గాంధీకి బాప్టిజం
అమెరికా చర్చ్ నిర్వాకం
మహాత్మాగాంధీ |
అమెరికాలోని
ఉఠా రాష్ట్రానికి చెందిన "ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే
సెయింట్స్ (ఎల్.డి.ఎస్.)" అనే చర్చి భారత జాతిపిత మహాత్మాగాంధీకి బాప్టిజం
ఇచ్చింది. అదీ ఆయన మరణించిన ఎన్నో ఏళ్ల తరువాత. అమెరికా చర్చి మత
దురహంకారానికి అద్దం పట్టే ఈ వివాదాస్పద చర్యపై గాంధీ మనుమడు సహా పలువురి
నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1996 మార్చి 27 న మహాత్మాగాంధీకి
బాప్టిజం ఇవ్వగా ధృవీకరణ ప్రక్రియ 2007 నవంబర్ 17 న సావో పోలో బ్రెజిల్
చర్చిలో పూర్తి చేసినట్లు సాల్ట్ లేక్ సిటీకి చెందిన హెలెన్ రాడ్కీ అనే
పరిశోధకురాలు వెల్లడించారు. ఫిబ్రవరి 16 న గాంధీజీకి బాప్టిజం ఇచ్చిన
రికార్డును తాను చూశానని, ఆ తరువాత చర్చి డేటాబేస్ నుంచి దానిని శాశ్వతంగా
తొలగించి నట్లున్నారని ఆమె నేవడాకు చెందిన హిందూ కార్యకర్త రాజన్ జెడ్ కు
పంపిన ఒక మెయిల్ లో తెలియచేశారు.
న్యూయార్క్
లో నివాసముంటున్న గాంధీ మనుమడు అరుణ్ గాంధీ దీనిపై స్పందిస్తూ "ఇది నన్ను
ఆందోళనకు గురి చేసింది. మరణించిన తరువాత ఏం చేసినా మాట్లాడేవారెవ్వరూ
ఉండరని వారు భావిస్తున్నట్లుంది. మత మార్పిళ్ళకు మహాత్మాగాంధీ వ్యతిరేకం"
అని వారు చెప్పారు. "హిందూ విశ్వాశాలను శ్రద్ధగా అనుసరించిన గాంధీకి పరోక్ష
బాప్టిజం ఇవ్వడం ఆయనకు మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ
అవమానకరం'' అని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే హిందూ అమెరికా ఫౌండేషన్ కు
చెందిన సుహాగ్ శుక్లా అన్నారు. ఎల్.డి.ఎస్. అధ్యక్షుడు థామస్ దీనికి
క్షమాపణ చెప్పాలని రాజన్ జెడ్ డిమాండ్ చేశారు.
- ఈనాడు సౌజన్యంతో...
http://www.lokahitham.net/2012/01/blog-post_3706.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి