6, అక్టోబర్ 2012, శనివారం

తాజ్‌మహల్ షాజహాన్ కట్టిచిందేనా? చారిత్రాత్మక ఆధారాలు (రెండవ భాగం)

- రచన : రావు తల్లాప్రగడ
 
గతభాగంలో  తాజమహల్లొ కనపడిన హైందవ చిహ్నాలను గమనించాము. 
 
ఈ అధ్యాయంలో చారిత్రాత్మకమైన అధారాలను పరిశీలించి చూద్దాము.

మన దేశంలో చరిత్ర వ్రాసుకునే అలవాటు మొదటి నుంచీ కొంచెం తక్కువే. అందుకే చరిత్ర తెలుసుకోవాలంటే మనకు విదేశీ పర్యాటకులు వ్రాసుకున్న పుస్తకాలే చాలా వరకు ప్రామాణికమయ్యాయి. కానీ మొగలు చక్రవర్తుల వద్ద ఆస్థాన చరిత్రకారులు ఉండేవారు. మొగలులు కూడా నిజానికి తురకలు (టర్కీ దేశస్తులే) కాబట్టి వారి ఆచారవ్యవహార పద్దతులు యూరోపియన్ల వలే కొంచెం ఆధునికంగా వుండేవి. ఇలా మొగల్ చక్రవర్తుల వద్ద మనం నేర్చుకున్న విషయాలు నిజానికి అనేకం. ఒకరకంగా చూస్తే, మనకి డాక్యుమెంటేషన్ గురించి నేర్పింది వారే అని చెప్పుకోవచ్చు. వారివల్ల మనకు ఆధికారిక పరిభాష, పద్దతులు అనేకం వచ్చి చేరాయి. అలా మనకు కొంచెం మంచి జరిగినట్టే, చెడు కూడా కొంచెం జరిగింది. మంచిచెడులు కలిసిరావడం సహజమే, కాకపోతే మంచిని గ్రహించి చెడుని వదులుకోవ గలగడమే వివేకం.

ఇక చరిత్ర విషయానికొస్తే మనకు మిగిలింది లేక దొరికేవి మొగలు ఆస్థాన చరిత్రకారులు వ్రాసినవి, అలనాటి యూరోపియన్ పర్యాటకులు ప్రత్యక్షంగా చూసి వ్రాసుకున్న యాత్రానుభవాలు. వీటి గురించి గతంలో పి.ఎన్ ఓక్ గారు జరిపిన విశ్లేషణలే ఈ నాటికి కూడా మార్గదర్శకాలు. ఓక్ గారు ఒక చరిత్రకారుడు కాక పోయినా, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఇంతవరకూ ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోయారన్నిది మాత్రం నిజం. ముందు పి.ఎన్.ఓక్ గారు తన ఇతిహాస్ పత్రికలో ప్రచురించిన చారిత్రాత్మక అధారాలని పరిశీలిద్దాం. 

షాజహాన్ 

షాజహాన్ పుట్టింది జనవరి 5, 1592; చనిపోయింది జనవరి 22, 1666. ఇతడు భారతదేశాన్ని 1628 నుంచీ 1658 దాకా పాలించాడు. మొగల్ వంశంలో ఇతడు బాబర్, హుమాయున్, అక్బర్, జహంగీర్ల తరువాత ఐదవ వాడు. తన సామ్రాజ్యాన్ని 3లక్షల చరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెంచి, చివరికి తన కుమారుడైన ఔరంగజేబు చేత బంధింపబడి 1666లో మరణించాడు. తాజమహల్ తొ పాటూ, ఢిల్లీ లోని ఎర్రకోట, జామా మసీదు, ఆగ్రా కోట లోని కొన్ని భాగాలూ, వజీర్ ఖాను మసీదు, లాహోరులోని మోతీ మసీదు ఇతడు, మున్నగునవి ఇతడే కట్టించాడని చరిత్ర చెబుతున్నా, అది పూర్తిగా నిజం కాదనే వాదనలు అనేకం వున్నాయి. కానీ ప్రస్తుత వ్యాసం తాజమహల్ పైననే కనుక ఈ వ్యాస పరిధిని ఇంతవరికే పరిమితం చేద్దాం.

అనేక శతాబ్దాలుగా తాజమహల్ అంటే ... ఇది షాజహాన్ తన భార్యపై ప్రేమతో కట్టించిందని; అది ఒక అమర ప్రేమకు చిహ్నమని చదువుకుంటూ వస్తున్నాము. షాజహాన్ తన పూర్వీకుల లాగే తన అంతఃపురంలో అనేకమంది భార్యలు, ఉంపుడుగత్తెలు, నర్తకీమణులను ఉంచుకునేవాడు అని అనేకమంది యూరోపియన్ పర్యాటకులు వ్రాసారు. మొగల్ ఆస్థానంలో పనిచేసిన "Niccolao Manucci" అనే ఒక ఇటాలియన్, తన స్మృతిలో వ్రాసుకున్నదాని ప్రకారం, "అమ్మయిలను వెతుక్కుని తెచ్చుకుని తన కామాన్ని తీర్చుకోవడమే షాజహాన్ చేసే ముఖ్యమైన పనిగా కనిపిస్తుంది. అలా తెచ్చుకున్న స్త్రీలతో, తన కొలువులో ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుపుకునేవాడు. దానిలోకి హోదాసంపదలకు ప్రమేయము లేకుండా కేవలం అందమైన ఆడవారినే తెచ్చుకునేవాడు. వేరే వారెవరినీ అందులోనికి అనుమతించరు." చిట్టచివరికి షాజహాన్ని అతడి స్వంత కుమారుడే (ఔరంగజేబు) కారాగారంలో బంధీగా వుంచాడు. అప్పుడు "తన తండ్రికి ఇచ్చిన అదనపు అనుభోక్తంగా, ఆ చిట్టచివరి రోజులలో తన చుట్టూ ఆ వందలాది ఆడవారిని వుంచుకోవడానికి అనుమతి ఇచ్చాడు". అంటే అవసాన దశలో సైతం, ఆ కారాగారంలో ఉన్నప్పుడు కూడా, షాజహాన్ స్త్రీ లోలుడుగానే ఉండేవాడని అని తెలుస్తోంది. అంతేకాదు మొగల్ అధికారిక చరిత్రకారుడైన "క్వజినీ" కూడా షాజహాన్‌కి కనీసం ముగ్గురు భార్యలని వ్రాసాడు. ఇలాగే షాజహాన్ అంతఃపురంలో 5000 మందికి పైగా స్రీలు వుండేవారని మరొక కథనం కూడా వినపడుతుంది..

ఇదంతా ఒక ఎత్తైతే మరికొందరు యూరోపియన్ పర్యాటకుల కథనాలలో షాజహాన్‌కి తన స్వంత కుమార్తె ఐన జహనారా బేగంతో కూడా అక్రమ సంబంధం వుండేదని కూడా పుకార్లు వున్నాయి. ఇది మనం నమ్మవలసిన పనిలేదు కానీ, అందులో నిజానిజాలను పక్కనపెట్టి, చరిత్రకారులేమి వ్రాసారో చూస్తే కనపడే విషయాలివి. ఫ్రాంకోస్ బెర్నియర్ తన "Travels in the Mogul Empire, A.D. 1656-1668 (translated by A. Constable and edited by V. A. Smith (1914))" అన్న పుస్తకంలో " షాజహాన్ పెద్ద కూతురైన బేగం సాహిబా చాలా అందంగా వుండేది... వదంతుల ప్రకారం వారిరువురి మద్య సంబంధం నమ్మశక్యం కాని స్థాయికి చేరింది. దానిని అతడు సమర్ధించుకునే విధానాన్ని తన ముల్లాలు, వైద్యుల పైన వదిలేసాడు. వారి సమర్థనల ప్రకారం.. .. చక్రవర్తికి తన తోటలోని ఫలాలను రుచి చూసే హక్కువుంటుంది" అని వ్రాసాడు. జోనాస్ దె లెయట్ అనే యూరోపియన్ ఈ వదంతులను మొట్టమొదటి సారిగా గ్రంధస్థం చేసినట్లు తెలుస్తోంది. పీటర్ ముండీ, జేన్ బాప్టైస్ టావెర్నియర్ లు కూడా ఇదే వదంతి పైన వ్రాసినట్లుగా తెలుస్తోంది. కానీ కె.ఎస్.లాల్ ప్రకారం "ఈ వదంతులు ఔరంగజేబు వలనే పుట్టాయి. అతడే వ్యక్తిగత స్పర్థల వలన ఇలా ఒక పెద్ద అపవాదుని చిత్రీకరించి వుండివుంటాడు. అతడే షాజహాన్ని బంధించి, షాజహాన్ పితృవాత్సల్యానిని ఒక కళంకంగా నిందించి వుండవచ్చును; అలా కనుక ఐతే అది ఔరంగజేబు చేసిన పనులన్నిటిలోకీ నీచాతినీచము;...... ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితులలో ఈ విషయంపై ఖచ్చితంగా ఎటూ నిర్థారించలే ము"... అని పేర్కొన్నాడు. నిజమే షాజహాన్ మరీ అంత దిగజారి వుండకపోయి వుండవచ్చు కానీ, మొత్తానికి అతడి వ్యక్తిత్వమేమీ అంత గొప్పది కాదని మాత్రం మిగిలిన సమాచారం వల్లనైనా నిర్థారించవచ్చు.
ఐతే, ఈ షాజహాన్ గురించా, మనం ఒక అందమైన ప్రేమ కథను అల్లుకుని పులకరించిపోతున్నాము? ఈ కామంధుడా తాజమహల్ ని కట్టించి ఒక మహాప్రేమికుడిగా చరిత్రలో నిలిచిపోయింది? తాజమహల్ని షాజహానే కట్టించినా కట్టించకపోయినా, ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, దానిని అల్లుకుంటూ చెప్పే ప్రేమ కథ మాత్రం అంతా ఒక కట్టుకథ మాత్రమే అని, అది అలా వ్రాయించుకున్నది మాత్రమే అని. ఇహ పోతే, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన ఈ తాజమహల్ని కూడా దగ్గిర నుంచీ చూసి పరీక్షిద్దాం. తాజమహల్ అసలు మొగలాయిలు కట్టించిదో కాదో చూద్దాం. 

షాజహాన్ యమునా నది ఒడ్డున 1631-53 సంవత్సరాల మద్య తాజ్‌మహల్‌ని నిర్మించాడన్నది అందరూ చదువుకున్నదే. కానీ పి.ఎన్. ఓక్ వ్రాసిన పుస్తకం ప్రకారం ఇది 12వ శతాబ్దికి చెందిన ఒక శైవ మందిరం. మొగలాయిలు ఆక్రమించుకుని అపవిత్రం చేయగా, పూజలు నిలుపవేయ బడిన అనేక హిందూ మందిరాలలో ఇది ఒకటి. హుమాయున్ కాలలంలో వారి సామంతుడైన రాజా మాన్‌సింగ్ ఈ ఆలయాన్ని వశం చేసుకుని ఒక భవనంగా మిగిల్చాడు. ఆ తరువాత ఆ ఆలయాన్ని రాజా జయసింగ్ వద్దనుంచీ షాజహాన్ కైవసం చేసుకుని, దానిని ఒక సమాధిగా మార్చాడని, శ్రీ ఓక్ గారు నిర్థారించిన విషయం. అంటే తాజ్‌మహల్ షాజహాన్ కన్నా కొన్ని వందల ఏళ్ళ పాతది అయి వుండాలి. ఐతే షాజహాన్ కట్టించింది ఏమిటి? ఉన్న ఈ భవన సమూహాన్ని ఆక్రమించుకుని, కొన్ని చోట్ల కూల్చి, మార్పులు చేసి, హిందూ మందిరాన్ని ఒక మహమ్మదీయ సమాధిగా మార్చి, ఆ అందమైన కట్టడం మొత్తాన్నీ తానే కట్టించినట్టుగా చరిత్ర తిరగ వ్రాయించుకోవడమే ... అని మరికొందరు ఊహించిన విషయం. ఆ చరిత్ర నిలబడటం కోసం, దాని చుట్టూ ఒక ప్రేమ కథను సృష్ఠించి, దాన్ని తన ప్రియురాలి సమాధిగా చిత్రీకరించి వుంటాడు అనేది మరొక ఊహాగానం.

ముంతాజ్

కానీ, దీనికి భిన్నంగా, షాజహాన్ తన భార్య, ముంతాజ్ పైన ప్రేమతో, ఆమెకు సమాధిగా 20 వేల మంది కూలీలతో, 22 ఏళ్ళ కాలంలో (1631-1653 ) ఈ తాజమహల్ని నిర్మించాడని చరిత్ర గొప్పగా చెబుతోంది. ఐతే, ఇదే చరిత్ర ప్రకారం, ముంతాజ్ ఆగ్రాలో చనిపోలేదు. ముంతాజ్ బర్హంపురంలో (ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో వుంది) జూన్ 20, 1631 నాడు చనిపోతే, అక్కడే ఆమెకు సమాధి కట్టారని, దానికి ఋజువుగా అక్కడి సమాధి కనిపిస్తోంది. అక్కడ షాజహాన్ యుద్ధం చేస్తూ వుండగా తనతో ఉండటానికి ఆమెను తెచ్చుకున్నాడట. అక్కడ కాన్పులో ప్రసవిస్తూండగా ఆమె మరణించిందట. ఆరు నెలల తరువాత (1632 జనవరిలో), బర్హంపూర్ సమాధిని తవ్వి, ఆమె శరీరాన్ని బయటకు తీసి, ఆగ్రాలోని తాత్కాలిక సమాధిలోకి తరలించారని, మళ్ళీ ఆ తరువాత ఎప్పుడో తెలియదు కానీ, ఆమె శరీరాన్ని తాజమహల్‌లోకి మార్పించారని తెలుస్తోంది. ఇలా "ముంతాజుని మూడు చోట్ల సమాధి చేసారు" అని చరిత్ర చెబుతోంది.


ఆధికారిక "బాదుషానామా"లోనుంచీ, షాజహాన్ జారీచేసిన "ఫర్మానాల" నుంచీ, రాజా జయసింగ్ దగ్గిర తాజ్‌మహల్ భవనానికి మక్రానా గనుల నుంచీ పాలరాయి కొనుగోలుకై వ్రాసి ఇచ్చిన "విక్రయపత్రాల" నుంచీ, "ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి పీటర్ మండీ" వ్రాసుకున్న తన "ఆగ్రా యాత్రానుభవాల" నుంచీ, ఫ్రెంచ్ వర్తకుడైన "జె.బి. టవెర్నియర్" వ్రాసుకున్న తన "యాత్రానుభవాల" నుంచీ, సేకరించినవే. అవి కూడా పరిశీలిద్దాము.

బాదుషానామా:

బాదుషానామాలో ఇలావ్రాసుందట... " ముంతాజ్ శవాన్ని బర్హంపురం సమాధి నుంచి త్రవ్వి తీసి, ఆగ్రాకు తరలించారు. ఆగ్రాలో ఒక తాత్కాలిక సమాధిలో వుంచారు. ఎంచుకున్న అంతిమ సమాధి ఆగ్రా నగరానికి దక్షిణ భాగాన వున్న అందమైన తోటలలో వుంది. అందులో రాజా మాన్‌సింగ్ వారి భవంతిని ఎంపికచెయ్యడం జరిగింది. ప్రస్తుతం అది రాజా జయసింగ్ వారి ఆధీనంలో వుంది. రాజా జయసింగ్ ఆ భవంతిని తన పూర్వీకుల విశిష్టమైన వారసత్వ ఆస్తిగా, ఒక పుణ్యప్రదేశంగా భావిస్తాడు. కానీ షాజహాన్ ని కాదనలేక, ఇవ్వడానికి ఒప్పుకోవలసివచ్చింది. ఫలితంగా అతనికి సర్కారీ భూమిని ఇవ్వడం జరిగింది. తరువాత సంవత్సరం మహరాణి దేహం, ఆ భవనంలో పూర్తి విశ్రాంతి పొందింది. రాజశాసనం ప్రకారం, అధికారుల సమక్షంలో ఆకాశమంత ఎత్తువున్న ఆ సమాధిలో ఆ మహారాణిని దాచిపెట్టారు. ఎంతో సువిశాలము, ఘనము అయిన ఆ భవనం ఒక పెద్ద మహాగోపురంతో (ఇమారత్-అ-ఆలిషాన్ వా గుంబేజ్) శోభిల్లుతూ, చక్రవర్తుల శక్తిని తెలుపుతూ, అందనంత ఎత్తులో వుంది. వేసిన పునాదులు, క్షేత్రగణితజ్ఞులకే అందనంత పెద్దగా  వుండి, స్థపతుల జ్ఞానశక్తిని తెలియచేస్తున్న, ఈ కట్టడానికి రూ 40 లక్షలు ఖర్చయ్యింది."

బాదుషావామాలో ఒక పేజీ

దీన్ని చదివితే ఎవ్వరికైనా అర్థమయ్యేది -- షాజహాన్ బలవంతంగా రాజా జయసింగ్ దగ్గర నుంచీ ఒక పూర్వీకుల పవిత్ర భవంతిని లాక్కుని దానిపై 40 లక్షల రూపాయిలు ఖర్చు పెట్టి, దానికి మార్పులు చేర్పులు చేయించి, హిందువుల మందిరాన్ని సమాధిగా మార్పించాడని తెలుస్తోంది. ఈ భవనం రాజా మాన్‌సింగ్‌ది. షాజహాన్ కట్టించినది కాదు అని చాలా సీదాసాదాగా స్పష్టంగా కనిపించిన మాటే అయినా, తరతరాలగా జానపదంలో మిగిలిన కథనం ప్రకారం, షాజహానే ఈ భవనం కట్టించాడు అని చాలా మంది వాదిస్తారు. వారి వాదనకున్న ఆధారం ... "అందులో పునాది వేసాడన్న మాట". నిజమే ఆ మాట వింటే మళ్ళీ షాజహానే కట్టించాడన్న వాదనకు బలం కనిపిస్తుంది. కాబట్టి షాజహాన్ కట్టించలేదు అని వాదించేవారికి మరిన్ని ఋజువులు చూపించాల్సిన అవసరం వుంది. 

"పునాది వేసాడు" అన్న మాటకు అర్థంగా "భవన మరమ్మత్తుల పధకానికి అంకురార్పణ" అని కూడా తీసుకోవచ్చు అని "ఓక్" గారి వాదన. ఈ వాదనలో వున్న బలాబలాలు తెలియాలంటే ఈ కట్టడాన్ని నిశితంగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది. ఇందులో మార్పులు జరిగినట్లు ఎక్కడైనా కనిపిస్తే అవి తరువాత చేర్పించినట్టుగా తెలుసుకోవచ్చు. 


ఈ పాలరాతి మెట్లు తరువాత అతికింపబడ్డవని అవి ఆ మెట్ల వల్ల అర్థాంతరంగా, అర్థరహితంగా కప్పబడిన డిజైన్లను చూస్తేనే తెలుస్తుంది.

మసీదు అనబడే కట్టడం. ఇందులో ముల్లాలు ఎక్కి కూర్చునే మెట్లని గమనిస్తే, ఆ మెట్లు వెనుక గోడల పైనున్న డిజైనులని కప్పివేస్తూ విరిచివేస్తూ కనిపిస్తాయి. అంటే ఆ భవనం మసీదుకోసం కట్టినది కాదని, తరువాత అలా మార్చుకున్నారనీ అనుకోవచ్చు. ఎందుకంటే మసీదుమొత్తంలోకీ ఇంత ముఖ్యమైన స్థానాన్ని ఇలా అడ్డకోలుగా ఎవరూ కట్టరు. దానిచుట్టూతా డిజైనులు వేస్తారు కానీ, డిజైనులను కప్పుతూ ఈ స్థానాన్ని నిర్మించరు

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా ఫొటోలే కాకుండా చారిత్రాత్మక వివరణలు కూడా పరిశీలిద్దాం. బాదుషానామా ప్రకారం బర్హంపురంలో జూన్ 20, 1631 నాడు ముంతాజ్ మృతి చెందారు. తరువాత జనవరి 8, 1632 నాటికి ఆ శరీరాన్ని ఆగ్రాకి తరలించడం జరిగింది. కానీ తాజ్‌మహల్లో ఎప్పుడు సమాధి చేసారు అన్న మాట మాత్రం (ఆగ్రాకి వచ్చిన తరువాతి సంవత్సరం అనడం తప్ప) ఇందులో చెప్పలేదు. అన్ని తేదీలూ చెప్పి, ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఎందుకు వదిలి పెడతారు అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. అంటే తాజ్‌మహల్‌లో ముంతాజ్‌ని నిజంగా పాతిపెట్టరా లేదా అన్న అనుమానం కూడా వస్తుంది! కాని పాతి పెట్టడం అంటూ నిజంగా జరిగిందే అనుకుంటే, అది ఫిబ్రవరి 25, 1633 నాటికన్నా ముందే ఎప్పుడో జరిగి వుండాలి. ఎందుకంటే, ఆ నాటికి "ఆ అద్భుత భవనాన్నీ, ఆ సమాధిని నేను చూసాను, ఆ సమాధి చుట్టూ బంగారు కడ్డీలు అమర్చారు. ఇది ఇప్పటికే ఒక యాత్రాస్థలంగా ప్రసిద్ధి పొందింది " అని "పీటర్ మండీ" తన పుస్తకంలో వ్రాసుకున్నాడు కనుక. 
 
కానీ తాజమహల్ కట్టింది 1631-53 మద్యలో అని చరిత్ర చెబుతోంది. ఆ సమాధి తాజమహల్ లోని 5వ అంతస్తులో వుంది. అంటే 1632 నాటికే కనీసం 5 అంతస్తులైనా పూర్తి అయ్యివుండాలి. తాజమహల్ అందరూ అనుకున్నట్టుగా 2 అంతస్తుల భవనం కాదు. ఇది మొత్తం 7 అంతస్తుల భవనం. ఇది 7 అంతస్తుల భవనమేనని ఔరంగజేబు కూడా తన లేఖలో వ్రాసుకున్నాడు. ఆ అంతస్తుల వివరాలు తరువాతి అధ్యయాల్లో మరింతగా పరిశీలిద్దాం. షాజహాన్ ఒక్క సంవత్సరంలోనే 5 అంతస్తులు కట్టించి నగిషీలు చెక్కించి బంగారుమయమైన కట్టడాన్ని నిర్మించేస్తే మిగితా 21 సంవత్సరాలు ఏమి కట్టించినట్లు? 

ఇలా ప్రశ్నిస్తే వచ్చే సమాధానం.. .. ఇలా రావచ్చును. బాదుషానామాలొ చెప్పినట్లు రాజా జయసింగ్ దగ్గిర కొన్న భవంతిలో కింది 5 అంతస్తులు ముందే వున్నాయి అనుకుంటే, మిగితావి రెండే అంతస్తులు కనుక, సమాధిని కట్టడానికి సమయం సరిపోయింది. అంటే ఆ పైన వున్న (నేడు మనకు కనబడే) పాలరాతి తాజమహల్ని తరువాత 21 సంవత్సరాలలో షాజహాన్ కట్టించి వుండవచ్చు అని మనం అనుకోవచ్చు. అలా అయివుండటానికి అవకాశం తప్పకుండా వుంది. ఈ అవకాశాన్ని కూడా పరిశీలిద్దాం. 

ఔరంగజేబు లేఖ:
ఔరంగజేబు లేఖ:

తాజమహల్ కట్టించింది 1631 నుంచీ 53 దాకా అని ఇందాకే చెప్పుకున్నాము. 1652 లో షాజహాన్ కుమారుడు ఔరంగజేబు తాజమహల్ పర్యటించి దోల్పూర్ నుంచీ వ్రాసిన లేఖలో ఇలా అన్నాడట ( వి.యస్. వత్స్ గారి తర్జుమా)-- "పవిత్రమైన సమాధి గోపురాలన్నిటిలో నుంచీ నీరు కారుతోంది, వెంటనే వాటికి మరమ్మత్తులు చేయించాలి. వర్షాకాలంలో ఉత్తర దిశలో కారుతోంది. మిగితా చిన్న గోపురాలు, రెండవ అంతస్తులోని గదులలో, నాలుగు చిన్న గోపురాలలోనూ, భూమి కింద నున్న గదులలోనూ అనేక చోట్ల బీటలువారి వున్నాయి. క్రిత ఏదాది అన్నిటికీ మరమ్మత్తులు చేయించాము. కానీ మనం సఫలీకృతులయ్యామో లేదో తెలియాలీ అంటే, మళ్ళీ వర్షాలు పడితే కానీ తెలియదు. జామాయిత్ ఖానా పైన, అలాగే మసీదు పైన వున్న గోపురాలు కూడా కారుతున్నాయి. మన స్థపతి అభిప్రాయం ప్రకారం, రెండవ అంతస్తు కప్పుని మొత్తం విప్పి మళ్ళీ సున్నంతో కట్టి, అలాగే అదనంగా అరగజం సున్నం ముట్టిస్తే గదులు ద్వారబంధాలు కూడా కారకుండా వుంటాయి. కాని మహాగోపురానికి మాత్రం ఎలా మరమ్మత్తు చేయాలో స్థపతులకి తెలియదంటున్నారు. .... .... ... "

ఈ ఉత్తరం చూస్తే మనకు అర్థమయ్యేది 1652లో మొత్తం అన్ని గోపురాలలోనూ నీరుకారుతోంది. తాజమహల్ కట్టినది 1631 నుంచీ 1653 దాకా అని మనం చదువుకున్నాము. మరి నిర్మాణం కూడా పూర్తికాకుండానే ఇన్ని మరమ్మత్తులేమిటి? నిర్మాణంలోని తప్పులైతే నిర్మాణం సరిగా చేయలేదని స్థపతులని ఆపేక్షించినట్లు కూడా లేదిక్కడ! గమ్మత్తుగా లేదూ! అంతేకాదు స్థపతికి మహాగోపురం మరమ్మతు ఎలా చేయాలో తెలియదట. కట్టింది ఆయన కాదా?

అంటే బాదుషానామాలో చెప్పిన "ఒక మహాగోపురం క్రింద వున్న భవనంలో ముంతాజ్‌ని సమాధి చేస్తున్నారు" అని వున్న మాట అక్షరాలా నిజమన్న మాట. అంటే అది రాజా జయసింగ్‌వారి భవనమే అని తేలుతోంది. గోపురాలతో సహా అన్ని అంతస్తులు పాతవే, అన్నీ ముందునుంచే వున్నాయని తేలుతోంది. అంటే షాజహాన్ అప్పటికే వున్న అ భవనాన్ని తీసుకుని, మరమ్మత్తులు దాదాపు 22 సంవత్సరాలుగా చేయించాడని, అందులో చాలా మార్పులు చేసి, ఒక మహమ్మదీయ కట్టడంగా చూపించడానికి ప్రయత్నించాడనీ అర్థం చేసుకోవచ్చు. ఇదే మాటని ఫర్మానాలు కూడా బలపరుస్తున్నాయి.
ఫర్మానాలు(రాజాజ్ఞలు):

మన పరిశొధనలో మనకు మరింత సమాచారం అందించేవి ఈ ఫర్మానాలు. షాజహాన్ వద్దనుండీ జయపూర్ రాజా జయసింగ్‌కి పంపిన ఈ మూడు ఫర్మానాలు పరిశోధకులకు లభించాయి, అని పి. యస్. భట్ మరియు ఏ. ఎల్. అటావలే లు తమ పరిశోధనా పత్రాలలో పేరొన్నారు. ఈ మూడు ఫర్మానాలూ పాలరాతి కొనుగోలుకు చెందినవే. వీటిని చూపే కొందరు, తాజ్‌మహల్‌ని షాజహానే కట్టించాడని ఇప్పటిదాకా వాదిస్తూ వస్తున్నారు. అందుచేత వాటిలో ఏముందో కూడా మరొక సారి పరిశీలిద్దాం.

1) జనవరి 21, 1632(9 రజబ్, 1041 హిజ్ర ) నాటి ఫర్మానా:

పాలరాతిని తీసుకురావడానికి చాలా బండ్లు కావాలి అని ఇంతకు ముందే మీకు ఫర్మానా పంపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అనేక బండ్లని సంసిద్ధం చేయవలసిందిగా తెలుపడం జరుగుతోది. ఆ బండ్లని "మక్రానా గనులకి" పంపి పాలరాతిని వెంటనే పంపవలెను. దీనికి అయిన ఖర్చుని మా ముసద్దీ వారికి జమా ఖర్చుల లెక్కలు చూపించి వారి వద్ద నుంచీ పొందగలరు.

2) సెప్టెంబర్ 9, 1632 (4 రబి-ఉల్-అవ్వాల్, 1043 అల్ హిజ్ర) నాటి ఫర్మానా:

పాలరాయి తీసుకురమ్మని "అంబెర్"కి "ముల్క్ షా"ని నియమించాము. అతడికి వెంటనే బండ్లు సమకూర్చమని మీకు ఆదేశం. "ముల్క్ షా" ఎంత పాలరాయి కావాలంటే అడిగిన మేరకు అతడికి దక్కేలా చూడమని కూడా మా అదేశము. అయిన ఖర్చు మొత్తం మీరు మా ఖజానా నుండీ పొందగలరు. మాకు కావలసిన పాలరాతిని, శిల్పులను, వెంటనే రాజధానికి పంపవలెను.

3) జూన్ 21, 1637 (7 సఫ్ఫెర్, 1047 అల్ హిజ్ర) నాటి ఫర్మానా:

ఆంబెర్, రాజ్‌నగర్లకు చెందిన పలువురు రాతిని చెక్కేవారు మీ ఆధీనంలో పనిచేస్తున్నారని తెలిసింది. దీనివల్ల మాకు రాతిపనివారి కొరత ఏర్పడి ఇబ్బంది కలుగుతోంది. అందుచేత మీ ఆధీనంలోవున్న పని వారినందరినీ మాకు స్వాధీన పరచాలని ఆదేశిస్తున్నాము. 

ఈ ఫర్మానాలు చూసిన తరువాత, జరిగిన కథ మరొక్కసారి నెమరువేసుకుని చూద్దాము. బర్హంపూరులోని ముంతాజ్ సమాధి చూస్తే అది పూర్తిచేసిన సమాధి. తాత్కాలిక సమాధిలావుండదు. కానీ ఆగ్రాలోని తాత్కాలిక సమాధిని తాత్కాలికమనే భావించారు కనుక, దానికి ఒక సమాధిలాగా కట్టడమేమీ వుండదు! కానీ బర్హంపూరులోని సమాధి అలా కాదు. దానికి అన్ని నగిషీలు చేసి పూర్తి చేసారు. అంటే ఆ బర్హంపూరులోని సమాధి కట్టేటప్పుడు కూడా 'షాజహాన్ మనస్సులో తాజమహల్ కట్టిద్దామన్న ఆలోచనే లేదు' అని అనుకోవచ్చును. అలాంటి ఆలోచనే అప్పటికి వుంటే బర్హంపూర్ లో సమాధి అలా పూర్తిచేసిన కట్టడమై వుండదు. వున్నా తాజమహల్ పూర్తి ఐతే కానీ బర్హంపూర్ నుంచీ ఆగ్రాకు ఆ పార్థివశరీరాన్ని తెద్దామన్న ఆలోచన కూడా రాకూడదు. కానీ, ఆరునెలలు గడవగానే, జనవరి 1632లో, ముంతాజ్ పార్థివశరీరాన్ని ఆగ్రాకి తెచ్చాడు. అంటే అక్కడ తాజమహల్ అప్పటికే వుంది అని అనుకోవచ్చు. 

అంతే కాదు, ఆగ్రాకి దేహాన్ని తెచ్చిన రెండు వారాల తరువాత, మొదటి ఫర్మానా వ్రాయబడింది. అంటే దాదాపు ఆ పార్థివశరీరం ఆగ్రాకి వచ్చిన సమయంలోనే తాజమహల్ సంకల్పం షాజహాన్ మనస్సులో మొదలయ్యింది. తాజమహల్ క్రింది మూడు అంతస్తులు ఇటుకలు, ఎర్ర రాతితో కట్టబడ్డాయి. అలాగే ఆ పైన వున్న అంతస్తులు కూడా ఇటుకలు ,ఎర్రరాతితోనే కట్టడం జరిగింది, కాకపోతే వాటిపైన పాలరాతితో తాపడం చేసారు. పైన కనపడే గోపురంతో సహా మనకు కనపడే పాలరాతి కట్టడం మొత్తం పైపైన పాలరాతి తాపడమే కానీ, లోపల వున్నదంతా ఇటుకలు, ఎర్రరాళ్ళే. అంటే కట్టడంలోని ఏడు అంతస్తులు కట్టిన తరువాత కదా ఆ పాలరాతి అవసరం!? దానికి ముందు పాలరాయి కోసం షాజహాన్ అంత కంగారుపడ అవసరం లేనే లేదు!!! అసలు ప్లాను వెయ్యడానికి, మహాశిల్పులను సేకరించడానికే ఎంతో సమయం పడుతుందే.. మరి ఇంత భారీ సౌధం పునాదినుంచీ లేపి కట్టి, అది పూర్తయ్యాక కదా ... ... ఈ పాలరాతి తాపడం. ఆ తరువాత కదా ఈ ఫర్మానాలు, హడావిడీను. అంటే ఆ రెండు వారాలలోనే (పోనీ, ఆరు నెలలలోనే) ఏడంతస్తుల తాజమహల్ ని నిర్మించేసి, వెంటనే పాలరాతి కొనుగోలుకై కంగారు పడసాగాడు అని అనుకోవాలా?

పాలరాతి తాపాడానికే 22 ఏళ్ళు పట్టినప్పుడు, కొద్ది వారాలలో, నెలలలోనే తాజమహల్ భవననిర్మాణం ఎలా వూర్తి చేయగలరు? అందుచేత ముంతాజ్ శరీరాన్ని ఆగ్రాకి తరలించడానికి ముందే తాజమహల్ భవనం అక్కడ వుందని తేలుతోంది. పురాతన భవనం రెడీగానే దొరికింది కనుక, బర్హంపూరు సమాధిని త్రవ్వి శరీరాన్ని ఆగ్రాకు తేవడం జరిగింది అని తెలుస్తోంది. తెచ్చిన తరువాత ఇంకా మరమ్మత్తులు చేస్తే బాగుంటుంది అనిపించి, మరమ్మత్తుల పధకాన్ని ఆవిష్కరించినట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మరమ్మతులు, మార్పులు చేయడానికి మాత్రమే పాలరాతిని కొన్నారని మాత్రమే ఈ ఫర్మానాలనుంచీ గ్రహించవలసిన విషయం అని తేలిపోతోంది.

తాజ్‌మహల్ లో కనిపించే ఖురాన్ వ్రాతల ఫలకాలన్నీ (మొత్తం ఖురాన్లోని 14 అధ్యాయాల వరకు చెక్కించాడట - అంటే చాలా ఫలకాలే అవుతాయి) ఖచ్చితంగా షాజహాన్ వ్రాయించి అతికించినవే. ద్వారాల అంచులు, సమాధి గదిలోని గోడలకున్న పాలరాయి ఫలకాలు అన్నీ షాజహానువే. అలాగే లోపలి అనేక పూల డిజైన్లు చెక్కుళ్ళు మహమ్మదీయ సాంప్రదాయానివే. అవన్నీ షాజహాన్ చేయించినవే. వీటికి చాలా, చాలా పాలరాయి కావలసి వస్తుంది. వాటిని చెక్కడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎంతో ఖర్చు కూడా అవుతుంది. అదే షాజహాన్ చేసిన పని. కానీ మొత్తం తాజమహల్ నిర్మాణం చేసినట్టు అనిపించడం లేదు. 

అలాగే పీటర్ మండి వ్రాతల ప్రకారం 1632-33 నాటికే (షాజహాన్ తన తాజమహల్ పనిని దాదాపుగా మొదలు పెట్టిన సంవత్సరంలోనే ) తాజమహల్ ఒక యాత్రాస్థలిగా ప్రసిద్ధిపొందింది. ఆనాటికే "ముంతాజ్ సమాధి చుట్టూ బంగారు కడ్డీలతో చేయబడ్డ కంచెలు వున్నాయి. పర్యాటకులు ఆ సమాధిని చూసి వస్తున్నారు. కట్టడం మొత్తం అయిపోయింది. కేవలం అక్కడ జరిగే పని అంతా బంగారం, వెండి, పాలరాతితో జరిగే మెరుగులు మాత్రమే" నని పేర్కొన్నాడు. అంటే షాజహాన్ పని మొదలు పెట్టడానికి ముందే, తాజమహల్ అక్కడ పూర్తయిపోయి వుంది. అక్కడ "ఖురానుకి వ్రాతల ఫలకాలను తాపడం చెయ్యడం, బంగారు వెండి రేకుల తాపడం జరుగుతోంది. బంగారం వెండి ఉన్న మిగితా గదులలోకి యాత్రికులకు అనుమతి ఇవ్వడంలేదు" అని చెప్పాడు, కానీ నేడు ఎక్కడా వెండి బంగారాలు కనిపించడంలేదు, అంటే దాని అర్థం ... అక్కడ స్వతహాగా వున్న వెండిబంగారాల్ని కొల్లగొట్టుతూ కనిపిస్తే, దాన్ని చూసి పీటర్ మండీ అక్కడేదో పని జరుగుతోందని అనుకున్నాడేమో?! 

1632 నాటికి షాజహాన్ మరమ్మత్తుల పని మొదలు పెట్టివుండవచ్చు కానీ, ఆ భవన నిర్మాణం మాత్రం కాదు అని అలా నిర్ధారించవచ్చును. ఫర్మానాలను మాత్రమే చూస్తే షాజహాన్ పాలరాతి కట్టడం ఒకటి కట్టిస్తున్నాడని అనిపిస్తుంది. కానీ, దొరికిన మిగితా ఋజువులన్నీ కలిపి చూస్తే, ఆ షాజహాన్ కొనుగోలుచేసిన పాలరాయి, కేవలం మార్పులు చేర్పుల కొరకు మాత్రమేననీ, భవన నిర్మాణానికి కాదని తేటతెల్లమవుతుంది.
అలాగే క్రింద చూపబడ్డ "పర్షియన్ దస్త్రాల" ప్రకారం, పనిచేసిన వారిలో స్థపతులు, గోపుర నిర్మాతలు, శిల్పులు తక్కువ (పూలని చెక్కే శిల్పులు తప్ప). వున్నవారంతా తాపీమేస్త్రీలు, ఖురాను వ్రాత కళాకారులు (Calligraphers), పాలరాతి తాపడం చేసే కార్మికులు, ఎక్కువ అని తెలుస్తోంది. ఈ పట్టిక ప్రకారంగా చూసినా భవన నిర్మాణం జరగలేదనే తెలుస్తోంది. అంటే అందరూ దాదాపుగా చివరలో పైపైన డిజైను చేసే వారే ఎక్కువగా కనపడుతున్నారు. తాజమహల్ భవన సముదాయం చూస్తే అందులో ఎన్నో భవనాలు, ఎన్నో గోపురాలు, ఎన్నో చెక్కుళ్ళు, కనిపిస్తాయి. మేస్త్రీలు కనిపిస్తున్నారు. మరి కావలసిన స్థపతులు, గోపుర నిపుణులు, శిల్పులు ఏరి? వీరు కదా ఎక్కువగా కావలసిన వారు. తాజమహల్లో ఎక్కువ పని వీరిదే కదా? వీరెవరూ లేకుండా ముఖ్యభవనం ఎలా తయారయ్యింది? ఇద్దరు కలశ నిపుణులుంటే గోపురనిపుణుడు ఒక్కడేనా? ఇంత తక్కువమంది వుంటే వీరు గోపురాలను కట్టారనుకోవాలా లేక మరమ్మత్తులు చేసారనుకోవాలా?

తాజ్‌మహల్ - నెలసరి జీతాల వివరాలు (ఇతిహాస పత్రిక అధారంగా)
(పర్షియన్ వ్రాతలు - నేషనల్ లైబ్రరీ, కలకత్తా, ఈ.బీ హావెల్ ప్రకారం)

 
అంతే కాదు! షాజహానుకి పరమతసహనం లేదని ముందే తెలుసుకున్నాము. ఇందులో వాడిన స్థపతులు, ముఖ్యనిపుణులు కేవలం మహమ్మదీయులే, ప్రత్యేకంగా బయటనుంచీ తెప్పించబడినవారే. మిగితా పనివారంతా చిన్నచిన్న పనులు చేసేవారూ, కూలీలూను. ఈ చిన్నచిన్న పనులు చేసేవారిలో హిందువులున్నా, వారంతా పైవారు చెప్పింది చేసేవారే కానీ, నిర్ణయాలు తీసుకునేవారు కాదు. అంటే హిందూ చిహ్నాలు తాజమహల్లోకి ప్రవేశపెట్టగలిగిన అర్హత, హోదా వున్నవారెవరూ లేరు అని తెలుసుకోవచ్చు. కానీ తాజమహల్లో హిందూ చిహ్నాలు అనేకం కనిపిస్తున్నాయి అని ముందే తెలుసుకున్నాము. అంటే ఈ చిహ్నాలు ముందునుంచే వున్నాయి, లేక తాజమహల్ ముందు నుంచే వుంది అని కూడా అనుకోవచ్చు. 

అలాగే ఆస్థాన చరిత్రకారులు, రాజుని పొగడానికి వచ్చిన అవకాశాలను సాధారణంగా వదులుకోరు. ఉన్నదానిని లేనిదానిని కలిపి పొగడ్తలు గుప్పిస్తారు. మరి ఆ 1600 పేజీల బాదుషానామాలొ, ఇంత మహాకట్టడమైన తాజ్‌మహల్ నిర్మాణం గురించి ఒక్క పేరా మాత్రమే వుంది. ముంతాజ్ ఖననం గురించి రెండు పేజీలు వుంది. ముంతాజ్ ని అక్కడ సమాధి చేసిన తేదీ కూడా ప్రస్తావించలేదు. అంటే ఆ నాటికి అందరి ముందూ, అందరికీ తెలిసిన ఆ భవనాన్ని తామే నిర్మించామని బాహాటంగా ఆధికారికంగా చెప్పుకోలేకే అని అనిపిస్తుంది. అందుకే జానపద కథలుగా నృత్యరూపకాలుగా తన ప్రేమకథలను వ్రాయించుకుని మెల్లి మెల్లిగా ప్రచారం చేయించుకున్నాడని అనుకోవడంలో తప్పులేదు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా మరెన్నో కనిపిస్తాయి. అలాగే టావెర్నియెర్, అనే ఫ్రెంచ్ వర్తకుడు వ్రాసుకున్న యాత్రావిశేషాలలో ఇలా వ్రాసాడట "షాజహన్ కావాలని ముంతాజ్ సమాధిని విదేశీయులందరూ బసచేసే తాజ్-ఈ-మఖాన్ (తాజమహల్ అనుకోవచ్చు) అనే భవనంలో చేసాడు. ఆ రోజులలో కలప తక్కువగా వుండడం మూలంగా, ఆ భవననిర్మాణానికి చుట్టూ ఇటుకలతోనే scaffolding చేసారు. ఆ scaffoldingsకి అయిన ఖర్చు భవనం కట్టడానికి అయినదానికన్నా ఎక్కువే అయ్యిందని భోగట్టా". అంటే భవన నిర్మాణానికి పెద్దగా ఖర్చు జరగలేదని చెబుతున్నాడు. లేక భవనం ముందు నుంచే వుందని చెబుతున్నాడు. scaffoldings అన్నవి పైపైన చేసే పనులకే కదా వాడేది!!

అదిసరేలే, అసలు షాజహానుకి వేరే భవనం తీసుకుని మహమ్మదీయకట్టడంగా మార్చుకోవలసిన అవసరమేమొచ్చిందని కూడా ఎవరైనా ప్రశ్నించి చూడవచ్చు. ఏ దేశ చరిత్రలో చూచినా మహమ్మదీయత ప్రాభల్యం మొదలయ్యిన రోజుల్లో అక్కడి ఆలయాలను, చర్చిలను, ద్వంసం చేయ్యడమో లేక వాటిని మహమ్మదీయ కట్టడాలుగా మార్చడమో జరిగిన సందర్భాలు వేలకు మించి వున్నాయి. అవన్నీ ఇక్కడ చర్చించలేము కానీ ఆ సాంప్రదాయాన్ని గురించి చర్చించుకోవచ్చు.

షాజహానుకి (పాద్‌షా ఘాజి జిల్లుల్లా), ఇతడి తండ్రి యైన జహంగీర్‌కీ, మొగల్ సామ్రాజ్యన్ని స్థాపించిన బాబర్ చక్రవర్తికీ, అతడి ముత్తాత యైన అమీర్ టైమర్‌కీ, ఉన్న బిరుదులలో "ఘాజీ" అనేది ఒక ముఖ్యమైన పదము. "ఘాజీ" అంటే అరబిక్ లో "దోచుకోవడం" అని అర్థం. దోచుకోవడం అన్నది వారికి తప్పుగా అనిపించే పదం కాదు, ఎందుకంటే పరమతస్థులను దోచుకోవడం అన్నది, వీరందరూ వారివారి హక్కుగా, ఒక సత్సాంప్రదాయంగా భావించిన వారు. 14వ శతాబ్దంలో చరిత్రలో ఎవ్వరూ హింసించలేనంత హీనాతిహీనంగా భారతీయులని హింసించి, లక్షలాది ఇళ్ళలోకి జొరబడి, చంపించి, మానభంగాలు జరిపించి, స్త్రీలను బానిసలుగా మార్చి ఎత్తుకుపోయి, వారి సంపదనంతా దోచుకుని, అన్ని రకాల నేరాలనూ కొన్ని రోజుల్లోనే జరిపించి, దేశం మొత్తం పీల్చి పిప్పిచేసి, ఇక అక్కరలేదు అని వదిలేసి వెళ్ళిపోయిన ఘనత, కేవలం అమీర్ టైమర్ కే దక్కుతుంది. అమీర్ టైమర్ తన సైనికులకి జీతాలేమీ ఇవ్వకున్నా సైనికులందరూ ఎంతో నమ్మకంగా పనిచేసేవారట. ఎందుకంటే ప్రతి యుద్ధంలోనూ గెలిచిన తరువాత, ప్రతిసైనికుడూ శత్రురాజ్యంలోని ఏ ఇంటిలోకైనా వెళ్ళి తనకు కావలసిన డబ్బులనూ, వస్తువులనూ, స్త్రీలనూ, యదేఛ్ఛగా తెచ్చుకోవచ్చు; పరమతస్తులనైతే కావలసినంత మందిని బానిసలుగా చేసి పట్టుకుపోవచ్చు. ఈ ఫార్ములాతో రోజురోజుకీ పెరిగిపోతున్న అతిక్రూరమైన సైన్యంతో, యుద్ధాలే పనిగా పెట్టుకుని, అనేక దేశాలను కొల్లగొడుతూ, జల్సా చేస్తూ ఇతడు కాలాన్ని వెళ్ళబుచ్చాడని చరిత్ర చెబుతోంది. తన క్రూరత్వానికి పరాకాష్ఠగా, నిదర్శనంగా, తన మతంలోకి మారని వారికి, లేక మాట వినని వారికి (భారతీయులకి) లక్షల కొలది శిరఛ్ఛేదన చేసాడని కూడా చరిత్ర చెబుతోంది. 
 
బాబర్ కూడా తన జీవితకాలం మొత్తం, ఇలాగే యుద్ధాలు చేస్తూ, చివరికి తన అవసానదశలో భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగి, ఇక్కడ స్థిరపడ్డాడు. కానీ అప్పటికే లెక్కలేనన్ని యుద్ధాలు చేసి అలసి, దేశాన్ని ఆక్రమించుకున్న నాలుగు సంవత్సరాలకే చనిపోయాడు. ఇలా మొదలయ్యింది మొగల్ సామ్రాజ్యం. ఈ వంశంలో పుట్టినవాడే షాజహాన్ కూడా. ఇతడు బాబర్, టైమర్ల అంత క్రూరుడు కాడు కానీ, ఇతడు కూడా పరమత సహనం పెద్దగా లేని వాడే అని, అనేక హిందూ మందిరాలను నాశనంచేసాడనీ, కొల్లగొట్టాడనీ ఇప్పటికే తెలుసుకున్నాము. యుద్ధాలు అనేకంగా చేసి రాజ్యవిస్తరణ చేసినవాడు, స్త్రీలోలుడు. కానీ ఒక సౌందర్యపిపాసి. స్త్రీలయినా, వస్తువులైనా, కట్టడాలయినా ఏవైనా సరే అందాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతకైనా వెనుకాడని క్రియాశీలుడు.
ఈ ఒక్క గుణమే షాజహాన్ని చరిత్రలో ఒక చిరస్మరణీయుడుగా నిలిపింది. ఈ గుణంతోనే, షాజహాన్ ఎన్నో కట్టడాలను సొంతం చేసుకున్నాడు. వాటికి మార్పులు చేసి తనదైన రీతిలో అందాలను సృష్ఠించుకున్నాడు. ఖ్యాతిని సాధించుకున్నాడు. తాజమహల్ని ఇతడు కట్టించినా కట్టించకున్నా, ఆ భవనానికి నేడున్న నిండుదనానికీ, ఆ అంతర్జాతీయ ఖ్యాతికికీ అతడే కారణం. అతడు దానిమీద మరమ్మతులే చేయించినా, ఉన్నది దోచుకున్నా, మెరుగులే దిద్దినా సరే, చివరికి మిగిలినదేమీ తక్కువ రకానిది కాదు. అది ఒక మహాద్భుతభవనంగానే మనకు దర్శనమిస్తోంది. అందుచేత ఆ ఖ్యాతిలో షాజహానుకి చెందాల్సిన వాటా నిస్సంశయంగా షాజహానుదే. కాకపోతే మొత్తం అతడిదే కాకూడదన్నదే ఈ వాదన.

ఇలా చారిత్రాత్మక ఆధారాలను పరిశీలించి, అందులోని హిందూ చిహ్నాలను గమనించి, ఆలోచిస్తే తాజమహల్ భవనం షాజహానుకి ముందు నుంచే వుండివుండాలనీ, షాజహాన్ దానిని సమాధిగా మార్చి, మార్పులుచేర్పులతో, మెరుగులు, మరమ్మత్తులు చేయించాడనీ అనుకోవడానికి ఆస్కారం కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా ఇంకా నిర్థారించలేము. ఆ కట్టడం పైన కార్బన్ డేటింగు వంటి పరీక్షలు చేసి ఆ కట్టడం షాజహాన్ కన్నా పురాతనమైనదని నిర్థారించగలిగితే కానీ ఈ వాదనలో తగిన బలం దొరకదు. అంతే కాదు మహమ్మదీయ చిహ్నాలుగా కనిప్పించే ఆ గోపురాలు మినార్ల సంగతి కూడా తేలాలి, వాస్తుపరంగా కూడా అధ్యయనం చేయాలి. అవి వచ్చే అధ్యాయంలో పరిశీలిద్దాం. 

(సశేషం)
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan12/sujananeeyam.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి