21, ఫిబ్రవరి 2012, మంగళవారం

భారతీయ ముస్లింలలో కుల అసమానతలు: యోగీందర్ శిఖండ్ పరిశోధన



హిందువులలాగే భారతీయ ముస్లింలలో కూడా కుల విభజనలు ఉన్నాయి. కుల వ్యవస్థని ఉర్దూ బాషలో జాత్, జాతి, బిరాదెరీ అనే పదాలతో వ్యవహరిస్తారు. ఇస్లాం మతం కుల వ్యవస్థని ప్రతిపాదించకపోయినా భారతీయ ముస్లింలలో కూడా కుల పట్టింపులూ, కుల సుప్రీమసీ భావాలూ కనిపిస్తాయి. హిందూ సంప్రదాయం అయిన కుల వ్యవస్థని ముస్లింలు ఎందుకు ఆచరిస్తున్నారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పై వాళ్ళ పక్క ఇళ్ళళ్ళో నివసించే హిందువుల ప్రభావం కూడా పడుతోంది. భారత దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కనుక హిందువుల ఆచారాలలో కొన్ని భారతీయ ముస్లిం సమాజంలో చేరడం విచిత్రం కాదు. కులం కట్టుబాట్లు కూడా భారతీయ ముస్లింలలో ఈ విధంగా చేరి ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. భారతీయ ముస్లింలలో కులం కట్టుబాట్ల గురించి ఉలేమా (ముస్లిం పండితులు) ని అడిగితే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇస్లాం మతం కుల వ్యవస్థని ప్రభోధించలేదు కానీ ముస్లిం పండితులు కూడా కులం కట్టుబాట్లని ఆచరిస్తున్నారు. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళు దేవుడిని, కర్మకాండలు (rituals) ని మార్చుకున్నారు కానీ చాలా సంప్రదాయాలని మార్చుకోలేదు. వాళ్ళు ఇస్లాం మతంలోకి మారకముందు ఆచరించిన సంప్రదాయాలని ఇప్పుడు కూడా ఆచరిస్తున్నారు. హిందూ సంప్రదాయాలని పూర్తిగా కాకుండా పాక్షికంగా ఆచరిస్తున్నారు. కులం కట్టుబాట్ల విషయంలో మాత్రం హిందూ సంప్రదాయాల ప్రభావం ముస్లింలపై ఎక్కువగానే కనిపిస్తోంది.

 హిందూ మతం వదిలి ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళలో ఎక్కువ మంది శూద్ర కులాల వాళ్ళు. పర్శియా (ఇరాన్), అరేబియా, టర్కీ, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చిన ముస్లింలు తమని తాము ఉన్నత జాతీయులగానూ, ఇస్లాం మతంలోకి మారిన శూద్రులని అల్ప జాతీయులగానూ భావిస్తారు. ఉన్నత జాతి ముస్లింలని అష్రాఫ్ అనీ, అల్ప జాతి ముస్లింలని అజ్లాఫ్ అనీ అంటారు. అల్ప జాతి ముస్లింలకి రజిల్, కమీనా అని కూడా పేర్లు ఉన్నాయి. అజ్లాఫ్ (దిగువ కుల) ముస్లింలలో ఎక్కువ మంది ద్రవిడులు (నల్లని శరీర ఛాయగల వారు) కావడం వల్ల కూడా వాళ్ళని అష్రాఫ్ (ఉన్నత కుల) ముస్లింలు హీనంగా చూడడం జరుగుతోంది. అజ్లాఫ్ ముస్లింలలో ఎక్కువ మంది చేతివృత్తిదార్లు, పేద రైతులు. ముస్లిం పండితులలో ఎక్కువ మంది ఉన్నత కులాలకి చెందిన వాళ్ళు కావడం వల్ల కులం కట్టుబాట్ల ప్రశ్న గురించి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. భారతీయ ముస్లిం సమాజంలో కులం కట్టుబాట్లని రద్దు చెయ్యడానికి ప్రయత్నాలు సరిగా చెయ్యడం లేదు. కొంత మంది ముస్లిం పండితులు కుల వ్యవస్థ ఇస్లాం మతానికి వ్యతిరేకం అని చెపుతున్నప్పటికీ వాళ్ళు కూడా ముస్లిం సమాజంలో కులం కట్టుబాట్లని రద్దు చెయ్యడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు.  
ముస్లిం మత పెద్దలు కూడా కులాలని ఆచరిస్తున్నప్పుడు సాధారణ ముస్లింలు కులాలని వదులుకోవడం కష్టమే. కులం కట్టుబాట్లకి మతం ఒక్కటే కారణమనుకోలేము. ఇందులో ఆర్థిక అసమానతల పాత్ర ఎక్కువ. పూర్వం హిందువులలో అగ్రకులాలవాళ్ళ పిల్లలకే చదువుకునే అవకాశం ఉండేది. అలాగే ముస్లింలలో ధనికుల పిల్లలకే చదువుకునే అవకాశం ఉండేది. తుగ్లక్ చక్రవర్తుల దగ్గర జియా-ఉద్-దీన్ బరాని అనే మంత్రి ఉండేవాడు. అతను పేద ముస్లింలు చదువుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అతను తుగ్లక్ చక్రవర్తులతో ఇలా అనేవాడు "పేద రైతు కొడుకు చదువుకుంటే అతను శిస్తు వసూలు అధికారి అవుతాడు, శిస్తు వసూలు అధికారి పదవి వచ్చిన తరువాత ఆ పదవితో సంతృప్తి పడకుండా రాజు అవుతానంటాడు. అతను కుట్ర పన్ని రాజునే పడగొడతాడు" అని. అప్పట్లో డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళని చదువుకోనివ్వకుండా అలా చేసేవాళ్ళు. కులం కట్టుబాట్లు బలంగా ఉంటే ఒక వర్గంవాళ్ళని చదువుకోనివ్వకుండా చెయ్యడం చాలా సులభం. అందు వల్ల కూడా ముస్లింలలో కుల వ్యవస్థని బలంగా ఏర్పాటు చేసి ఉండొచ్చు

 http://samajikasastralu.in/articles/muslim_society/23072011_1.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి