3, మార్చి 2012, శనివారం

అయోధ్య వివాదం - ప్రసారమాధ్యమాల పాత్ర


పర్ణశాల బ్లాగునందు ఈ వారం మహేష్ వెలిబుచ్చిన అభిప్రాయం ఇదీ(యధాతధంగా)...!

బాబ్రీ మసీదు స్థలంలో ఒకప్పుడు రాముడి కొడుకు కుశుడు కట్టించిన దేవాలయం ఉండేది. అనే అధారరహిత చరిత్ర, అపాయకరమైన చరిత్ర, భారతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర.

ఈ వ్యాఖ్య నన్నెంతో కలచి వేసింది. నేను మొదలు పెడదామనుకున్న 'హిందూ ఆధ్యాత్మిక వాదుల' పరిచయాన్ని ప్రక్కన పెట్టించి, ఈ వ్యాసాన్ని రాసేందుకు పురిగొల్పింది.

- బృహఃస్పతి


హిందుత్వానికి వేరే దేశాలపై దండెత్తిన చరిత్ర లేదు. మిషనరీల పేరిటగానీ, మరేవిధంగానో గానీ ఇతర దేశాలకు పోయి అక్కడి వారి మతాన్ని ప్రేతమనో సైతాననో ప్రచారం చేసి హిందుత్వాన్ని మాత్రమే ఆచరించమని బలవంతం చేసిన సంఘటనలు అసలే లేవు. ప్రక్కదేశాలలో కోలనీ వ్యవస్థలను స్థాపించి, అక్కడి వారిని ఆర్ధికంగా దోచుకున్న ఘటనలు క్రించింత్ కూడా లేవు. హిందువు ఏనాడూ కూడా సత్యంగానీ, భగవంతుడు గానీ కేవలం తమకు (హిందువులకు) మాత్రమే చెందుతాడని, మిగిలిన వారు పాపులని చాటిన దాఖలాలు లేవు. హిందూ చరిత్రను తరిచి చూస్తే సహనం, పరమత ఆదరణ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఏ ఇతర మతమూ ఎరుగనివి.

ఐతే దురదృష్టవశాత్తూ ఈనాడు ప్రసార మాధ్యమాల్లో హిందూ వ్యతిరేకత అన్నది సర్వ సాధారణ విషయంగా మారింది. ఈ విధమైన హిందూ వ్యతిరేక భావనలు బహు కొద్ది మంది చేత మాత్రమే ఖండించబడుతున్నాయి.

1992 డిసెంబరులో జరిగిన అయోధ్య సంఘటనను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచం అంతటా (భారతీయ మాధ్యమాలతో పాటుగా) “హిందూ తీవ్రవాదులు మసీదును కూలగొట్టారు" అంటూ కోడై కూసి హిందువులను అటు తీవ్రవాదులగానూ, ఇటు మసీదును నాశనం చేసిన వారిగానూ నిలబెట్టిన ఈ ఘటన పూర్వ పరాలను పరిశీలిద్దాం.

4 శతాబ్దాల క్రిందట మధ్య ఆసియాకు చెందిన ముస్లిం చక్రవర్తి నిర్మించిన ఒక కట్టడాన్ని హిందూ వర్గానికి చెందిన వారు కూల్చివేసారన్నది కాదనలేని సత్యం. ఈ కట్టడం గతంలో సుమారు (60-65 ఏళ్ళ క్రిందట) మసీదుగా ఉపయోగించబడినది. చివరిసారిగా ఇక్కడ ముస్లింలు 1945 ప్రాంతాంలో నమాజునాచరించారు. తరువాతి నాళ్ళలో ఈ అయోధ్య మసీదు లేదా బాబ్రీ మసీదు కేవలం హిందువుల మత కార్యక్రమాలకై మాత్రమే ఉపయోగించబడుతున్నది.

1949 వ సంవత్సరంలో ఇక్కడ రాముని ప్రతిమలు స్థాపించబడ్డాయి. కాకపోతే అప్పటికే కట్టబడిన మసీదు నిర్మాణాలను కూల గొట్టకుండా ఆ ప్రక్కన ఈ ప్రతిమలు ప్రతిష్టించారు. ఈ కట్టడం యొక్క నిర్మాణం నిజమైన మసీదుని పోలి ఉండదు. గోపురాలు(మీనార్), గూళ్ళు వంటి మసీదు పరమైన నిర్మాణాలు ఇక్కడ లేవు (గూగుల్ లో ఫోటోలు చూడండి) వీటన్నిటికీ మించి, ఈ స్థలం హిందువులు పవిత్రంగా భావించే శ్రీ రాముని జన్మస్థలంగా హిందూ గ్రంధాలలో పేర్కొనబడినది. అయితే కాలక్రమంలో జరిగిన డజన్ల కొద్దీ యుధ్ధాలలో హిందువులు(సిక్కులు కూడా) మొఘలుల నుండి ఈ ప్రదేశాన్ని కాపాడుకోవ యత్నించి అశువులు బాసి చివరకు నిస్సహాయంగా ధారాదత్తం చేసిన ప్రదేశమిది.

ముస్లింలకు సంబంధించి ఈ ప్రదేశం మక్కా లేక మదీనా వంటి పవిత్ర స్థలం కాదు. అయితే హిందువులకు సంబంధించి ఇది ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో(sacred) ఒకటి.

కనుక ఈ స్థలాన్ని మసీదు అనడం అసంబధ్ధం. బహుశా ఒక 'వివాదాస్పద స్థలం' అని ఉన్నా సమంజసమేనేమో!

అయితే ఏ ప్రసారమాధ్యమమూ కూడా హిందువులు ఒక వివాదాస్పద కట్టడాన్ని కూల్చారన్న వార్తను ప్రజలకు చేరవేయలేదు. ఎందుకంటే ఇలా చెప్తే వారికి కావలసిన 'మసాలా కధ' దొరకదు. ఫలితం ప్రసారమాధ్యమాలు హిందువులు ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీసారన్న గగ్గోలునే కాక హిందువులపై తీవ్రవాదులన్న అపవాదును మోపి తదనంతరం జరిగిన మరెన్నో హింసాజ్వాలలకు ఆజ్యం పోసారు.

వేయి సంవత్సరాల పైబడి, అలుపెరగని ముస్లిం చక్రవర్తుల దండయాత్రలలో కొన్ని లక్షల హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. క్రీస్తు శకం 6-7 వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికులు (హుయాన్ త్సాంగ్ మొదలగువారు) తమ దేశానికి అందించిన చరిత్ర లెక్కల ప్రకారం ఉండాల్సిన ఎన్నో- ఎన్నెనో హిందూ దేవాలయాలూ, బౌధ్ధ, జైన కట్టడాలూ ఇప్పుడు ఆనవాళ్ళకు కూడా దొరకవు. ఇవేవీ సహజ సిధ్ధంగా నేలమట్టమవలేదు. రాత్రికి రాత్రి మాయమవనూలేదు. ముస్లిం చక్రవర్తుల సంకల్పానుసారం హిందువుల విశ్వాసాలను దెబ్బకొట్టే ప్రయత్నంలోనూ, ఆ దేవాలయాల్లోనున్న వజ్ర, వైఢూర్య, రతనాల సంపదలను కొల్లగొట్టే ప్రయత్నంలోనూ జరిగినవి.

ఇందులో భాగంగానే హిందువులు పవిత్రంగా భావించే శ్రీకృష్ణ, శ్రీరామ జన్మస్థానాలు దారుణంగా ధ్వంసం చేయబడ్డాయి. ఈ విధ్వంసంతో ఆగక ఈ పవిత్ర హిందూ కట్టడాలకు ఉపయోగించిన రాళ్ళను ఆ ప్రక్కనే మసీదు కట్టడాలలో (మధుర కు వెళ్ళిన వారికి ఇది ప్రత్యక్షానుభవం) ఉపయోగించటం అత్యంత దయనీయమైన విషాద సంఘటన. ఈ హిందూ ఆలయ పూజారులను, ఆ మసీదు ప్రవేశద్వారం వద్ద పూడ్చి పెట్టేవారట. మసీదునందు ప్రవేశించేవారు తమ పాదాన్ని ఈ భూస్థాపిత హిందూ సమాధిపై మోపి వెళితే అదొక విజయసూచికం.

ఈ విధమైన క్రూర చరిత్ర, చాలా మంది చరిత్రనుండి 'లాభాల'ను మాత్రమే ఆశించే 'వ్యాపారులకు' పట్టదు. తమ 'వ్యాపారాపేక్ష'తో 'చరిత్రహీనులు'గా ఉండటమే ఉత్తమమని భావించే వీరికి ఉన్నత విలువలు పట్టవు. రాముడక్కడే పుట్టాడనటానికి అక్కడ DNA ఆధారాలు కావాలంటారు. హిందువులు పది చోట్ల రాముడు పుట్టాడని ప్రకటించలేదు. హిందూ గ్రంధాల ప్రకారం, శిలాశాసనాల ప్రకారం అన్నీ ఏకాభిప్రాయంతో చెప్పిన చోటనే పుట్టాడంటున్నారు. ముస్లిం చక్రవర్తులు కూడా ఈ ఆధారాల అనుగుణంగానే ఒక ప్రణాళిక ప్రకారం హిందూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేసారు. ఏ భావాల, ఇజాల ప్రభావానికి లొంగకుండా, ప్రశాంత చిత్తంతో ఒక్క సారి మీ మనోనేత్రాన్ని తెరచిచూడండి. వేల యేళ్ళగా హిందుత్వ ఆత్మ ఎలా హత్యా యత్నాలకు గురి అవుతోందో మీ హృదయానికి ఖచ్చితంగా కనిపించి తీరుతుంది.

1947 లో ముస్లిం మైనార్టీలకొరకు జరిగిన దేశ విభజన ముఖ్యోద్దేశం హిందువుల పాలనలో జీవించేందుకు ముస్లిం వర్గాల తిరస్కారం. ఈ పరిణామంలో పాకిస్థాన్ లో నున్న అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడి మసీదులుగా రూపాంతరం చెందాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు చెందిన ప్రభుత్వాలూ, సైన్యం కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ ధ్వంసాకాండకు రచన చేసిన సంఘటనలు కోకొల్లలు.

అయితే చరిత్రలో ఈ విధంగా హిందూ దేవాలయాలను కూల్చి మసీదు నిర్మించిన ఘటన ఒక్కటి కూడా వెలుగు సంతరించుకోలేదు. కనీసం అయోధ్య వివాద సమయంలోనైనా ఇటువంటి చరిత్ర ప్రస్తావన ఎవ్వరినీ ఆలోచింపచేయలేదు. ఇందుకు విరుధ్ధంగా తిరిగి హిందువులు తీవ్రవాదులగానూ, మసీదు విధ్వంసకులగానూ ప్రపంచానికి పరిచయం చేయబడ్డారు.

అయోధ్య వివాద సమయంలో కూడా డజన్ల కొద్దీ హిందూ దేవాలయాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూల్చివేయబడ్డాయి. బ్రిటన్ మొదలగు భారతేతర దేశాలలో సైతం ఈ విధమైన దాడులు హిందూ దేవాలయాలపై జరిగాయి. అయినప్పటికినీ ఈ వివాదాలు చాలా తేలికగా తీసుకోబడ్డాయి. కారణం, 'మసీదు ధ్వంసానికి తెర లేపినది హిందువులు. కావున తదనంతరం చెలరేగిన హింసా వివాదాలకు (ముస్లిం వర్గాలచే కూల్చబడిన హిందూ దేవాలయాలకు) కూడా హిందువులే బాధ్యులు.'

ఇదీ దాదాపు అన్ని ప్రసార మాధ్యమాలూ కూడా అయోధ్య వివాదాన్ని చూసిన కోణం.

'హిందూ దేవాలయం కూల్చివేత ఎందుకు వార్త కాలేకపోతోంది?' 'ఒక వివాదాస్పద కట్టడం(మసీదుగా భావించే) కూల్చివేత ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటుంది?' నిజానికి ముస్లిం వర్గాలు వేరే వర్గానికి చెందిన మసీదులను కూల్చివేసిన సంఘటనలూ ఉన్నాయి. (పాకిస్థాన్లో కూల్చివేయబడ్డ అహ్మదీయ మసీదు). ఇవి సైతం ఎందుకు అయోధ్య సాధించినంతటి వివాదాన్ని పొందలేకపోతున్నాయి?

దీనికి సమాధానంగా తిరిగి ఇలా ప్రశ్నించుకుందాం.

"వేల సంవత్సరాలనుంచీ హిందూ దేవాలయాలు ధ్వంసమవుతున్నప్పటికినీ, ఎందుకు హిందువులు అయోధ్య విషయంలో మాత్రమే కళ్ళు తెరచారు?"

పై ప్రశ్నకు సమాధానం కూడా తరచి చూస్తే అక్కడే లభిస్తుంది.

"ఎవరు సమ్మతించినా, లేకున్నా తరతరాలుగా మనసు పొరల్లో దాగున్న మోసగింపబడ్డామన్న భావన లేదా అన్యాయం జరిగిందన్న బాధ లేదా దోచుకోబడ్డామన్న దుగ్ధ చట్ట పరంగా తగిన న్యాయం లభించనప్పుడు విప్లవంగా ఉబికి వస్తుంది."

ఇది కమ్యూనిస్టులు సైతం అంగీకరించవలసిన నిజం. విప్లవానికి వారిచ్చే నిర్వచనం కూడా ఇదే!

గత అరవై ఏళ్ళ పైబడి ఈ అయోధ్య వివాదం కోర్టు గోడల మధ్య సరియైన తీర్పు వెలువడక నలుగుతుందన్న నిజాన్ని ఏ పత్రికా చూపించ ప్రయత్నించలేదు. కనీసం మన చట్టాలు సైతం ఆ కట్టడం మసీదనో లేదా గుడి యనో నిర్ధారించలేకపోవటం శోచనీయం. ఇలాంటప్పుడు అది వివాదాస్పద కట్టడమే కానీ చట్టపరంగా కూడా మసీదు కాజాలదు.

అణగద్రొక్కబడిన ఎన్నో వర్గాల మాదిరిగానే హిందువులూ మేల్కొన్నారు. జాతి, వర్ణ, లింగ విచక్షణ తదితర వైషమ్యాలలో అణగద్రొక్కబడిన వారు కోపోద్రేకాలకు, కట్టలు తెంచుకునే అవేశానికీ లోనై ప్రవర్తించేటప్పుడు వారిపట్ల చూపే సానుభూతిలో కాసింతైనా హిందువు పొందలేకపోయాడు. కనీసం ప్రసార మాధ్యమాలు సైతం అటుగా దృష్టి సారించలేదు. తరతరాలుగా లభించని న్యాయానికై నిరీక్షించి నిరీక్షించి, ప్రజాస్వామ్య పాలనలో సైతం తమకు న్యాయం జరుగకపోవటంతో హిందువు తనకు తాను న్యాయం చేసుకో యత్నించిన ఘటన ఇది.

ఇది తప్పనో, ఒప్పనో నేను చాటిచెప్పటానికి ప్రయత్నించటంలేదు. ఇది ఒక విప్లవం అంతే! ప్రపంచంలో ఏ మూలనైనా అణగద్రొక్కబడ్డ వర్గాలు ఉద్యమించటం సరియైనట్లైతే, ఇది అందుకు మినహాయింపు కాజాలదు. హిందువు కూడా ఈ దారిలోనే నడిచాడని భావించాలి.

హిందువు అణగద్రొక్కబడిన వర్గం అంటే మీరెవరూ అంగీకరించకపోవచ్చును. ఒక్కసారి చరిత్రను చూడండి. 8 వ శతాబ్దం మొదలుకునీ ముస్లిం, పోర్చుగీసు, బ్రిటిష్ దండయాత్రలలో వర్ణ పరంగా, మత పరంగా, ఆర్ధిక పరంగా సైన్యం ఉక్కుపాదాల క్రింద అణచివేయబడిన చరిత్ర మనది. ఈ విధంగా చరిత్రను తరచి చూస్తే మనం హిందువులెందుకు ధ్వంస రచనకు పూనుకున్నారని ఆవేశపడటం మాని హిందువు ఇన్ని శతాబ్దాల తరబడి దేవాలయ విధ్వంసాలను ఎలా సహించాడని ఆలోచిస్తాం. ఈ తరహా సహనం ప్రపంచంలోని ఏ ఇతర సంస్కృతిలోనూ కనపడదు.

హిందుత్వ వ్యతిరేకతను ప్రసార మాధ్యమాలు ఎంత మేరకు ప్రదర్శిస్తాయో తెలుసుకోవాలనుకుంటే మనం ఓ రెండు ప్రపంచ దేశాలను ఉదహరించి పోల్చి చూడాలి.

అందులో మొదటిది సౌదీ అరేబియా. ఇక్కడ ఇస్లాం తప్ప వేరే మతాన్ని ఆచరించటం చట్టరీత్యా నేరం. ఇతర మత కార్యకలాపాలు కేవలం విదేశీయులకు అందునా బహిరంగం కానీ ప్రదేశాల్లో (అంటే ఇంట్లోనన్న మాట) మాత్రమే అనుమతి లభిస్తుంది.ఇక్కడ మతానికీ, ప్రభుత్వానికీ, రక్షాణా యంత్రాంగానికీ(పోలీసు వ్యవస్థ), సైన్యానికీ తేడా కనపడదు. అన్నీ ఇస్లాం మతాచారాల చట్టాల ప్రకారం నడుస్తాయి. ఇక్కడ సహనం అన్న విధానమే ప్రభుత్వ అజెండాలలోనూ, మత చట్టాలలోనూ ఉండదు. ఇస్లాంకు వ్యతిరేకంగానో లేదూ ఇతర మతాచారాలను బహిరంగంగానో ఆచరించినట్లైతే(సూర్య నమస్కారంతో సహా) చేతులు నరకివేయటం, కళ్ళు పీకివేయటం వంటి క్రూర శిక్షలు అమలవుతాయి. ఎన్నో ఏళ్ళగా ప్రపంచం నలు మూలలా విస్తరిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలకు ఇక్కడి నుండే ధనం సమకూరుతోంది. అయినప్పటికినీ సౌదీ మధ్యస్థ ఇస్లామిక్ (moderate) దేశంగానే పేర్కొనబడుతుంది.

సౌదీలోని చట్టాల వంటివి 10% భారతదేశంలో హిందువులకు అనుకూలంగా ప్రవేశ పెట్టినా ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి ఉండేది. పరిస్థితి యుధ్ధచర్యల దాకా వెళ్ళినా ఆశ్చర్యపడనవసరం లేదు.

అయినప్పటికినీ సౌదీ ఎందుకు ఈ విధమైన గౌరవాన్ని పొందగలుగుతోంది? కారణం అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం పెట్రోలు కొరకు సౌదీ పై ఆధారపడి ఉంది. ఈ ఆర్ధికావసరాలు ప్రపంచ ప్రసార మాధ్యమాలను సైతం నిర్దేశిస్తూ ఉన్నత ప్రమాణాలకు తిలోదకాలిప్పించి, పత్రికా విలువలకు నీళ్ళొదిలేలా చేస్తున్నాయి.

మనం వ్యాపారావసరాలకై ఎవరిపై ఆధారపడతామో వారు ఎంతటి నియంతృత్వ ధోరణి ప్రదర్శించినా అది మనలను విస్మరించేలా చేస్తుంది. ప్రతి రంగంలోనూ ఆధిక్యాన్ని చూపే పశ్చిమ దేశాలు భారత దేశం పై ఆర్ధికంగా ఆధారపడిలేవు. అదే సమయంలో భారతదేశం నుంచి తీవ్రవాద రూపంలోనో, మరే విధమైన ఆర్ధిక పరంగానో వారికి ముప్పులేదు. ఈ పరిస్థితి సహజంగానే ప్రభుత్వాలచే పరోక్షంగా నియంత్రించబడే ప్రసార మాధ్యమాలు భారత దేశం విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం లేకుండా చేసాయి. (అయితే ఈ స్థితి కూడా మారుతుంది. ఛిన్నాభిన్నమైన ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచదేశాలన్నిటినీ ఒకే స్థాయికి తెచ్చినప్పుడు ఆర్ధికంగా బలోపేతమయ్యే భారత వ్యవస్థ ఈ ప్రపంచ ప్రసార మాధ్యమాలకు కళ్ళెం వేయగలుగుతుంది)

ఇక రెండవ దేశం చైనా. కమ్యూనిస్టు నియంతృత్వంలోనున్న చైనాకు - అమెరికాకూ మధ్యన ఎన్నో ఏళ్ళగా బలమైన వ్యాపార సంబంధాలున్నాయి. అందువల్ల సహజంగానే చైనా వ్యతిరేకత ప్రపంచ ప్రసారమాధ్యమాల్లో కనపడదు. వారి సైనిక పాలన గూర్చి ఏ ప్రపంచ పత్రికా నోరు విప్పదు. చైనా ప్రభుత్వం ఎన్ని అణు ప్రయోగాలు చేసినా, టిబెట్టులో బౌధ్ధులపై అకృత్యాలు చేసినా అవి అంతగా ప్రాధాన్యత సంతరించుకోవు. చైనా ఎందుకు ఈ విధంగా ప్రత్యేక హోదా పొందగలుగుతోంది? సమాధానం, ఆర్ధిక లావాదేవీలూ, విస్తీర్ణత, జనాభా, శక్తి రీత్యా చైనా కున్న బలాబలాలు.

మానవీయ విలువలు, సమస్యలు ఈ విధంగా ఆర్ధిక అవసరాలకు దాసోహమై, ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ఏమి చేసినా అది ఒప్పే అన్న పరిస్థితిని తీసుకు వచ్చాయి. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు సులభంగా క్షమించబడతాయి. 'అర్ధం' చేసుకోబడతాయి.

ఇప్పుడు ముస్లిం దేశాలలోని హిందూ మైనార్టీలను, భారత దేశంలోని ముస్లిం మైనార్టీలతో పోల్చి చూద్దాం.

పాకిస్థాన్ తమ దేశంలోని హిందూ మైనార్టీలను ఏనాడో దాదాపుగా ఏరిపారవేసింది. బంగ్లాదేశ్ లోనున్న హిందూ మైనార్టీలు సమయం దొరికినప్పుడల్లా దోచుకోబడతారు. ఇవేవీ ప్రపంచ మాధ్యమాల చూపుకు సోకవు. 1971-72 లో జరిగిన బంగ్లాదేశ్ విభజన భారతదేశం జరిపిన కుట్రగా వర్ణించే ప్రపంచ ప్రసార మాధ్యమాలు ఆ సంఘటనలో అశువులు బాసిన వారిలో అధికులు హిందువులేనన్న నిజాన్ని చూపవు.

అరబ్ దేశాల్లో హిందువులు బహిరంగ ప్రదేశాల్లో ఏ విధమైన మతపరమైన కార్యకలాపాలను (సూర్య నమస్కారంతో సహా) ఆచరించకూడదని నిషేధిస్తే దానిని భారతదేశంతో సహా ఏ దేశమూ ప్రశ్నించదు. ఈ తరహా విధానం భారతదేశంలో అమలు చేద్దామంటే జరిగే వివాదం తేలిగ్గా ఊహించవచ్చు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక దేశాలు హిందువుల పట్ల ప్రదర్శించిన తీరును భారతదేశం ఏనాడూ ముస్లింల పట్ల ప్రదర్శించలేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న, భారతదేశంలో పెరుగుతున్న ముస్లిం జనభాతో మనం ముస్లింల వ్యాప్తికి సహకరిస్తుంటే, పాకిస్థాన్ వంటి దేశాలు హిందువులను పూర్తిగా నిర్మూలిస్తున్నాయి.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఏ ఇతర ఇస్లామిక దేశంలోనూ లేనన్ని ముస్లింవర్గాలు మన దేశంలో తమ ఉనికిని చాటుకో గలుగుతున్నాయి. అహమ్మదీయ ముస్లింలు పాకిస్థాన్ నుంచి తరిమివేయబడగా శరణార్ధులై వచ్చిన వీరిని భారతదేశం ఆదరించింది. ఇంత జరిగినప్పటికినీ అయోధ్య వివాదం భారతదేశంలో ముస్లింలపై హిందువులు సాగించిన అకృత్యంగానే మిగిలిపోయింది.

దీనివల్ల అర్ధమైనదేమిటంటే ముస్లింపై హిందువు జరిపే దాడి వార్తకు అర్హమైనది. హిందువుపై ముస్లిం జరిపే అకృత్యం(ఎంత పెద్ద ఎత్తునైనా గానీ) వార్తకు అనర్హమైనది.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం ఒక వార్త కూడా కాజాలదు. మన దేశంలో వలే అక్కడి ప్రభుత్వాలు ఈ విధ్వంసాలను అడ్డుకునేందుకు ప్రయత్నించవు. కనుకనే ఇది అక్కడ ఏ రకమైన వివాదాన్నీ సృష్టించదు.

ఎన్నాళ్ళీ అసహాయత? ఎందుకీ అసమానత? కారణం ప్రపంచదేశాలకు ఇస్లాం తీవ్రవాద భయం. హిందువుకు తాను హిందువునన్న స్పృహ లేకుండటం రెండవ కారణం. ఈ రెండో కారణానికి మూల కారణం భారతదేశం పై నున్న వామవాద, మార్కిస్టు భావజాల ప్రభావం. విద్యావ్యవస్థలోనూ, ప్రభుత్వ విధానాలలోనూ(చట్టపరమైన, రాజ్యాంగ పరమైన) వీరు నింపిన హిందూ మత వ్యతిరేకత.

వీరు హిందుత్వాన్ని ఒక వర్గంగానూ, విగ్రహారాధన మొదలైన అనాగరిక దురాచారాలతో నిండిన మౌఢ్యంగానూ వ్యవహరిస్తారు. నిజానికి హిందుత్వం ఒక వర్గానికి చెందినది కాదు. అది వ్యక్తిగతం. హిందుత్వ ముఖ్యోద్దేశం విగ్రహారాధన కాదు. ఉద్దేశ్యం ఆధ్యాత్మికం. హిందూ ఆచరణాలయిన యోగ, ధ్యానం, మొదలైనవి ఆత్మ స్పృహ కొరకు(self realization) వాడబడు సాధనాలు. హిందుత్వ ఉన్నత లక్ష్యం ఈ ఆత్మ సిధ్ధాంతం. ఈ ప్రకృతి సిధ్ధమైన హిందూ తత్వం, ఆత్మ విశ్లేషణ విస్మరింపబడుతున్నాయి. వీటిని అకుంఠిత దీక్షతో ఆచరించిన మహానుభావులు రామకృష్ణ పరమహంస, అరబిందో, రమణ మహర్షి వంటి వారు ఆధ్యాత్మిక పుస్తకాలలో తప్పితే చరిత్రలో స్థానం సంపాదించుకోలేకపోయారు.

ప్రపంచదేశాలూ, ప్రసార మాధ్యమాలూ అన్నీ హిందూ సంఘజీవనంలోని లోపాలను (కుల వ్యవస్థ, లింగ విచక్షణ, వరకట్న దురాచారం వంటివి) ఎత్తి చూపాయి తప్పితే హిందుత్వ ఉన్నత విలువలను చూపటానికి ప్రయత్నించలేదు. కాస్తో కూస్తో వెలుగు చూసిన ఆధ్యాత్మికత అనాగరికులు ఆచరించినదన్నట్లు చూపబడింది. ఈ "అనాగరికులే" ఎన్నో శతాబ్దాల క్రిందటనే ప్రపంచ మానవుడు బట్ట కట్టక మునుపే నాగరికతనూ, అభివృధ్ధినీ సాధించి చూపారన్న సత్యం ఎవ్వరికీ పట్టదు. విచిత్రంగా హిందువులు ఏనాడూ ఏ ఇతరదేశస్థులనీ అనాగరికులని నిందించలేదు. తిరిగి తన చరిత్రను అనాగరికమని పరిగణించినపుడు మౌనం దాల్చవలసి వచ్చింది.

హిందూ దేవాలయం ధ్వంసం చేయటం ఇస్లాం మత వ్యాప్తిలో భాగమని అంగీకరిస్తే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు. జనులందరికీ ఒకటే న్యాయం వర్తింపజేయాలి. ఉన్నత విలువలతో కూడిన హిందుత్వ సహనం చేతకానితనంగా భావిస్తున్న రోజులు మారాలి. హిందువుకు ఏ ప్రత్యేక ప్రతిపత్తీ అవసరం లేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న అసమానత తొలగాలి. హిందువుల పట్ల సునాయాసంగా వ్యక్తమయ్యే చులకన పోవాలి.

ప్రసార మాధ్యమాల్లో(బ్లాగులే కానివ్వండి, లేదా TV channels, పత్రికలే కానివ్వండి) ఈ హిందూ వ్యతిరేకత కొనసాగినన్నాళ్ళూ అది హిందుత్వానికి మరింత హాని చేస్తుంది. కనీసం ఈ మార్పు మన భారతీయ ప్రసారమాధ్యమాల్లో ప్రారంభమవ్వాలి. ఇది స్వేఛ్ఛాపహరణ ఎంత మాత్రమూ కాదు. స్వేఛ్ఛ అన్నది విషయాన్ని సూటిగా, నిజాయితీగా చెప్పటంలో ఉండాలి తప్పితే మసి పూయటానికి కాదు. మన సంస్కృతిని, ఆచారాలను హేళన చేసే వారిని నిలదీసే స్థైర్యం సంపాదించుకోవాలి. ఇందుకోసం ప్రతి హిందువూ తన పరిధిలో ప్రయత్నించాలి.

హిందూవ్యతిరేకతను అంగీకరించిన పక్షంలో హిందువు తనను తానే నిందించుకోవాలి తప్ప వేరెవరినీ కాదు. ప్రసార మాధ్యమాలు హిందుత్వ ద్వేషాన్ని సవరించటానికి కూడా ఎంతో ఉపయోగపడగలవు. కాకపోతే ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఈ వ్యాసం ముఖ్యోద్దేశం హిందువులు నిష్కల్మషులని చెప్పటం ఎంత మాత్రమూ కాదు. హిందుత్వ పార్టీలు, సాంఘిక ఆచారాలు ఉన్నతమైనవని చాటటం కూడా నా ఉద్దేశ్యం కాదు. హిందూ సమాజాన్ని సంస్కరించుకునే అవకాశాన్ని హిందుత్వానికే ఇవ్వండి. అఖండ భారతావని ఆత్మకు, హిందూ ధర్మాలకు ఆ భాధ్యతనొసగండి. అంతే తప్ప ఈ కార్యాన్ని పశ్చిమ దేశాల చేతికో, కార్ల్ మార్క్స్ వీరారాధకులకో ఇవ్వకండి.


ఇదంతా చదివాక నేనేదో RSS అభిమానిననుకునే వారికి ఒక మనవి. నాకు కనీసం RSS కి అర్ధం కూడా తెలియదు (R అంటే రాష్ట్ర అని మాత్రమే తెలుసు. మిగిలిన S, S లకు అర్ధం తెలియదు. తెలుసుకోవ ప్రయత్నమూ చేయలేదు. I swear it). గత పదేళ్ళల్లో నేను గుళ్ళకూ, దేవాలయాలకూ వెళ్ళిన సంఘటనలు వేళ్ళ మీద లెఖ్ఖించవచ్చు. ఇక ఇంట్లో పూజ సరే సరి. గత పదేళ్ళల్లో ఏవో కొన్ని పండగలకు తప్ప కనీసం దేవుని పటానికి నమస్కారం పెట్టి కూడా ఎరుగను. నన్నేదో మత మౌఢ్యునిగా భ్రమించే వారి సందేహాన్ని తీర్చటం కోసం ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నాది మతపరమైన విశ్లేషణ అని భావించేవారికి ఇదే నా ఆత్మఘోష.

నేనొక హిందువుని. చెట్టుపై అందనంత ఎత్తులోనున్న ఫలాన్ని కోసుకునేందుకు ఒక కర్రను ఉపయోగిస్తాం. ఫలం లభించాక ఆ పండుని ఆస్వాదిస్తాం కానీ కర్రను కాదు. అసలా కర్ర విషయం కూడా అలోచించం. ఆ అవసరమూ లేదు. మతం కూడా ఈ కర్రలాంటి సాధనమే. నేను హిందుత్వ ఫలాలను అందుకుని సాధనాన్ని ఏనాడో త్యజించాను. అంత మాత్రాన ఎవరో వచ్చి ఆ కర్రను తగలబెట్టాలి అని గగ్గోలు పెడితే నాకెందుకులే అని ఊరుకోను. ఎందుకంటే భావితరాలకు ఫలాలను అందించే శక్తి కేవలం ఆ సాధనానికి మాత్రమే ఉంది. అట్టి సాధనాన్ని ఎవరో నిర్మూలింప ప్రయత్నిస్తుంటే చూస్తూ కూర్చోలేక గళం విప్పుతున్నాను.

ఈనాడు పెల్లుబికిన ఈ స్వరం కేవలం నా ఒక్కడిది మాత్రమే కాదు. ఇది చదువుతున్న ప్రతి ఒక్కరి హృదయాంతరాల్లో, నరనరాల్లో నిద్రాణమైన హిందుత్వ ఆత్మది. నేడు నా గొంతునాశ్రయించినట్లే రేపు మరొకరి గొంతు సంతరించుకుంటుందని విశ్వసిస్తూ...

జై...
..."హింద్"


(చివరిగా: నా మాటలో మీకు నిజాయితీ కనిపించి ఉంటే, అలోచింపజేసి ఉంటే - ఈ సారాంశాన్ని నలుగురితో పంచండి. హిందుత్వ వ్యతిరేకతను నిర్మూలించటానికి, మీ వంతు చిన్ని ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని forward చేసి(There is an email-a-friend option below next to the comments) గానీ, మీ బ్లాగులో copy చేసుకుని గాని వ్యాప్తి చేయండి)


 http://vikaasam.blogspot.in/2009/07/blog-post_10.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి