థాయ్ ల్యాండ్ : ఇది బౌద్ధదేశమా ? హిందూదేశమా ?
ఇక్కడ విచిత్రమేంటంటే రాజు హిందువు. ప్రజలేమో బౌద్ధులు. కానీ థాయ్ రాజబిరుదాల్లో ఆయన్ని థేరవాద బుద్ధధర్మ పరిరక్షకుడని చదువుతారు. (చిఱు వివరణ :- థేరవాదం అంటే బుద్ధుణ్ణి దేవుడుగా కాక గురువుగా మాత్రమే భావించే బౌద్ధశాఖ. మన ఆంధ్రదేశంలో ఒకప్పుడు నాగార్జునుడు బోధించిన మహాయాన బౌద్ధానికి ఇది కొంచెం విరుద్ధంఅన్నమాట. మహాయానంలో బుద్ధుణ్ణి దేవుడుగా కొలుస్తారు)
అయితే రాజు చాలా విషయాల్లో బౌద్ధాన్ని అనుసరించడు. అందుచేత తనకోసం ప్రత్యేకంగా ఒక హిందూబ్రాహ్మణ్ణి రాజగురువుగా పెట్టుకున్నాడు. ప్రస్తుత రాజగురువు పేరు ఫారా రాజగురు వామదేవముని. అలాగే సలహాలివ్వడానికి ఆయనకొక రాయల్ కౌన్సిల్ ఉంది. అందులో ఏడుగురు భారతీయ బ్రాహ్మలున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా రాజుగారి పూర్వీకుల మాదిరే ఏ కాలంలోనో భారతదేశం నుంచి వలసపోయినవాళ్ళు. స్థానిక థాయ్ ఆడవాళ్ళని చేసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ ముఖకవళికలు భారతీయుల్లా అనిపించవు. ఇప్పుడు వాళ్ళందఱికీ థాయ్ భాషే మాతృభాష. ఈ థాయ్ భాష అక్షరాలు ప్రాచీన దాక్షిణాత్యబ్రాహ్మి (అంటే ఇప్పటి తమిళలిపికి దగ్గఱ) నుంచి ఉద్భవించాయట.
థాయ్ ల్యాండ్ లో తొంభై అయిదుశాతం మంది బౌద్ధులుగా నమోదయ్యారు. అయిదుశాతం మంది మాత్రమేబౌద్ధేతరులు. అందులో కేవలం ఒక లక్ష జనాభా గల హిందువులు కూడా ఉన్నారు. ఈ హిందువుల్లో ఎక్కువమంది ఇటీవలి శతాబ్దాల్లో భారతదేశం నుంచి అక్కడికి వలసపోయినవాళ్ళే. వీళ్ళు వలసపోవడానికి ముందే ఆ దేశంలో శివాలయాలూ, బ్రహ్మాలయాలూ, విష్ణ్వాలయాలూ, విఘ్నేశ్వరుడి ఆలయాలూ వేలాదిగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటిల్లో పెక్కు ఆలయాలు ఈమధ్య కట్టినవి కావు. చాలా ప్రాచీనమైనవి. కట్టించినది భారతీయులు కారు. థాయ్ వాసులే. కొన్నైతే రాజుగారే ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేసి మఱీ కట్టించాడు. ఎటొచ్చీ, ఇక్కడొక తమాషా ఉంది. బౌద్ధంలోంచే హిందూమతం ప్రభవించిందని ఎక్కువమంది థాయ్ వాసులు నమ్ముతారు. ఇదొక అమాయక నమ్మకమే తప్ప ఇందులో మనల్ని (భారతీయుల్ని) అవమానించేదేమీ లేదు. ఎందుకంటే తాము అవలంబిస్తున్న హిందూమతాన్ని ఇండియా అనే ఒక పొఱుగుదేశంలో కూడా అవలంబిస్తారని బాగా చదువుకున్నవాళ్ళకి తప్ప సామాన్య థాయ్ పౌరులకి తెలీదు.
థాయ్ బౌద్ధ భక్తుల ద్వారా ఈ దేవాలయాలకి భారీగా ఆదాయలొచ్చిపడుతున్నాయి. కారణం ఏంటంటే - థాయ్ ప్రజలు వేదాంతంలో బౌద్ధాన్ని, లౌకిక జీవితంలో హిందూమతాన్ని అవలంబిస్తారు. ఉదాహరణకి - బౌద్ధంలో సన్న్యాసం తప్ప వేఱే ఆశ్రమం లేదు. కనుక పెళ్ళిళ్ళూ పేరంటాలూ, గృహప్రవేశాలూ గట్రా కర్మతంత్రాలకి హిందూ ఆచరణలు చేస్తారు. అలాగే కోరికల కోసం మొక్కుకోవడానికి హిందూ దేవాలయాలకి వెళతారు. బుద్ధుడు కోరికలు తీర్చడని వారి అభిప్రాయమట. అలా అక్కడ అడుగడుగునా బుద్ధుడికీ, హిందూ దేవతలకీ సమాన ప్రతిపత్తి చాలకాలంనుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలోని మతపరిస్థితుల మీద ఒక విపులమైన వ్యాసాన్ని ఈ క్రింది లంకెమీద నొక్కి చదవొచ్చు.
http://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3760
మఱికొన్ని ఛాయాచిత్రాలు ఈ క్రింద:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి