15, మార్చి 2012, గురువారం

ఆత్మ సంరక్షణ శాలిగా హిందూ సమాజం ఎదగాలి


పరమ పూజనీయ  శ్రీ డాక్టర్ జీ

తన బాగు చూసుకోగల శక్తి హిందూ సమాజానికి కలిగింపచేయడమే సంఘం తలపెట్టిన కార్యం. మన పొట్ట నింపుకోవడం చేత కాకుండానే మరొకరి ఆకలి తీర్చడానికి పరుగులెత్తే విచిత్రమైన అలవాటు మనకు దాపురించింది. ఇది తొలగిపోందే మనం బాగుపడజాలం. ఆత్మ సంరక్షణశాలిగా రూపొందడమే హిందూ సమాజానికి వైభవం కలగడం. 

మనం కొత్తగా చేయవలసిందేమీ లేదు. మన పూర్వులు మునుపు ఏ సంస్కృతీ సమాజాలను సేవిన్చాలనే ధ్యేయాన్ని ముందుంచుకొని, దాని ప్రాప్తికై రేయింబవళ్ళు కృషి చేశారో ఆ ధ్యేయాన్ని అలాగే సాధించి, వారు సగం చేసి విడిపోయిన పనిని మనం పూర్తి చేయాలి.

హిందూ సంస్కృతిని ధ్వంసమొనర్చి, మనలను శాశ్వతంగా దాస్యశృంఖలాలలో బంధించి ఉంచాలనే ఉద్దేశ్యంతో మన దేశానికి వచ్చి ఇంకా ఇక్కడ ఉంటూ ఉన్నటువంటి విదేశీయుల ఆక్రమణల నుంచి దేశాన్ని రక్షించాలి. దానికి బాధలన్నింటినీ సహించడానికి ఎంత పరిశ్రమనైనా చేయడానికీ, ప్రాణాలైనా అర్పించడానికి కావలసిన ప్రవృత్తిని సమాజంలో నిర్మించి, సమాజాన్ని సమైక్యపరిచే కార్యాన్ని సంఘం స్వీకరించింది. 

 http://www.lokahitham.net/2012/03/blog-post.html

యుగద్రష్ట డాక్టర్ హెడ్గేవార్



బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులలో ఒక ప్రక్క దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతూ ఉంటే మరో ప్రక్క వందల సంవత్సరాలుగా హిందూ సమాజంలో నిర్మాణమైన సమస్యలను పరిష్కరించి హిందూ సమాజంలో ఐక్యత నిర్మాణం చేయటానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. మరో ప్రక్క హిందూ సమాజంపై జరుగుతున్న ఆక్రమణలను నిలువరించటానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఆర్యసమాజ్ ద్వారా మతం మారిన వారిని హిందూ ధర్మంలోనికి తీసుకొని రావటం, ఇంకొక ప్రక్క గాంధీజీ అంటరానితనం దూరం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించటం, మరో ప్రక్క వీర సావర్కార్ సమరసతను సాధించుటకు ప్రయత్నాలు ప్రారంభించారు. డా.అంబేద్కర్ హిందూ సమాజంలోని హరిజనుల హక్కుల కోసం, వారి జీవన స్థితిగతులను మార్చటం కోసం ఉద్యమించటం కనబడుతుంది. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు హిందూ సమాజాన్ని బలహీనం చేయటానికి సామాజికంగా ప్రజలను చీల్చే ప్రయత్నం చేయటం, ఈ దేశం గురించి గర్వపడటం కాని, ఈ దేశంలో జన్మించిన మహా పురుషులను స్మరించుకోవడం గాని, అసలు ఈ దేశ వాస్తవ చరిత్ర ఇక్కడి వాళ్లకు తెలియకుండా చేసే ప్రయత్నం చాలా యోజనాబద్ధంగా చేసుకొంటూ వచ్చారు. అసలు ఇది ఒక దేశం కాదు, ఇది ఒక సత్రం వంటిది అనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులలో ఈ దేశం యొక్క వాస్తవ చరిత్ర, ఈ దేశం హిందువుల దేశం, ఈ దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక గొప్ప సంస్కృతి ఉంది. ఈ దేశంలో జన్మించిన అనేకమంది మహా పురుషులు ఈ దేశం గురించే కాక విశ్వ కల్యాణం గురించి ఆలోచించారు. ప్రపంచానికి జ్ఞానం అందించారు అనే విషయాలను అర్థం చేయించ వలసిన అవసరం ఏర్పడింది. ఆ చారిత్రిక ఆవశ్యకతను పూరించటానికి ఒక సమగ్ర దృష్టి కోణంతో అలోచించి ఒక కార్య ప్రణాళిక తయారు చేసి దానిని అమలు పరిచిన వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్. 
డా.హెడ్గేవార్ 1889  సంవత్సరం ఉగాది పర్వదినాన నాగపూర్ లో జన్మించారు. 1925 విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించారు. సంఘ కార్యమంటే సామాజిక కార్యం. అంటే ఈశ్వరీయ కార్యం. ఈ పనిని సాధించటానికి శాఖను ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక గంట శాఖ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ దేశం గురించి తెలుసుకొంటూ ఈ దేశం గురించి పని చేయటం ఎలాగో నేర్చుకొంటూ, ఈ పనిలో తమ జీవితాలనే అర్పించిన అనేకమంది శ్రేష్ట పరంపర మనకు సంఘంలో కనబడుతుంది. 

డాక్టర్ జీ హిందూ సమాజానికి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారు -"ఇది హిందూ రాష్ట్రం". ఇది ఒక వాదాతీతమైన సత్యం. మనం అందరం హిందువులం. ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం మన లక్ష్యం. డాక్టర్ జీ వాస్తవ విశ్లేషణ, దూర దృష్టితో అలోచించి ప్రారంభించిన ఈ కార్యం పెరిగి పెద్దదై ఈ రోజున భారతదేశంలోనే కాక, ప్రపంచమంతట వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను సమైక్యపరుస్తూ వేగవంతంగా విస్తరిస్తున్నది. ఈ దేశంలోని అన్ని జీవన రంగాలలో స్వయంసేవకులు ప్రవేశించి పని చేస్తున్నారు. ఒక నిర్ణయాత్మక శక్తిగా సంఘం ఎదుగుతోంది. ఈ రోజున ఈ దేశ హితం గురించి అలోచించేవారైనా, ఎవరైనా సంఘాన్ని విస్మరించి ఈ దేశం గురించి ఆలోచించే పరిస్థితులు నేడు లేవు. రాజకీయాలకు అతీతంగా నేడు దేశంలో అనేక సంస్థలు పని చేస్తున్నాయి. సంఘంతో సంబంధం లేకుండా సమాజ హితం గురించి అనేకమంది స్వచ్ఛందంగా ఈ దేశంలో పని చేస్తున్నారు. అటువంటి వారు కూడా సంఘ సమన్వయంలో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. దీని కారణంగా దేశంలో మంచి మార్పు వస్తున్నది. ఒక భావాత్మక చైతన్యం సమాజమంతట కనిపిస్తున్నది. భారతీయ సంస్కృతీ, ఆధ్యాత్మిక విషయాలు, యోగ, ఆయుర్వేదం, సంస్కృతం ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచంలో ఒక మంచి పరివర్తన తీసుకొని వచ్చి విశ్వ కల్యాణం సాధించే విషయంలో అంతటా చర్చ జరుగుతున్నది. ఈ విధంగా హిందూ సమాజంలో ఒక చైతన్యం కనబడుతున్నది. మరోప్రక్క పెరుగుతున్న సమస్యలను ఎదుర్కొంటూ వాటిని పరిష్కరించుకోగలం అనే విశ్వాసం కూడా స్పష్టంగా కనబడుతున్నది. దీని అంతటికీ డాక్టర్ హెడ్గేవార్ యొక్క స్పష్టమైన ఆలోచన, ఆచరణే కారణం. ఇదే సమాజమంతటికి ప్రేరణ.





http://www.lokahitham.net/2012/03/blog-post_6940.html