18, ఫిబ్రవరి 2012, శనివారం

మత బీజాలు నాటుతున్న మిషనరీ స్కూళ్ళు


కుహానా లౌకికవాదులకు మరింత మేత దొరికింది మహారాష్ట్రలో. మైనారిటీల మీద ఎక్కడలేని వివక్ష చూపుతున్నారని మరోసారి పత్రికల పతాకశీర్షికలకెక్కి గగ్గోలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, ముంబాయిలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు (దాదాపు నూటయాభై క్రైస్తవ మిషనరీ స్కూళ్ళకు కూడా) శివసేన - భా.జ.పా. ఏలుబడిలో ఉన్న బి.ఎం.సి. (బృహన్ ముంబాయ్ మునిసిపల్ కార్పొరేషన్) ఆయా పాఠశాలలలో భారతీయత ప్రతిబింబించే విధంగా చర్యలు చేపట్టమని చెప్పింది.

ఇది తమ స్కూళ్ళ నిర్వహణలో తల దూర్చడంగాను, మైనారిటీ స్కూళ్ళని వేధించే చర్యలుగాని అభివర్ణిస్తూ క్రైస్తవ మిషనరీలు హడావుడీ చేస్తున్నాయి. మిగతా స్కూళ్ళకు లేని ఇబ్బంది, ఈ మిషనరీ స్కూళ్ళకి ఎందుకనేది మనకు అర్ధం కాదు. బి.ఎం.సి. తీసుకోమని చెప్పిన చర్యలలో, ఆడ పిల్లలు ధరించే బొట్టు, గాజుల మీద ఆయా స్కూళ్ళు విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలనేది ముఖ్యమైనది. అదేవిధంగా, వినాయక చవితి, దీపావళి పండుగలకు సరిపడే విధంగా సెలవలు ఇవ్వాలని, బి.ఎం.సి. తో సాగించే ఉత్తర ప్రత్యుత్తరాలు మరాఠీలో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

నిజమైన లౌకికవాదులకి, పై ఆదేశాలలో ఒక్కటి కూడా తప్పుగా కనిపించకూడదు. మరి ఈ కుహానా లౌకికవాదులకి ఇవన్నీ తప్పుగానే ఎందుకు తోస్తున్నాయో! బురఖాలు ధరించి ముస్లీం యువతులు కళాశాలలకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది కానీ, బొట్టు గాజులు తొడుక్కునే స్వేచ్ఛ హిందు బాలికలకు లేకపోవటం ఏమిటని ఎవరూ ప్రశ్నించరే!

ఒక్క మహారాష్ట్ర అనే కాదు, దాదాపు దేశంలోని ప్రతి క్రైస్తవ మిషనరీ పాఠశాల ఆడపిల్లలు బొట్టు, గాజులు ధరించటాన్ని నిషేధించింది. అది, హిందువుల హక్కులను కాలరాయటం కాదా? దీన్ని ప్రశ్నించినవాళ్ళను మతవాదులుగా మసిపూయటం ఎంత దారుణం!

ఈ వార్త చదవగానే, నా చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. నేను గుంటూరు హిందు హైస్కూల్లో చదువుకునేటప్పుడు ఓసారి గుంటూరులోని స్టాల్స్ గరల్స్ హైస్కూలు నుంచి కొందరు మా స్కూలుకు వచ్చి, బైబిల్ పుస్తకాలు పంచుకోటానికి మా హెడ్ మాస్టర్ అనుమతి కోరారు. ఆయన దానికి ఒప్పుకొని, ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే, వాళ్ళ స్కూల్లో భగవద్గీత పంచుకునేందుకు అనుమతి ఇస్తే, ఇక్కడ బైబిల్ పంచుకునేందుకు తనకేమీ అభ్యంతరంలేదని. పల్లెత్తు మాట మాట్లాడకుండా వచ్చినదోవనే వెళ్ళిపోయారు.

పసి మనసుల్లో ఇలా మత బీజాలను నాటాలని ప్రయత్నించే క్రైస్తవ మిషనరీ పాఠశాలలను, మదర్సాలను ప్రభుత్వం వెంటనే జప్తు చేయాలి. 
 http://amtaryaanam-1968.blogspot.in/2010/05/blog-post_21.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి