14, మార్చి 2012, బుధవారం

సాంస్కృతిక భారత్‌


ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను' అని వేదర్షి గానం చేశాడు. ఏ పుడమి యొక్క ఎల్లల్లో మాత్రమే హిందువుల (భారతీయుల) పుణ్యక్షేత్రాలు వెలసినవో ఆ పుడమి అయిన భారత భూమియే మన తల్లి. మనమంతా ఆమె సంతానం. 

'మాతా పృథ్వీ పుత్రో హం పృథ్వివ్యా:' ఈ భూగోళమంతా మన తల్లి అనే అర్థం పైన పేర్కొన్న వేదసూక్తికి అన్వయిస్తే, భారతదేశానికి బయట కూడా మన పుణ్యక్షేత్రాలు ఉండి ఉండేవి గదా! భారతదేశమే పుణ్యభూమి, మిగతావన్నీ భోగ భూములు అని మన ప్రాచీన వాఙ్మయం ఎందుకు చెబుతున్నట్లు? 

''తతోన్యాభోగభూమయ:'' (విష్ణు పురాణం). మన ప్రాచీన భారతీయులు అమెరికా ఖండంలో, ఆస్ట్రేలియాలో (పూర్వార్థ గోళంలోనే కాక పశ్చిమార్థ గోళంలో సైతం) మన సంస్కృతిని వ్యాపింపజేశారని చరిత్ర చెపుతోంది గదా! భూగోళమంతా మన పూర్వీకులు సంచరించారనే దాఖలాలెన్నో ఉన్నాయి. మరి అక్కడెక్కడా మన పుణ్యక్షేత్రాలను మన వాళ్ళెందుకు నెలకొల్పలేదో? కనుక నిర్దిష్టంగా, నిర్దుష్టంగా మాతాపృథ్వీ అంటే భారతపృథ్వీమాతా అనే అర్థం.
హింగూళాదేవి శక్తిపీఠం అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నది. ఉపగణస్థాన్‌ దాని ప్రాచీన నామం. అది ఒకప్పుడు భారతదేశ అంతర్భాగం. సాంస్కృతిక భారతదేశ పటాన్ని చూసినట్లైతే అర్థమవుతుంది.

శ్లో|| ఉత్తరం యత్‌ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణమ్‌
వర్షం తత్‌ భారతం నామ భారతీ యత్ర సంతతి:|

భావం : సముద్రానికి (హిందూ మహా సముద్రానికి) ఉత్తరంగా హిమాద్రులకు దక్షిణంగా ఉన్న వర్షమే భారత వర్షం ఆమె సంతానమే భారతీయులు.
'ఆసేతు శీతనగరం' ఈ సమాసం అతి ప్రాచీనమైనది.

భారతమాత కుమారుని పేరుతో తల్లిని పిలవడం మనదేశపు ప్రాచీన సంప్రదాయం. మహామహిమాన్వితుడైన భరతుని తల్లిగా మనదేశానికి భారతమనే పేరు వచ్చింది. 'రాముని తల్లి కౌసల్య' వంటి ప్రయోగం ఇలాగే ఏర్పడింది. అంటే మన పెద్దన్న భరతుని తల్లి అంటే మన తల్లే గదా!
హిందువులకు ఇది మాతృభూమి, పితృభూమి, పుణ్యభూమి, తపోభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, దేవభూమి మన హిందువుల సర్వస్వం.

శ్లో || గాయన్తి దేవా: కిల గీతకాని ధన్యాస్తుయే భారత భూమి భాగే
స్వర్గా పవర్గాస్పద హేతుభూతే భవన్తి భూయ: పురుష: సురత్వాత్‌||

భావం : స్వర్గానికి, మోక్షానికి ద్వారమైన భారత భూభాగంలో నివసిస్తున్న మనుజులు తమకంటే ఎంత ధన్యులో గదా అని దేవతలు స్తోత్రం చేస్తున్నారు.
కృష్ణసార మృగం (నల్లచారల జింక) చరించే చోటు తపోభూమి, యజ్ఞభూమి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం భారత భూమిలోనే (అంతటా) కృష్ణసారమృగం సంచరిస్తుంది.

ఈ హిందు భూమిలో ప్రతి అణువూ, ప్రతి క్షణమూ పవిత్రమే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని కదా వేదాలుచెప్తున్నాయి.ఈ భూమి మనకు తల్లి, తండ్రి, గురువు.

మరి ఈ నేతల్లో! మనం బ్రతికి ఉన్నన్నాళ్ళూ మోస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా, మనల్నందరినీ, ఆఖరికి ఆమెకే ద్రోహం చేసేవాళ్లను సైతం మోస్తోంది. ఆ తల్లికి ఉన్న క్షమాగుణం మరెవరికి ఉంటుంది? ఎవరైనా ఊసుబోక అనవసరంగా నేలను తన్నితే లేక నేలను కర్రతో కొట్టినా, పనిలేక త్రవ్వినా, 'తప్పు. భూమాతకు కోపం వస్తుంది!' అని పెద్దలు నేటికీ అంటూంటారు. ఏదైనా నిర్మాణానికి నేలను త్రవ్వబోయే ముందు భూమాతకు పూజచేసి అనుమతి తీసికొంటారు. ఏదైనా నిర్మాణానికి నేలను త్రవ్వబోయే ముందు భూమాతకు పూజచేసి అనుమతి తీసికొంటాము. ఏరువాక ప్రారంభంలో నేల తల్లిని పూజించి అనుమతి తీసికొనే ఆచారం మనది. 'క్షమయా ధరిత్రీ' హిందూ స్త్రీని క్షమాగుణంలో భూమాతకు పోలుస్తారు.

మన తండ్రి : రక్షించేదీ, పోషించేది తండ్రి. ఉత్తరాన ప్రపంచంలోకెల్లా ఎత్తైన మంచుకొండలు పెట్టని కోటగా వాయవ్య ఈశాన్య దిక్కుల వరకూ వ్యాపించి ఉన్నాయి. ఈ హిమాలయాలూ మూడు వైపులా నున్న మూడు సముద్రాలూ, శత్రువులనుండే కాకుండా అతిశీతల వాయువులనుండీ, అతి ఉష్ణవాయువుల నుండీ మనలను కాపాడుతున్నాయి. ఇలాంటి విశిష్ట భౌగోళిక అస్తిత్వంతో భారతదేశం తండ్రిగా మనలను రక్షిస్తోంది. వింధ్య శ్రేణులు, ఆరావళి కొండలు, సహ్యోద్రులు మన జాతీయ వీరులను తమలో దాచుకొని శత్రువులనుండి రక్షణ కలుగజేశాయి. పోషించేది కూడా తండ్రే. అత్యంత సారవంతమైన నేలలతో, అనుకూలమైన వాతావరణంతో గంగా కావేరీ వంటి జీవనదుల జల ప్రవాహాలతో, పాడిపంటలతో, సకల సంపదలకు వివిధ వృక్ష జంతుపక్షి జాతులకు నెలవైన ప్రకృతితో, అత్యంత విలువైన రత్న ఖనిజాలతో మనలను పోషించే ఈ భూమి మన తండ్రి. 'రీజియన్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌' తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితాన్నిచ్చే నేలగా మనదేశం గుర్తింపు పొందింది.

మనగురువు : మన మాతృభూమి తొలిపేరు 'అజనాభం'. అంటే బ్రహ్మదేవుని బొడ్డు. అంటే మానవ సృష్టికి వికాసానికి న్యూక్లియస్‌ (జీవకేంద్రం) ఈ దేశం.

శ్లో|| అస్త్యుత్తరస్యాం దిశిదేతాత్మా హిమాలయో నామనగాధిరాజ:|
పూర్వా పరౌ వారినిధీ విగాహ్య స్థిత: పృథివ్యా: ఇవ మానందండ:||
(కాళిదాస 'కుమార సంభవం')

భావం : ఇక్కడికి ఉత్తరదిశలో దేవాతాత్మ అయిన హిమాలయమనే పర్వత రాజున్నాడు. ఆయన తన రెండు బాహువులను పూర్వ పశ్చిమాలలోనున్న సముద్రాలలో ముంచుతున్నాడు. ఆ దేవతాత్మ ఈ పృథ్వికి మానదండం (కొలబడ్ద) యుగయుగాలుగా ఎందరో మహర్షులకు, సిద్ధులకు, మహా తపస్సులకు, మహా యోగులకు నిలయం ఆ హిమాలయాలు. మానవీయ సంస్కృతీ ద్రష్ఠలు ఎందరో అత్యంత ప్రాచీన కాలం నుండి ఈ నాటికి కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.

ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద గ్రజన్మన:
స్వం స్వం చరిత్రన్‌ సృష్టేరన్‌ పృథివాం సర్వమానవా:||

భావం : పృథ్విలోని మానవులందరూ ఈ దేశంలో పుట్టిన మహాత్ములనుండి తమ తమ నడవడికను నేర్చుకుంటారు. ఇది మనవు యొక్క శాసనం. మానవతా వికాసానికి పాదు ఈ దేశం. 'ఇండియా ఈజ్‌ ది మదర్‌ ఆఫ్‌ అజ్‌ ఆల్‌' (మనందరికీ (మానవాళికంతటికీ) భారతదేశమే తల్లి) అని అంటాడు విల్‌ డ్యూరాంట్‌. ''భారతదేశం లేనిదే ప్రపంచం లేదు, 'హిందూ ధర్మం లేనిదే భారతదేశం లేదు' అని అంటుంది అనీబిసెంట్‌. టాయన్‌బీ, మాక్సముల్లర్‌, రోమారాలా లాంటి పాశ్చాత్య మేధావులు భారతదేశ గుణ గానంచేశారు. ఇది పుణ్యభూమి, విశ్వగురువు, కర్మభూమి. ఇక్కడ జన్మించి నిష్కామ కర్మ ఆచరిస్తేనే మోక్షం లభిస్తుంది. కనుక ఇది మోక్ష భూమి. మానవాళికంతటికీ మానవత్వంతో బ్రతికే విధానాలనూ, మానవులను దైవ సమానులుగా తీర్చిదిద్దే సంస్కృతీ సభ్యతలను జ్ఞాన విజ్ఞానాలను తొలిగా అందించిన గురువు భారతభూమియే.

మనధర్మభూమి : 'విశ్వ ధర్మే ప్రతిష్ఠితా:' ఈ చరాచర జగత్తాంతా ధర్మంపై అధిష్ఠితమైయున్నది అని శ్రుతి వాక్యం. 'ధర్మ' మనే పదం కేవలం భారతీయ భాషలలోనే ఉన్నిది. ఏ ఇతర భాషలలోనూ దీనికి సమానార్థకమైన పదం లేదు. మన ద్రష్ఠలు, మహర్షులు, రాజర్షులు, ఆచార్యులు మానవాళినంతటినీ దృష్టిలో పెట్టుకొని మానవ ధర్మాన్ని మనకు అందించారు. వాస్తవానికి మన ధర్మం విశ్వమానవ ధర్మ, హిందూ దేశంలో ఉద్భవించింది గనుక ఇది హిందూ ధర్మం అయింది. అదే భారతీయ సనాతన ధర్మం. మానవులు కలిసికట్టుగా వ్యవస్థితంగా వ్యక్తిగతంగా, సమిష్ఠిగా వ్యవహరించవలసిన తీరుతెన్ను లను చూపేదే ధర్మం. భారతదేశమే ధర్మభూమి. ఈ ధర్మభూమియే విశ్వాసానికి అధిష్ఠాత్రి.

ఇది దివ్యభూమి : ఇక్కడి ప్రతిచెట్టు, పుట్ట, రాయి రప్ప, ప్రతి ప్రాణి, ప్రతి పక్షీ పవిత్రమే. ఉదాహరణకు ఎలుక విఘ్నేశ్వరుని వాహనం. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అన్నీ పూజార్హమే. ప్రతి వాగు, ప్రతి సెలయేరు, ప్రతి నదీ నదమూ అన్నీ పవిత్రమే. అడుగడుగునా పుణ్యక్షేత్రమే. మహాత్ముల, అవతార పురుషుల, సిద్ధ మహాత్ముల, మహాయోగుల, మహితాత్మలైన నారీమణుల పాదస్పర్శచే మరింత పవిత్రమైనది. గోమాత భూమాత నదీమాత తులసీమాత, తన భార్య తప్ప ప్రతి స్త్రీ తల్లియే. ఆడపిల్లలను, పసివాళ్ళను సైతం తల్లిd, అమ్మా అని పిలుస్తాం. హిందువుయొక్క నరనరాన, కణకణాన ఈ పవిత్ర భూమిలోని పంచభూతాలు నిండిఉన్నాయి. మాతృభూమిపట్ల మమకారం మానవునికి సహజంగా అబ్బుతుంది. లక్షల సంవత్సరాల నుండి పరంపరానుగతంగా, అనూచానంగా మనదైన ఈ భూమి భారత జన్మభూమి మన హిందువులకు సర్వస్వం.

మన ప్రత్యక్షదైవం : సకల చరాచర సృష్టికి మూలకారణమైన ఏదో ఏకైక శక్తి తప్పక ఉండి తీరాలి అని ఆలోచించాలి. మన ప్రాచీనులు దానికొక అద్భుతమైన పేరు పెట్టారు. 'ఆదిశక్తి'' అని. ఆధునిక విజ్ఞానం కూడా 'ప్రియార్డియల్‌ ఎనర్జీ' అని, 'ఫండమెంటల్‌ ఎనర్జీ' అని అంటోంది. శక్తి అత్యంత బృహద్రూపంలో (మహత్తు) అనంతమైనదిగా, అంతుబట్టనిదిగా, అత్యంత సూక్ష్మరూపంలో, అగోచరంగా పరమాణు (మాలిక్యుల్‌) రూపంలో ఉంటుంది. అది అనుభవంలో, అనుభూతిలో మాత్రమే వ్యక్తమవుతుంది. కనుకనే అది సర్వ వ్యాప్తం అది 'ఆదిపరాశక్తి' స్వయంభువు అదే త్రిపుర, మహాత్రిపుర సుందరి. ఎలక్ట్రాన్‌, న్యూట్రాన్‌, ప్రోటాన్‌లు త్రిగుణాలు, త్రితత్వాలు, త్రిశరీరాలు, త్రిఅవస్థలు. వీటి తురీయావస్థయే (నాలుగవ స్థితి) మహాత్రిపుర సుందరి. లేక పరబ్రహ్మం. ఈ ఆది పరాశక్తి కల్పనకు జన్మస్థానం భారత భూమియే. తొలి క్రోడీకృత విజ్ఞానం వేదములే గదా! వేదభూమి భారతదేశమే గదా! ఆ ఆదిపరాశక్తి వివిధ విభూతులతో ప్రస్ఫుటమవుతుంది.

- వాత్సల్యానంద భారతీస్వామి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి