స్థానానికి పడిపోయింది. కానీ దీనివల్ల మన విదేశీయ వినిమయ ద్రవ్యం భారీగా చైనాకు తరలిపోతోంది. మన ఎగుమతులకంటే దిగుమతుల విలువ రెండురెట్లు పెరిగిన కారణంగా గత ఏడాది దాదాపు లక్షా ఇరవైవేల కోట్ల రూపాయల వినిమయ ద్రవ్యాన్ని మనం చైనాకు అదనంగా చెల్లించాము! సరిహద్దు సమస్యను ఇలా మనం మాత్రమే మరచిపోయాము! 


                చైనా మాత్రం సరిహద్దు ప్రాంతమతంటా సైనిక స్థావరాలను ఆయుధ స్థావరాలను పెంపొందించింది. సరిహద్దు చర్చలు మొదలైన తర్వాత దాదాపు పదిహేను ఏళ్ళలో చైనా టిబెట్ అంతటా రైలు రోడ్డు మార్గాలను అత్యాధునికంగా తీర్చి దిద్దింది! చైనాకు మనకు గతంలో యుద్ధం జరగలేదన్న 1950 దశకం నాటి మైత్రి మాటలకు ప్రాతిపదిక. 1959 వరకూ మనకూ చైనాకూ మధ్య టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండటం, టిబెట్‌ను చైనా ఆక్రమించడంతో ‘్భరత టిబెట్’ సరిహద్దు ‘్భరత చైనా’ సరిహద్దుగా మారింది. ఈ చారిత్రక ‘మహాద్భుతం’ మన సరిహద్దు గోడకు కన్నం!

 http://sevalive.com/editorial/