9, అక్టోబర్ 2012, మంగళవారం

తాజ్‌మహల్ షాజహాన్ కట్టిచిందేనా? వాస్తు శాస్త్రం ( మూడవ భాగం)

  - రచన : రావు తల్లాప్రగడ
 

 
ముందుగా అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు!
--- --- ---
“సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్ర పాత్ |
స భూం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ||” (పురుష సూక్తం)
(ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామి! అనేక శీర్షముల (Infinite number of vertexes), అనేక అక్షములు (Infinite number of Diagonals), అనేక భుజములు(Infinite number of Sides) కలిగిన వృత్తాకార తరంగము లాగా వ్యాపిస్తున్న ఈ విశ్వాని కన్నా పది అంగుళాలు ఆవలి వరకు వ్యాపించాడు). పురుషసూక్తం నాటికే, మన సంస్కృతిలో, ఇలా అంగుళం ప్రస్తావనలు కనిపిస్తాయి. ఇప్పుడు తాజమహలో కూడా ఇదే ప్రస్తావన రాబోతోంది!!! ముందు భాగాలలో (గత రెండు మాసాలలో) తాజమహల్లో వున్న హైందవ చిహ్నాలను, చారిత్రాత్మక ఆధారాలనూ పరిశీలించాము. సంతృప్తిపొందలేదు. ఇక సాంకేతికపరంగా, వాస్తుపరంగా ఆలోచించి చూద్దాము.
తాజమహల్ వాస్తు:
"తూర్పుదేశస్తులైన ఆ మహాస్థపతులు, అలనాటి వివిధదేశాలకు చెందిన సమకాలీన భావప్రకటనలకు స్పందించినవారు, ఆకళింపు చేసుకున్నవారు. వారి అంతిమ నక్షాలకు షాజహాన్ అనుమతి లభించే నాటికే, వారు ప్రపంచంలోని సమస్త మహాద్భుతకట్టడాలను, వాటి నక్షాలను పరిశీలించి జీర్ణించుకున్నట్టివారు. ఇంతటి బృహత్పధకం చేపట్టగలిగారు అంటే ఎన్నో సుధీర్ఘ సంప్రదింపులతో తాజమహల్ కు రూపకల్పనను చేసి, ముందుగా చెక్క నామూనాలను కూడా తయారు చేసే వుంటారు..." [ఏ.బి.హావెల్. ఇండియన్ ఆర్కిటెక్చర్, లండన్, 1913] అని తాజమహల్ నిర్మాతలైన స్థపతుల వాస్తుకౌశలాన్ని హావెల్ కొనియాడాడు.
 
తాజమహల్ కట్టడ సముదాయం:
(1). మహ్తబ్ బాగ్ (మూన్ లైట్ గార్డెన్న్, యమునకు ఉత్తరదిశ వైపు) ;
(2). తాజమహల్ అరుగు, సమాధి, మసీదు, గెస్టుహౌసు ;
(3). ఉద్యానవనం;
(4). ముఖ్యద్వారము, తతిమా సమాధులు, నివాస గృహాలు ;
(5). బాజార్ ప్రాంతము
తాజమహల్ నిజంగా ఒక పెద్ద రూపకల్పనే! తాజమహల్ని షాజహాన్ కట్టించినా కట్టించకున్నా, దాన్ని అభివృద్ధిచేసి, దాని చుట్టూతా ఒక మహాప్రణాళికను రూపొందించింది, లోకానికి పరిచయం చేసింది, షాజహానే అని మనం గుర్తించవచ్చు. తాజమహల్ ఒక భవనమే కాదు. ఒక కట్టడ సముదాయం. ఎన్నో భవంతులు, ఎన్నో ఉద్యానవనాలు, కొలనులు, ఫౌంటెనులు, బాజారులు, నివాస గృహాలు, ఒకటేమిటి, అది దాదాపుగా ఒక ఊరే. ఇలా దీన్ని ఎన్నో ఎకరాల స్థలంపై రచించి నిర్మించారు.
 
తాజమహల్ కట్టడసముదాయంలో ఉద్యానవనం మహమ్మదీయ స్వర్గాన్ని ప్రతిబింబిస్తుంది. సమాధికి దక్షిణభాగంలో (నెం.3) ఉన్న ఉద్యానవనం 984*984 అడుగుల వైశాల్యం కలిగి వుంటుంది. దీని మద్యలో నుంచీ ప్రవహించే నాలుగు కాల్వలు, ఈ ఉద్యానవనాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. ఈ నాల్గు భాగాలను గట్లతో మరొక నాలుగు భాగాలుగా విభజించి, వెరసి 16 భాగాలుగా చేస్తాయి. ఉద్యానవనంలోని ఈ నాల్గు నదుల డిజైన్నే ఇస్లాంలో వర్ణింపబడే చార్‌బాగ్ అని నమ్మకం.
 
సాధారణ మహమ్మదీయ సమాధులలో ఉద్యానవనాలు దీర్ఘచతురస్రాకారంలో వుంచి మద్యలో సమాధిని నిర్మిస్తారు. కానీ తాజమహల్లో ఎందుకో మద్యలో చదును చేసి, అందులో పాలరాతి నీటి చెరువును నిర్మించారు. సమాధిని ఉత్తర దిశగా ఒక పక్కన నిర్మించారు. అది ఉత్తరం నుంచీ దక్షిణం దాకా నిర్మించిన నీటికొలనులో ప్రతిబింబిస్తూ మరింత అందంగా వుంటుంది. మొదట్లో అనేక పూలమొక్కలు, ఫలవృక్షాలు వుండేవిట. తరువాత ఆంగ్లేయుల పాలనలో ఆ ఉద్యానవనాన్ని పునర్నిర్మించి వారి తరహాలో పచ్చికపట్లు (లాన్లను) వేసారట.
మహ్తబ్ బాగ్‌
యమునకు అవతల వైపున నల్లతాజమహల్ నిర్మించాలని షాజాన్ సంకల్పించినట్లు కూడా చరిత్ర కారులు చెబుతారు. ఇటీవల త్రవ్వకాలలో అక్కడ బయటపడిన మహ్తబ్ బాగ్‌ని (Moon Light Garden)ఆ పధకంలోని అసంపూర్తి భాగంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ కథనం ప్రకారం తాజమహల్ యొక్క చార్‌బాగ్ పధకంలో యమునని మద్య నదిగా ఉద్దేశించివుండి వుంటారని కూడా ఒక వివరణ మనకు వినిపిస్తూవుంటుంది. అలా ఆలోచిస్తే తాజమహల్ ఒక ప్రక్కగా కాదు, మద్యలోనే వుంది అందుకని అది మహమ్మదీయ చార్‌బాగ్ ప్రణాళికే అని, అక్కడి స్థానిక టూర్ గైడులు చెబుతారు. ఈ త్రవ్వకాలలో ఒక పెద్ద అష్టభుజాకారంలోని కొలను, 25 ఫౌంటెన్లు, మద్యలో ఒక చిన్న కొలను, రాజపుత్రశైలిలోని దీపాల గూడులు బయటపడ్డాయి. అలాగే 1652నాటి ఔరంగజేబు ఉత్తరంలో కూడా ఈ ఉద్యానవనం వరదలలో మునిగిపోయింది అన్న ప్రస్తావన కనిపించడంతో, ఇది ఆనాటి నుంచీ కూడా వుందని దృవీకరింపబడుతోంది. కానీ ఇక్కడ దొరికిన శిధిలాల వాస్తు కళని పరిశీలించి చూస్తే, ఇది రాజపుత్రుల నిర్మాణమే అని శాస్త్రజ్ఞులు వెలిబుచ్చిన అభిప్రాయము. అంటే ఈ మహ్తబ్‌బాగ్‌ని నల్లతాజమహలుగా మార్చడానికి షాజహానుకి సంకల్పం వున్నది కానీ, దానిపై కార్యాచరణ మొదలు పెట్టలేక పోయాడని మాత్రం మనం నిర్థారించవచ్చు.
ఇలా ఈ మహ్తబ్‌బాగ్‌ని కలుపుకుని, (మొదటిగా చూపిన పఠంలోని 5 ముఖ్యభాగాలు కూడా కలుపుకొని) అతి సువిశాలమైన పధకంతో తాజమహల్ నిర్మింపబడింది. ఏ కట్టడానికైనా స్థపతులు ఏదో ఒక కొలతల పద్దతిని అనుసరించాల్సి వుంటుంది. షాజహాను వ్రాయించుకున్న చరిత్ర ప్రకారం, స్థపతులతో పాటూ అందరు నిపుణులూ పర్షియా వంటి ఆవలి దేశాల వారే. అంటే తాజమహల్ నిర్మాణం పర్షియన్ల కొలమానాల ప్రకారం వుండాలి. వికిపీడియా ప్రకారం, అలనాటి పర్షియన్ల కొలమానాలు ఇలా ఉండేవి.

ఐవాస్ (వేలు కొలత) = 20 మిల్లీ మీటర్లు;
ద్వ (చేతి కొలత) = 5 ఐవాస్;
త్రయస్ (పాదం) = 3 ద్వ;
రెమెన్ (4 చేతులు) - 4 ద్వ; ... ...
ఇలా వుంటాయి వీరి కొలమానాలు. కానీ తాజమహల్‌లో ఇటువంటి కొలతలేవీ వాడినట్లు కనపడవు.
వాస్తుచరిత్రకారుల ప్రకారం మొగల్ కట్టడాలన్నీ వారి గజ్ (గజం) అనే మొగల్ కొలమానం తోటే నిర్మింపబడ్డాయి. 17వ శతాబ్దిలో గజం పొడవు 28½ ఇంచిలుగా పరిగణించేవారట. ఇప్పుడు దీనిని ఇంగ్లీషువారి యార్డుతో (0.91మీటరు) పోల్చుతూ లెక్క చెబుతారు.
1825లో తాజమహల్ సముదాయాన్ని సర్వే చేసిన జే.ఏ. హోడ్జసన్ ఈ నిర్మాణం ఎంతో సౌష్టవతతో కూడినదని, నేలపైన గళ్ళు (ఒక గ్రీడ్) గీసుకుని దానిపైననే ఈ కట్టడన్ని రూపొందించారనీ నిర్థారించాడు. కానీ ఏ రకమైన గ్రిడ్డు వాడారో అన్న నిర్థారణ చేయలేకపోయాడు. ఆ నిర్థారణ 1989లో బెగ్లే, దేశాయిల పరిశోధనల
ే తేలింది. ముందు 400 గజాల్ గ్రిడ్డుని రూపొందించి, దానిని విభజించుకుంటూ గ్రిడ్లని వేసుకుంటూ ఈ భవన సముదాయాన్ని కట్టారని వీరు నిర్థారించారు. కానీ ఈ కట్టడాలు ఆ గ్రిడ్డులో సరిగ్గా పట్టక పోవడంతో దానికి అలనాటి కొలమాన వివరణా లోపాలే కారణమయి వుండవచ్చని సరిపుచ్చుకున్నారు.
తరువాత 2006వ సంవత్సరంలో కోచ్, రిచర్డ్ ఆండ్రే బర్రాడ్ అనే శాస్త్రజ్ఞుల పరిశీలనలో 17వ శతాబ్దిలో తాజమహల్ కట్టినప్పుడు మరింత క్లిష్టతరమైన గ్రిడ్డుని వాడి వుంటారని నిర్ణయించారు. బెగ్లే, దేశాయ్‌లు ఒక నిర్దిష్టమైన సరళమైన గ్రిడ్డుని ఊహించి దాని పైన భవనాలు కట్టారని అభిప్రాయపడ్డారు. కానీ కోచ్, రిచర్డ్ ఆండ్రే బర్రాడ్ గ్రిడ్డులు ఒక చోట ఒక రకంగానూ మరొక చోట మరొక రకంగానూ విభజించుకుంటూ పోయి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైన గ్రిడ్డుని ఊహించారు. వీరు వాస్తుచరిత్రకారులు చెప్పినట్టు, మూడు చతురస్రాలని (ఒక్కొక్కటీ 374 గజాలుగా) ఊహించారు. ఒక్కొక్క చతురస్రాన్ని వేరువేరురకాల గ్రిడ్డులుగా విభజించారు. 17 గజాల చదరాన్ని జిలౌఖానాకీ, బాజార్‌కీ నియమించారు. అలాగే 23గజాల చదరాన్ని ఉద్యానవనానికి నియమించి చూసారు. భవనాలకి చిన్ననిన్న చదరాలని ఊహించారు. అయినా వీరి
సర్దుబాటులోకూడా అనేక లోపాలు మిగిలిపోయాయి.
చివరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్, ఆర్. బాలసుబ్రమణ్యం 2009వ సంవత్సరంలో, బర్రాడ్ పరిశోధనను కొనసాగిస్తూ, బర్రాడ్ ఊహించిన గ్రిడ్ల విరణలోని లోపాలను చూపిస్తూ, వాటికి కారణం అందులో వాడిన కొలమానమే అని తేల్చిచెప్పారు. గజాలకు బదులుగా హైంద కొలమానమైన అంగుళం (1.763 సె.మి.) కొలమానంగా వాడి చూస్తే, ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయని సూచించారు. ఈ అంగుళం (12 అంగుళాలు = ఒక విస్తస్తి) ప్రస్తావన క్రీ.పూ 300 నాటి అర్థ శాస్త్రంలోనూ, సిందూనాగరికతలోనూ కనిపిస్తుంది. అన్నిటికన్నా పురాతనమైన వేదాలలో, ఈ వ్యాసానికి మొదట్లో ఉదహరించిన పురషసూక్తంలో కూడా అంగుళం ప్రస్తావన కనిపిస్తుంది. హైందవ కట్టడాలన్నీ ఈ అంగుళం కొలమానంతోనే కట్టేవారు.
ఈ పరిశోధన ప్రకారం తాజమహల్లో వాడినది విస్తస్తి గ్రిడ్డే అని ప్రొఫెసర్, ఆర్. బాలసుబ్రమణ్యం గారు ఋజువుచేసారు. ఈ కొలమానం వల్ల ఒక రకమైన గ్రిడ్డునుంచీ మరొక రకమైన గ్రిడ్డులోకి మార్పిడి కూడా సులభతరమవుతుందని విశదీకరించారు. అంటే తాజమహల్ షాజహానే కట్టినా, లేక అంతకు ముందు వారే కట్టినా, అందులో వాడిన కొలమానం మాత్రం నిస్సందేహంగా హైంద కొలమానమైన అంగుళమే అని తేలుతోంది. (షాజహాన్ తెచ్చిన
స్థపతులు, నిపుణులు అందరూ మహమ్మదీయులే అని గత అధ్యాయాలలో తెలుసుకున్నాము. ఇందులో హిందువులు కూలీ వారే తప్ప నిపుణులు కారు) మరి మొగలాయులు కట్టించినప్పుడు గజాలు వాడాలి. లేకపోతే పర్షియన్ స్థపతుల కొలమానమైన "ఐవాసు"లు వాడాలి. మరి, ఈ అంగుళమెక్కడినుంచీ వచ్చింది అన్న ప్రశ్న మిగిలిపోతోంది. అంటే, ఇది మొగల్ నిర్మాణం కాదా అన్న అనుమానం మళ్ళీ మొదలవుతోంది.
 
హావెల్, బేట్లి, కెనోయర్, హంటర్ వంటి విశ్వవిఖ్యాత పరిశోధకులు కూడా మొదటి నుంచీ తాజమహల్ వాస్తుకళ మహమ్మదీయ వాస్తుకళను అనుసరించలేదని అనుమానిస్తున్నారు. అది హైందవ ఆలయాలకు చెందిన వాస్తు లాగా కనిపిస్తోంది అని అనుమానపడుతున్నారు.
తాజ్‌మహల్ నక్షా:
తాజమహల్ నక్షా (ప్లాన్‌ని) చూసిన తరువాత తాజ్‌మహల్ చూసిన ప్రతి యాత్రికుడికీ, అసలు తాను చూసింది తాజమహలేనా అన్న అనుమానం వస్తుంది. తన పరిశీలనాశక్తిపైనే తనకు అనుమానం వస్తుంది. తనకు అక్కడ కనపడనివి కొత్తకొత్తవి ఎన్నో ఈ నక్షాలలో కనిపిస్తాయి కనుక, తన కళ్ళపైన తనకే అనుమానం రావడం సహజమే.
గూగుల్ మాపు లో తాజమహల్
పైన కనించే ఈ గూగుల్ మాపుని చూస్తే ఉత్తరదిశగా యమునా నది కనిపిస్తోంది. కానీ ఈ తాజమహల్ కట్టడసముదాయాన్ని యమునానది వారగా కట్టలేదు. ఖచ్చితంగా ఉత్తర దిశనే లెక్కించి, ఉత్తరముఖంగానే నిర్థారించి కట్టినట్టు కనిపిస్తోంది. దీనిని బట్టి రెండు విషయాలు తెలుస్తున్నాయి.

(1) మొదటిది ఉత్తరదక్షిణదిశలలో శివునికున్న విశేషము. శివాలయాలు ఉత్తర దిశగా వుండటం సహజమే. దక్షిణదిశలో ప్రవేశమార్గం ఉండటం కూడా దక్షిణామూర్తి యైన శివుడికే చెల్లుతుంది. ఈశాన్య దిక్కులో కొలను; లేకపోతే ఉత్తరదిశనుంచీ ఈశాన్యదిక్కుగా ప్రవహించే నది ఉండటం, హిందూ సాంప్రదాయమే కనుక, ఉత్తరదిశలోని యమునానది ఆలయాల వాస్తుకి సరిపోతుంది.
ఇది తాజమహల్ కట్టడసముదాయంలో పశ్చిమముఖియైన మసీదు
(2) ఇక రెండవ విషయానికొస్తే, ఈ గూగుల్ మాపులో తాజమహలుకి కుడిఎడమల వైపున మరో రెండు కట్టడాలు కనిపిస్తాయి. వీటిలో ఎడమ వైపునున్న దాన్ని మసీదుగా, కుడి వైపు దాన్ని గెస్టుహౌసుగా షాజహాను కట్టించాడని చరిత్రకారులు చెబుతారు. వీటితో మరో రెండు ప్రశ్నలు వస్తాయి. "అసలు సమాధిలో గెస్టుహౌసు కట్టే సాంప్రదాయం ఏ మతంలోనూ ఉండదు కదా! అంటే ఇది నిజంగానే సమాధేనా?" అన్నది మొదటి ప్రశ్న.

ఇక రెండవది చాలా ముఖ్యమైన ప్రశ్న! ఇక్కడి మసీదు ఖచ్చితమైన పశ్చిమ దిశగా (cardinal westగా) కట్టబడి వుంది. కానీ మసీదులని
మక్కా దిశగా మాత్రమే కడతారు. తాజమహల్‌ పశ్చిమానికి క్రిందగా 14 డిగ్రీల 15 నిమిషాల నైరుతీ దిశలో మక్కా వుంటుంది. ప్రపంచంలోనీ ఏ మూల నుంచి యైనా మక్కాదిశను ఖచ్చింతంగా నిర్థారించగలిగే పరిజ్ఞానాన్ని, తొమ్మిదవ శతాబ్దికాలానికే మహమ్మదీయ స్థపతులు సాధించుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. అందుచేత వారు ఇంత ముఖ్యమైన విషయంలో (మసీదు నిర్మాణంలో) పొరపాటు చేస్తారని అని అనుకోవడం మన అవివేకమే అవుతుంది. "అంటే ఈ కట్టడ సముదాయం మహమ్మదీయ నిర్మితమేనా?", అన్న ప్రశ్న రావడం సహజమే.
ఈ కట్టడ సముదాయాన్ని నది వారగా (ఉత్తర దిశకు నిర్దేశించకుండా) కట్టినా మసీదు మక్కా వైపుకు తిరిగివుండేదే?, మరి ఉత్తర దిశను ఖచ్చితంగా లక్కించుకుని నదివారగా ఎందుకు కట్టకూడదనుకున్నారు? అంటే ఆ భవన నిర్మాతలు మసీదుకి మక్కాదిక్కుతో ప్రమేయంలేదని అభిప్రాయపడినట్లుగానే అనిపిస్తోంది. అంటే అది మసీదుగా ఉద్దేశించి కట్టిన భవనం కాదని మనం అనుకోవడంలో తప్పులేకపోవచ్చు 
అలాగే , మహమ్మదీయ సమాధులు (మసీదులే కాదు) కూడా పశ్చిమ దిక్కుగానే (మక్కా దిశగా) ఉంటాయి, ఉత్తర దక్షిణాలతో పని లేదు. కానీ ఈ భవనంలో సౌస్ఠవత ఉత్తరదక్షిణ అక్షము (NS axis) పైనే ఉంది. సమాధికి (తాజమహల్ ముఖ్యభవనానికి) పశ్చిమద్వారం తెరిచి, మిగితా మూడు ద్వారాలు మూసేస్తే, నక్షాలోని సౌస్ఠవతకు భంగం కలుగుతుంది. అందుకే తూర్పుపశ్చిమ ద్వారాలు మూసి వేయ వలసి వచ్చి వుంటుంది. ఇక ఉత్తరదిశగా నది వుండటంచేత, దక్షిణ ద్వారం గుండానే ఊళ్ళోకి వెళ్ళాలి. అందుకే తాజమహల్ సమాధి అయినప్పటికీ దక్షిణ ద్వారం నుంచే ప్రవేశం కల్పించ వలసి వచ్చిందేమో? ఇది మహమ్మదీయ కట్టడమే అయితే వారు ఇలా డెజైను చేసేవారా?
తాజమహల్ ముఖ్యభవనంలోనికి నాల్గువైపుల నుంచీ వెళ్ళడానికి ద్వారాలున్నాయి. కానీ దక్షిణ ద్వారం తప్ప మిగితావన్నీ మూసివేయబడి వుంటాయి. మూసేసారు సరే, కానీ మిగితా మూడు దిక్కులలో ఈ అక్కరలేని ద్వారాలు ఎందుకు కట్టించినట్లు? ముఖ్యంగా అవసరం లేని ఆ నదివైపుకు అన్ని దారులు ఎందుకు పెట్టినట్లు? "అంటే ఆ భవనం కట్టేటప్పుడు దాని నిర్మాతకు ఇది ఒక సమాధి కోసం కడుతున్నాము అని తెలియదా?", అన్న అనుమానం రావడం సహజమే.
కానీ అది ఆలయమో, లేదా ఒక నివాసయోగ్యమైన భవనమో అని అనుకుని చూస్తే, అప్పుడు నదివైపుకి దారులు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. తాజమహల్ ఇప్పుడున్నట్లుగా కేవలం దక్షిణముఖంగానే కాకుండా, ఉత్తరదిశగా కూడా మార్గం వుండేటట్లుగా (అంటే నది ముఖంగా కూడా ఉండేటట్లుగా ఉద్దేశించి) మొదట్లో ఈ భవనాన్ని కట్టారనడానికి మరేమైనా సాక్షాలు వున్నాయా?
1) బేసిమెంటు అంతస్తులనుంచీ, నదివైపుకు ఇప్పుడు మూసివేయబడి కనిపిస్తున్న ద్వారాలు వున్నాయి.
2) దొరికిన నక్షాల ప్రకారం మిగితా ఫొటోలప్రకారం, ఉత్తరదిశలోని నదివైపు నుంచీ పైకి వెళ్ళడానికి మెట్లు కూడా వున్నాయి.
tajphoto039
కర్నల్ హోడ్జ్సన్ 1825లో సర్వే చేసి తయారు చేసిన నక్షా. ఉత్తరదిశగా (వాయువ్యం నుంచీ ఈశాన్యం వైపుకుకు) వున్న ప్లాట్ఫారం చూస్తే అక్కడనుంచీ నదివైపుకు మెట్లు కనిపిస్తాయి ఇందులో. అంటే ఇది ఒక నదీమార్గాన్ని సూచించడమే కాకుండా, అది ఒక నివాసయోగ్యమైన ప్రదేశమని తెలుపుతుంది..
3) నిజానికి తాజ్మహల్ భవనంలోకి యమునానది నుంచీ లోనికి రావడానికి అనేక మార్గాలున్నాయి. నది వైపుకి ఎన్నో తలుపులు, కిటికీలు వున్నాయి. అన్నిటినీ రాళ్ళు పెట్టి అనుమానం రాకుండా మూయించేసారు.
4) నదినుంచీ ఈ భవనంలోకి పడవలలో కూడా వచ్చేవారని నిరూపించడనికి ఆ భవనం ముందున్న లంగరు రింగులే నిదర్శనాలు.

 
లంగరు రింగులు
పడవలను కట్టడానికి తాజమహల్‌కి ఉన్న రింగులివి. తాజమహల్‌కి ఉత్తరదిశగా మూడున్నర అడుగుల ప్లాట్ఫారం నడుస్తుంది. దానిపైన ఇలా ఎన్నో రింగులు కనిపిస్తాయి. అంటే ఈ భవనం కట్టిన అసలు యజమాని ఈ భవనంలోకి పడవలు రావాలని ఆశించి కట్టినట్టు తెలుస్తున్నది. ఆ భవనంలో (లేక ఆలయంలో) అనేక గదులుండటం చేత ఇక్కడకు వచ్చినవారు పడవల్లో ప్రయాణం చేసి వచ్చి విశ్రాంతి తీసుకునేవారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పక్కనే ఒక గెస్టుహౌసు కూడా వున్నదని ముందే తెలుసుకున్నాము. అంటే ఇది ఒక ఆలయమో, పూజాస్థలమో, ఆరామమో, భవనమో అయివుండవచ్చు. సమాధిలో అన్ని గదుల అవసరమూ, గెస్టుహౌసు ఉపయోగమూ లేవని తేలికగా చెప్పవచ్చు.  
      ఇక మిగితా నక్షాలను పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు ఇవి.
1885లో జే. ఫర్గూసన్ చిత్రించిన ముఖ్య కట్టడపు అవచ్చేదనపు (cross-section) బ్లూ ప్రింట్. దీనిలో గుప్తపరచిన బేస్మెంటు కనిపిస్తుంది.
బేస్మెంటులోలో ఉన్న 22 గదులకి వెళ్ళడానికి మెట్లని చూపించే బ్లూప్రింటు. ఈ దారికి చెందిన ఈ బ్లూప్రింటు 1902వ సంవత్సరంలో దొరికిందట. వి.యస్ గాడ్బోలే గారు 1981లో ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ బేస్మెంటుని చూసి వచ్చారట. 
(1) మనం అరుగని భావించే అంతస్తుల మూసివేయబడ్డ తలుపులు కిటికీలు.
(2) నదివైపునుంచీ చూస్తే మరొక రెండు అంతస్తులు బేసిమెంటులో కనిపిస్తాయి. ఒక భూగర్భంలోని అంతస్తు బయటకు కనిపించదు
 
నిజానికి తాజ్‌మహల్‌కి ఒక యాత్రికుడుగా వెళ్తే, మనకు పైన ఒక అంతస్తు చూపించి. మహా అయితే ఒక క్రింది అంతస్తులోని సమాధి గది చూపించి పంపించేస్తారు. ఆ తరవాత మనం చూడ గలిగింది అంతా .. .. ఆ భవనం చుట్టూ తిరగడమే. కానీ పైన చూపిన ఫొటోలో నది వైపు నుంచీ చూస్తే మూడు అంతస్తుల బేసిమెంటొకటి కనిపిస్తుంది. ఇందులో ఎన్నో నివాసయోగ్యమైన గదులున్నాయని, వాటి నుంచీ నది వైపుకి, రెండవ వైపుకి వెళ్ళడానికి అనేక మార్గాలున్నాయని కూడా ఈ నక్షాలవల్ల ఫొటోలవల్ల తెలుస్తోంది. బేసిమెంటులోని క్రింద అంతస్తు నేలక్రిందకి వుండటం చేత బయటకి కనపడదు. రెండవ మూడవ అంతస్తులు కనిపిస్తాయి. కానీ ఈ రెండు అంతస్తులనీ పూర్తిగా మూసివేసారు. అందులోకి ఎవరినీ వెళ్ళనీయరు, కానీ అందులో ఎన్నో గదులున్నాయని తెలుస్తోంది. మూడవ అంతస్తులోని కొన్నిగదులలోకి మొదట్లో కొందరిని అనుమతించేవారట. అందులో 22 అపార్టుమెంట్లు వున్నాయని, 300 అడుగుల పొడవైన పెద్ద కారిడార్ వుందని, పాత నక్షాల వల్ల తెలుస్తోంది. ఇప్పుడు అందులోకి కూడా ఎవరినీ వెళ్ళనీయరు. అన్ని అంతస్తుల లాగే ఈ మూడు అంతస్తుల కూడా ఎర్రరాతితోనే కట్టబడి వుంటాయి. కాకపోతే ఈ బేసిమెంటు లోని మూడు అంతస్తుల పైన పాలరాతి తాపడం చేయలేదు.
 
(1) మనకు చూపించని అనేక గదులలో ఉదాహరణకి ఒకటి
(2) పై అంతస్తుకి మూసివేయబడిన ద్వారం.
(3) క్రింది అంతస్తులకి మూసివేయబడిన దారి .
ఈ "మూడు అంతస్తుల బేసిమెంటు" పైన మరో రెండు అంతస్తులున్నాయి. వీటిని మనం తాజమహల్ కూర్చున్న ప్లాట్ఫారంగా గమనిస్తూ వుంటాము. వీటి పైన పాలరాతితో తాపడం చేయబడివుంటుంది. ఇందులో క్రింది అంతస్తులో (అంటే 4వ అంతస్తులో) ముంతాజ్ అసలు సమాధి వుంటుంది. మహమ్మదీయుల సాంప్రదాయం ప్రకారం, అసలు సమాధిని ఎవరికీ చూపించరు. దాని పైన మరొక అంతస్తు కట్టి, దానిలో మరొక సమాధి వంటి దాన్ని కట్టి, దానిని అందరినీ చూడనిస్తారు (పీటర్ మండీ చూసిన సమాధి కూడా ఇదే అయ్యివుండాలి). అంటే ఐదవ అంతస్తులో మరొక సమాధిని కడితే, దానినే మనకు చూపిస్తున్నారన్న మాట. ఈ ఐదవ అంతస్తులోని సమాధి చుట్టూ వున్న గదులలోకి కూడా మననెవరినీ వెళ్ళనీయరు. కానీ సమాధి గదిలోకి మాత్రం అనుమతిస్తారు. ఇకపైన వున్న ఆరవ అంతస్తే నిజంగా యాత్రికులను చూడనిచ్చేది.

పైన ఉన్న గోపురంలో రెండు పొరలు వుంటాయి. అది కూడా నిజానికి మరొక అంతస్తే. దానిని ఏడవ అంతస్తుగా పరిగణిస్తారు. ఇందులోకి కూడా మనకు అనుమతినీయరు.
ఎన్నో గదులు: తాజ్‌మహల్ క్రింద బేసిమెంటులో మూడు అంతస్తులు, అందులో ఎన్నో గదులు, వాటికి నదివైపుకి (ఇప్పుడు మూసివేయబడి వున్నా) తలుపులు కిటికీలూ కూడా కనపడుతున్నాయి. సమాధిలో, అందులోనూ నేల మాళిగలలో(భూగర్భ అంతస్తులలో), అన్ని గదుల అవసరం ఏముంటుంది? కానీ అది ఒక భవనమైతే, లేక ఒక శివాలయమయి వుండివుండుంటే, ప్రతి గదికి ఒక ప్రణాళిక, ఉపయోగం వుంటాయి అని వెంటనే తెలుస్తుంది. హిందూమందిరాలలో, భవనాలలో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకమైన పూజాపునస్కారాలు జరిగే అవకాశముంటుంది. పూజారులకి వసతిగృహాలకు అవకాశం ఉంటుంది. ఆలయాలలో బాటసారులకు ఆరామాలు, విడిది ఏర్పాటులు ఉంటాయి, మౌనమందిరాలు వుంటాయి. ఇలా ఒక్కొక్క గదికీ అనేక ప్రణాళికలు వుంటాయి.

తాజమహల్ బైటవున్న ముఖ్యద్వారంలో కూడా ఎన్నో గదులు, నడవాలు, తాజమహల్ ప్రక్కన గెస్టుహౌసు అనబడే మరొక పెద్ద కట్టడము, ఈ కట్టడ సముదాయంలో ఎన్నో రాజపుత్రశైలిలోని దారులు, వాటికి ఇరుపక్కలా అనేక నివాసయోగ్యమైన గదులు. ఇలా ఎక్కడచూసినా నివాసయోగ్యమైన కట్టడలు, గదులు లెక్కలేనన్ని ఉంటాయి. ఈ నక్షాలు చూస్తే, నిజానికి ఒక సమాధిలాగా కాదు, ఒక మహారాజభవనంలాగా, ఒక మాహా ఆలయంలాగా కనిపిస్తుంది.
(1) క్రింది అంతస్తులో 300 అడుగుల పొడవైన కారిడార్- (2) క్రింది అంతస్తులో ఉన్న 22 ఎపార్టుమెంటు గృహాలలో ఒకదానికి ద్వారం. అన్నీ మూసివేయబడ్డాయి -(3) దిగువ అంతస్తులలో ఇటుకలతో మూసివేయబడ్డ ద్వారాలు
నది వైపునుంచీ తాజమహల్ కట్టడసముదాయం
నది వైపునుంచీ చూస్తే, దాచబడ్డ మరో రెండు అంతస్తులు కనిపిస్తాయని విన్సెంట్ స్మిత్ కూడా తను 1911 లో వ్రాసిన "History of Fine Art in India and Ceylon", పుస్తకంలో పేర్కొన్నాడు. ఆ రహస్య అంతస్తుల ఫొటో మనకు 1844 నాటి స్లీమన్ వ్రాసిన –"Rambles and Recollections of an Indian Official" పుస్తకంలో కూడా కనిపిస్తుంది. కానీ ఏ పరిశోధకుడినీ ఈ అంతస్తుల్లలోకి వెళ్ళనీలేదు. ఆ అంతస్తులలో ఇంకా ఎన్నిఋజువులు దొరుకుతాయో తెలియదు, ఇంకా ఎన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతాయో తెలియదు. ఇన్నిన్ని అంతస్తులు, ఇన్నిన్ని గదులు ఎందుకున్నాయని? వీటిల్లో ఎవరు వుండేవారనీ? సమాధిలో ఈ గదులు వుండవలసిన అవసరమేమిటీ అని? చివరగా .... ఇది హిందూ మందిరమే ఐతే ... .. హిందువుల మందిరాన్ని ఇలా అపవిత్రం చేసి సమాధిగా ఎందుకు మార్చారని? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, ఆ అంతస్తులన్నిటినీ యాత్రికులకూ, పరిశోధకులకూ, చరిత్రకారులకూ అన్ని అంతస్తులనూ అందుబాటులో లేకుండా చేసారని మనం తేలికగా వూహించవచ్చు. అలా తాజ్‌మహల్ భవనం మొత్తం 7 అంతస్తులని, అందులో ఇంకా చాలా చాలా గదులు వున్నాయనీ మనకు తెలియనివ్వరు. అది ఈ నాడే కాదు. షాజహాన్ ఆ భవనాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచీ అంతే. అన్ని గదులకు వెళ్ళే దారులను మూసేసారు, అని మనం ఊహించుకోవడం తప్పు కాదేమో?
(1) పై బేసిమెంటు అంతస్తులోని ఎపార్టుమెంటుకి గాలి రావడానికి ఏర్పరచిన పాలరాతి జాలీ. (2) లోపలనున్న అనేక పూజామందిరాలు.
నగర్ ఖానా: ముఖ్యద్వారానికీ పాలరాతి తాజ్మహల్కి మద్య, దారికి ఇరుపక్కలా నగర్ ఖానాలనబడే రెండు మృదంగవాయిద్య ప్రదర్శనల భవనాలు (Drum Houses) కనబడతాయి. సమాధిలో సంగీత ప్రదర్శనలేమిటి? అందునా ఇస్లాంలో సంగీతం నిషిద్ధం కూడా! కానీ శైవాలయాలలో మేళతాళలకు ఒక ప్రత్యేక విశిష్ఠతవుంది. పూజావిధానంలో సంగీతం ఒక ముఖ్యభాగం కూడా. శివాలయాలలో మృదంగ డోలకుల వంటి వాయిద్యాలతో శివతాండవ నృత్యాలు అనాదిగా పరిపాటే.
గోశాల: తాజ్మహల్ పరిధిలోని తూర్పు మూలనే, ఒక గోశాల అని పిలవబడే  పాక వుంటుంది. సమాధిలో గోశాల అవసరం లేదు. కానీ ప్రతి హిందూదేవాలయంలోనూ గోశాల సర్వసాధారణమే. ఇంత సౌష్ఠవతతో కట్టిన తాజమహల్లో ఒకే మూల కనపడే, ఈ గోశాల తాజమహల్ సౌష్ఠవతకు భంగం కలిగించుతోంది. అంటే దాని ఎదురుమూలలో మరొక గోశాల లేదు. ఈ సఔష్ఠవతకూ భంగం కలింగించే ఈ గోశాలకు సమాధిలో వుండవలసిన ఆవశ్యకత ఏమిటి. అదే ఒక మందిరంలోనో భవనంలోనో ఐతే గోశాలను (భవనసముదాయసౌష్టవతకు భంగం కలిగించినా) ఎందుకు నిర్మించవలసి వచ్చిందో ఊహించడం అంత కష్టమేమీ కాదు. అంతే కాదు పేరుకూడా సంస్కృత నామమే. ఆలయం, మహమ్మదీయుల ఆధీనంలోకి వచ్చి ఒక సమాధిగా మారిపోయినా, అక్కడి స్థానిక ప్రజలు అలవాటు ప్రకారం దాన్ని ఇంకా గోశాల అని పివడమే పేరుకి కారణం అయివుండి వండవచ్చు.
1) పైనున్న గదులకి వరండాలు. సమాధులలో ఇన్ని గదులు, వరండాల అవసరం లేదు అది ఒక భవనమో మందిరమో అయితే తప్ప.  (2) బౌలీ బుర్జ్ లోని నీటి భావి- ఏడు అంతస్తుల క్రింద వున్న ఈ భావిలోనుంచీ నీరు తోడుకునేవారు. దాని చుట్టూ ఎన్నో గదులు. అన్ని గదులల్లోకీ నీరు రావడమే కాక, అక్కడ ఉన్న నీటి వలన అన్ని గదులల్లోకీ చల్లటి గాలి వస్తుంది. అంటే నివాస యోగ్యంగా వుండటానికి, బతికున్నవారికోసం, కట్టినది ఈ కట్టడం అని తెలుస్తోంది).
ఇలా తాజమహల్ వాస్తుని పరిశీలించిన కొద్దీ, కొత్త ప్రశ్నలు వస్తూనేవుంటాయి. బాదుషానామా ప్రకారం ఇది రాజా మాన్సింగ్ వారి భవంతి అని తెలిసింది. ఇంకా ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు దొరికాయి, అలాగే ఎన్నో హైందవ చిహ్నాలను కూడా గమనించాము. ఇన్ని చూసిన తరువాత, ఇది మహమ్మదీయ కట్టడమేనా అన్న అనుమానం మరింత బలపడిందే కానీ, మనకు దొరికిన సాక్షాలు నిరూపించడానికి చాలవు. ఎందుకంటే వాస్తు పరంగా ఇంకా అందరూ అడిగే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి పోయింది. తాజమహల్ బల్బు గోపురాలు, ఆర్చిలూ, మినారులూ చూస్తే అవి మహమ్మదీయతనే ప్రతిబింబిస్తున్నాయి. అసలు హిందూ ఆలయాలను ఇలా నిర్మించే ఆచారం వున్నదా? ఉన్నా అటువంటి అచారం తాజమహల్ కంటే ముందు వున్నదా? అంతే కాదు, షాజహాన్ కన్నా ముందునుంచే తాజమహల్ వుంది అంటే, దాని వయస్సుని నిర్థారించలేక పోయారా? ఇలా చాల ప్రశ్నలు మిగిలి పోతాయి. అంటే ఇక సైన్సులోకి పోవాలన్న మాట. అవి తరువాతి భాగాలలో అన్వేషించి చూద్దాం.
                                                                                 (సశేషం)

 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb12/sujananeeyam.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి