21, ఫిబ్రవరి 2012, మంగళవారం

హిందువులు తీవ్రవాదులైతే హిందుస్తాన్ తీవ్రవాది కాదా? - ముజప్ఫర్ హుస్సేన్

భారతదేశంలో గత కొద్దికాలంగా అధికారపక్షానికి చెందిన కొందరు ప్రముఖ నేతల నుండి ఒక స్వరం వినబడుతున్నది.  'దేశమంతటా కాషాయ తీవ్రవాదం వేగంగా పెరుగుతున్నది. '  అనేదే ఆ స్వరంయొక్క సారాంశం. తీవ్రవాదానికి కూడా ఒక రంగు ఉంటుందనేది మొదటిసారిగా ఈ స్వరం ద్వారా ప్రపంచానికి తెలిసింది. కాషాయరంగు ధ్వజాలు మఠమందిరాలపై ఎగురుతుంటాయి. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసుల వస్త్రాలు తప్పనిసరిగా కాషాయ వర్ణాంకితమై ఉంటాయి. కమ్యూనిష్టు విప్లవాలు జరిగినచోట లక్షలాదిమంది హతులైనారు. దీన్ని ఎవ్వరూ ఎరుపు తీవ్రవాదం అని అనలేదు. భారతదేశంలోని  ఉర్దూమీడియా తాలిబాన్ తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించింది. దానికి ఎవరూ హరిత (ఆకుపచ్చ) తీవ్రవాదమని పేరిడలేదు. తలపై తెల్లవస్త్రాలు కప్పుకొని కొందరు ఎన్నో ఉద్యమాలు చేస్తుంటారు. అప్పుడెవ్వరూ తెలుపు తీవ్రవాదమని పేర్కొనరు.

ఇక్కడ హిందువులు ఏదేని ఉద్యమాలను నడిపిస్తే దానికి కొందరు కాషాయ తీవ్రవాదమనే పేరు పెట్టుచున్నారు. దీన్ని మొదటగా దిగ్విజయ్ సింగ్ - పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు దాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. ఆ వెనువెంటనే కాంగ్రెసుదళాలు- దళాధిపతులు అవే చిలుకపలుకుల్ని మరలమరల గట్టిగా బట్టిపట్టి పలక నారంభించారు. ఇదే కాంగ్రెసువారికి ఒక విషయం గుర్తుండాలి.  స్వతంత్ర పోరాట సమయంలో స్వతంత్ర భారతదేశం యొక్క జెండా ఎలా ఉండాలి? దాని రంగు ఏమిటి అనే చర్చ జరిగింది. ఈ కమిటీ సభ్యులలో మౌలానా ఆజాద్ కూడా ఉన్నారు. చర్చలో పాల్గొన్నవారంతా ముక్తకంఠంతో ఒకే మాట చెప్పారు. భారతీయ ప్రాచీన సంస్కృతిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా స్వతంత్ర భారత జాతీయ పతాకం ఉండాలన్నారు. కాషాయరంగు ధ్వజమే ఈ దేశప్రతీక అవుతుందని చెప్పారు. 1929 నుండి 1932 వరకు ఈ విషయంగా తీవ్ర చర్చలు జరిగినవి. భారతదేశాన్ని ప్రపంచంతో కలుపడానికి గాంధీగారి ఆలోచనల మేరకు ఇతర రంగుల్ని కూడా తీసికోవాలనే నిర్ణయం జరిగి ఇప్పుడున్నత్రివర్ణ పతాకం నిర్మాణమయింది. భారతదేశంలోని కోటానుకోట్ల మందిరాలు, మఠాలు, ధార్మిక స్థలాలన్నిచోట్ల కాషాయపతాకం రెపరెపలాడుతున్నది. మనవాళ్ళు ధరించే సిందూరం, తిలకంరంగు కాషాయమే - మన దేవీదేవతామూర్తులనలంకరించే రంగు కాషాయమే - 'భగవా' (కాషాయ)వర్ణం భగవంతునితో, భగవతి మాతతో జోడించేది. దీనికి రాజకీయరంగు పులిమే ప్రయత్నమిపుడు జరుగుతున్నది.
 

ఒకవేళ కాషాయ వర్ణమే తీవ్రవవాది అయితే సమస్త భారతదేశమూ తీవ్రవాదియే అవుతుంది.  'సత్యమేవ జయతే' మరియు జాతీయ చిహ్నం - మూడు సింహాలు (నాల్గు సింహాలు) ఉన్న చిత్రంతో సహా మన పార్లమెంటులోని మన జాతీయ అస్తిత్వానికి మన పార్లమెంటులోని మన జాతీయ అస్తిత్వానికి చిహ్నాలయిన ప్రతి వస్తువునూ తొలగించాల్సి వస్తుంది. కాషాయ తీవ్రవాదాన్నిప్రవచిస్తున్నవాళ్ళు మొదట ఈ పని తప్పక చేయాల్సి వుంది. మన జాతీయ పతాకంలోని  కాషాయవర్ణం కూడా తీవ్రవాదానికి చెందినదే అవుతుంది. నాల్గు పెద్ద కుంభమేళాలు (ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసికాత్ర్యంబకేశ్వరం) కూడా తీ- 9.1.2011 పాంచజన్య నుండివ్రవాద కాషాయ మేళాలే అవుతాయి.  భారతదేశంలో  లక్షలాది తీర్థస్థలాలున్నవి.   వాటి సందర్శనకు ప్రజలు తపిస్తారు, తరలివస్తారు. మన తీర్థయాత్రలు ఉత్తరాన అమరనాథ్ నుండి  దక్షిణాన అయ్యప్ప (శబరిమల), పశ్చిమాన సోమనాథ్ నుండి  తూర్పున కామాఖ్య (అస్సాం) వరకు సాగుతుంటాయి.  యాత్రల మార్గమధ్యాలలో షిరిడీ- పండరీపురం (అళంది)కి వెళ్ళే కాషాయ సాధువులు కనిపిస్తారు.
 

భారతదేశమంటేనే కాషాయధారులైన సాధుసంతుల దేశం;  కాషాయ ధ్వజాలెగిరే మఠ- మందిరాల దేశం. దేశంలోని 80 శాతం ప్రజలు ఏదో  ఒక కాషాయచిహ్నాన్ని ధరించే వుంటారు.  కాబట్టి భారతదేశంలో 80 శాతం ప్రజలు తీవ్రవాదులేనా?  ఎన్నికలలో ఓట్లువేయడానికి క్యూలు కట్టే ప్రజానీకం కూడా వీళ్ళేనని మరిచిపోవద్దు. ఈ కాషాయధారులైన ప్రజల ఓట్ల కృపాకటాక్షాలతోనే ఇప్పుడు పాలకులైన వారంతా అధికారానికొచ్చారని మరవొద్దు. కాంగ్రెసుపార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కాషాయ తీవ్రవాదులైన ప్రజల ఓట్లతోనే వారికి అధికారం లభించింది. తమకు ఓట్లువేసిన ప్రజల్నే పాలకులు కాషాయ తీవ్రవాదులంటున్నారు. వారు ఏ మట్టిలో నుండి పుట్టారో మరిచిపోతున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.   ఏమని?  "మేం ఓట్లయితే వేశాం. మా శ్రద్ధా భక్తి విశ్వాసాలపైననే మీరు (పాలకులు)తీవ్రవాదమని దాడిచేయడమా? మీరు (పాలకులు) దీన్ని బాగా ఆలోచించాలనుకుంటున్నాం! "- అని.
 

కాంగ్రెసు ప్రభుత్వాధినేతలు కాషాయ తీవ్రవాదమంటూ మన దేశాన్ని అవమానపరుస్తున్నారు.  వారొక్కసారి విదేశాలవైపు పరిశీలనగా చూడాలి. హిందువులను గురించి, హిందుత్వాన్ని గురించి విదేశాల్లో అనంతమైన, అగాధమైన శ్రద్ధాభక్తులున్నాయి. విదేశాల్లో భారతదేశం పట్ల ఏ విషయంగా  గౌరవముంది? ప్రాచీన హిందూ సంస్కృతి- సభ్యతలనే  ప్రపంచం తలకెత్తుకుంటున్నది. కాషాయ తీవ్రవాదమంటూ గోలచేసే భారతనేతలు విదేశాల్లోని ఈ దృశ్యాన్ని చూస్తే తప్పక పశ్చాత్తాపపడతారు!
 

మన నేతలు దీనికోసం ప్రపంచమంతా తిరుగాల్సిన పనిలేదు. కేవలం ఒక్క కెనాడాను చూస్తే చాలు. కెనడాలోని వేంకూవర్ దీవిలోకి వెళ్ళిచూస్తే అక్కడి వారికళ్ళలో కనిపించే 'హిందువులమైనందుకు గర్విస్తున్నాం' - అనే మెరుపులు మన కళ్ళకు  మిరుమిట్లు గొల్పుతాయి. హిందుత్వం పట్ల వారికున్న శ్రద్ధ - ఆకర్షణ వెలుగులీనుతూ కన్పిస్తుంది.  డగ్లస్ టాడ్ అనే సుప్రసిద్ధ రచయిత వ్యాసాన్ని వీరు చదివితే సరిపోతుంది.  ఈ వ్యాస శీర్షిక, "వెలుగులీనుతున్న 'వేంకూవర్'. "  అదే సమయంలో సుప్రసిద్ధ అమెరికను ప్రతిక టైమ్స్ 'మనమంతా హిందువులమై పోయామా?' అనే శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది. కెనడా, అమెరికా పత్రికలు ఇలా ఎందుకు వ్రాస్తున్నాయి? అక్కడివారు అక్కడి హిందువుల తీవ్రవాదంలో కొట్టుకొని మునిగిపోయారా?  హిందుత్వభూతం వారి తలకెక్కి ఇలా పలికిస్తున్నదా?
 

దీనికంతకు మొదటి కారణం ఈ దేశాలలో భారతీయ మూల నివాసులు పెద్దసంఖ్యలో అక్కడ నివసించడమే. రెండవ కారణం అక్కడ హిందువుల పూజాదికాలు - మత విశ్వాసాలు -  జీవన వ్యవహారం - ఆధ్యాత్మిక చర్చలు - ఇవన్నీ అక్కడి వారిని బాగా ప్రభావితులుగావించినవి. 2001 నాటి జనాభా లెక్కలననుసరించి హిందువులు కెనడాలో 4.75 లక్షలు అమెరికాలో 11.50 లక్షలుగా ఉన్నారు. ఆయా దేశాలకెళ్ళిన హిందువులు తమవెంట హిందూ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, పండగలను కూడా తీసికెళ్ళారు. ఈ దేశాలలో ధార్మికంగా చూసినపుడు హిందువులుగా అక్కడివారు మనకు కనిపించరు.  కాని వారే పోటీపడి దీపావళి, హోళీ సంబరాలను నిర్వహిస్తారు. ఆనందాన్ని అనుభవిస్తారు. అమెరికాలోని వైట్ హౌస్ దీపావళికి విద్యుద్దీపాల అలంకరణలతో జగజ్జేగీయమానంగా వెలుగులీనుతుంది.  ఈ పండగలలో అక్కడివారికి మతతత్వం ఎంత మాత్రం గోచరించదు. వారు ఈ పండగలతో ఆనంద పులకాంకితులైపోతున్నారు. ఆనందంకోసం అక్కడివారు ఇస్కాన్ వారి  రాధాకృష్ణ మందిరాలకెళ్తున్నారు.  గణేశ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.  మందిర నిర్మాణాల్లో ముందుకొస్తున్నారు. హిందుత్వంలోని పైకి కనబడని 'అంతర్యామి  ఆధ్యాత్మికధార' వారిని బాగా ప్రభావితులను గావిస్తున్నది.
 

పాశ్చాత్యదేశాలలోని అనేక సర్వేక్షణలలో  ఒక అంశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.  పాశ్చాత్యులు మతము- సంస్కృతి - ధర్మం మున్నగు విషయాలలో హిందుత్వానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. హిందూ సంస్కృతి సర్వశ్రేష్ఠమైనదిగా గుర్తిస్తున్నారు. కెనడా పశ్చిమ తీరంలో అనేక యోగకేంద్రాలు, ఆయుర్వేదిక చికిత్సాకేంద్రాలు, శాకాహార హోటళ్ళు, ధ్యానకేంద్రాలు ప్రారంభమయినవి. వీటి నిర్వాహకులు అత్యధికులు హిందువులే - కెనడా ప్రజలు ౩౦ శాతం పురుషులు, 37 శాతం స్ర్తీలు పునర్జన్మను నమ్ముచున్నారు -  ఇది బైబిల్, ఖురాన్  విశ్వాసానికి విరుద్ధమైనప్పటికీ!
 

భారతీయ యోగశాస్ర్తం సమస్త ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం గావిస్తున్నది. ఈ ప్రభావం అరబ్బు దేశాలకు కూడా విస్తరించటం ఆశ్చర్యకరమే. అక్కడి సాధారణ ప్రజలే కాదు,  ధనవంతులైన అరబ్బుషేక్ లు - రాజవంశాలవారు ఉదయం యోగాభ్యాసం చేస్తూ కనిపిస్తారు. ఇందులో ఆశ్చర్యమేమున్నది అంటారక్కడివారు. ఆరోగ్యం కోసం యోగ-ధ్యానం మంచి ఔషధమంటారు. భారతదేశంలోనే కొందరు మన యోగాచార్యుల్ని విమర్శిస్తూ వుంటారు. యోగాభ్యాసం అశాస్ర్తీయమనేవారు ఉన్నారు. బూటకపు యోగాచార్యులంటూ కథనాలు ప్రచారం చేస్తుంటారు.  అయితే మహేశ్ యోగి,  ఆచార్య రజనీశ్, బాబారాందేవం వంటివారు ఈ రంగములో ప్రపంచానికెంతో యోగదానమందించారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతిని ప్రచారంగావిస్తున్న వివిధ మత సంప్రదాయాల పాత్ర కూడా ప్రశంసనీయమైనదే - సాయిభక్తులు, ఇస్కాన్ (హరేకృష్ణ) భక్తులు -  ఇంకా అనేక ధార్మిక సంస్థలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి వారిద్వారా లక్షలాది పాశ్చాత్యులు ప్రభావితులై హిందూధర్మాన్ని స్వీకరిస్తున్నారు.  ప్రొద్దున్నే నగరాలలో మీరా భజనలు వినబడితే, తులసీదాసు, సూరదాసు, రసఖాన్, త్యాగరాజు, మొదలగువారి కీర్తనలు ఆలాపిస్తూ కనబడితే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. అందుకే  ప్రధానిగా అటల్ బిహారీ వాజపాయ్ అమెరికాకు వెళ్ళినపుడు అక్కడి పత్రికలు పతాకశీర్షికలలో వారి పర్యటన కార్యక్రమాలను, హిందుత్వాన్ని గూర్చి వ్రాసిన వ్యాసాలను ప్రచురించాయి.  ఇలా వ్రాయబడటం నెహ్రూ నుండి నేటివరకు ఎప్పుడూ జరగలేదన్నారు పరిశీలకులు - ఆ సందర్భంగా కాషాయీకరణం భారతదేశంలో మాత్రమే కాదు అమెరికాలో కూడా జరిగిపోతున్నదని వ్యాఖ్యానించాయి.
 

ప్రతిముగ్గురు అమెరికనులలో ఇద్దరు యోగాభ్యాసం చేస్తున్నారు.  ధ్యాన- ధారణ- సమాధి ప్రక్రియల ద్వారా ఆత్మ- శరీరాలను వేరుగా చేయొచ్చని విశ్వసిస్తున్నారు. అమెరికాలో  ఋగ్వేదం పెద్దసంఖ్యలో పఠింపబడుచున్నది. ఈ విషయాలన్నిటిని గమనిస్తే 'హిందుత్వ తీవ్రవాదం' ఎంత హాస్యాస్పదమో అర్థమవుతున్నది. హిందుత్వం ఎన్నడూ తీవ్రవాదాన్ని విశ్వసించదని తెలియడం లేదా? అలాంటప్పుడు భారతదేశంలో 'హిందూ తీవ్రవాదం'-  పేర జరుగుచున్నదనే దుష్ర్పచారానికి అంతం పలకాల్సిన అవసరమెంతైనా ఉంది!
 

కాంగ్రెసు అధ్యక్షురాలు కాషాయ సంస్కృతికి చెందిన వ్యక్తినెందుకు వివాహమాడిందో? రాహుల్ గాంధీకి చరిత్ర తెలియాల్సి ఉంది. ఆయన తాత ఫిరోజ్ గాంధి పూర్వీకులు ఈరాన్ నుండి భారత్ లో శరణుపొందారు. పార్శీలు కాషాయ తీవ్రవాదుల దేశంలోకి (భారత్) కు ఎందుకు రావల్సి వచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలి! ఫిరోజ్ గాంధీ బ్రతికి ఉంటే తన కోడలు, మనవడి అజ్ఞానానికి తలబాదుకునేవాడు. తీవ్రవాదులైన హిందువుల దేశాన్ని ఎలా పాలించాలనుకుంటున్నారో సోనియా - రాహుల్ చెప్పాలి! ఈ విశాల దేశాన్ని తీవ్రవాదుల దేశమంటున్న ఈ కొద్దిమంది దుష్ర్పచారాన్ని సహించాల్సిందేనా? దీన్ని మించిన అవమానం మరే ముంటుంది? అందరూ ఆలోచించాలి.

అనువాదం : బెల్లంకొండ మల్లారెడ్డి

- 9.1.2011 పాంచజన్య నుండి


 http://www.jagritiweekly.in/index.php?user/showArticle/2/9

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి