3, మార్చి 2012, శనివారం

కురుక్షేత్రయుద్ధం మొత్తం కల్పితమేనా? 3/3

- రావు తల్లాప్రగడ




అందరం చిన్నప్పుడు స్టార్ ట్రెక్ సినిమాలు చూసేవుంటాము. సైన్స్ ఫిక్షన్ అన్న మాటనే  మన ఊహల అంచులకి తీసుకుపోయేటి అంతటి మహాద్భుత రూపకల్పనలను ఆ చిత్రాలలో సమకూర్చారు. అందులో వాడే స్పేస్‌షిప్పులకి ఇంధనంగా పెట్రోలును గానీ బొగ్గుని కానీ వాడరు. అందులో వాడేది అణుశక్తి, అంటే అది మనకు తెలిసిన ఆణుశక్తి కూడా కాదు. సాధారణయాటంతో యాంటీయాటంని  “ఢీ” కొడితే ఒక మహా శక్తి విడుదలయ్యి, దానితో వాళ్ళ “స్పేస్‌షిప్పు” కాలగమనం కంటే వేగంగా ప్రయాణిస్తుందనేటు వంటి ఒక అసమాన్యమైన  ఊహను రూపొందించింది ఈ చిత్రం.  
1928లో నోబెల్ బహుమతి గ్రహిత, పౌల్ డిరాక్ అనే శాస్త్రవేత్త తాను వేసిన అనేక సమీకరణాలలో యాంటీ మాటర్ అనేది బిగ్ బాంగ్ సమయంలో (శక్తి తాను పదార్థంగా రూపాంతరం చెందినప్పుడు) సాధారణ మాటర్‌తో సమానంగా తయారయ్యిందని తేల్చి, ప్రతిపాదించాడు. కానీ ఆ   యాంటీ మాటర్ అంతా ఏమయ్యిందో ఈ నాటిదాకా అంతు పట్టడంలేదు. కానీ దాని పైన అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. తరువాత కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ పరిశోధకులైన ఎమీలియో సెగ్రి , ఓవెన్ చాంబర్లెన్‌లు  కొంత యాంటీ మాటర్‌ని తయారు చేసి చూపించి 1959లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. గత 20 సంవత్సరాలుగా కృషిచేస్తున్న,  జెనీవాలోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (CERN) వారి 17 సభ్యుల రిసెర్చి బృందం, ఇటివలే, నవెంబర్ 19, 2010 నాడు, తమ ఆల్ఫా లాబరేటరీలో, 38 యాంటీ హైడ్రోజెన్ యాటములను సృష్టించి, ఒక క్షణం పాటు (సెకనులో పదవ వంతు కాలం) నిలువ చేయగలిగామని ప్రకటించారు. అది మన ఆధునిక విజ్ఞానరంగంలో ఒక మహత్తరమైన పురోగతి. ఎందుకంటే యాంటీ యాటములు విడుదలయ్యిన వెంటనే వాటిని మన ప్రకృతి విలీనం చేసుకుంటుంది. కనుక వాటి పైన అధ్యయనం ఈనాటి దాకా సాధ్యపడలేదు.

ఇప్పుడు  CERN అభివృద్ధిచేస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఈ యాంటీ మేటర్‌ని అధ్యయనం చెయ్యడానికి వీలవుతుంది. కానీ, స్టార్ ట్రెక్‌లోని స్పేస్‌షిప్పులు, బాంబులు వంటివి తయారు చెయ్యడానికి మనకి ఇంకా ఎన్నో దశాబ్దాలు పట్టవచ్చు. అయినా మనం పురోగతి సాధిస్తున్నాము కనుక, కాలక్రమేణా అన్నీ తెలుసుకో గలుగుతామని ఆశించవచ్చు. అలాగే చాలా రోజులుగా మనకు అర్థం కానటువంటి “డార్క్ మాటర్” అంటే ఏమిటో, డార్క్ ఎనర్జీ” వంటి కాన్సెప్టులపైన కూడా, అనేక  పరిశోధనలు జరుగుతున్నాయి.  వెరసి త్వరలోనే మనకు తెలిసిన అణు బాంబులను మించేటువంటి అతి భయంకర  వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్లు (WMD) ఎన్నో అవగతమవుతాయి. 

కానీ ఈ యాంటీ మాటర్ లేమిటి, డార్క్ మాటర్ లేమిటి, డార్క్ ఎనర్జీలేమిటి? WMDలు ఏమిటి?  వీటికి  మన మన మహాభారత యుద్ధ విశ్లేషణకీ సంబంధం ఏమిటి? అనిపిస్తోంది కదూ! విశ్లేషణ చివరి కొచ్చేటప్పటికి వీటి మద్య నున్న సంబంధం కొంచెం అర్థమవ్వొచ్చు. చదవండి...  

---- --- ----
గత రెండు మాసాలుగా కురుక్షేత్రయుద్ధం గురుంచి విశ్లేషణ జరుపుతూ వస్తున్నాం. ముందుగా 18 అక్షౌహిణుల సంఖ్య సుసాధ్యమే అని గుర్తించాం. తరువాత మహాభారత గ్రంధం మొత్తం చరిత్ర కాకపోయినా కనీసం అందులోని మూలకథ చరిత్రే అయ్యివుండాలని గ్రహించాం. ఇక సాక్షాధారాలు లేవు అన్న ఆక్షేపణను పరిశీలిద్దాం. పరిశీలించేముందు మనకు సాక్షాధారలను పరిశీలించి అర్థం చేసుకోగల అర్హత, సామర్ధ్యాలు వున్నాయా అని ప్రశ్నించుకోవాలి.
ఎందుకంటే, ఎదురుగా వున్న సూర్యుడినే మనం తిన్నగా చూడలేము, అది మనలోని లోపమే అవుతుంది కానీ సూర్యుడు అబద్దమని కాదు. ఒక వేళ చూసినా, చూడగలిగినా ఆ కనబడే సూర్యుడు ఆరు అంగుళాల వ్యాసమున్న చిన్న చక్రమేననీ, ఓస్ అదేమంత పెద్దది కాదనీ,  అనుకుంటే అది మన అవివేకమే అవుతుంది, కాని ఆధారం లేక కాదు. సత్యాన్వేషనకు తగిన విజ్ఞాన  సామర్ధ్యం కూడా అవసరం. మన విజ్ఞానం పరిణితి చెందుతోంది కనుక కొన్నికొన్ని విషయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాము. మిగితావి కాలక్రమేణా అర్థం చేసుకోగలుగుతామేమో! కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించిన సాక్షాధారాలను ముఖ్యంగా 5  రకాలుగా విభజించవచ్చు.
 
1)    చారిత్రాత్మక ఆధారాలు:

చరిత్ర గురించి మాట్లాడుతున్నాము కనుక, ముందుగా చారిత్రాత్మకతను పరిశీలిద్దాం. అంటే చరిత్రలోనే  మనకు దొరికిన కొన్ని ఆధారాలను పరిశీలిద్దాం.
  • అయిహోలె జైనమందిరం లోని శిలాశాసనం ప్రకారం ఆ మందిరం భారతయుద్ధం తరువాత 3,735 సంవత్సరాలకు, అలాగే కలియుగంలో షక శకములో 556వ సంవత్సరంలో చాళుక్యరాజైన పులకేశి కట్టించాడని వ్రాసివుందట. ఇప్పుడు ఆ శకములో 1915 నడుస్తోంది. అంటే  మహాభారత యుద్ధం దాదాపుగా క్రీ.పూ.3102 లో జరిగి వుండాలన్నది విధితమేనని మన పండితులు చెబుతున్నారు. ఇదే కలియుగారంభ కాలం కూడా.
  • క్రీ.పూ 4వ శతాబ్దిలో చాణుక్యుడు శ్రీకృష్ణజన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించాడు.
  • క్రీ.పూ. 4వ శతాబ్దిలో, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి గ్రీకు రాయభారిగా వచ్చిన మెగస్తనీసు ప్రకారం, మథురావాసులైన Sourasenoi (అంటే సురసేనలు గానీ యాదవులుగానీ) Heraklesని పూజించారు అని పేర్కొన్నాడు. ఇతడు హెరకిలిస్సుకిచ్చిన వర్ణనను బట్టి, కృష్ణుడునే అని అలా గ్రీకులు పిలుచుకునేవారు అని ఒక విశ్లేషణ చెబుతోంది.
  • యొబరెస్ తీరాన (అంటే యమునా తీరాన) వారి రెండు మహానగరాలన్నాయని; వాటి పేర్లు మెథొర (మన మథుర) మరియు క్లైసొబొర (కృష్ణపుర?) అని మెగస్తనిసు చెప్పాడట. అంతే కాదు, హెరక్లెస్సు (అంటే శ్రీకృష్ణుడు) తన కుమార్తెని పాండయరాజుకి (పాండవరాజు లేక పాండ్యరాజు అయివుండవచ్చు) ఇచ్చాడని; వారు మరొక మథురని (తమిళనాడులోని మథురై) పాలించారనీ; ఆ రాజ్యం దక్షిణాదిన సముద్రతీరాన వుందని చెప్పాడు. దీనితో పాండ్యరాజులు  అలా పాండవుల సంతతి వారు అయివుండ వచ్చునని;  అలా పాండవులు దక్షిణప్రాంతంలో పాండ్యు లయ్యి మరో మథురను నిర్మించుకున్నాని తెలుస్తున్నది.
  • గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు వ్రాసిన మరో వివరం ప్రకారం, శ్రీకృష్ణుడి తరువాత 138 రాజే చంద్రగుప్త మౌర్యుడు అని తెలుస్తోంది. అంటే ఇవన్ని చూస్తే కృష్ణుడు నిజంగా వున్నట్లే తెలుస్తున్నది. అంతే కాదు,  చైనీయుల పర్యాటకుల ప్రస్తావనలు కూడా మహాభరతయుద్ధం జరిగినదనే చెబుతున్నాయి.
  • తరువాత పాణిని, పతంజలి, భౌద్ధులు, జైనుల గ్రంధాలలో కూడా శ్రీకృష్ణుని ప్రస్తావనలతో పాటూ, కురుక్షేత్రయుద్ధ సంఘటనలు కనబడతాయి.
  • యువాన్ చాంగ్ అనే చీనీ పర్యాటకుడు కూడా కురుక్షేత్రం వద్ద ఒక మహాయుద్ధం జరిగిందని; ఎందరో అందులో మరణించి భూస్థాపితమైపోయారనీ వ్రాసుకున్నాడు.
  • కురుక్షేత్ర ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో కొన్ని ఆనాటి బాణాలు, శూలాలు దొరికాయి.
  • అలాగే గ్రెకో-బాక్ట్రియన్ ప్రభువు, అగాథొక్లెస్ క్రీ.పూ. 180-165 కాలంలో శ్రీకృష్ణబలరాముల రూపాలతో నాణాలను అచ్చువేయించాడట.  అధారాలుగా ఆ నాణాలు కూడా దొరికాయి. వాటిపై చక్రధారిగా శ్రీకృష్ణుడు కనపడతాడు. యూరప్‌లో క్రైస్తవ మతాని కంటే ముందు  కూడా హైందవ లేక సనాతనధర్మం వుండేది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఈ నాణాలు,  ఆనాటి గ్రీకు హైందవ స్నేహసంబంధాలను ధృవీకరిస్తున్నాయి. ఇవి  రెండు దేశాల మద్య జరిగిన పరస్పర సాంస్కృతిక మార్పిడులను తెలియజేస్తూ పశ్చిమ దేశాలలోకి భారతీయ విజ్ఞానం ఎలా వెళ్ళిందో చూపించ గలుగుతున్నాయి.
  • క్రీ.పూ. 1వ శతాబ్ది కాలపు, తక్షశిలవాసీ, గ్రీకు రాయభారియైన హెలియోడొరస్ నిర్మించిన బెసనగర్ లోని (నేటి మధ్యప్రదేశ్ లోని) గరుడ స్తూపం పైనున్న శిలాశాసనం వాసుదేవుని ఉనికిని చాటుతోంది.
  • మథుర వద్దనున్న మోరా శాసనం ప్రకారం అక్కడ ఐదుగురు దేవతలను ఆరాధించేవారనీ; అందులో వాసుదేవుడు ఒకడనీ తెలుస్తున్నది.
మరి ఇన్ని చారిత్రాత్మక ఆధారాలు దొరుకుతూవుంటే మన విశ్లేషకులు మహాభారతయుద్ధం జరుగలేదని ఎలా అనగలరు అని మనకు అనిపించవచ్చు. కానీ మన విశ్లేషకులు నమ్మనిదే ఆ శిలా శాసనాలను. ఎందుకంటే అ శాసనాలు భారత కాలానికి చెందినవి కావు కనుక. వారి అనుమానం కొందరు అమాయక ప్రభువులు గ్రుడ్డి నమ్మకంతో అవి చేయించారేమోనని! అ శాసనాలన్నీ నిజమైతే - త్రవ్వకాలలో తగిన ఆధారాలు ఎందుకు దొరకలేదు? అని వారీ ప్రశ్న. ఎప్పుడో 5,000 వేల ఏళ్ళనాటి సింధూలోయలో కూడా ఎన్నో విషయాలు బయటపడితే; మరి భారతకాలం నాటి శిధిలాలు ఏమయ్యాయి? అనే వారి ప్రశ్న.

2)      త్రవ్వకాలు:
పురావస్తు శాఖ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో ఇంకొన్ని ఆధారాలు దొరికాయి
a)      కాంబాట్: మహాభారత పరిశోధనలో ఒక సరికొత్త మలుపు ఈ కాంబాట్. ఇటివలే (2002లో) జలగర్భంలోని చాలా లోతుల్లో కనుగొనబడిన ఈ కాంబాట్ అనే పట్టణం, కనీసం 9వేల సంవత్సరాలకన్నా పాతదని; అది 30వేల సంవత్సరాల కాలం నాటిది కూడా అయివుండవచ్చుననీ; ఇటీవలే సోనోగ్రఫీ టెస్టింగు ద్వారా కనుగొన్నారు.

ఋగ్వేదంలో  అనేక చోట్ల సముద్ర యానం గురించి చెప్పబడి వుందని ప్రఖ్యాత చరిత్రకారుడు, అర్.సి.ముజుందార్ చెప్పారు. ఆయన ప్రకారం సింధూ-సరస్వతి ప్రాంతవాసులు పశ్చిమ దేశాలతో నౌకాయానం ద్వారా పరస్పర వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నారని తెలుస్తోంది. ద్వారక లోని రేవు, అదే విధంగా కాంబాట్ లోని ఈ రేవు పట్టణాలు ఇదే సత్యాన్నే ఋజువు చేస్తున్నాయి.
అసలు అంత కాలపు క్రిందట,  భూమి పైన ఏ అభివృద్ధి చెందిన నాగరికతైనా వుండే ఆస్కారమే లేదు అని అంటూ, మనకు తెలిసిన, మనం నేర్చుకున్న, మన  పాశ్చాత్య జ్ఞానం తెలుపుతోంది. కాని ఈ కాంబాట్  ప్రాంతం ఆ నమ్మకానికి పూర్తిగా భిన్నమైన  ఆస్కారము వుందని ఋజువు చేసి, మన నాగరికత యొక్క సనాతనత్వాన్ని నిరూపిస్తోంది. మన సనాతనధర్మ నాగరికతకి  ఇంతకన్నా ఏమి ఆధారం కావాలి?
b)      ద్వారకానగరం: శ్రీకృష్ణుని మరణానంతరం కలియుగం ప్రవేశించిందని, అలా క్రీ.పూ.3102 వ సంవత్స్రం లో కలియుగం ప్రారంభమైందనీ మనకు తెలుసు. 

నిర్యతె తు జానె తస్మిన్ సాగరోమకరాలయః
ద్వారకాం రత్నసంపూర్ణం జలేనాప్లావయత్తదా (మౌసల. 40)
జనమంతా వదిలేసిన తరువాత సముద్రం పొంగి సర్వసంపదలతో నిండిన ద్వారకను ముంచివేసింది. తాను ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ కబళించివేసింది. మాజీ పురావస్తుశాఖ శాస్త్రవేత్తయైన డా. ఎస్. ఆర్. రావు గారు, మెరైన్ ఆర్కియాలజీలో నిష్ణాతులు. ఆయన చేసిన పరిశోధనల వలన జలగర్భంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు, అనేక శిధిలాలు దొరికాయి.

హరివంశంలో సూచించిన ద్వారకా నగరవాసులు ధరించే ముద్రిక నొక దానిని (శంఖంపైన మూడు తలల చిహ్నం)  వీరు గుర్తించ గలిగారు. వీటిని బట్టి ద్వారక అనే నగరం నిజంగానే వుండేదనీ, అది భారతంలో చెప్పబడ్డ శ్రీకృష్ణుని నగరమేననీ, అది మనం వెదికే కాలం నాటిదేననీ తెలుస్తోంది.  ద్వారకా నగరం ముణిగిపోవడం కూడా భారతంలో చెప్పబడి వుంది.  
డా. ఎస్. ఆర్. రావు గారు ద్వారకాదీశుని గుడి వద్ద జరిపిన త్రవ్వకాలలో 15, 12 9వ శతాబ్ది నాటి గుళ్ళు దొరికాయి.  అలా ఆ  మందిరాల క్రింద 9.5 మీతర్లు త్రవ్వుకుంటు పోగా, అక్కడ రెండు నగరాల శిధిలాలు కనపడ్డాయిట. అక్కడ దొరికిన పింగాణిల వంటివే మళ్ళీ మన హస్తినాపురంలో కూడా దొరికాయి. అందుచేత అక్కడే ద్వారక కూడా వుండి వుండాలని నమ్మికతో ఆయన సముద్ర జలగర్భంలో పరిశొధలు జరిపితే, అక్కడ పెద్ద పెద్ద ద్వారాలు, కోట గోడలు, ఒక రేవు దొరికాయట. వాటిని బట్టి అవి మహాభారత కాలానివేనని నిర్థారించడం జరిగింది. వాటితో పాటుగా కంచు, ఇనుప పరికరాలు, రాతి లంగరులు, శంఖు ముద్రలు, దొరికి ఈ నాగరికతకూ, హర్రప్పా నాగరికతకు మద్యన ఒక లంకెను కూడా చూపించాయి. 
బెట్ ద్వారకా నగరం అనే ద్వీపంలోని మందిరానికి శ్రీకృష్ణుడు తరచు వెళ్తూ వుండేవాడట. అక్కడ మత్స్యావతార పురుషుడైన మహావిష్ణ్వాలయంకూడా వుండేదట. అక్కడ దొరికిన శిధిలాలో వాటికి సంబంధించిన అవశేషాలు దొరకడమే కాకుండా అవి క్రీ.పూ 1500 - 1300 నాటివని కూడా తెలుపుతున్నాయిట. మహాభారతంలో చెప్పబడిన గ్రామాలు, చెరువులు, కొండలను కూడా గుర్తు పట్టగలిగారట. మొత్తానికి గుజరాత్ దగ్గిర సముద్రంలో వద్ద జలగర్భంలో దొరికిన నగరం మన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకానగర ప్రాంతమేనని  పరిశోధకులు నిరూపించగలిగారు

c)   కురుక్షేత్రం : ఇంద్రప్రస్థం, హస్తినాపురం, కురుక్షేత్రం ప్రాంతాలలో పురావస్తు శాఖ జరిపిన త్రవకాలలో దొరికిన ఆధారాలను విశ్లేషిస్తే అక్కడి నాగరికతలు క్రీ.పూ 1700-1400 మద్య కాలానివని తేలాయి. కానీ, పెద్దగా చెప్పుకోదగ్గ ఆయుధ పరిజ్ఞానానికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదు.  అంటే మిసైలుల వంటి దివ్యాస్త్రాలు గానీ, భారి ఆయుధాలుగానీ, రధ చక్రాలు గానీ, ఇరుసులు, కీలలు గానీ, గుర్రపు నాడాలు గానీ, పెద్దపెద్ద భవనాలు గానీ కనిపంచలేదు.  వెరసి ఒక మహాయుద్ధం జరిగింది అని చెప్పడానికి తగిన సాక్షాలు దొరకలేదు. 

d)      హస్తినాపురం: మత్స్య వాయు పురాణాలలో చెప్పబడిన గంగానది వరదల మూలంగా హస్తినాపురం మునిగిపోగా, నిచక్షు మహారాజు (పరిక్షితు తరువాత 5వ రాజు) కౌసంబికి రాజధానిని తరలించాడని తెలుస్తోంది. హస్తినాపురంలో మట్టిపై జరిపిన విశ్లేషణవల్ల అక్కడ అలాంటి పెద్ద వరద వచ్చినట్లుగానే తేలింది. అలాగే పురావస్తుశాఖ వారి త్రవ్వకాలలో కౌసంబి నగరం కూడా దొరికింది. అంతే కాదు ఆ నగరం వరద వచ్చిన కాలం నుంచే మొదలయ్యిందని కూడా నిర్థారణ చెయ్యగలిగారు.
 
 
అలాగే శ్రీకృష్ణ రాయభార సమయంలో పాండవులు అడిగిన పాణిప్రస్థము, సోనప్రస్థము, ఇంద్రప్రస్థ నగరాలలో (నేటి డిల్లీలోని పానిపట్, సోనేపేట్, పురానాఖిలా) కూడా ద్వారకలో దొరికిన రకమైన పింగాణీలే దొరికాయి. అలాగే పురానాఖిలాలో కొన్ని భవంతులు డ్రైనేజీ కాలువలు కనిపించాయి. దాదాపు 35 స్థలాలో జరిపిన ఈ త్రవ్వకాలన్నిటిలోనూ material culture అంటే painted grey ware (PGW) దొరికింది. ఈ పింగాణీలు అతి ఉన్నతమైన నిపుణతతో చేయబడ్దవి. ఈ నాగరికతలో ఇనుమును కూడా వాడినట్లు తెలుస్తోంది. కానీ హరప్పా జనులకు ఇనుము తెలిసినట్లుగా ఎక్కడా దాఖలాలు  లేవు. అలనాడు వైభవాలలో మునిగితేలిన ఆ హస్తినాపురం - ఈ నాడు ఒక నిర్మానుష్య ప్రాంతం. అందులో దొరికిన వాటిలో ముఖ్యమైనవి  - విదురుని భవనము, ద్రౌపది వంటశాల , ద్రౌపది స్నానల రేవులుగా గుర్తించారు.  వాటితో పాటుగా అనేక రాగి గిన్నెలు, ఇనుప ముద్రలు, కొన్ని ఇనుప పరికరాలు, వెండిబంగారు ఆభరణాలు, మట్టిపాత్రలు, ఏనుగు దంతాలతొ చెసిన పొడగాటి పాచికలు(శకుని వాడినట్టివి) వెండిబంగారు ఆభరణాలు, పెంకులు, పింగాణీలు వంటివి ఎన్నో దొరికాయి. అలాగే బాణాలు, శూలాలు, ఇరుసులు, కొక్కాలు, గొడ్దలులు, కత్తులు,వంటి ఆయుధపరికరాలతో కూడిన మొత్తం 135 ఇనుముతో చేయబడ్డి వస్తువులు దొరికాయి. ఇటుకలతో పేర్చబడ్డ వీధులు, డ్రయినేజీలతో పాటుగా ఓక వ్యవసాయప్రథానమైన క్షేత్రంగా హస్తినాపురం కనిపిస్తోంది.
మరి ఇన్ని ఆధారాలు దొరికితే ఇక సమస్యేమిటి అంటే, కలియుగారంభం క్రీ.పూ.3102లో జరిగింది. అంటే భారతం ఇంకా ముందే జరిగివుండాలి. కానీ  మనకు దొరికిన హస్తినాపురం క్రీ.పూ 1700-1400 మద్య కాలానిది, ద్వారక క్రీ.పూ 1500 - 1300 కాలానిది. అంటే వీటి నమయ నిర్దారణలలో ఎక్కడో లెక్క తప్పింది లేకపొతే మనమే మహాభారత కాలనిర్ణయంలో తప్పు చేసాము. ఇక కాల నిర్ణయానికి వేరే పద్దతులేమయినా వున్నాయా?

3)      గ్రహాస్థితిగతులు :
ఇక మహాభారత యుద్ధానికి చెందిన కాలనిర్ణయం, దానికి సంబంధించిన ఆధారాల కొస్తే ముఖ్యంగా అందరూ చెప్పేది భారతంలో చెప్పబడిన గ్రహాస్థితిగతులు, గ్రహణాలు వాటికి సంబంధించిన కాలాలు. ఆ గ్రహస్థితులన్నీ భారతంలో వివరించిన క్రమంలో కనుక వచ్చినట్లైతే, వాటి మూలంగా దాని చారిత్రాత్మకతను కూడా ఖాయం చేసుకోవచ్చు అని అందరూ ఒప్పుకుంటున్నారు. యుద్ధం జరపడానికి ఒక ముహుర్తం; అలాగే భీష్ముడు తన మరణానికి ఒక ముహుర్తం; అలాగే యుద్ధం జరిగేటప్పుడు కూడా ఒకరోజు సూర్యుడు రెండు సార్లు అస్తమించడం, ఎన్నో గ్రహణాలు, ఇలా ఒకటేమిటి ఎన్నో చోట్ల గ్రహస్తితుల ప్రస్తావనలు కనబడతాయి. ఉదాహరణకు భారతంలో ప్రస్తావింప బడ్డ కొన్ని గ్రహ స్థితులు ఇలా కనిపిస్తాయి (ఇవికాక ఇంకా ఎన్నో వున్నాయి).

  • ఉద్యోగ భీష్మపర్వాలలో ప్రస్తావనలు
-శని రోహిణిలో వుండటం
- జ్యేష్టా నకషత్ర ప్రవేశానికి ముందు అంగారకుని వక్ర గమనము 
- కార్తీక పౌర్ణిమ నాడు చంద్ర గ్రహణము, తరువాత జ్యేష్టలో సూర్య గ్రహణము
  • , మధుసుదనా, అంగారకుని  వక్రగమనముతో అనూరాధను శాంతి కాముకుడై ప్రార్థించుచున్నట్లు కనిపించుచున్నది. MB (V.141.8)
  • మహాగ్రహములు రెండు సేనలలోనూ ఎంతో వినాశనమును తెలుపుచున్నవి. అంగారకుడు మఖా నక్షత్రం లోనూ బృహస్పతి శ్రవణా నక్షత్రంలోను వక్రగతిలోనున్నారు ” MB (VI. 3. 13)
  • సూర్యకుమారుడు (శని) పూర్వఫాల్గుణి దాటి క్షీణించుచున్నాడు. ఓ రాజా, శుక్రుడు పూర్వా భాద్రపద ప్రవేశించి ఉత్తరాభాద్రపదను చుట్టుచూ రెంటిలోనూ ఉదయించుచున్నాడు.” MB (VI. 3. 14)
  • యముడు ప్రకాశవంతుడై ధూమాపరివేషలను కలసి ఇంద్రస్థానమైన జ్యేష్టా నక్షత్రమును ప్రవేశించుచున్నాడు. MB (VI. 3. 15)
  • రాహువు సూర్యుని మింగగా భూమి వణుకుచున్నది. స్వేతగ్రహం చిత్రను అతిక్రమించుచున్నది” MB (VI. 3. 11)
  • చంద్రుడు క్షీణించగా రాహువు సూర్యుని చేరుచున్నాడు.” MB (V. 141. 10)
ఎందరో విద్వాంసులు (మరి కొందరు ఈ నాటి కంప్యూటర్ సహకారంతో) ఆ గ్రహాలనూ, గ్రహణాలనూ పరిశీలించి, అవన్నీ జరిగినవేనని; భారతంలో పేర్కొనబడిన క్రమంలోనే అవి జరిగాయనీ చెప్పారు. కానీ మళ్ళి వచ్చిన చిక్కేమిటంటే, చెప్పబడిన గ్రహాల  స్థితి గతులు  ఒక్కసారే కాకుండా పలుమార్లు వచ్చినట్లున్నాయి. దానితో అనేక వాదోపవాదాలు కూడా వచ్చాయి. అలా భారత యుద్ధ కాలానికి  అనేకులు అనేక రకాల కాల నిర్థారణలు చేసారు.
5వ శతాబ్దినాటి ఆర్యభట్టుని లెక్కల ప్రకారం మహాభారతయుద్ధం క్రీ.పూ.3100 కి ముందు జరిగింది. చాలా మంది ఆర్యభాట్టుడితోనే ఏకీభవిస్తారు.  ప్రొ.వైద్య,  ప్రొ. ఆప్టేల లెక్కలు కూడా దీనితో ఏకీభవించాయి. కానీ  భారతంలో పేర్కొడబడిన చంద్ర గ్రహణాలను బట్టి, S. బాలకృష్ణ గారు మహాభారత కాలాన్ని క్రీ. పూ. 2559 అని నిర్థారిస్తే; I. N. అయ్యంగార్ గారు ద్వంద్వగ్రహణాలను బట్టి, శని, బృహస్పతుల గమనాలను బట్టి క్రీ.పూ.  1478 అని నిర్థారించారు B. N. ఆచార్ గారు వివిధ గ్రహస్థానాలను బట్టి క్రీ.పూ. 3067 అని నిర్థారిస్తే; P. V. హోలెయ్ గారు వివిధ గ్రహస్థానాలను బట్టి క్రీ.పూ. నవంబర్ 13, 3143 అని నిర్థారించారు; అలాగే P. V. వర్తక్ గారు వివిధ గ్రహ స్థానాలను బట్టి క్రీ.పూ. అక్టోబర్ 16, 5561 అని నిర్థారిస్తేK. సదానంద గారు క్రీ.పూ. నవెంబర్ 22, 3067 అని నిర్థారించారు.    
అంటే సమయ నిర్థారణ సరిగ్గా చెయ్య లేక పోయారు గానీ, భారతం గాథ మొత్తం క్రీ.పూ. 3100  సంవత్సర ప్రాంతంలోనే జరిగి వుండాలి అని అనేకులు అభిప్రాయపడ్డారు. ద్వాపర యుగాంతంలో అష్టగ్రహకూటమి సంభవించిందని అంటారు. ఆ కూటమి క్రీ.పూ. ఫిబ్రవరి 18,3102 నాడు జరిగిందని గ్రీకు జ్యోతిష్యులు మనకన్నా ముందు నిర్థారించారట. ఎదేమైనా మనం  చేసిన సమయ నిర్థారణలో లోపాలు వుండి వుండవచ్చు, కానీ ఇవన్ని మహాభారతం జరిగే వుండి వుంటుంది అని మాత్రం ఖచ్సితంగానే తెలియజేస్తున్నాయి.  ఇక ఆ యుద్ధం జరిగిందా అన్నది ప్రయత్నిద్దాం.
4)      ఇనుము :
మహాసంగ్రామ నిర్ణయంలోనూ, దాని కాల నిర్ణయంలోనూ, మనకి వచ్చిన మరొక అడ్డంకి ఇనుము. నిజంగా అంత పెద్ద యుద్దమే జరిగి వుంటే, అందులో ఆయుధాల  కోసమనో రధాల కొసమనో ఎక్కడొ అక్కడ ఖచ్చితంగా కొంత ఇనుమును వాడి వుండాలి. భారతలో రథాలు వాడారని మనకు తెలుసు. రథాల నిర్మాణానికీ (కమ్మీలు, కీలలు, ఇరుసుకడ్డీ), అలాగే ఆధునిక మారణాయుధాల తయారీకీ, ఇనుము ఆవశ్యకత ఎంతో వుంటుంది.  కురుక్షేత్రంలో జరిపిన త్రవ్వకాలలో పెద్దగా ఇనుము దొరకలేదుగానీ కొన్ని ఇనుప బాణాలు, శూలాలు దొరికాయిట. వీటిని బట్టి ఒక చిన్న యద్ధం జరిగిందని చెప్పొచ్చు, కానీ ఒక మహాయుద్ధం జరిగింది అనడానికి ఆధారాలుగా పెద్ద పెద్ద మిస్సైలులవంటి ఆయుధాలు, పరికరాలు దొరకలేదు.  
ఒక్క నిమిషం దొరకని మిస్సైల్సుని పక్కన పెడదాం. ముందు ఆ దొరికిన బాణాలను థర్మోల్యూమినెన్స్ టెస్టింగు ద్వారా పరీక్షిస్తే, అవి  క్రీ.పూ. 2800 నాటివని తెలిసింది. ఇది దాదాపు మన కలియుగారంభ సమయానిదే. వచ్చిన చిక్కేమిటంటే, మన చరిత్రకారుల ప్రకారం క్రీ.పూ. 1000కి ముందు ఇనుమునే కనుక్కోలేదు. మరి క్రీ.పూ.2800 నాటి ఇనప బాణాలు కురుక్షేత్రంలో ఎలా దొరికాయి? అంటే భారతం క్రీ.పూ. 1000కి లోపు గానే జరిగిందా? మనమే వాటి సమయాన్ని సరిగ్గా నిర్థారించలేదా? మొత్తానికి కాల నిర్థారణ మాట కొస్తే మళ్ళి మనకి మరొక్క కొత్త చిక్కే వచ్చింది.
కానీ మనం మర్చిపోయినది ఏమిటంటే-- మిగితా దేశాలలో లేకపోవచ్చుని గానీ, భారతదేశంలో పదార్థజ్ఞానం ఏనాటి నుంచో వుంది. ఆనాడు ఇనుముతో మనవారు చేసిన గారడీలు ఈ నాటికీ అంతుపట్టనివి అని నిరూపించడానికి కుతుబ్ మినార్ ముందునున్న-- ఆరున్నర టన్నుల బరువుతో, 22 అడుగుల ఎత్తున్న-- ఉక్కు స్థంభమే సాక్షం. క్రీ.పూ. 300 సంవత్సరంలో చెయ్యబడ్డ ఈ ధ్వజస్థంభం ఎన్నో శతాబ్ధాలుగా,  ఆలయాలను  విధ్వంసంచేసిన అనేక ముస్లిముల దాడులను సైతం లెక్కచెయ్యకుండా, కనీసం తుప్పైనా కూడా పట్టకుండా ఎదురు నిలిచింది. 

అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చెయ్యగలిగారు గాని, ఆ స్థంభాన్ని మిగల్చక తప్పిట్లు  లేదు. మరి అటువంటి చెక్కు చెదరని ఉక్కుని మనవారు ఎలా చేసి వుంటారు? ఏ పశ్చిమ దేశస్తుడికి తెలుసునట, ఆ కాలంలో మనకు నేర్పివుండటానికి ?  ఏది ఏమైనా అంత పరిజ్ఞానం సాధించారు అంటే, మనకు ఆ రోజుల్లోని పదార్థజ్ఞానం చాలా ఎక్కువే అని తెలుసుకోవచ్చు.  అంటే భారత కాలానికే మన దగ్గర ఇనుము వుందా అన్నది, ఒక అసందర్భ ప్రశ్న కావొచ్చును.    “అంత పరిజ్ఞానం సాధించిన మనవారికి, మిస్సైల్స్ వంటి ఆయుధాల (అస్త్రాల) తయారీలో  ఇనుము అవసరమే రాలేదా?”, అన్నది సరైన ప్రశ్న అవుతుంది. అంటే, దివ్యాస్త్రాలలో మనకు తెలియని మరేమైనా దివ్యపదార్థాలను వారు వాడి వుండే  ఆస్కారం వుందా?
ఆస్కారం వుంది! అని చెబుతోంది భరద్వాజముని వ్రాసిన వైమానిక శాస్త్రం కూడా! అందులో చెప్పబడిన అనేక పదార్థాలలో ఏ పదార్థం కూడా, ఈనాడు మనకు అర్థం కాదు. అందులో చెప్పబడిన ఏ విమానంలోని టెక్నాలజీ కూడా  మనకు బోధపడదు. అందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనవారు, జర్మనులు ఎంత విశ్లేషించినా ఇప్పటికి అంతు పట్టడం లేదు. అంటే ఆనాటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మనకు అర్థం కావడం లేదనేగా అర్థం!
1)     


5. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (WMD):
సరే మహాభారతం క్రీ.పూ 3100లోనో లేకపోతే క్రీపూ 1000 లోనో జరిగింది ఒప్పుకుంటాం. కానీ అప్పుడు అంత పెద్ద మహాయుద్ధమే జరిగితే, అందులో పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి అనేక దివ్యాస్త్రాలు వాడితే, వాటి అవశేషాలు ఏవి? అన్నదే చివరికి మిగిలిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన అన్వేషణ పూర్తయ్యినట్లే.  ఆ రోజుల్లో అణ్వస్త్రాల వంటివి వాడినా, ఇప్పుడు ఇన్ని వేల ఏళ్ళయ్యిన తరువాత, త్రవ్వకాలలో ఏమి అవశేషంగా మిగిలి కనిపించాలో నిజంగా మనకు తెలియదు.  ఒక వేళ అణుశక్తినే వాడితే, దాని తాలూకు రేడియేషనులు వుండాలిగా అనొచ్చు. కానీ, అది 5వేల సంవత్సరాలు భూమిలో కప్పెట్టబడిన తరువాత కూడా వస్తుందో లేదో తెలియదు. వచ్చినా, అసలు ఆనాడు వాడినది అణుశక్తో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియని, అర్థంకాని శక్తి స్వరూపాలు ఇంకా మరెన్నో వున్నాయి.  
ఉదాహరణకు మొదట్లో మనం చెప్పుకున్న యాంటీ మాటర్ గురించి మనకి ఇంకా ఏమి అవగాహనే లేదు. ఈ  నవంబర్ 19వ తారీఖున  జెనీవాలో యాంటీ యాటముని ఒక సెకనులో పదవ వంతు పాటు కాలం వరకు నిలప గలిగారని ప్రకటించారు. అది నేటి విజ్ఞాన రంగం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయి కావొచ్చు. అయినా ఆ శక్తిరూపాన్ని స్పృశించడానికి, పరిక్షించడానికి, ఇంకా మరెన్నో సంవత్సరాలు పడుతుంది. అలాగే “డార్క్ మాటర్” , “డార్క్ ఎనర్జీ” అన్నవి  ఇంకా  కాన్సెప్టులే గానీ, వాటి గురించి మనకేమీ తెలియదు. ఇప్పుడప్పుడే తెలియక పోవచ్చు కూడా! ఇలా మన ఊహకి అందని ఎన్ని రకాల శక్తి రూపాలు ఎన్ని వున్నాయో? వీటిని ప్రయోగించిన తరువాత అసలు అవశేషాలు ఏమైనా మిగులుతాయో లేదో? మహాభారతంలో అసలు ఏ ఏ శక్తులని ప్రయోగించారో?  
మనకు తెలిసిన ఒక్క  మిస్సైల్ని పట్టుకొని, అదే దివ్యస్తామయి వుండొచ్చని, మనమే అనుకుని, అవి దొరకలేదు కాబట్టి ఆ మహాసంగ్రామం జరగలేదని చెప్పడం సబబేనా?  ఏదో కాకతాళీయంగా ఒక కొత్త సాక్ష్యం మన చేతిలో పడాలి! అది కూడా అర్థం అవ్వాలి!  అంతే కాదు ఆ సాక్షం చేతిలో పడడాని కంటే ముందే, దాన్ని అర్థం చేసుకోడానికి తగిన విజ్ఞానసామర్ధ్యం కూడా అభివృద్ధిచెంది, సమయానికి  అందుబాటులో వుండాలి. అప్పుడు గానీ ఈ పజిల్‌కి ముక్తి లేదు. లేకపోతె ముందు చెప్పుకున్నట్లుగా, మనం చూసిన సూర్యుడు ఆరంగుళాల చిన్న చక్రమే అనేటువంటి  వాదనల లోకి దిగే ప్రమాదం మిగుల్తుంది.
కాలక్రమేణా అన్ని తప్పక తెలుసుకోగలుగుతాము. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. అంటే కనీసం 5000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఆనాటి భౌగోళిక పరిస్థితులు మనకు తెలియవు. యుగాంతంలో జరిగే భోగోళిక ప్రక్రియలు, ప్రకృతిలోని మార్పులు, వాటి ప్రభావాలూ మనకింకా అర్థం అయ్యి వుండకపోవచ్చు. ఆ పరిస్థితులలో మనం వెతికే సాక్షాలు ఒక వేళ వున్నా, అవి భూగర్భంలోనో, కాలగర్భంలోనో ఎక్కడ, ఏరకంగా, ఎందుకు కలిసిపోయాయో అన్నది -- ఈనాడు మన ఊహకు అందని విషయం.
భోగోళిక మార్పుల వల్లనో, లేకపొతే  మరేమైనా వేరే కారణాల వల్లనో ఏమో – త్రవ్వకాలలో క్రీ.పూ. 3000నాటి సింధూ లోయ నాగరికతకు నుంచీ,  దాని తరువాత మళ్ళీ క్రీ.పూ 300 సంవత్సరపు మౌర్యుల నాగరికత దాకా మద్య Cultural continuity కనపడలేదు. ఆ  మద్య కాలంలోని చరిత్రపై కూడా మనకు పెద్దగా ఆధారాలేమీ లేవు. అవగాహనా లేదు. భోగోళిక మార్పులు జరిగి, ఆనాటి అధారాలు నశించి వుండి వుండవచ్చు నేమో అని అనడానికి ఇది (The absence of Cultural continuity) ఒక చిన్న ఆధారం.  ఇలా, కురుక్షేత్రయుద్ధం కల్పితం కాదనీ, అది చారిత్రాత్మకమేనని, ఈ మూడు భాగాల విశ్లేషణ వల్ల నిర్థారించవచ్చును. ఇక మనకు నిర్థారణ కాని విషయాలు – ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ ఆయుధాలతో  జరిగింది? అన్నవే.  
అలనాటి నాగరికత నేటి నాగరికత కన్నా మహోన్నతమైనది; వారి జ్ఞానం మనకన్నా ఎన్నో రెట్లు గొప్పది; కానీ  కురుక్షేత్ర మహాసంగ్రామం వల్లనో , యుగాంతం వల్లనో ఎందరో చనిపోయి, వార్ల  నాగరికతలు సమూలంగా నాశనమయ్యి, కాలక్రమేణా ఆ విజ్ఞానం సాంతం నశించిపోయి వుండవచ్చు. అందుకే మనం మరిన్ని ఆధారాలకై వెతుకుతూనే వుండాలి ; వెతికి అందరికి అర్థమయ్యేలా చూపించి, అందరి ఆమోదాన్నీ అందుకోవాలి. ఒక భారతీయునిగా అది మన బాధ్యత! అది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాకపోవచ్చు. ఎన్నో వేల సంవత్స్రాల చరిత్ర కలిగినది మన సంస్కృతి. ఎంతో సనాతనమైనది మన ధర్మం. నిరూపించడానికి చాలా  సమయం పట్టొచ్చు. అయినా నిరాశ పడకుండా ప్రయత్నిద్దాం.  
భారతీయులమైన  మనం -- మన భారతాన్నయినా అర్థం చేసుకుందాం!
---- --- ----

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec10/sujananeeyam.html

1 కామెంట్‌:

  1. అలనాటి నాగరికత నేటి నాగరికత కన్నా మహోన్నతమైనది; వారి జ్ఞానం మనకన్నా ఎన్నో రెట్లు గొప్పది

    రిప్లయితొలగించండి