16, ఫిబ్రవరి 2012, గురువారం

మతహింస బిల్లు మేలెంత? - వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు

ప్రభుత్వం ఏ చట్టం తీసుకువచ్చినా అంతిమంగా అది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలి. సమాజంలో శాంతికి, ప్రజలంతా కలిసి మెలిసి జీవించడానికి ఉపయోగపడాలి. ఏ చట్టం లక్ష్యమైనా అదే కావాలి. కానీ కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు ఇలాంటి ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయ. దీనివల్ల సమాజంలో మరింత అశాంతికి దోహదం చేస్తుంది. ఓటు బ్యాంకు వంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం బిల్లులు తీసుకు వస్తే అది సమాజంలో తీవ్రమైన ప్రభావం చూపించి, అశాంతిని రేకెత్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన మతహింస బిల్లుపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. కానీ ఈ బిల్లు అర్జంట్‌గా కావలసింది ఎవరికి? ప్రజల కోసమా... వచ్చే రెండున్నర ఏళ్ల తరువాత జరిగే ఎన్నికల కోసం అధికారపక్షానికా? ప్రమాదకరమైన ఈ బిల్లుపై మేధావుల అభిప్రాయాలివి .
  • వేదింపులు  తప్పవు! - రే. టి. భాస్కర్  వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ 
  • హిందువులను  బలిచేయడమే  - శ్రీ రాం మాధవ్ 
  • కాంగ్రెస్  నియంతృత్వానికి నిదర్శనం - అరుణ్  జైట్లి 
  • విద్వేషాలు  రగిలించే చట్టాలు వద్దు - టి పురుశోత్తమ రావ్
వేధింపులు తప్పవు! - రెవరెండ్ టి. భాస్కర్
 
భారతదేశం మత సామరస్యానికి పెట్టింది పేరు. భారతీయ సంస్కృతికి మించిన సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. నేను ఐదారు దేశాల్లో పర్యటించాను కాని, భారత్‌లో ఉన్న విధంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన మత సామరస్యం ఎక్కడా నాకు కనిపించలేదు. అందుకే భారతదేశం అంటే విదేశాల వారు మోజుపడతారు. భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. భారతీయ జీవన విధానాన్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. భారత్‌లో చట్టాలకు ఎలాంటి కొదవాలేదు. ప్రస్తుతం మన సమాజంలో అనేక చట్టాలున్నాయి. ఈ చట్టాలన్నీ చిత్తశుద్ధితో అమలవుతున్నాయని చెప్పలేం. ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల చట్టం కాని, గృహహింస చట్టం కాని ఇదే తరహాలో రూపొందించిన ఇతర చట్టాలు కాని ‘ట్రూస్పిరిట్’తో అమలవుతున్నాయని ఎవరూ గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. ఈ తరహా చట్టాలు అవసరమే కాని, వీటిని కొంతమంది దుర్వినియోగం చేసేందుకు, గిట్టనివారిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు వినియోగిస్తున్నారు. అందువల్ల కొత్తగా ఎలాంటి చట్టాలు రూపొందించాలనుకున్నా, ప్రజల కోణంలో ఆలోచించాలి. కొత్త చట్టాలు సమాజాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయో పరిశీలించి రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ప్రివెన్షన్ ఆఫ్ కమ్యునల్ అండ్ టార్గెటెడ్ వాయలెన్స్ బిల్, 2011’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ బిల్లును ఏ విధంగా, ఏ ఉద్దేశంతో రూపొందించినా, అమలు చేయాల్సింది ప్రస్తుతం ఉన్న యంత్రాంగమే కదా! ఇప్పుడు భారత్‌లో మతసామరస్యానికి గాని, మత స్వేచ్ఛకు కాని వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మతపరమైన వేధింపులు కూడా ఉన్నాయని చెప్పడానికి వీలులేదు. అన్ని మతాల వారు కలిసి జీవిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వెయ్యిరెట్లు మేలని చెప్పకతప్పదు.

మతంకాని, మత సంబంధమైన చట్టాలు కాని మానవత్వాన్ని పెంపొదించే విధంగా ఉండాలే తప్ప, మనుషుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉండకూడదు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కొత్తగా ప్రివెన్షన్ ఆఫ్ కమ్యునల్ అండ్ టార్గెటెడ్ వాయలెన్స్ బిల్లు తీసుకువస్తుందో అర్థం కావడం లేదు. ప్రస్తుత పరిస్థితిలో ఈ తరహా చట్టం కావాలని ఎవరు కూడా కోరలేదు కదా! ప్రజలు ప్రభుత్వం నుండి కోరుకునేవి ప్రధానంగా వౌలిక సదుపాయాలు- తాగడానికి మంచినీరు, సరైన ఆహారం అందుబాటులో ఉండటం, నివసించడానికి గృహం, గ్రామాలకు రవాణాసౌకర్యం. ఈ వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. నేటికీ మన దేశంలో రోడ్డులేని గ్రామాలు, తాగునీటి సౌకర్యంలేని గ్రామాలు, విద్య, వైద్య సౌకర్యం లేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. రెండుపూటలా కడుపునిండా భోజనం చేయలేని నిర్భాగ్యులు కూడా ఉన్నారు. తెలివి ఉన్నప్పటికీ, చదువుకునే అవకాశాలు లేని విద్యార్థులు ఎందరో ఉన్నారు. అలాంటి వారి సేవలను, మేధస్సును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

 
మేం (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా-డయోసిస్ ఆఫ్ మెదక్) నడిపిస్తున్న విద్యాలయాలు, ఆసుపత్రుల్లో అన్ని మతాలకు చెందిన వారు టీచర్లుగా, డాక్టర్లుగా, ఇతర ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అన్ని మతాల వారికి సేవలు అందుతున్నాయి. భగవంతుడు అనే వాడు సమస్త మానవాళిని రక్షించేవాడు. అందుకే ప్రవక్తలు కూడా తమ బోధనలను మనుషుల మధ్య స్నేహభావాన్ని పెంపొదించే విధంగా చేయాలే తప్ప ఘర్షణలు రేకెత్తించే విధంగా చేయకూడదు. ప్రభుత్వం కూడా ఉన్న చట్టాలను సమర్థతగా అమలు చేస్తే బాగుటుందే తప్ప, కొత్త చట్టాలను తీసుకువచ్చి ఘర్షణలకు తావు ఇవ్వకుండా, మనస్పర్థలు రాకుండా చూడాలి.

హిందువుల్ని బలిచేయడమే! - శ్రీ  రామ్‌మాధవ్

మత కలహాలను నిరోధించే ముసుగులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన పనిచేస్తున్న జాతీయ సలహా మండలి రూపొందించిన బిల్లు మతం పేరిట ప్రజలను, తద్వారా దేశాన్ని రెండుగా విభజిస్తుంది. మైనారిటీల కోసం మెజారిటీ వర్గాన్ని బలి తీసుకుంటుంది. మనది హిందూ దేశం. హిందువులు శాంతి కాముకులు కావటం వల్లే దేశం ప్రశాంతంగా ఉంటోంది. హిందువులు ఎన్నడూ శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన దాఖలా లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న బిల్లు చట్టరూపం ధరిస్తే మెజారిటీగా ఉన్న హిందువులు నానాఇబ్బందులకు గురవుతారు. హిందువులే తప్ప ముస్లింలు లేదా క్రైస్తవులు మతకలహాలకు పాల్పడరన్న ప్రధాన ఉద్దేశ్యంతో ఈ బిల్లును రూపొందించారన్నది స్పష్టమవుతోంది. ముస్లిం మైనారిటీలను పల్లెత్తు మాట అంటే హిందువులు కఠిన శిక్షకు గురికాక తప్పదు. హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉన్న దేశంలో వారిని మైనారిటీల కోసం పణంగా పెట్టాలన్న దురాలోచనను ప్రతిఘటించి మన హక్కులను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. ఈ బిల్లు చట్టంగా మారితే ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థకే విఘాతం కలుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును కూడా కేంద్రం ఈ బిల్లు ద్వారా హరించే వీలుంటుంది. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారితే శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్న మిషతో ఆంతరంగిక భద్రత దృష్ట్యా రాష్టప్రతి పాలనను విధించే అధికారాన్ని ఈ చట్టం కేంద్రానికి కల్పిస్తుంది. ఈ బిల్లు చట్టరూపం ధరించాక దానిని అమలుచేయటానికి జాతీయ స్థాయిలో ఏడుగురితో ఒక అధారిటీ ఏర్పడుతుంది. ఈ అధారిటీలో మైనారిటీ వర్గానికి చెందిన నలుగురు సభ్యులు మెజారిటీలో ఉంటారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉంటారు. రాష్ట్ర స్థాయిలో కూడా కుల, మతాల ప్రాతిపదికపై అధారిటీలు ఏర్పడతాయి. అంటే మైనారిటీల దయాదాక్షిణ్యాలు ఇష్టాఇష్టాలపై మెజారిటీ వర్గం అంటే హిందువుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. పోలీసు, పారామిలటరీ బలగాలను ఆదేశించే అధికారం ఈ అధారిటీకి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వంటి అత్యంత బలమైన చట్టం ఉండగా ఇప్పుడు మత కలహాల నిరోధ బిల్లును తీసుకువచ్చి మైనారిటీలను పరిరక్షిస్తామని చెప్పటం ఓటు బ్యాంకు రాజకీయం తప్పించి మరొకటి కాదు. గతంలో టాడా, పోటా చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త బిల్లులో టాడా, పోటాలోని అంశాలనే చేర్చింది. టాడా, పోటా చట్టాలు జాతి వ్యతిరేకమని గొంతుచించుకున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్ధులను అణిచివేయటానికి ఈ కొత్త బిల్లును ఆయుధంగా ప్రయోగించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించి తీరాలి. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడినా మెజారిటీ వర్గమైన హిందువులు మైనారిటీలకు బలికాక తప్పదు.
 
కాంగ్రెస్ నియంతృత్వానికి నిదర్శనం-అరుణ్ జైట్లీ

మతకలహాలను నిరోధించటానికి రూపకల్పన చేసిన బిల్లు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరికి సరైన సాక్ష్యం. అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులే తప్పించి ఇతర మైనారిటీ వర్గాలు మత కలహాలకు పాల్పడరన్న దురభిప్రాయంతో జాతీయ సలహా మండలి తయారు చేసిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశానికి గొడ్డలిపెట్టులా మారుతుంది. దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువుల జీవితం దినదిన గండంలా మారుతుంది. మైనారిటీల చేతుల్లో మెజారిటీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఈ బిల్లులో పొందుపరచిన అనేక క్లాజులు ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రాల ఆధీనంలో ఉన్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కబళించే వీలుంటుంది. శాంతిభద్రతలను పరిరక్షించే అధికారం రాష్ట్రానికే ఉంది. అయితే పరిస్థితిని అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందన్న ఆరోపణతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్టప్రతి పాలన విధించడం ద్వారా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టటానికి ఈ బిల్లు అధికార పక్షానికి వరప్రసాదంగా మారుతుంది. మతకలహాలకు పాల్పడటంతో పాటు మైనారిటీలను మానసికంగా హింసించారన్న ఆరోపణపై మెజారిటీలపై కేసు బనాయించటానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. మత కలహాలు చోటుచేసుకున్నప్పుడు మైనారిటీలపై దాడి చేశారన్న ఆరోపణపై మెజారిటీ వర్గానికి చెందిన వారికి శిక్ష విధించే ఈ చట్టం మైనారిటీలకు మాత్రం మినహాయింపును ఇస్తోంది. కనుక మెజారిటీలపై దాడి చేసినా మైనారిటీలకు శిక్ష పడదు. ఈ బిల్లు చటంగా మారితే తీవ్రవాదులు తమకు తాముగా ఎటువంటి విధ్వంసకాండకు పాల్పడకుండానే హిందూ-ముస్లింల మధ్య మత కలహాలను రెచ్చగొట్టి తమ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించుకో గలుగుతారు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. దేశంలో మత సామరస్యం పెరిగింది. అన్ని వర్గాలవారు శాంతియుతమైన సహజీవనానికి అలవాటు పడుతున్నారు. మత కలహాలు చాలావరకూ తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మతకలహాల నిరోధక బిల్లు తీసుకురావటంలో అర్థం లేదు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి దారితీయటం ఖాయం. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ మెప్పుపొందటానికి హిందువులకు బద్ధవిరోధులుగా గుర్తింపు పొందినవారు తయారుచేసిన ఈ బిల్లును ఉపసంహరించి తీరాలి. మెజారిటీ వర్గం తమ హక్కులను కాపాడుకోవటానికి పోరాటానికి సిద్ధం కావాలి. నింగిని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, భయపెడుతున్న ఆహార భద్రత వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలను ఆదుకోవటంలో యుపిఎ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి యుపిఎ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. వామపక్ష తీవ్రవాదం, మావోయిస్టు నక్సల్స్ ఆగడాలను అదుపు చేయడంపై దృష్టిని కేంద్రీకరిస్తే అభివృద్ధి జరుగుతుంది.
  
 

విద్వేషాలు రగిల్చే చట్టాలు వద్దు- టి. పురుషోత్తమరావు
 
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మహోన్నతమైనవి. తరతరాలుగా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జోరాస్ట్రియన్లు, బౌద్దులు, జైనులు తదితర మతాలవారు కలిసి జీవిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం తరహాలో సహజీవనం కొనసాగిస్తున్నారు. వివిధ మతాల ప్రజలు పరస్పరం ఒకరి మతాచారాలను మరొకరు గౌరవించుకుంటూ, జీవనం గడుపుతున్నారు. ఈ జీవన విధానాన్ని మరింత పటిష్టం చేసే విధంగా చట్టాలను రూపొందించాలే కాని, వివిధ మతాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా చట్టాలను రూపొందించవద్దు. భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చింది. అందుకే మతపరమైన స్వేచ్ఛను ప్రజల ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ పరిస్థితిలో పాక్షికమైన చట్టాలను పార్లమెంట్ కాని, శాసన వ్యవస్థ కాని రూపొందించడం శ్రేయస్కరం కాదు. అనాలోచితమైన చట్టాల మూలంగా, ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే విధంగా చట్టాలను రూపొందించడమంటే సమాజానికి కీడు చేసినట్టే అవుతుంది. మన దేశంలో ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం ఉంది. దళితులు, గిరిజనుల రక్షణకు ఈ తరహా చట్టం అవసరమే కాని, ఈ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఒక వ్యక్తి కాని, ఒక వర్గం కాని, ఇతర వ్యక్తిని లేదా మరో వర్గాన్ని ఇబ్బందులకు గురిచేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం చేసే ఎలాంటి చట్టాలైనా, ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి ఆయుధంగా మారకుండా, దుర్వినియోగం కాని రీతిలో, ప్రజల మధ్య సోదరభావం, మైత్రీభావం పెంపొందించే విధంగా ఉండాలి. ప్రపంచం ఒకవైపు తీవ్రవాదంతో అట్టుడికిపోతోంది. అమెరికా వాణిజ్య కేంద్రాలపై జరిగిన దాడితో తీవ్రవాదం ఎంత ప్రమాదకరమైందో ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా పేరుతెచ్చుకున్న అమెరికా గుర్తించింది. భారత్, పాకిస్తాన్‌లు కూడా తీవ్రవాదుల దుశ్చర్యలకు చాలా నష్టపోతున్నాయి.
 
ముంబాయిలో బాంబు పేలుళ్లు, పార్లమెంట్‌పై దాడి, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు, ఢిల్లీ హైకోర్టు ఎదుట బాంబు విస్ఫోటనం తదితర సంఘటనలు తీవ్రవాదులు దుశ్చర్యలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ పరిస్థితి ఉండగా, మరోవైపు మత విద్వేషాలు కూడా సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. వాస్తవంగా భారత్‌లో వివిధ మతాల వారు సహజీవనం సాగిస్తుండగా, రాజకీయాల్లో లబ్దిపొందేందుకు మాఫియాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. అన్నా హజారే అవినీతిపై చేపట్టిన పోరాటానికి భారతీయులంతా కుల, మతాలకు అతీతంగా అండగా నిలిచారు కదా! అంటే ఇక్కడ ఏం స్పష్టమవుతుంది? అవినీతి, అక్రమాలు, అధర్మానికి భారతీయులంతా వ్యతిరేకంగా పోరాడేందుకు, నీతివంతమైన, స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థం కావడం లేదా? ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ లబ్దికోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణను సృష్టించే విధంగా చట్టాలను రూపొందించడం ఎంతమాత్రం తగదు. ప్రజల అభిప్రాయాన్ని చట్టసభల సభ్యులు చట్టసభల్లో ప్రస్తావించాలి. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా, ప్రజలందరికీ సమానంగా రాజ్యాంగపరమైన హక్కును కల్పించాల్సిన బాధ్యత చట్టసభలపై ఉంది. భారత్‌ను బలహీనం చేసే చట్టాలను రూపొందించడం శ్రేయస్కరం కాదని గుర్తించాలి.
 
 http://rastrachethana.blogspot.in/2011/09/blog-post_22.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి