మహాత్ముడికే మత మార్పిడి ;
మరణానంతరం బాపూజీకి బాప్టిజం ;
లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?
బయటపెట్టిన పరిశోధకురాలు రాడ్ కీ
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్
"ప్రపంచంలో అన్ని మతాలూ నిజమే, అన్నిట్లోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. అయినప్పటికీ నా మతం నాకు గొప్పది. ఒక మతం వ్యక్తి మరొక మతంలోకి మారాల్సిన అవసరం లేదు. అయితే, ఒక హిందువు మరింత ఉత్తమమైన హిందువుగా మారాలి. ఒక క్రైస్తవుడు మరింత ఉత్తమమైన క్రైస్తవుడుగా, ఒక ముసల్మాన్ మరింత ఉత్తమమైన ముసల్మాన్‌గా మారాలి.'' - మహాత్మా గాంధీ (యంగ్ ఇండియా 28.01.1928)
వాషింగ్టన్, ఫిబ్రవరి 28: వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత సంస్థలు... మరణానంతరం మహాత్ములకూ మతాన్ని అంటగడుతున్నాయా? హిందూమత సిద్ధాంతాల్నీ.. గీతాసారాన్నీ బలంగా విశ్వసించిన మహాత్ముడికి ఒక అమెరికన్ చర్చ్ బలవంతంగా క్రైస్తవం ఇచ్చిందా? మరణానంతరం ఆయన పేరు మీద బాప్టిజం 'ప్రసాదించిందా'? ..ఈ ప్రశ్నలన్నిటికీ హెలెన్ రాడ్ కీ అనే పరిశోధకురాలు అవుననే సమాధానమిస్తున్నారు.
1996 మార్చి 27న అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ నగరంలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) గాంధీజీ పేరిట బాప్టిజం ఇచ్చిందని, సావోపాలో బ్రెజిల్ టెంపుల్‌లో 2007 నవంబరు 17న ఈ ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఎల్డీఎస్ చర్చ్ మోర్మన్ చర్చ్‌గా బహుళప్రాచుర్యం పొందింది. గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్‌కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్‌కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు.
'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్‌ఫ్రాంక్ కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్‌కీకి ఉంది. ఇదే కోవలో.. గాంధీజీకి కూడా లేటర్‌డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్‌కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే... తాను చూసిన కొద్దిరోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు. ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్‌లో పేర్కొన్నారు.
ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్‌గాంధీ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఒక వ్యక్తి మరణించాక, అతని పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ... మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్‌గాంధీ వివరించారు.
ఇక... హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం గల గాంధీజీ పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని వాషింగ్టన్‌లోని హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)కు చెందిన సుహాగ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయమై రాడ్‌కీ నుంచి లేఖ అందుకున్న రాజన్ జెడ్... దీనిపై తాను ఎల్‌డీఎస్ చర్చ్ అధ్యక్షుడు థామస్ ఎస్ మాన్సన్‌కు ఫిబ్రవరి 24న లేఖ రాశానని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆయన వద్ద నుంచి జవాబు రాలేదన్నారు. "మాన్సన్ దీనికి క్షమాపణ చెప్పాలి. ఇదెలా జరిగిందో ఆయన చెప్పాల్సిందే'' అన్నారు.
andhrajyothy news
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి