3, మార్చి 2012, శనివారం

హిందుత్వం-మార్కిస్టు దృక్పధం



ప్రపంచంలో కల్లా అతి ప్రాచీనమైన హిందుత్వ సిధ్ధాంతాలు మార్కిస్టులకు ఎలా కనిపిస్తాయో ఒక్కసారి ఊహించగలరా? సహజంగానే హిందుత్వం వీరిచే తృణీకరించబడింది. కార్ల్ మార్క్స్ తనంతట తానుగా ఇట్టి మత సిధ్ధాంతాలను భ్రమగా కొట్టేసినపుడు, భారతీయ కమ్యూనిస్టులందరూ హిందుత్వంతో విభేదించటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే ప్రస్తుత సమాజంలో కమ్యూనిజం పేకమేడలా కుప్పకూలగా, మత సిధ్ధాంతాలు(హిందుత్వతో సహా అన్నీ) మరింత శక్తిని పుంజుకున్నాయి. ఇట్టి మార్పు మతాలు భ్రమ కాదని, కమ్యూనిజమే నిజమైన భ్రమ అని నిరూపించాయి.

స్వాతంత్ర్యానంతరం నుండీ దురదృష్ట వశాత్తు భారతీయ విశ్వ విద్యాలయాలు ఈ వామ పక్షవాదులచే ప్రభావితమై తమ అభిప్రాయాలను పాఠ్య పుస్తకాల రూపేణా విద్యా వ్యవస్థలో చొప్పించాయి.

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన చరిత్రాధ్యాపకురాలు 'రోమీలా థాపర్' మార్కిస్టు కార్యకలాపాలకు పేరుపొందారు. (గూగుల్ లో ఈమె గురించి వెతికి చూడండి... 4వ తరగతి పాఠాల మొదలు పరిశోధనా గ్రంధాల వరకూ ఈమె పుస్తకాలు విద్యా వ్యవస్థలో చొప్పించబడ్డాయి). ఈమె తనకనుకూలురైన సహచరులతో కలసి రచించిన ఎన్నో వ్యాసాలు హిందూ చరిత్ర రూపేణా పాఠ్యపుస్తకాలలో చేరాయి. ఇవన్నీ కూడా హిందుత్వం పై దురభిప్రాయాన్ని కలిగించేవే.

నిజానికి భారత దేశంలో మిగిలిన మతాలు ప్రవేశించనంత వరకూ 'హిందూ మతం' అన్న స్పృహ, అవగాహన భారతీయులలో ఉండేవి కావు. వీరంతా తరతరాల నుండి కొనసాగుతున్న హైందవ ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు. వీరు, రామాయణ, మహా భారతాల మొదలూ భగవద్గీత మనుసంహితాలను, వేద, ఉపనిషత్తులనూ ఏనాడు మత గ్రంధాలుగా భావించలేదు. భారతీయులు ఇట్టి పుస్తకాలను చారిత్రక, సాంఘిక, వైద్య, మూలికా, జ్యోతిష్య, గణిత, భౌతిక, ఖగోళ ఇత్యాది శాస్త్రాలకు చెందిన పరిశోధనలగానే భావించేవారు. కవులు తమ కవితా చాతుర్యానికీ, గురువులు తమ శిష్యులకు విద్యా బుధ్ధులు భోదించేందుకు, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు (వీటిని నమ్మని వారు కూడా అప్పట్లో ఇవి మతానికి చెందిన గ్రంధాలుగా ఏనాడూ భావించలేదు). భారత దేశంలో మిగిలిన మతాలు బలం పుంజుకోవటం ప్రారంభమయ్యాక, హైందవ ధర్మం ఆచరించే ఈ భారతీయులందరూ సంఘటితమయ్యి, మూలాలు కాపాడుకునే ప్రయత్నంలో 'హిందూ మతం' అన్న నానుడి సృష్టించారు.

ఇదిగో, సరిగ్గా ఇక్కడే రోమీలా థాఫర్ దృష్టి సారించారు. ఈమె హిందుత్వ మూలాల కొఱకు వేదాల వద్దకో, ఉపనిషత్తుల వద్దకో వెళ్ళక కాస్త ఆధునిక కాలంలో త్రవ్వటం మొదలు పెట్టారు. కొన్ని చారిత్రిక సత్యాలు ('హిందూ మత' ఆవిర్భావమంటూ పేర్కొనే ఆధారాలు) ఈమెకు సహజంగానే క్రీస్తు మరణానంతర కాలంలోనే లభించాయి. ఈమె ఈ విధమైన ఆధారాలతో హిందుత్వం అందరూ అనుకునేంత ప్రాచీనమైనది కాదనీ, నవీనమైనదేనని నిరూపించ ప్రయత్నించారు. ఈ విధమైన విశ్లేషణతో ఈమె అప్పటికే హిందుత్వంలో చొరబడిన సాంఘిక దురాచారాలకు పెద్ద పీట వేస్తూ, హిందూ మతంనందు ఆది నుండీ కూడా ఈ దురాచారాలు ఉండేవని ప్రచారం చేసారు. ఈ విధమైన ఫ్రెంచ్ తరహా మార్కిజం వల్ల హిందుత్వానికి మరింత మసి పూసినట్లైయ్యింది.

థాపర్ దృష్ట్యా హిందుత్వమనే సంస్కృతి(మతం) సాంఘిక మరియూ రాజకీయ ప్రయోజనార్ధం క్రీస్తు మరణానంతర కాలంలోనే ఒక వర్గం వారి ద్వారా(అగ్ర వర్ణాల) సృష్టింపబడింది. ఈమె రచనల ద్వారా(దురదృష్టవశాత్తు ఇవి పాఠ్యపుస్తకాలు) హిందుత్వమనేది సాంఘిక దురాచారాల(పురుషాధిక్యత, కుల సంస్కృతి ఇత్యాదివి)తో నిండి, ఆధునికులూ, నాగరికులూ, విద్యాధికులూ విభేదించాల్సిన మత తత్వంగా ప్రదర్శింపబడింది. ఇలా ఈమె హిందుత్వ ఆత్మకు మతరంగు పులిమి దురాచారాల అత్తరునద్దడం వల్ల 'హిందుత్వ' మంటే ఒక అనాగరిక మత మౌఢ్యం అన్న చందాన ప్రచారం చేయబడింది.

ఈ కమ్యూనిస్టు ప్రొఫెసర్లందరూ హిందువులు నమ్మే అహింస, సహనం వంటి గుణాలను అభూతకల్పనగా తిరస్కరించి, హిందుత్వంలో అటువంటి భావనలే లేవన్నట్లుగా కొద్ది మంది హిందూ రాజులు (బౌధ్ధులూ, జైనులూ) సాగించిన మారణహోమాలను ఉదహరించారు. ప్రతి మతంలోనూ, సంస్కృతిలోనూ ఈ విధమైన వర్గ వైషమ్యాలు సహజమే. చరిత్రలో బౌధ్ధమతాన్ని ఆచరించిన వారు కూడా హింసను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. అయితే వీటికి మూల కారణాలు వేరు. ఇవి హిందుత్వానికీ, హైందవ ధర్మానికీ అతీతంగా జరిగినవి. ఇవేవీ కూడా పెద్ద యెత్తున పవిత్ర యుధ్ధం పేరుతోనో, మరే విధమైన ప్రభువు ఆజ్ఞగానో భావించి దేశ దేశాలను కబలించిన సంఘటనలు కావు.

హిందుత్వలో కూడా కొందరు హింసా సంస్కృతిని పాటించి ఉండవచ్చునుగాక, కానీ అవి వ్యక్తిగతమైనాయి తప్పితే పెద్ద ఎత్తున హిందువులందరూ సంఘటితమై హింసను ఆశ్రయించిన దాఖలాలు లేవు.

థాపర్ మరియూ మిగతా మార్కిస్టు ప్రొఫెసర్ల పరిశోధనలలో హిందుత్వ మూలమైన ఆత్మ సిధ్ధాంతాల గూర్చి గానీ, హిందూ మహర్షుల, మహాయోగుల ప్రస్తావనలు గానీ ఉండదు. ఈమె పరిశోధనలలో హిందూ విశ్వ తత్వం, జ్ఞాన సిధ్ధాంతాలు వంటివి ఉండవు. ఒకటో అరో ప్రస్తావించిన సన్యాస సిధ్ధాంతాలు కూడా మందిని శాసించే (అగ్ర వర్ణాల) సాంఘిక దురాచారాలుగా పేర్కొనబడ్డాయి.

ఈ విధంగా విద్యార్ధులకు చేరువైన ఈ పరిశోధనలు పూర్తిగా హిందూ సంస్కృతిలోని సాంఘిక అకృత్యాలూ, రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరిగాయి. నిజానికి ఒక మార్కిస్టు నుండి అంతకు మించిన భక్తి, యోగ సిధ్ధాంతాలను ఆశించటం అత్యాశే అవుతుంది. వీరు ఉపనిషత్తుల గూర్చి గానీ, గీత గురించి గానీ ఎక్కడా ఉదహరించలేదు. మార్కిస్టులు భగవద్గీతను మానవుడిని భ్రమలోకి నెట్టిన అతి పెద్ద సృష్టిగా వర్ణిస్తారంటే వీరి హిందుత్వ వ్యతిరేకతను అర్ధం చేసుకోవచ్చు.

కార్ల్ మార్క్స్ క్రైస్తవాన్ని, చైనా కమ్యూనిస్టులు బౌధ్ధాన్ని చూసిన చందానే మన హిందూ వామపక్ష వాదులు హిందుత్వాన్ని చూసారు తప్పితే, లోతైన అధ్యయనం చేయలేదు.

వీరి ఉద్దేశ్యనుసారం హిందుత్వాన్ని అధ్యయనం చేయటం అంటే మార్క్స్ క్రైస్తవాన్ని, మావో బౌధ్ధాన్ని అధ్యయనం చేయటంతో సమానం. ఒక వర్గం వారు (అగ్ర వర్ణాలు) తమ రాజకీయ ప్రయోజనార్ధం సృష్టించిన మతంగా హిందుత్వాన్ని పేర్కొనే వీరు, నిజానికి మార్కిస్టు సిధ్ధాంతాలే రాజకీయ పరంగా రాజకీయ అజండాలతో పుట్టాయంటే ఒప్పుకోరు. వీరి రచనల నిండా హిందూ మత మౌఢ్యులూ, వారు కమ్యూనిస్టులపై, ఇతర మైనార్టీలపై సాగించిన అకృత్యాలే ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు, ఈ థాపర్ వంటి మార్కిస్టులు గొప్ప సంఘ సంస్కర్తలుగా కీర్తింప బడ్డారు. వీరికున్న ప్రజ్ఞాపాటవాలూ, కీర్తి ప్రతిష్టలూ, ప్రపంచజ్ఞానం, డిగ్రీలూ, ఇవన్నీ కూడా భావితరాల వారికి వీరు ఆదర్శప్రాయమయ్యే దుస్థితిని కలిగించాయి.

(నా రచనల్లో ఏదైనా అస్పష్టత ఉంటే అంగీకరిస్తాను. ఎందుకంటే మార్కిస్టులు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలను శాసించే స్థాయికి ఎదిగిన కారణాలను వివరించలేకపోయాననిపిస్తోంది. అదీగాక హిందూ దురాచారాల పట్ల సానుభూతిని ప్రదర్శించానేమో (మొత్తం చదువుతుంటే నాకే సంశయమేస్తోంది) అని కూడా అనిపిస్తోంది.)

అయితే మార్కిస్టులు హిందూ విశ్వ విద్యాలయాల్లోనే కాక, యూరోప్ మరియూ పశ్చిమ దేశాల యూనివర్సిటీలలో కూడా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల సహజంగానే హిందూ వామపక్షవాదులు తమకున్న మిగిలిన దేశపు మార్కిస్టు సంబంధాలను ఉపయోగించుకుని, తమకు తోచిన(తాము అర్ధం చేసుకున్న) హిందుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసారు. ఇది ఇప్పటికినీ కొనసాగుతుంది. మిగిలిన మతాల యొక్క రాజకీయ, సాంఘిక ప్రయోజనాలను మార్కిస్టులు విజయవంతంగా నిరూపించటం ద్వారా, భారతీయ లెఫ్టిస్టులకు, విద్యాధికులకు, వీరు ఆదర్శమయ్యి - హిందుత్వాన్ని కూడా అదే కోణంలో చూసేందుకు దోహదపడ్డారు. దీనితో సహజంగానే ఈ హిందూ విద్యాధికులకు గురువైనా, దేవుడైనా మార్క్స్ అయి కూర్చుని, సొంతం కావాల్సిన వేదాలు విదేశీయమైనాయి. అప్పటికే మన భారతీయ సంస్కృతిలో చొప్పించబడ్డ దురాచారాల వల్ల అణగద్రొక్క బడిన దళిత వర్గాల వారు, నాస్తికులు కూడా వీరికి బాసటగా నిలిచారు. నిజమైన హిందుత్వం ఎప్పటిలానే తనకు మాత్రమే సొంతమైన సహనాన్ని అశ్రయించి మౌనంగా ఉండిపోయింది.

హిందుత్వ విషయంలో మార్కిస్టు సిధ్ధాంతాలకు, క్రైస్తవ సిధ్ధాంతాలకూ(ఇది మార్కిస్టులు వ్యతిరేకించే మతమయినప్పటికినీ) పెద్దగా తేడా కనిపించదు. క్రైస్తవం హిందుత్వాన్ని మత సాతానుగా వర్ణిస్తే, మార్కిస్టులు హిందూ సాంఘిక దురాచార భూతాలను ప్రదర్శించ యత్నించారు.

అదృష్టవశాత్తూ కమ్యూనిజం ప్రపంచం అంతటా తుడిచిపెట్టుకు పోయే రోజులు రానుండటంతో భారతదేశంలో కూడా కమ్యూనిజం ప్రభావం తగ్గుతుందని ఆశిద్దాం. భారతీయులు ఈ మార్కిస్టు సిధ్ధాంతాలను ఎంత తొందరలో త్యజిస్తే హిందుత్వానికి అంత మేలు చేసిన వారౌవుతారు.

ఈ వ్యాసం ద్వారా హిందుత్వంలో మార్కిస్టులు పేర్కొనే సాంఘిక దురాచారాలు లేవని చెప్పటం ఎంత మాత్రమూ నా ఉద్దేశ్యం కాదు. మన దేశంలోనున్న ఈ సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు హిందుత్వాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సూత్రం ఏ మతానికైనా వర్తిస్తుంది. తమ తమ మతాలలోని దురాచారాలను సంస్కరించటం కోసం తమ తమ మతాలను విసర్జించాల్సిన పని లేదు. ఇందు కోసం కమ్యూనిస్టు సిధ్ధాంతాలను దత్తత చేసుకునే అవసరం అంతకంటే లేదు. స్థూలంగా అలోచిస్తే హిందూ మూల సిధ్ధాంతాల ద్వారానే హిందుత్వాన్ని (హిందూ మతాన్ని) సంస్కరించుకోవచ్చు.

ఈ సందర్భంలో కధా ఉపనిషత్తులో పేర్కొన్న సూక్తి గుర్తొస్తోంది.

"అజ్ఞానాంధకారంలో బ్రతికే వాడు తనని తాని జ్ఞానిగానే భావిస్తాడు. ఆ చీకటిలో అతడికి నిజమైన జ్ఞాని కూడా కనపడడు. ఇట్టి అజ్ఞానులు మందిని ప్రభావితం చేసి, ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానిని నడిపించే చందాన వ్యవహరిస్తారు. సత్యానికి చేర్చాల్సిన దారి ఇట్టి అయోమయులకు ఎన్నటికీ కనపడదు."

ప్రపంచం ఒక్కటి మాత్రమే నిజమని, అది మాత్రమే దుఃఖానికీ, అజ్ఞానానికీ హేతువని భావించే మార్కిస్టులకు ఈ సూక్తి సరిగ్గా వర్తిస్తుంది కదూ! 


 http://vikaasam.blogspot.in/2009/07/blog-post_03.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి