3, మార్చి 2012, శనివారం

కురుక్షేత్రయుద్ధం మొత్తం కల్పితమేనా? 1/3

- తల్లాప్రగడ రావు   


http://www.nautis.com/wp-content/uploads/2008/11/mahabharata-kurukshetra.jpg
పాశ్చాత్యులు మహాభారత గాధ కల్పితం అనీ, అది చరిత్రే కాదనీ తేల్చేసారు. అవును అలాగే అనిపిస్తోంది అంటున్నారు మన పురావస్తుశాఖవారు కూడా! నిజానికి కురుక్షేత్ర యుద్దం నిజంగానే జరిగిందా అనే ప్రశ్న మనందరిలోనూ ఎప్పుడో ఒకసారి మెదిలి వుండేవుంటుంది.  నిజమే ఒక్క చరిత్ర పుస్తకంలో కూడా మనం దీన్ని చదవలేదు. అంతే కాదు, ఈ యుద్ధానికి సంబంధించిన ఆధారాలు కాని అవశేషాలు కానీ, ఏవీ సరిగ్గా దొరకలేదు.  మనం కేవలం ఒక కథ చదివేసి, అంతంత చదువుకున్న శాస్త్రజ్ఞులని మాత్రం తప్పు అని ఎలా అనగలం? అలా అని మొత్తంగా కేసునే  కొట్టెయ్యగలమా? లేకపోతే ఏమైనా అధారాలను విశ్మరించామా?
 
ఇంతకీ మన శాస్త్రజ్ఞులు, విశ్లేషకుల ఆక్షేపణలు ఏమిటో ఒకసారి తిరగవేద్దాం. 
  • సైనికుల సంఖ్య: W.H.మూర్‌ల్యాండ్ అనే ప్రసిద్ధ చరిత్రకారుని కట్టిన లెక్క ప్రకారం, మొగలాయిలు భారత దేశాన్ని పాలించిన రోజుల్లో భారత జనాభా 3, 4 కోట్లు మాత్రమే; కానీ దాదాపు  18 అక్షౌహిణులు మంది మహాభారతయుద్ధంలో చనిపోయారని భారతంలో వుంది.  మనకు తెలిసి మొగలాయిల కాలం నాటికి కూడా అంతమంది సైనుకులు గానీ జనాభా గానీ లేరని మన విజ్ఞులు తెలియజేస్తున్నారు. నిజంగా అంతమంది సైనికులు వుండటం మహాభారతకాలం నాటికి సాధ్యమేనా?
 
  • మొత్తం కవి ఊహాచిత్రమే : మహాభారతం అంతా ఒక కవి ఊహారూపమే అంటున్నారు మన శాస్త్రజ్ఞులు కూడా. ఎందుకంటే అది ఒక చరిత్రలాగా లేదు, అది అంతా కల్పనలా కవితలాగా వుంది. 18 పర్వాలు, 18 అక్షౌహిణులు, 18 రోజుల యుద్ధం వంటివి చూస్తే ఆ సంఖ్యలన్ని కాకతాళీయం ఎలా అవుతాయి, ఒక మహాకవి మనోజనిత కల్పనలు తప్ప?
  • సాక్షాలు లేవు: కురుక్షేత్రం ప్రాంతంలో పురావస్తు శాఖ చేసిన తవ్వకాలలో ఒక్క  శిధిలం కానీ, ఆయుధాలకు సంబంధించిన ఇనుప ముక్క కానీ కూడా దొరకలేదు. హిందువుల లెక్కల ప్రకారం మహా భారత యుద్ధం జరిగి 5 లేక 6 వేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది.  5000 ఏళ్ళ క్రితపు సింధూ లోయలో ఎన్నో అవశేషాలు దొరుకుతూ వుంటే, అంత పెద్ద యుద్దం జరిగిన చోట ఒక్క అధారమైనా దొరుకకుండా ఎలా పోతుందిమనవద్ద మహాఅస్త్రశస్త్రాలు వున్నాయనడనికి కూడా దాఖలాలు లేవు!

ఇవి చాలా సమంజసమైన ప్రశ్నలే కనుక, మనం గుడ్దిగా భారతం జరిగింది అనకూడదు. మనం కూడా మన విశ్లేషణలను జరిపి, పరిశోధన చేసి చూద్దాం. కొత్త ఆలోచనతో పునఃపరిశీలిద్దాం. 
 
సైనికుల సంఖ్య: ముందుగా సైనికుల సంఖ్యను పరిశీలిద్దాం. మన విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 18 అక్షౌహిణులు అంటే చాలాచాలా పెద్ద సంఖ్య; కనుక అంత మంది యుద్ధం చెయ్యడం అసంభవం. ముందు అసలు అక్షౌహిణి అంటే ఎంత మంది అన్న విషయాన్ని గమనిద్దాం. ఒక్కొక్క అక్షౌహిణి  లెక్క ఈ క్రింది విధంగా సాగుతుంది
 
సైనిక విభాగం
రథాలు
ఏనుగులు
అశ్వాలు
కాలి సైనికులు
అధిపతి
ప్రస్తుత ఆంగ్ల నామం
పత్తి
1
1
3
5
పత్తిపాల్
Lieutenant
సేనాముఖము
3
3
9
15
సేనాముఖి
Captain
గుల్మము
9
9
27
45
నాయక
Major
గణము
27
27
81
135
గణనాయక
Lieutenant Colonel
వాహిని
81
81
243
405
వాహినీపతి
Colonel
పృతన
243
243
729
1215
బిరుదనాధిపతి
Brigadier
చమువు
729
729
2187
3645
సేనాపతి
Major General
 అనీకిని
2187
2187
6561
10935
అనీకాధిపతి
Lieutenant General
అక్షౌహిణి
21870
21870
65610
109350
మహాసేనాపతి
General
Table-1


Present US Military Command Structure
Unit
Soldiers
Commander
Fireteam
4
NCO
Squad/Section
8–13
Squad Leader
Platoon
26–55
Platoon Leader
Company
80–225
Captain/Major
Battalion
300–1,300
(Lieutenant) Colonel
Regiment/Brigade
3,000–5,000
(Lieutenant) Colonel/Brigadier (General)
Division
10,000–15,000
Major General
Corps
20,000–45,000
Lieutenant General
Field army
80,000–200,000
General
Army group
400,000–1,000,000
Field Marshal
Army Region
1,000,000–3,000,000
Field Marshal
Army theater
3,000,000–10,000,000
Field Marshal
Table-2
 
అంటే పైన Table-1 లో చూపిన విధంగా ఒక్కొక్క అక్షౌహిణిలో 21,870+21,870+65,610+109,350= 218,700 మంది ఉంటారు. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు. అంటే యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణులు. అంటే మొత్తం (18 అక్షౌహిణులలో) 39,36,600 మంది  యుద్ధం చేసారు. (అదికూడా రధసారదే యుద్ధం చేసాడు అని అనుకుంటే).  రధానికి సారధి వేరు సైనికుడు వేరు అని అనుకుంటే ఈ సంఖ్య  47 లక్షలు దాటుతుంది. ఏ రకంగా చూసినా ఒక అక్షౌహిణి సంఖ్య పైన చూపిన Table-2 లోని ఈనాటి ఆర్మీ థియేటర్ కన్నా చిన్నగానే వుంది. మరి ఈ అక్షౌహిణుల సంఖ్యను చూసి అంత ఆశ్చర్యం ఎందుకు?  
 
సరే ఉజ్జాయింపుగా 40 లక్షల మంది యుద్ధం చేసారనుకుందాం. ఇంత మంది సైనికులు వుండాలీ అంటే,…  ప్రతి ఇంటికొక్క సైనికుడు వున్నాడనుకున్నా, ఒక్కో కుటుంబంలో నలుగురు మంది మనుషులే వున్నారనుకున్నా,  దేశ జనాభా కనీసం ఒకటిన్నర కోటి మంది వుండివుండాలి. ఐతే ఈ జనాభా వుండే అవకాశం వుంది. కానీ మన విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రతి నలుగురిలో ఒకడు యుద్ధం చేసాడు అనడం అతిశయోక్తి మాత్రమె. యుద్ధ సమయాల్లో మనకు తెలిసిన దేశాలను పరిశీలించి చూస్తె వాటిల్లో 1:30 నిష్పత్తిని దాటి జనమెప్పుడూ యుద్ధంలోకి దిగలేదు అని వారి నిశ్చిత అభిప్రాయం. అంటే మహాభారత కాలానికి జనాభా కనీసం 12 కోట్లమంది వుండివుండాలి. మొగలాయుల సమయానికే మన జనాభా 4 కోట్లు కూడా దాటలేదు అని ఒక విశ్లేషణ ధృవీకరిస్తుంటే. మరి మొగలాయిల కాలంకంటే ముందుకాలమైన మహాభారత కాలానికి ఎక్కువ జనాభా వుండటం సాధ్యమేనా. జనాభా పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గదు అని వారి అభిప్రాయం. . 12 కోట్లమంది మహాభారత కాలానికి వుండే అవకాశం వుందా?.... అన్నదే ఈ సందేహం.  అది కనక నిరూపించగలిగితే మొదటి సమస్య తీరినట్లే. ప్రయత్నిద్దాం..
 
1)      ఐతే కురుక్షేత్రకాలంలో మనకు తెలిసి జనాభా లెక్కలు వెయ్యలేదు.  కనుక నాటి జనాభా వివరాలు ఎవ్వరికీ తెలియవు. నిజానికి మొగలాయిల కాలంలో 4కోట్ల జనాభా అని మన విశ్లేషకులు చెప్పే మాటలకు కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఒక వేళ వున్నా మొగలాయిల కాలం కన్నా భారతయుద్ధకాలం పాతది కనుక జనాభా ఇంకా తక్కువుండాలన్నదే వీరి వాదన.   అసలు వీరు అందరూ అనుకునే విధంగా మొగలాయిల కాలం కంటే తక్కువ జనాభా ఎందుకుండాలి భారతం జరిగింది ద్వాపర యుగంలో! ఆ యుగంలో ఎందరొ చనిపోగా మిగిలిన అతితక్కువ జనాభాతో కొత్తయుగం (కలియుగం) మొదలయ్యింది అనుకోవచ్చుగా? అదే కదా మన భారతం చెప్పేది కూడా!!?  అప్పుడు మహాభారత కాలం కంటే మొగలాయిల కాలంలోనే తక్కువమందే వుంటారు.  ఇక సమస్య ఏమిటి?

http://www.caclubindia.com/images/10.jpg
 
2)      క్రీ.పూ. 327-26 సంవత్సరంలో భారతదేశంపై దండెత్తిన అలెగ్జాండర్ కూడా భారతసైన్యాలు చాలా చాలా పెద్దవని చెప్పాడు. అంతే కాదు, క్రీ.పూ. 321-297లో చంద్ర గుప్తుని దస్తావేజులప్రకారం ఆతడి ఒక్క రాజ్యానికే 7లక్షల మంది కాలి సైనికులున్నారని భారత సెన్సెస్ విభాగం తన వెబ్ సైట్లో తెలియజేస్తోంది.. అంటే ఆనాటి జనభా మరీ అంత తక్కువగాలేదని తేలికగా చెప్పొచ్చును.
 
3)      క్రీ.పూ. 274-236లో అశోక చక్రవర్తి కాలంలో నాటికే పెద్దపెద్ద సైన్యాలకు సంబంధించిన పాలనా యంత్రాంగ విధానాలు, విధినిర్వాహక బాధ్యతల నిర్వాహణాపద్దతులు సైతం చాలా అధినీకరణ పొందాయి అంటూ మన చరిత్రకారులే చెబుతున్నారు. అంటే సైన్యాలు చాలాచాలా పెద్దవని వుండివుండాలని తెలుస్తున్నది. మరి ఆనాటి అశోకసైన్యంతో పాటూ అన్నిదేశాల సైన్యాలనూ కలిపితే 40 లక్షలమంది సైన్యం వుండే ఆస్కారం లేదా?

4)      ఐనా ఒప్పుకోను అంటారా, ఐతే మొగలాయిల సమయంలో దేశజనాభా 4 కోట్లు అంటే, అది వారి పాలనలోని ప్రాంతాలలో మాత్రమే.  అదీ ఖచ్చితంగా చెప్పలేము. అక్బర్‌ జనభా లెక్కల కోసం ఉత్తరువు జారి చేసాడని తెలుసు కానీ ఆ లెక్కల సమాచారం మనకు దొరకలేదు. ఇహపోతె, అబ్దుల్ ఫజల్ (అక్బర్ ప్రభుత్వ ఆస్థాన చరిత్రకారుడు) తయారుచేసిన అక్బర్‌నామాలోని మూడవ పుస్తకమైన ఆయనీఅక్భరీలో ఆ నాటి వస్తుద్రవ్యాల ధరలు, సైనికుల జీతాలు, భవననిర్మాణ మేస్త్రీకూలీల భత్యాలు, భూవైశాల్యం వంటి స్టాటిస్టిక్స్ ఎన్నో పొందుపరిచాడు. ఆ ఆయినీఅక్బరీ లెక్క ప్రకారం ఆనాడు సాగులోవున్న భూమి వైశాల్యం మనకు తెలుస్తున్నది. దానిని బట్టి W.H.మూర్‌ల్యాండ్ అనే ప్రసిద్ధ చరిత్రకారుని కట్టిన లెక్క ప్రకారం 16 వ శతాబ్ది కాలం నాటికి  30 నుంచి 40 మంది మిలియన్ల జనాభాకు సరిపోయే ధాన్యవుత్పత్తి జరిగిందని నిర్థారించాడు. అలా వచ్చింది -- 40 మిలియన్ల  (4 కోట్ల) లెక్క, అదే  మన విశ్లేషకులు పదేపదే వల్లించే సంఖ్యామంత్రం.

            

కానీ ఆ  మూర్‌ల్యాండే, గతంలో జరిగిన పలు యుద్ధాలను పరిగణలోకి తీసుకుని వేసిన మరొక లెక్క ప్రకారం సైనికులకీ జనభాకీ మధ్య 1:30 కనీస నిష్పత్తి వుంటుంది.  అలా చూస్తే అక్బర్ రాజ్యంలో 60 మిలియన్ల మంది వుండచ్చొని అతడే అభిప్రాయపడ్డాడు.  అలాగే అక్భర్ పాలనలో లేని మిగిలిన భారత భూభాగాలన్నీ కలిపితే భారతజనభా 100 మిలియన్ల (10 కోట్ల) వరకు వుండే అవకాశంవుందని కూడా అతడే తేల్చాడు.   మూర్‌ల్యాండ్ వేసిన లెక్కలోని మరిన్ని లోపాలను సరిదిద్ది కింగ్‌స్లీ డేవిస్ ఈ సంఖ్యను 14.5 కోట్లకు మార్చాడు. మరి ఈ లెక్కను పరిగణలోకి తీసుకుని చూస్తే 12 కోట్ల సంఖ్యను మనం దాటేయలేదా?

అవును మొగలాయిలకాలానికి 12 కోట్లు ఒప్పుకుంటాం కానీ భారతయుద్ధం నాటికి దేశ జనాభా దీని కన్నా చాలా తక్కువే వుండాలి అని పట్టుబడితే, మనం మరికొంచెం విశ్లేషణ సాగించాలి. సాగిద్దాం.
5)      భారతదేశంలో జననమరణాల నిష్పత్తి (population replacement rate) దాదాపు సరిసమానంగా వుండటంచేత, మొగలాయిల కాలానికి ముందున్న 2000 సంవత్సరాలలో జనాభాలో ఏమీ మార్పులేదని కింగ్‌స్లీ డేవిస్ అనే ప్రఖ్యాత ఆధునిక చారిత్రకవిశ్లేషకుడు, శాస్త్రజ్ఞుడు తన పరిశోధనా పత్రంలో (1951) పేర్కొన్నాడు. దీని ప్రకారంగా కూడా మొగలాయిల కాలంకంటే ముందు కాలంలో జనం తక్కువ వుండాలనేమీ లేదని తేలుతోంది.
ఐనా ఒప్పుకోను, భారతకాలం నాటికి మొగలాయిల కాలం కంటే జనాభా తక్కువ వుండాల్సిందే అని పట్టుపడతారా?
6)      మూర్‌ల్యాండ్,  కింగ్‌స్లీ డేవిస్..  వీరిరువురూ చెప్పని విషయం మరొకటుంది. వీరు లెక్కవేసిన ఈ 14.5 కోట్ల జనాభా, కేవలం భారతదేశానికి చెందిన జనాభామాత్రమే. కానీ మహాభారత యుద్ధంలో వందకు పైగా దేశాలు పాల్గొన్నాయి, కనుక  అది ఒక ప్రపంచ యుద్ధం అని తేలికగా నిర్ధారించొచ్చు (నిజానికి అదే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం).  అందుచేత భారతయుద్ధంలో పోరాడిన 18 అక్షౌహిణుల సైనికులు కేవలం మనవారే కారు, అన్ని దేశాలకూ చెందినవారు అని మనం గమనించాలి. అంటే మనం లెక్క వెయ్యాల్సింది మనదేశ జనాభాని మాత్రమే కాదు, ప్రపంచజనాభా అని గుర్తించాలి.  మహాభారతం కూడా దీన్ని ఒక ప్రపంచ యుద్ధంగానే వర్ణించింది, గుర్తించింది.
 
ఉదాహరణకి భారతంలో మనం విన్న కొన్ని దేశాల పేర్లు …  కురు, పాంచల, వత్స, కోసల,కాసి, వైదేహ, దక్షిణ కోసల, మల్ల, సురసేన, ద్వారక, అనర్త, సౌరాష్ట్ర, హెహేయ, నిషాధ, గుర్జర, కరుష, చేది, దసర్న, కుంతి, అవంతి, మాలవ, మత్స్య, త్రిగర్త, సాళ్వ, మద్ర, సింధు, సౌవీర, సివి, కేకేయ, గాంధార, యౌధేయ, పహ్లవ, బాహ్లిక, పరమ కాంబోజ, ఉత్తర మద్ర, ఉత్తర కురు, యవన, ఖాస, శాక్క, కాశ్మీర, కాంబోజ, దారద, పరద, పారసిక, తుషార, హున, హార హూన, రిషీక, చైన, పరమ చైన, మగధ, కీకట, అంగ, ప్రజ్ఞోతిష, సోనిత, లౌహిత్య, పుండ్ర, సుహ్మ, వంగ, ఓడ్ర, ఉత్కళ, విదర్భ, అనుప, సూర్పరక, నాసిక్య, కొంకణ, అస్మాక, దండ, కళింగ, తెలింగ, ఆంధ్ర, కిష్కింధ, గోమంత, కర్నాట, కంచి, చోళ, పాండ్య, తుళు, ముషిక, సత్యాపుత్ర, కేరళ, సిణళ, సారస్వత అభిర, సూద్ర, నిషాద, కింపురుష, పిశాచ, నాగ, కిన్నర, యక్ష, గంధర్వ, కిరాత, హిమాలయ, పర్వత, నేప, సృనాజయ, బాళిక, హైహాయులు, వృష్ణి, అంధక, అవంతి, కుకూర, అంగ, కళింగ, మద్ర,సౌవీర, కాంబోజ, సింధు, భోజ, యవన, మ్లేలేచ్చ, వైకర్ణ, చేది.
[ancient-india.png]
ఈ పేర్లు చూస్తే తూర్పుపశ్చిమ ఖండాలలోని అనేక దేశాల పేర్లు వున్నాయి. మొగలాయిల కాలానికి భారత దేశ జనాభా 14.5 కోట్లు వుంటే, ప్రపంచ జనాభా కనీసం 87 కోట్లు వుండదా (ఈ నాటి నిష్పత్తి ప్రకారం, 1:6)? అంటే మొగలాయిల కాలానికి ప్రపంచ జనాభా 87 కోట్లు వుంటే, మహాభారత కాలానికి అది కనీసం 12 కోట్లు వుండే అవకాశం లేదా? ఖచ్చితంగా వుంది!
 
7)      సరే 12 కోట్లమంది వున్నారు కానీ అందులో 3.9 మిలియన్లమంది యుద్ధం చేసి నశించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అది చాలా పెద్ద సంఖ్య అని అంటారా! దానికి సరియైన ఉదాహరణ మొన్నీమద్య జరిగిన (మనం అనుకునే) రెండవ ప్రపంచ యుద్ధమే. ఇందులో, క్రింద చూపిన వికీపీడియాలోని పట్టిక ప్రకారం, 25 మిలియన్ల సైనికులతో పాటుగా, మొత్తంగా 78 మిలియన్ల మంది చనిపోయారని మనకు తెలిసిన చరిత్రే చెబుతోంది. ఇక 3.9 మిలియన్లు మంది యుద్ధంలో నశించడంలో వచ్చిన ఆశ్చర్యం ఏమిటి? ఆలోచించండి!!
    
 
8)      అంతేకాదు, మనం ఇక్కడ 18 అక్షౌహిణుల సంఖ్యతోటే సతమతమవుతున్నాం. రామాయణకాలంలో ఆ సంఖ్య మరింత పెద్దగావుంది. దాన్ని చూస్తే మన విశ్లేషకులు ఏమంటారో?  దానిని కూడా ఒకమారు గమనిద్దాం. 8 అక్షౌహిణులను ఒక ఏకము అంటారట; అలాగే ఎనిమిది ఎకములు ఒక కోటి”(ఇది మనం ఇప్పుడు వాడే సంఖ్య కోటి కాదు); ఎనిమిది కోట్లు ఒక శంఖము అవుతుంది; ఎనిమిది శంఖములు ఒక కుముదము అవుతుంది; ఎనిమిది కుముదములు ఒక పద్మము అవుతుంది; ఎనిమిది పద్మములు ఒక నాడి అవుతుంది; అలాగే ఎనిమిది నాడులు ఒక సముద్రము”,  ఎనిమిది సముద్రాలు ఒక వెల్లువ అవుతాయి. అంటే 366,917,139,200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరట.
 
ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద ఉన్నట్లుగా  కంబ రామాయణం చెబుతోందట. అంటే సుగ్రీవుని వద్ద 256,842,399,744,000 (257 Trillions) మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలొ 67 కొట్ల మంది సైన్యాదిపతులు. వీరికి నీలుడు అధిపతిట. అసలు ఒక పక్క ఈ సంఖ్యే ఇంత పెద్దగా, అసాధ్యంగా అనిపిస్తూ వుంటే, అంతేసి సమూహాల విభజనలూ వాటి  నిర్వచనాలూ ఎందుకు చెప్పారంటారు? అంత గొప్ప కవులకు ఏమీ తోచకనా? లేక పోతే ఏమైనా విషయముందంటారా? ఆలోచించండి !?

పోనీ, అది వేరే (24వ) మహాయుగంలోని ఒక త్రేతా యుగంలోని మాట! ఆ నాటికే అంత మంది వుండేవారంటే, మన 26 మహాయుగంలోని ద్వాపర యుగంలో మనం అన్నది విన్నది 18అక్షౌహిణులు మాత్రమే. ఈ మద్య జరిగిన రెండవ ప్రపంచయుద్ధంలోని సంఖ్యతో పోల్చినా ఇది చిన్న సంఖ్యే అని పైన తెలుసుకున్నాము. ఈ చిన్న సంఖ్యకి అంత ఆశ్చర్యం ఎందుకు?

కాబట్టి ఏ రకంగా చూసినా 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధం చెయ్యడం అనేది అంత నమ్మశక్యం కాని విషయంగా ఏమీ చెప్పుకోనక్కరలేదు అని తెలుస్తోంది. ఈ సంఖ్య అసాధ్యము అనీ ఏ మూర్‌ల్యాండ్‌తో మిగితా  పాశ్చాత్యులతో కలసి మనవారందరూ ఉదహరిస్తూ చెపుతున్నారో, ఆ మూర్‌ల్యాండ్ లక్కల ప్రకారం కూడా ఈ సంఖ్య సుసాధ్యమే అని తేలుతోంది.  మరీ అంత పాజిటీవ్‌గా కాకపోయినా, ఒక క్రిస్టియన్ మిషనరీలాగా కాకుండా,  కొంత న్యూట్రల్‌గా ఆలోచిస్తే చాలు. మన మనస్సాక్షే నిజం ఒప్పుకుంటుంది.

అంతేకాదు ఒక మూర్‌ల్యాండ్ కానీ కింగ్‌స్లీ డేవిస్ కానీ, అలనాటి మాక్స్ ముల్లర్ కానీ అందరూ పాశ్చాత్యులే! మన ధౌర్భాగ్యమేమోకానీ, ఆ బయటవాడు చెప్పాడు అంటేకానీ మనపై మనకు నమ్మకం కుదరదు. మనలని పశ్చిమ దేశాలకన్నా తక్కువగా చూపించాలనుకున్న ఆ పశ్చిమ దేశస్తులనే నమ్మి వారితోనే వంత పాడి, మనలను మనచరిత్రను తక్కువ చేసుకోవడంలో మనకో గొప్ప ఆనందం వుంది. భారతం ఒక వేళ జరిగినా కూడా అది ఒక చిన్న ట్రైబల్ స్టోరీ మాత్రమే అన్న పాశ్చాత్యుల వ్యాఖ్యని మనం తప్పని నిరూపించలేక పోతే పోనీ, కనీసం ప్రయత్నలోపం జరగకూండా చూసుకోవాలసిన భాధ్యత మనదికాదా? మళ్ళీ ఎవరో ఒక పాశ్చాత్యుడే వచ్చి మనగత వైభవాన్ని గుర్తిస్తూ గుర్తుచేస్తూ ప్రకటిస్తే తప్ప, మనలను మనం గుర్తించలేమా? అప్పటిదాకా మన చరిత్ర పుస్తకాలను సైతం మనం వ్రాసుకోలేమా?  ఏమో?  ఎలాగూ మనం చేసే అధ్యయనాలు సైతం మనలను ఉన్నతంగా చిత్రీకరించవు. కనీసం ఏ అమెరికాలాంటి దేశాలలో ఐనా మళ్ళీ భారతచరిత్రపై ఒక క్రొత్త నిష్పాక్షిక అధ్యయనం మొదలయితే బాగుండు! వారే మన పురాణాల ఔన్నత్యాన్ని, చారిత్రాత్మకతను బయటపెడితే బాగుండు! అప్పటికైనా మన చరిత్ర మనకు తెలిసొస్తుందేమో!
 
ఇది కథకాదు ఒక ఇతిహాసము  --అని భారతంలోనే వ్యాసులవారు ఎంత గట్టిగా విశిదీకరించి చెప్పినా కూడా, ఆ మాటని నమ్మము కాక నమ్మము, అంటే అదేమి విడ్డూరమో? పైగా, ఎలాగూ కథే కదా అంటూ, దాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటాం. ద్రౌపదిని చూసొచ్చినట్లు ఆమె మనసులోని భావాలను కూడా నిర్వచించే సాహసం చేస్తాం. మన ఐతిహాసిక పురుషుల వ్యక్తిత్వాలకు ఇష్టమొచ్చిన కొత్త రూపాలను ఇచ్చి తెలిసినట్లు  వితండ వాదనలు చేస్తాం. లేకపోతే ఇతిహాసాలను ఈ నాటి తరానికి అర్థమయ్యేలా చెబుతాం అంటూ కొత్త అర్థాలని పుట్టించి కొత్త కొత్త భావాలు అందిస్తాం ఆపాదిస్తాం. ఉద్దేశ్యం మంచిదే అయినా పరిణామం మాత్రం ధుర్భరం.  కథకి చరిత్రకీ మద్య వున్న వ్యత్యాసాన్ని విస్మరిస్తే  మిగిలేది అనర్థమే.

ఇక మిగిలినవి రెండు సమస్యలు. ఒకటి భారతం మొత్తం కవి రూపకల్పనే. రెండవది సాక్షాలు లేవు. స్థలాభావం వల్ల ఈ ఆంశాలు తరువాయి సంచికలలో చర్చించుకుందాం. కానీ ఇప్పటిదాకా మనం చర్చించుకున్న మొదటి అంశం సైనికుల సంఖ్యను చూస్తే 3.9 మిలియన్ల మంది ఈ భారతయుద్ధంలో పోరాడారనీ, వారందరూ ఆ యుద్ధంలోనే చనిపోయారనీ, ఇందులో దాదాపు అన్ని దేశాలూ పాల్గొన్నాయనీ, ఇదే నిజానికి మొదటి ప్రపంచ యుద్దమనీ తెలుస్తోంది. కనీసం ఆ సంఖ్యకు ఆక్షేపణ అనవసరం అని తేలుతోంది. 

 
ఇంత ప్రాణనష్టం జరగడం మంచిదికాదని భారతంలో శ్రీకృష్ణుడు రాయభారియై వచ్చి ధృతరాష్ట్రుడి కొలువులో కౌరవ వీరులందరికీ నచ్చచెప్ప ప్రయత్నించి చూసాడు. ఫలితం లేకపోయింది. దాదాపు 40 లక్షల వరకు ప్రాణనష్టం జరగక  తప్పలేదు. ఆ భగవానుని బోధనలను ఈ నాటికైనా మనం అర్థం చేసుకుంటే, అంతే చాలు. దానితో ఇక ముందైనా మళ్ళీ ఇలాంటి భీకరమైన యుద్ధాలు జరగకుండా, ప్రాణనష్టాలు జరగకుండా చూసుకోవచ్చును.  చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుంది (History repeats itself) అని పాశ్చాత్యులన్నారనైనా మనం ఆ మాటను గుర్తిస్తాం కనుక, మన చరిత్రలోని నీతులను అర్థం చేసుకుందాం.
  http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct10/sujananeeyam.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి