21, ఫిబ్రవరి 2012, మంగళవారం

'సంస్కృతి”మారితే ఏమవుతుంది?

''కల్చర్‌'' అనే ఆంగ్లపదాన్ని తెలుగులో ఇతర భారతీయ భాషలలో ''సంస్కృతి'' అనే సమానార్థక పదంగా వాడుతున్నాయి. కల్చర్‌ అనే మాటకు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో భూమిని దున్నటం అనే అర్థం ఒకటి ఇచ్చారు, ఇది కూడా సబబే. (అగ్రికల్చర్‌) -మనస్సును శరీరాన్ని సంస్కరించటం కూడా సంస్కృతియే కదా? కల్చర్‌ శబ్దానికి అదే (ఆంగ్ల నిఘంటువులో ఇలా మరొక అర్థం ఇచ్చారు'' ఇంటలెక్చువల్‌ డెవలప్‌మెంట్‌ పర్టిక్యులర్‌ ఫాం -స్టేజ్‌, ఆర్‌, టైప్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్‌ సివిలిజేషన్‌ -( ద ట్రు -లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌)
ఈ నిర్వచనాన్ని బట్టి తేలే సారాంశమేమంటే

(1) సంస్కరించేది సంస్కృతి.
(2) సంస్కృతి నాగరికత సమాన భావాత్మకంగా ఉంటుంది.

ఈ విధంగా చూస్తే పైకి రూపభేదం ఉన్నా అంతర్లీనంగా ప్రవహించే సమాన భావధారను సంస్కృతి అనవచ్చు. పాలతో సందేశ్‌, కలాఖండ్‌, దూద్‌పేడా, పాయసం వంటి ఎన్నో మధుర పదార్థాలు తయారు చేయవచ్చు. అన్నింటికీ మూలం పాలే. నెక్‌లెస్‌, కంకణం, గండపెండేరం, కర్ణాభరణము, ముక్కెర-ఇలా ఆభరణాలు వేరైనా అన్నీ బంగారానికి భిన్న రూపాలే -సంస్కృతి కూడా అలాంటిదే.

కేరళలో ధరించే దుస్తులు వేరు -ఆంధ్రులు ధరించే దుస్తులు వేరు. తమిళులు పంచెకడితే ఆంధ్రులు బిళ్లగోచీ కడతారు. బెంగాలీ పంచె కట్టు మరో రకంగా ఉంటుంది. ఇక భాషా పరంగా చూసినప్పుడు మలయాళం, పంజాబీ, పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కన్పడుతాయి. ఆహారపు అల వాట్లు సరేసరి -కేరళలో పుష్కలంగా కొబ్బరి నూనెను వాడుతారు. అవియల్‌ వంటి కొబ్బరి వంటకాలు చేసుకుంటారు. కాని పంజాబ్‌లో సర్షప్‌ ఉపయోగిస్తారు అంటే ఆవనూనె, ఆవగరికెలతో వంటకాలు చేస్తారు. ఈ విధంగా చూసినప్పుడు పంజాబు సంస్కృతి కేరళ సంస్కృతి వేరే అని చెప్పాలి. కాని అది నిజం కాదు ఎందుకంటే కేరళలోని అయ్యప్పను దర్శించుకునే నిమిత్తం పంజాబునుండి భక్తులు వస్తారు. పంచనదీ స్నానం కోసం తమిళనాడు నుండి కూడా భక్తులు వస్తుంటారు. పంజాబులో పుట్టిన సుఖదేవ్‌ రాజగురు, భగత్‌సింగ్‌ వంటివారిరై రంజిత్‌సింగ్‌ వంటి పాలకులపై మొత్తం భారతదేశంలోని వారందరికీ సమాన గౌరవం ఉంది. అలాగే ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలను పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయలపై భారత దేశంలోని వారందరికీ సమాన గౌరవ ప్రతిపత్తి ఉంటుంది. అంటే వీరంతా ఒకే సంస్కృతికి చెందినవారు అని అర్థం.

మొన్న శ్రీరామ నవమి ఉత్సవం వచ్చింది. రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, భారతీయులందరికీ పూజనీయులే. అమెరికాలో అబ్రహాం లింకన్‌ను జార్జి వాషింగ్‌టన్‌ను మాత్రమే ఆరాధిస్తారు. అంటే ఇక్కడ సాంస్కృతిక భేదం ఉన్నదని అర్థం. ఆవిధంగా చూస్తే భారతభూమి యొక్క అఖండతను సార్వభౌమాధికారాన్ని గుర్తించని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. రాముణ్ణి కృష్ణుణ్ణి కృష్ణదేవరాయలను హేళన చేసేవారూ ఉన్నారు. వారు ఈ దేశంలో పుట్టిన ఈ సంస్కృతికి చెందినవారు కాదు అని అర్థం. కాబట్టి సంస్కృతి జన్మసిద్ధం కాదని సిద్ధాంతీకరింపవలసి ఉంటుంది. అంటే సంస్కృతి భావాత్మకం అని అర్థం!

కమ్యూనిజం ఎక్కడైనా వ్యాపించాలంటే ముందుగా స్థానిక సంస్కృతిని నిర్మూలించాలని వారి సిద్ధాంతం - రామునిపైన శివునిపైనా గౌరవం ఉన్నంతకాలం ఒక భారతీయుడు కమ్యూనిస్టు కాజాలడు. అలాగే దుర్గ, హనుమంతుడు లక్ష్మీదేవిలను పూజించేవాడు క్రైస్తవుడు కాజాలడు. అందుకే ఒక వ్యక్తి, హిందువు, క్రైస్తవమత స్వీకారం చేసిన వెంటనే బొట్టుతుడిపి వేస్తాడు. గాజులు పూలు తీసివేస్తారు. పూజామందిరం నుండి శివుడు, విష్ణువు, రాముడు, హనుమంతుడు వంటి దేవతామూర్తుల విగ్రహాలను వీధిలో పారేస్తాడు. అంటే మతం మార్పిడిలో సాంస్కృతిక పరివర్తన జరుగుతున్నది అని అర్థం.

నేను అమరనాధ్‌ యాత్రచేయలేదు. మౌంట్‌ ఆబూ వెళ్లలేదు. కాని అమరనాథ్‌ శివలింగం మీద మౌంట్‌ ఆబూలోని ఆలయాల మీద బ్రహ్మకుమారీల మీద గౌరవం ఉంది. అంతేకాదు మక్కా -జెరుసలేములమీద ప్రేమ ఉంది. అది హిందువుల విశాల హృదయం. కాని ఒక హిందువు ముస్లింగా లేదా కమ్యూనిస్టుగా మతపరివర్తన పొందిన వెంటనే అతడు కాశి, మధుర, జెరుసలేంలను ఎందుకు ద్వేషిస్తున్నాడు? దూషిస్తున్నాడు? ఆలోచించండి. పరమత సహనం కేవలం హిందువుల ముఖాన్నే బ్రహ్మదేవుడు వ్రాసి పంపించాడన్నమాట!

స్వీయ ధర్మ సంరక్షణకోసం క్రైస్తవులు చేసే మత యుద్ధాలను క్రూసేడ్స్‌ అంటారు. ముస్లింలు చేసే యుద్ధాలను జీహాదీ అంటారు. మరి హిందువులు స్వధర్మ రక్షణకోసం పోరాడితే దానిని ఏమంటారు? కాషాయ తీవ్రవాదోన్మాదం అంటారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వసిష్టుడు, ఛత్రపతి శివాజీ ధరించింది కాషాయ జండానే. సన్యాసులంతా కాషాయి వస్త్రాలే కట్టుకుంటారు. అంటే సాధువులు సన్యాసులంతా తీవ్రవాదులా?

కాబట్టి సారాంశం ఏమంటే సంస్కృతి నాగరికత, వారి మానసిక అంతర్లీన ప్రవాహంలో ఉంటుంది. శైవులు శివరాత్రిని వైష్ణవులు రామనవమి గోకులాష్టమినీ చేసుకుంటారు. ఐనా శివునిమీద విష్ణువుమీద సమాన గౌరవం ఇరువురి హృదయాల్లో ఉంటుంది. ఒకవేళ గౌరవం లేకపోయినా ద్వేషం మాత్రం ఉండదు. ఇదే''కామన్‌ కల్చర్‌'' (సమాన సంస్కృ తి) అనే పదానికి నికషోపలం (కసౌటీ) గా భావింపవచ్చు.

భారతదేశంలో నేడు నూటఇరవై కోట్ల మంది జనాభా ఉంది. వీరి ఆచారాలు మతగ్రంథాలూ పండుగలు వేరువేరుగా ఉన్నాయి. ఐనా కామన్‌ కల్చర్‌ ఒకటి ప్రధానంగా ఉంది. అదే హిందూ సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి. క్రైస్తవులూ హేతువాదులు, ముస్లింలు, కమ్యూనిస్టులూ ఈ ప్రధాన సంస్కృతే ప్రవాహాన్ని గౌరవింపవలసి ఉంది. ఒకవ్యక్తి మతం మార్చుకున్నంత మాత్రాన తమ పూర్వీకుల పరంపరను ద్వేషించటం తగునా? బుచ్చయ్య కొడుకు అలగ్జాండరు. ఆయన కొడుకు ప్రభుకిరణ్‌.

అస్పృశ్యుడైన బుచ్చయ్యను ఒక ఫాదరీ చేరదీసి అన్నోదకాలు కల్పించాడు. దానితో బుచ్చయ్య క్రైస్తవ ప్రార్థనలు వరంగల్‌ (1905) మొదలుపెట్టాడు. మూడు తరాలు మారే సరికి బుచ్చయ్యగారి శైవంమీద ఆయన మనుమళ్లకు ద్వేషం ఏర్పడింది. అంటే ఇక్కడి ఆరాధనా విధానాలు పండుగలు సంప్రదాయాలు వేషధారణలు వారు పాటించరు. దీనిని సాంస్కృతిక పరివర్తన అంటారు. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో సాంస్కృతిక పరివర్తనలు అనేకసార్లు జరిగాయి. రోమనుల సంస్కృతిని తర్వాతి కాలంలో క్రైస్తవం నిర్మూలించింది. గ్రీసు దేశంలోని ప్రజలు తమ ప్రాచీన దేవతలైన అపోలో, జియస్‌ హీరా, గోట్‌గాడ్‌ (పవనసుత హనుమాన్‌) ఎధీనా (దుర్గాదేవి)లను మ్యూజియంలలో మాత్రమే చూసుకుంటాము. కారణం ఇప్పుడక్కడ రెండువేల ఏళ్లనాటి గ్గరీకు సంస్కృతి నిర్మూలింపబడింది. ఆర్థడాక్స్‌ క్రైస్తవం గ్రీసును ఆక్రమించింది. ఇలాగే మెక్సికోలో కూడా జరిగింది. అనేక ఆఫ్రికా దేశాల్లో జరిగింది. ఆఫ్రికనుల ప్రాచీన సంస్కృతి దేవీ దేవతలు అక్కడ లేరు. నల్లతోలు గల తెల్లసంస్కృతి మాత్రమే ఆఫ్రికాను పరిపాలిస్తున్నది. ఇండియాలో కూడా ఇదే పరివర్తనజరుగుతున్నది.

సాంస్కృతిక వినిమయం -విచ్ఛేదం జరిగితే నష్టం ఏమిటి? అం దరూ మానవులే కదా? అనే వాదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. సాంస్కృతిక పరిణామం మతం మార్పిడి జరిగిన మరుక్షణమే ఆ ప్రాంతం భారత ప్రధాన భూభాగం నుండి విడివడిపోతున్నది. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ బంగ్లాదేశ్‌ వంటి దేశాలను అందుకు ఉదాహరణలుగా చూపవచ్చు. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో క్రైస్తవం బాగా వ్యాపించింది. వారు తాము భారత దేశంలో అంతర్భాగం అని చెప్పుకోవడానికి ఇష్టపడటంలేదు. ''మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే మేము ఇండియాలో ఎందుకు ఉండాలి?'' అని ఒక విద్యార్థి అన్నట్లు కెసిఆర్‌ ప్రకటించారు. అంటే ఆ విద్యార్థి చైనా భావజాలంతో కూడిన విద్యార్థి సంఘానికి చెందినవాడు అనేది సుస్పష్టం.''

''నూరు పూలు వికసింపనివ్వండి నూరు భావాలు వ్యాపింపనివ్వండి'' ఈ నినాదం ఎంతో బాగుంది -ఇది మావోసేటుంగ్‌ గారిది -ఒక సోషలిస్ట్‌ రాజ్యం మరొక సోషలిస్ట్‌ రాజ్యంపై దండయాత్ర చేయదు ఈ నినాదం కూడా వారిదే మరి చైనా రష్యాపై ఎందుకు దండయాత్ర చేసింది. అమాయకులను లక్షలాది టిబెటన్లను ఎందుకు పొట్టన పెట్టుకున్నది. ఆరు లక్షల బౌద్ధవిహారాలలో ఎం దుకు నేలమట్టం చేసింది. కారణం ఒకటే ఇది సంస్కృతుల మధ్య సంగ్రామం -చైనా సామ్రాజ్యవాదానికి నిలువెత్తు దర్పణం!

ఎవడైనా కాస్త పచ్చగా ఉంటే వాడికి బూర్జువా అనే టాగ్‌ తగిలించి హతం ఖతం అంటూ వచ్చిన సామ్యవాదం ఎలాంటి భయంకర సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసిందో గమనించారా?

టిబెట్టు ఆదర్శ రాజ్యం కాకపోవచ్చు, ఇరాక్‌లో తప్పిదాలు ఉండవచ్చు. వారిని వారే సవరించుకుంటారు. వారి సంస్కృతులను నిర్మూలించవలసిన అవసరం, అధికారం మావోకు -జార్జిబుష్‌కు ఎవరిచ్చారు? లిబియాలో గఢాఫీ నిరంకుశుడు -అతనిని ఆ దేశ ప్రజలు శిక్షించాలి. అంతేకాని ఆ సాకుతో అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు, లిబియా మీద ఎందుకు దాడిచేశాయి? అంటే అక్కడి పెట్రోలు కోసం -ఇక్కడ వ్యాపార సంస్కృతియే విజయం సాధిస్తున్నది. ఇలా ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.

కాబట్టి సారాంశం ఏమంటే సాంస్కృతిక నిర్మూలన ద్వారా ఆ దేశాన్ని పాదాక్రాంతం చేసుకోవచ్చునని లోగడ ఎందరో పాశ్చాత్యులు గ్రహించారు. భారతీయ సంస్కృతీ నిర్మూలనకై అరబ్బు దేశాలు అమెరికా మతాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే చైనావర్గ సంఘర్షణను ఉపయోగించింది. ఈ సంక్లిష్ట పరిస్థితి నుండి భారత జాతి ఎలా బ్రతికి బట్టకడుతుందో మేధావులు చెప్పాలి.

శాంతి సహనం సత్యం అహింస ప్రేమ త్యాగం దయ-ఇవన్నీ వినడానికి ఎంతో అం దంగా ఉంటాయి-కాని దుర్మార్గుడైన శక్తిమంతుని ముందు దలైలామా లాంటి శాంతిదూతలు పరాజితులైనారు. ఈ అంశం, మనకు ఇస్తున్న సందేశం ఏమిటి? ఏసు గ్రీకు హిస్టరీ చదువుతున్నప్పుడు అందులో ఒక వాక్యం నన్ను ఆకర్షించింది‘‘The great Hellernie culture is destroyed by some unknown barbarians’’సోమనాథ దేవాలయం విషయంలో కూడా అలాగే జరిగుండాలి. భారత దేశంలో యుద్ధాలు వచ్చినప్పుడు శత్రువులు ఆవుమీద ఒక బ్రాహ్మణుణ్ణి ఎక్కించి ముందు వరుసలో నిలిపే వారు. గోబ్రాహ్మణ వధ నిషేధం కాబట్టి శత్రువులు అస్త్రసన్యాసం చేసేవారు. ఈ నియమాలు గజనీ మహమ్మదుకు వర్తించవు అని ఈ మూర్ఖులకు తెలియలేదు. ఫలితంగా సోమనాథ దేవాలయం పదిహేడుసార్లు దోపిడీకి గురి అయింది. ఇదంతా ఆర్థిక దృష్టిలోనే జరిగింది అని వామపక్ష మేధావులు వక్రభాష్యం చెప్పారు. అదే నిజమైతే వేల సంఖ్యలో మతం మార్పిడులు ఎందుకు జరిగినట్టు? చైనాలోని ప్రభువు యుద్ధవ్యతిరేకి బౌద్ధధర్మ ప్రేమికుడు. అలాంటి దేశాన్ని టిమోజిన్‌ అనే ఒక ఆటవికుడు కొలది సైన్యంతో నిర్మూలించాడు. చరిత్రలో ఇతనినీ ఛెంగిస్‌ ఖాన్‌ అంటారు. వీటన్నింటి సారాంశం ఒకటే. ప్రశాంత, సంస్కృతులు దుర్జన పదఘట్టనతో మొహంజోదారోలుగా నాగసాకి, హిరోషిమాలుగా మారటం చరిత్ర నేర్పిన (గుణ) పాఠం ఎడమచేతిలో పుష్పాన్ని ధరించి శాంతి ప్రవచనం చేసిన పద్మపాణి బుద్ధుడు కుడిచేతిలో కరవాలం కూడా పట్టుకోవాలి. అదే ''పద్మాపాశాంకుశ ధర'' దుర్గాదేవి ఇచ్చే సందేశం? అరవిందుడు సూచించిన అతి మానస యుగం వచ్చేవరకూ ఈ జాగ్రత్త తప్పనిసరి!

-ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి