- సెక్యులర్ ముసుగు తొలగుతోంది హిందూ మనోభావాలను దెబ్బతీసింది ముస్లిం తీవ్రవాదాన్ని తక్కువచేసి చూపే యత్నంగా రాహుల్‌పై విమర్శలు మైనారిటీ ఓటు బ్యాంకు కోసమే ఈ వ్యాఖ్యలని మండిపడుతున్న హిందూ వాదులు విమర్శలకు సరైన జవాబు ఇవ్వకుంటే రాహుల్‌తోపాటు కాంగ్రెస్‌కు గడ్డు స్థితే
(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)
న్యూఢిల్లీ: సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ వేసుకున్న ముసుగు నెమ్మదిగా తొలగుతోంది. అధికారం కోసం మతాల మధ్య చిచ్చుకు కూడా వెనుకాడని కాంగ్రెస్ నైజం బట్టబయలైంది. లౌకికతత్వం పేరిట మైనారిటీలను బుజ్జగించి ఓటుబ్యాంకులుగా కొనసాగించాలన్న ఆ పార్టీ ఆకాంక్ష రాహుల్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలతో మరోసారి జాతి దృష్టికొచ్చింది. భారత భావి ప్రధాని, యువతరం ప్రతినిధిగా గుర్తింపుపొందిన రాహుల్ అమెరికా రాయబారి తిమోతి జె రోమార్‌తో చేసినట్లుగా వికిలీక్స్ వెల్లడించిన టేపులపై ప్రపంచవ్యాప్తంగా పలు కోణాల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యాఖ్యలు దేశంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసాయి. ముస్లిం ఉగ్రవాదం కంటే హిందూ తీవ్రవాదమే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమంటూ రాహుల్ చెప్పడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రజాస్వామ్యవాదులెవరూ ఇలాంటి సంఘటనల్ని ప్రోత్సహించరు. ఈ సంస్థల చర్యల్ని ఆమోదించరు. వారంతా వీటిని ముక్తకంఠంతో ఖండిస్తూనే ఉన్నారు. ఈ సంస్థల కంటే ముస్లిం ఉగ్రవాదులే నయమన్న రీతిలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. అదికూడా ప్రపంచంలోనే అత్యంత కిరాతక ఉగ్రవాద ముఠాల్లో ఒకటిగా గుర్తింపుపొందిన లష్కర్ ఎ తోయిబా గురించి చర్చ జరుగుతున్న సమయంలో అంతకంటే హిందూ తీవ్రవాద సంస్థల నుంచి భవిష్యత్‌లో ముప్పు ఎక్కువగా ఉందంటూ రాహుల్ పేర్కొనడంతో పరోక్షంగా ముస్లిం ఉగ్రవాదాన్ని తక్కువచేసి చూపేందుకు రాహుల్ ప్రయత్నించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్‌ఖైదా, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థలతో లష్కర్ ఎ తోయిబాకు సంబంధాలున్నాయి. స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వమే లష్కర్ ఎ తోయిబాపై 2002లో నిషేధం విధించింది. భారత్‌లో కూడా దీన్ని అనుమతించకూడని టెర్రరిస్ట్ గ్రూప్‌గా పరిగణిస్తున్నారు.
2001 డిసెంబర్ 26న ప్రపంచ ఉగ్రవాదసంస్థగా దీన్ని అమెరికా ప్రకటించింది. బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 28న కిరాతక ఉగ్రవాద సంస్థగా ఎల్‌ఇటిని పేర్కొంది. భారత్‌లో జరిగిన అనేక విద్రోహ చర్యల్లో లష్కర్ హస్తముంది. 1998 జనవరి25న 63మంది కాశ్మీరీ పండిట్స్‌ను లష్కర్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. 2000 మార్చిలో కాశ్మీర్‌లో 35మంది సిక్కుల్ని కిరాతకంగా చంపేశారు. 2000 డిసెంబర్ 23న ఎర్రకోటపై జరిగిన దాడిలో ఎల్‌ఎటిదే కీలకపాత్ర. ఇదేసంస్థ శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై దాడిచేసి ఐదుగురిని బలిగొంది. బోర్డర్‌లో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్‌పై దాడి చేసింది. 2003 మార్చి 23 అర్ధరాత్రి 24 మంది కాశ్మీరీ పండిట్లను కాల్చిచంపింది. 2005 దీపావళి రోజున ఢిల్లీ మార్కెట్‌లో బాంబుదాడి చేసి 60 మందిని బలిగొంది. 2006లో వారణాసిలో బాంబుదాడి చేసి 37మందిచావుకు కారణమైంది. 2006 ఏప్రిల్ 30న మరో 34 మంది కాశ్మీరీపండిట్లను కాల్చేసింది. 2006 జూలై 11న ముంబై లోకల్‌ట్రైన్స్‌లో బాంబులుపేల్చి 211మందిని బలిగొంది. మరో 1175 మంది తీవ్రగాయాలయ్యేందుకు కారణమైంది.
2006 సెప్టెంబర్ 12న ఏకంగా పోప్ బెనడిక్ట్ -ృుఒకు ఫత్వా జారీచేసింది. 2008 నవంబర్ 26న ముంబైదాడుల వెనుక ప్రధాన సూత్రధారి లష్కర్ ఎ తోయిబాఅని గుర్తించారు. ఇంత ఉగ్రవాద చరిత్రున్న ఎల్‌ఇటి కంటే హిందూ తీవ్రవాద సంస్థలే ఎక్కువ హాని కలిగిస్తున్నాయంటూ రాహుల్ పేర్కొనడం ఆయన అవగాహనా రాహిత్యానికి, మానసిక అపరిపక్వతకు అద్దం పడుతోంది. అలాగే దేశం విపత్తుల్ని ఎదుర్కొన్న సమయంలో ఈ సంస్థల సేవలు ప్రశంసలు పొందాయి. ఇండోచైనా యుద్ధంలో హిందూ మతసంస్థల సభ్యులే ప్రధాన వాలంటీర్లుగా పనిచేశారు.
1963 రిపబ్లిక్ దినోత్సవంలో పాల్గొనేందుకు వారిని స్వయంగా నెహ్రూ ఆహ్వానించారు. 1971 ఒరిస్సా తుపాన్, 1977ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఇతోధిక సేవల్ని అందజేశారు. ఎమర్జన్సీని ధైర్యంగా ఎదుర్కొన్నారు. వినోబాభావేతోకలసి భూదాన యజ్ఞాన్ని రూపొందించారు. జమ్మూకాశ్మీర్‌లో హత్యలకు గురైన పండిట్ల పిల్లలు 57మందిని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధిత సేవాభారతి దత్తత తీసుకుంది. కార్గిల్ యుద్దబాధిత పిల్లల్ని కూడా దరిచేర్చుకుంది.
ఆరుశతాబ్దాల నుంచి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకున్న మహ్మదీయులు ఇస్లాం వ్యాప్తికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాతవచ్చిన బ్రిటీషీయులు క్రైస్తవాన్ని చొప్పించేందుకు చేపట్టిన యత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వలేదు. అప్పటికీ ఇప్పటికీ హిందువుల్లో మత విశ్వాసాలేమాత్రం సడల్లేదు. వారిప్పటికీ వాటినంటిపెట్టుకునే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు హిందువుల్ని తీవ్రవాదులుగా, హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై దాడి మాలెగావ్ పేలుళ్ళలో నిందితులైన హిందూ ఉగ్రవాద సంస్థల పనై ఉంటుందంటూ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం పుట్టించాయి. 26/11 పాక్ ముష్కరుల దాడి దుష్ఫలితాల్ని తగ్గించి చూపేందుకే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణలు మిన్నంటడంతో ఆయన వాటికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా బయటపడ్డ రాహుల్ వ్యాఖ్యలు ఈ దేశంలోని కాంగ్రెస్ నేతలు తమ ఓటు బ్యాంక్ పరిరక్షణ కోసం పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా మాట్లాడేందుకు కూడా వెనుకాడటంలేదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్లీనరీ ద్వారా రాహుల్ ఈ విమర్శలకు బదులివ్వాల్సిన ఆవశ్యకత వుంది. తన వ్యాఖ్యల పట్ల భారతజాతిలో వెల్లువెత్తుతున్న ప్రకంపనలకు తగిన వివరణనివ్వకపోతే ఆ ఫలితం రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అనుభవించక తప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి