3, మార్చి 2012, శనివారం

శ్రీకృష్ణుడే ఆది కౌన్సిలర్

 


కౌన్సిలింగ్ కళకు ఆదిపురుషుడు శ్రీ కృష్ణుడేనని ఒప్పుకుతీరాలి. కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో అర్జునుడు, కృష్ణా నేనీ యుద్దం చేయలేను. నా శరీరం వణుకుతుంది. అపశకునాలు కనబడుతున్నాయి. గాండీవం చేతినుంచి పట్టు తప్పి జారిపోయింది. ఇక నా వల్ల కాదు. అన్నప్పుడు శ్రీకృష్ణుడు ధైర్యవచనాలు పలికి, అతనిలో విశ్వాసం రేకెత్తించాడు. ఆ ఉపదేశాల మాలిక భగవద్గీత. అందరికీ ఒక గైడ్ లాంటిది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇటు కౌన్సిలింగ్ చేసేవారికి, అటు తీసుకునేవారికి గీతలో అద్భుతమైన టిప్స్ ఉన్నాయి.

* * *

భగవద్గీతలో అడుగడుగునా కౌన్సిలింగ్ కనబడుతుంది. సమస్యల గురించి శోకించేవారికి, ఆప్తులను పోగొట్టుకుని చింతించేవారికి, నిర్ణయాలు తీసుకోలేని వారికి, అవమానాలకు గురైన వారికి, సుఖదుఃఖాలను సమంగా స్వీకరించలేనివారికి గీతలో సమాధానాలున్నాయి. స్థితప్రజ్ఞుడి లక్షణాలను అద్భుతంగా వర్ణించాడు.

ఇదంతా రాయడానికి ఆసక్తికరమైన కారణం ఒకటుంది. దాదాపు సంవత్సరం క్రితం నాదగ్గరికి ఒకతను వచ్చాడు. ఆయనకు 55ఏళ్ళు ఉంటాయి. తన సమస్యలను వెళ్ళబోసుకుని తనకు మరణం తప్ప మరోమార్గం లేదనుకున్నాననీ, ఒక స్నేహితుడు చెబితే నన్ను కలిశాననీ చెప్పాడు. నిజానికి ఆయన సమస్యల్లో నేను పరిష్కరించేవీ, పరిష్కరించగలిగేవీ ఏమీ లేవు. ఒక ప్రయత్నం చేద్దామని, సమస్యలను ఒక కాగితం మీద రాసి వాటిలో అత్యంత ముఖ్యమైన వాటిని టిక్ పెట్టాను. చివరికి నాలుగు తేలాయి.

1. అతను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇంటిని ప్రభుత్వం వారు, రోడ్డు వెడల్పుచేసే కార్యక్రమంలో కూలగొడతామని నోటీసు ఇచ్చారట. ఐదులక్షల రూపాయల విలువ చేసే ఆ స్థలానికి 34 వేలు ఇస్తామని తెలిపారు.

2. అతని కొడుకు ఇంటర్మీడియట్ పరీక్ష పాసయ్యాడు. ఎమ్ సెట్. ఐ.ఐ.టి. రాశాడు. ఇంజనీరింగ్ చదివించడానికి తగిన స్తోమత లేదు. అతనికి రిజర్వేషన్ సౌకర్యం కూడా లేదు. ఎమ్ సెట్ లో క్వాలిఫై అయిన తర్వాత చదివించకపోతే కొడుకు అప్ సెట్ అవుతాడనే భయం ఉంది.

3. అతని భార్యకు కడుపులో అల్సర్ ఉంది. ఆపరేషన్ చేయించాలి. చేతిలో డబ్బులేదు. ఆమెకు బాధ రోజురోజుకూ తీవ్రమవుతూంది.

4. అతను ఒక కంపెనీకి ప్రారంభ దశ నుంచి ముఖ్య సలహాదారుడుగా ఉండేవాడు. వారికి అనేక సలహాలిచ్చి, ఆ కంపెనీని లాభాల బాటలోకి లాగాడు. ఆ కంపెనీకి ఈ మధ్య వచ్చిన కొత్త వైస్ ప్రెసిడెంట్, ఎకానమీ డ్రయివ్ పేరుతో ఈయనను ఉద్యోగం లోంచి తీశేశాడు. దానివల్ల నెలనెలా వచ్చే 15వేలు ఆగిపోయాయి.

పై నాలుగు సమస్యలనూ పరిష్కరించటానికి నా దగ్గర సమాధానాలు లేవు. ధైర్యంగా ఉండమని చెప్పడం తప్ప, అయితే కాలం కొన్ని సమస్యలను పరిష్కరిస్తుందని గీతలోని బోధ గుర్తుకొచ్చి, ‘మీరు చేసుకుందామనుకుంటున్న ఆత్మహత్యను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయండి. ఈలోగా మీ సమస్యలను గురించి తీవ్రంగా ఆలోచించకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, మీరు చేయగలిగే ప్రయత్నాలు చేయండి. పరిణామాలూ, జయాపజయాల గురించి ఆందోళన చెందవద్దు. అని చెప్తూ ‘మీకు హిందూ మతం మీద నమ్మకం ఉన్నా, లేకపోయినా, భగవద్గీత వచనం చదవండి. దానివల్ల తప్పక ఫలితం పొందుతారు. కాబట్టి, కొనుక్కుని చదవండి’ అని చెప్పాను.

అతను హిందువు కానప్పటికీ, నా మాటల మీది గౌరవంతో అంగీకరించాడు. తరుగాత జరిగిన కౌన్సిలింగ్ చేసి పంపించాను.

కాలగమనంలో ఏడాది గడిచిపోయింది. హఠాత్తుగా అతనొకరోజు మా క్లినిక్ లో ప్రత్యక్షమయ్యాడు.

మీ ఋణం తీర్చుకోలేను. ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను. మా వాళ్ళు భగవద్గీత కొనడానికి వీల్లేదు. అలాంటి పుస్తకాలు మనింట్లో ఉండటానికి ఉండకూడదు అన్నారు. అయినా మా ఆవిడను ఒప్పించాను. అందులోని ఉపదేశాలు చదువుతుంటే, నాకు కొంత ఊరటకలిగింది.

ఇంతకూ మీ సమస్యల గురించి చెప్పండి. అవి పరిష్కారమయ్యాయా? అని అడిగాను ఉత్కంఠతో.
అదే చెప్తున్నాను. అవన్నీ ఒక మిరాకిల్ గా జరిగాయి. రోడ్డు విశాలం చేసే సందర్భంలో మా ఇల్లు పడగొడదామనుకున్న మునిసిపాలిటీ వారు ఆ ఆలోచన విరమించుకున్నారు. నా ఇల్లు నాకు ఉండిపోయింది. ఇక మా అబ్బాయికి ఎమ్ సెట్ లో, ఐ.ఐ.టి.లో మంచి ర్యాంకులొచ్చాయి. ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు మా అబ్బాయి వాళ్ళ దగ్గర చదువుకున్నట్టు చెబితో కొంత సొమ్ము ఇస్తామన్నారు. ఇచ్చారు. వాడి ఫీజులకు కొంత పోగా, మిగతాదాంతో మా ఆవిడకు ఆపరేషన్ చేయిద్దామని ఆసుపత్రికి వెళ్ళాను. ఆ డాక్టరు నన్ను చూడగానే పలకరించి మీ ఆవిడకు తీసిన ఎక్స్ రే మారిపోయింది. ఆమెకు క్యాన్సర్ లేదు. అది మరొకరి ఎక్స్ రే. క్షమించండి అన్నాడు.అంటూ నీళ్ళు తాగాడు.

వెరీ గుడ్! మరి కొత్త ఉద్యోగం వచ్చిందా?

మరో కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చి, జరిగిన తప్పిదం తెలుసుకుని పాత బకాయిలతో సహా జీతం పంపించి, మళ్ళీ ఆహ్వానించారు.

వీటన్నింటిని పరిష్కరించింది కాలమేనని ఒప్పుకుంటారా? అని అడిగాను.
కాలంతో పాటు భగవద్గీత కూడా. అది నాకెంతో మనశ్శాంతినిచ్చింది అన్నాడు ఆనందంగా.



http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec10/pattabhi.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి