2, మార్చి 2012, శుక్రవారం

జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

వై.ఎస్ ‘మనవాళ్లు’ ఎవరు                - వరవరరావు  .


వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవపసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

‘తెలంగాణ రాష్ట్ర సమితి బలంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే “మనం'’ హైదరాబాద్‌లో విదేశీయుల వలె జీవించవలసివుంటుంది. జలయజ్ఞం ఆగిపోయి ఒక్క నీటిచుక్క కూడ మనకు దక్క దు. ఎందుకంటె టిఆర్ఎస్ పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నది. మనం హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకోలేము. కార్పొరేటు విద్యా సంస్థలను వెళ్ళ గొడ్తారట’ అని నంద్యాల సభలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మొదటి విడత పోలింగ్ ముగిసే సమయాన చాల విద్వేషపూరితమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం కూడా చాల తీవ్ర స్వరంతో సాగింది. అదే ప్రసంగాన్ని ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు పదే పదే పునరుద్ఘాటించారు. తాను కేవలం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తున్నానని, అవన్నీ గతంలో ఆయన చేసిన ప్రసంగాలు, హెచ్చరికలు అని కూడా అన్నారు. వాస్తవానికి కార్పొరేట్ విద్యా వైద్య విధానాలు తెలుగుదేశం పార్టీతోనే మొదలైనవి.

తాను అధికారంలో ఉంటే పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు ఈ ఐదేళ్ళలోనే పూర్తయి ఉండేవని చంద్రబాబు మహాకూటమి కట్టిన రోజే చెప్పారు. కెసిఆర్ కూడ అక్రమాలు చేసే విద్యా సంస్థలకు మాత్రమే తాను వ్యతిరేకినన్నా రు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులకు సూత్రప్రాయమైన వ్యతిరేకత ఏ ఎన్నికల పార్టీకి లేదు. అది తెలిసే మహాకూటమిని తనను తాను సమర్థించుకునే స్థితిలో పడేయడానికి వైఎస్ ఇంత ఫ్యాక్షన్ వైఖరి బహిరంగంగా తీసుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయివుండి, ఇంకా నెలరోజులు ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’గా కూడా కొనసాగవలసి ఉండగా ఏరుదాటినాక తెప్పతగిలేసినట్లు తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే నంద్యాలలో ఇట్లా మాట్లాడడం పూర్తిగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుంది.అయితే ఆయన ఆపాదించుకుంటున్న ఈ ‘మనం’ ఎవరు? ఆయన ఉద్దేశిస్తున్నది రాయలసీమ, ఆంధ్ర ప్రాంతపు సాధారణ ప్రజానీకమేనా? ఓటర్లుగా వాళ్లే అయివుండాలి. రాయలసీమ, ఆంధ్రప్రాంత ప్రజలంద రూ హైదరాబాద్‌తో తెలంగాణతో వ్యాపార సంబంధా లే పెట్టుకోవాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో, తెలంగాణలో వివిధ పరిశ్రమల్లో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్న ఆంధ్ర, రాయలసీమ వాణిజ్య ప్రముఖులేనా ఈ ‘మనం’? వీళ్లు సగటు తెలుగు ప్రజల ప్రతినిధులవుతారా? ఇది లగడపాటి రాజగోపాల్ భాషో, టి.జి.వెంకటేశ్ భాషో అయితే అర్థం చేసుకోవచ్చు గానీ, పొద్దున లేస్తే రైతుబిడ్డనని చెప్పుకునే వైఎస్, రైతు బాంధవుడు గా ముఖ్యమంత్రి అయిన వైఎస్ భాష కావడమే అభ్యంతరకరం. తన భూముల్లో బెరైటిస్ గనులు పడిన దగ్గర్నించీ, ఇవ్వాళ్టి ఊసరవెల్లి విశ్వరూపం దాకా బయట పడుతున్న స్వభావం ఇది.

రాష్ట్రంలో 60 శాతం ఇంటర్మీడియెట్ స్థాయి విద్యపై గుత్తాధిపత్యం ఉన్న నాలుగు కార్పొరేట్ విద్యా సంస్థలలో రాయలసీమ, కోస్తా ప్రాంత సామాన్య ప్రజల భాగస్వామ్యం ఎంత? వాళ్ల సమస్య లు, ఇబ్బందులు రాయలసీమ, ఆంధ్ర ప్రాంత సగటు ప్రజల సమస్యలు ఇబ్బందులు ఒకటేనా? రాయలసీమ, ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా రాయలసీ మ ప్రజలు, తెలంగాణ ప్రజలు పంచుకోవాల్సిన నిజమై న సమస్య నీటి సమస్య. రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, పాలమూరు జిల్లాకు ఉమ్మడి సమస్య. ఈ రెండు జిల్లాల ప్రజలను నిజంగా ఒకటి చేస్తున్నది కరువు సమస్యే గానీ వ్యాపార సంబంధం కాదు. అయితే ప్రకృతి రీత్యా పాలమూరు, నల్లగొండ జిల్లాలు కృషా ్ణపరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. రాయలసీమ లేదు. అనంతపురం పెన్నా పరీవాహక ప్రాంతం లో ఉన్నది. కర్నూలు, కడపలు తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.

తెలు గు గంగ, కెసి కెనాల్ నీళ్లు, వాళ్ల తాగునీటి, సాగునీటి సమస్యలు పరిష్కరించకపో తే తప్పకుండా కృష్ణానది వరదనీరును, నీటి మట్టంపై నుంచి దొర్లిపోయే నీరును రాయలసీమకు మళ్లించే విషయం ఆలోచించవలసిం దే. నదీ పరీవాహక ప్రాంతం లో లేనివాళ్ళకు నీటి పంపకాల గురించి జల నిపుణుల సాంకేతిక కారణాలతో ఆలోచించకపోతే ఇరుగు పొరుగు ప్రజలు ఆలోచించవలసిం దే. ప్రజా ప్రతినిధులు, ప్రజా రాజకీయాలు ఆలోచించవలసిందే. అయితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమలోకి తీసుకుపోతున్న నీళ్లన్నీ రాయలసీమ ప్రజల దాహా ర్తి తీర్చడానికి, తరి, ఖుష్కి పంటలు పండించడానికేనా అన్నది సగటు ప్రశ్న. కడపలో యురేనియం ప్రాజెక్టు, కర్నూలు, కడప మొదలు రాయలసీమలో వస్తున్న ప్రత్యేక ఆర్థిక మండలాలు, బ్రహ్మణి వంటి ఉక్కు పరిశ్రమలు-వీటికోసం మళ్లిస్తున్న కృష్ణా జలాలు ఎన్ని? ప్రజ ల మంచి నీటికి, సాగునీటికి కేటాయిస్తున్న నీళ్ళు ఎన్ని? ఈ జల యజ్ఞంలో విధ్వంసమవుతున్న ప్రకృతి వనర్లు, మానవ వనరుల మాటేమిటి? నిర్వాసితుల మాటేమి టి? ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలు, రాయలసీమ లో వస్తున్న పరిశ్రమలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధనరెడ్డి ప్రమేయం లేనివి ఒక్కటీ ఉండవు. బడా పెట్టుబడిదారులవి. బహుళజాతి కంపెనీలకు కమిషన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న దళారీలవి.

వాళ్లు విదేశీయు లు కాకపోవచ్చు. కాని విదేశీ కంపెనీల ప్రయోజనాల కోసం ఇక్కడ ఏజెంట్లుగా దళారీలుగా పనిచేస్తున్న వాళ్లు. తప్పకుండా వై ఎస్‌కు ‘మన వాళ్లు’. పులిచింతల, పోలవరం అటువంటివే. ఈ రెండు ప్రాంతాల కింద గ్రామాలు ముంపునకు గురవుతాయి. పులిచింతల కింద పలనాడు కరువు ప్రాంతం సస్యశ్యామలం కాదు. మునిగిపోతుంది. కృష్ణా డెల్టాయే లాభపడుతుంది. నల్లగొండలోని కరువు ప్రాంతం మునిగిపోతుంది. ఆల్మట్టి కాలంనుంచి కూడ ప్రజాస్వామ్యవాదు లు, తెలుగు ప్రజలు సమన్యాయం పొందాలని ఆశించేవాళ్ళు ప్రతిపాదిస్తున్నదే మంటే కృష్ణా డెల్టా రైతులు తమకు మూడు కార్లకు నీళ్ళు కావాలని స్వార్థ పట్టుదల చూపడం కన్నా ఎగువు న బీజాపూర్, రాయచూర్, పాలమూరు జిల్లాలకు దాహం తీర్చే త్యాగం అయి నా చేయవచ్చు కదా అని. నల్లగొండ జిల్లాకు, పలనాడుకు కన్నీళ్ళు మాత్రమే మిగిల్చే పులిచింతలను వ్యతిరేకించడం నల్లగొండ, పలనాడు ప్రజలకు సంబంధించినంత వరకు విదేశీ భా వన అవుతుందా? వైఎస్ ‘మనం’లో ఈ రెండు జిల్లా ల వాళ్లు లేరా? పోలవరం ప్రాజెక్టు ఖమ్మం, గోదావరి జిల్లాల్లో 304 ఆదివాసీ గ్రామాలను ముంపునకు గురిచేసి వస్తున్నది.

ఈ ఇందిరా సాగరంలోని నీళ్ళు మళ్లీ గోదావరి, కృష్ణా డెల్టాలలో ఎంత భూమిని అదనంగా సాగులోకి తెస్తుందన్న దానికన్న - ప్రాజెక్టు కాకినాడ నుంచి విశాఖపట్నం దాకా వస్తున్న పారిశ్రామిక కారిడార్ కోసం అన్నది-గోదావరి జలాలను విశాఖపట్నం దాకా తీసుకుపో యే బృహత్‌పథకం అన్నది అసలు రహస్యం. 23 బహుళజాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు కాకినాడ సెజ్-అవి జలయజ్ఞం లక్ష్యాలు. పోలవరం ప్రాజెక్టును ఆదివాసులో, తెలంగాణ వాళ్ళో కాదు, దేశభక్తులు వ్యతిరేకించాల్సివున్నది. మనుషుల పట్ల, ప్రకృతిపట్ల, పర్యావరణం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉన్న బాధ్యతగల పౌరులైనా వ్యతిరేకించాల్సిందే.

ఇప్పటికయినా ఒక్కటే సూటి ప్రశ్న. వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా? ఒక్క అసహనం నుంచే ఇవి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశించినవో తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రిగా వై. ఎస్. కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల చూపిన సేవాభావాన్నే గమనించవచ్చు. ప్రభుత్వాధినేతగా ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచిత విద్య, వైద్యం ఇవ్వవలసిన బాధ్యత గురించి ఐదేళ్ళూ ఆలోచించని వ్యక్తి కార్పొరేట్ విద్యాసంస్థలను రాయలసీమ, ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడినవి అన్నట్లుగా ‘మనను వెళ్లగొడతారట’ అంటున్నారు.

మనం విదేశీయులుగా బతకాల్సి వస్తుందని అంటున్నా రు. చరిత్ర చదివిన వాళ్ళకు ఇది ఈస్టిండియా కంపెనీ భాషలాగా అనిపించడం లేదా? పాలకుల భాష సరే వలస పాలకుల భాష అనిపించడం లేదా? కనీసం వాళ్లు ఇక్కడ గుమస్తాలను తయారు చేసుకోవడానికి ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు పెట్టారు. ఈ దళారీలు అది కూడా అనవసరం అనుకుంటున్నారు.



సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: 24 ఏఫ్రిలు 2009

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి