18, ఫిబ్రవరి 2012, శనివారం

వంచన దినం! వంచకుల దినం!!

ఈయేడు సెప్టెంబరు 17 నాడు ఏం చేసుకోవాలో తెలీలేదు మన రాజకీయ నాయకులకు.  పదిహేను రోజుల ముందుదాకా ఒక్కోడు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. వీర తెవాదులు విమోచనమన్నారు. అంత వీరులుకానివారు విలీనమన్నారు. సరే.., కొందరు మూర్ఖవాదులు విద్రోహమన్నారు – వీళ్ళని పక్కన పెట్టెయ్యొచ్చు ప్రస్తుతానికి.  వీళ్ళంతా ఇట్టా పోసుకోలు కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ముస్లిములు అడ్డు చెప్పలేదు, వాగనిచ్చారు. తరవాత ఒక ఇఫ్తారు పార్టీ పెట్టారు.  వీళ్ళు తమను ముస్లిములు అని పిలుచుకోరు మూవ్‍మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనో మరోటో పిలుచుకుంటారు తమను.  రాజకీయ నాయకులు  కొందరు రూమీ టోపీలు పెట్టేసుకుని ఇఫ్తారుకెళ్ళారంట. అక్కడ ఆ ముస్లిములు తమ (అభి)మతాన్ని బైటపెట్టారు.  అంథే…! అప్పటి దాకా ఓ.. థెగ మాట్టాడేసిన పోసుకోలు రాయుళ్ళ నోళ్ళకు తాళాలు పడ్డాయి. నోటమాట రాలేదు.  కొందరు ద్రోహులైతే అసలు పదిహేడో తేదీన  బైటికే రాలేదు. 

1948 సెప్టెంబరు 17న  హైదరాబాదు సంస్థానం భారత్ లో విలీనమైపోయింది. నిజాము, రజాకార్ల దుష్కృత్యాల నుంచి ప్రజలు విముక్తులయ్యారు.  ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగానే ఇన్నాళ్ళుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈయేడు మాత్రం మొత్తం అన్ని పార్టీలవాళ్ళూ మాట మార్చేసి విమోచన దినం కాదు, విలీనదినం అని పేరు మార్చారు – భాజపా,  లోక్ సత్తాలు తప్ప. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినాన్ని జరపాలని డిమాండిన తెరాస ఇప్పుడు గప్ చుప్ ఐపోయింది.

ఇక కేసీయారు సంగతి.. ఈయన  నాయకులందరి తల్లోంచి దూరెళ్ళినవాడు.  దంచుటకైనా, ముంచుటకైనా..  సారు  చాలా పెద్దవారు. గతంలో విమోచన దినమంటూ దంచిన కేసీయారు ఈసారి విలీనదినంగా చేసుకోవాలని మాటమార్చాడు. పాపం, మార్చక ఏం చేస్తాడులే – నిజామంటే భయభక్తులు ఉన్న వాడు, నిజాము కీర్తిగానం చేసేవాడూ గదా!  ముస్లిములు ఇచ్చిన షాకుతో  కేసీయారు మాట మార్చడమే కాదు, అసలు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవానికి హాజరే కాలేదు.  వంచన ఎరిగిన తన మనసునకు ముంచుట యన్నది సహజమెగా!

తెరాస వారి తోక ఐన తెలంగాణ రాజకీయ జేయేసీ కూడా మాటమార్చేసి ఇది విమోచన కాదు, విలీనమని ప్రకటించింది. ఎందుకు విలీనమో, విమోచనమెందుక్కాదో వివరించి చెప్పేందుకు పాపం కోదండరామ్ కు తలప్రాణం తోకలోకొచ్చింది.  సారు గూడా ఆ ఇఫ్తారు పార్టీలో ఉన్నాడని భోగట్టా!

నవంబరు 1 నాడు రాష్ట్రావతరణ దినోత్సవం కదా!  ఆరోజున వీళ్ళేం చేస్తారో చూడాలి. రాష్ట్రావతరణకు ఏం పేరు పెట్టడానికైనా వీళ్ళు ఎనకాడరు. ఎంత గొడవ చెయ్యడానికైనా తయారు. ’ఆంద్రోళ్ళ’ మీద విషం గక్కడమే కదా వాళ్ళ లక్ష్యం. కోస్తా సీమల ప్రజలను  తిట్టడమే వాళ్ళ ధ్యేయం.  ఇలాంటి అవకాశాన్ని ఎందుకొదులుకుంటారు? ముస్లిముల మనోభావాలంటే బయ్యంగానీ ఆంద్రోళ్ళ మనోభావాలంటే వాళ్ళకేం పట్టింది?

మరో సారుండారు.. వరవరరావు!  వీరు అసలు మాట మాత్రమైనా విమోచన దినం గురించి చెప్పినట్టు లేదు. ముస్లిములకు వ్యతిరేకమైన విషయంపై మాట్టాడ్డమంటే అది దేశద్రోహమే గదా! అంచేత వారు మాటాడ్రు. కానీ రేపు సెప్టెంబరు 24  న అయోధ్య వివాదంపై కోర్టు తీర్పొచ్చాక మాత్రం బైటికొస్తారు.  అయోధ్యలో  మసీదు కట్టించాల్సిందేనని డిసెంబరు 6 న డిమాండేందుకు మాత్రం  నోళ్ళొస్తాయ్, ఉద్యమాలు చేసేందుకు కాళ్ళొస్తాయ్! ఇస్లామిక్ మార్క్సిజమ్  ప్రత్యేకతే అంత మరి!  ముస్లిము మార్కు మార్క్సిస్టుల వ్యవహారశైలే అంత!

 మొత్తమ్మీద విమోచనం , విలీనం అంటూ మాటలు మార్చి వీళ్ళంతా ఆత్మవంచన చేసుకున్నారు, జనాన్ని వంచించారు.

 http://chaduvari.wordpress.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి