18, ఫిబ్రవరి 2012, శనివారం

నేను హిందువుని కానీ పిరికివాడిని

నేను హిందువుని. అలా చెప్పుకోడానికే సిగ్గు పడుతూ ఉంటాను, ఎందుకంటే ఈ మధ్య మతమంటే బూతు మాట ఐపోయింది.  
నేను హిందువుని. పరమ దైవ భక్తుడిని. కానీ పిరికి వాడిని. దేవుడిని గాడంగా నమ్ముతాను. నేనుండే ప్రదేశం లో , రాష్టం లో వీలయితే దేశంలో నా దేవుడిని కొలుచు కోడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళ్తాను.ప్రతీ పండగకి గుడికి వెళ్తాను. ఉగాది నించి సంక్రాంతి దాకా ఏది వదిలిపెట్టను. రోజూ పూజ చేస్తాను. గుళ్ళకి విరాళాలు ఇస్తాను. భక్తి కార్యక్రమాలని శ్రద్ధగా వీలైనన్ని చూస్తాను. నాకు బోలెడు భక్తీ. నా దేవుడంటే యనలేని విశ్వాసం. కానీ ఎవడన్నా నా నమ్మకం మీద దెబ్బకొడుతూ పిచ్చి రాతలు రాస్తే మాత్రం చేతికానివడిలా నోరుమూసుకుని కూర్చుంటాను. నా మతం పరమ పవిత్రంగా చూసుకునే గ్రంథాన్ని అవహేళన చేస్తే నేను మౌన ప్రేక్షకుడిలా ఉండిపోతా. నా సిగ్గుమాలిన తనాన్ని రచయిత భావ స్వేచ్చ అని సరిపెట్టుకుంటాను. సాహిత్య అకాడెమి అవార్డులిచ్చి సత్కరించుకుంటాను. సన్మాన సభలు చేసి ఆకాశానికి ఎత్తేస్తాను.


నేను రోజూ పూజించే దేవతలను నగ్నంగా, అసభ్యకరంగా చిత్రాలు గీస్తే, సెక్యూలరిజం ముసుగు లో నా చేతకాని తనాన్ని దాచుకుంటాను. ఇంకా ఇలాటివి బోలెడు గియ్యాలని ప్రోత్సహిస్తాను. వీలయితే భారత రత్న ఇచ్చి సత్కరించుకుంటా. గుండెలు రగిలిపోయినా ఎవరినీ ప్రతిఘటించను. నా దేవుడిని ఎవడన్నా తూలనాడినా నేను ఎదిరించను. నా రాముడిని ఏ కాలేజీ లో చదివాడని హేళన చేస్తే నేను మౌనంగా బాధ పడ్డానే కానీ ఎవరినన్నా ఎదిరించానా. ఎందుకు? అలా చేస్తే నన్ను మతోన్మాది అంటారని భయం. ఎందుకంటే నా మతం వరకు (కేవలం నా మతం వరకే వర్తిస్తుంది) మతాన్ని కాపాడుకోవడం కేవలం కాపాడుకోవడమే మిగతా వారికి .. కాదు కాదు నా మతం వారికే మతోన్మాదం లాగ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మేధావులు వేల సంవత్సరాల నా మత చరిత్ర అంతా అవపోసన పట్టారు మరి. పుక్కిలించేసారు. వేదాలను ఆమూలాగ్రం చదివి జాతికి ఉపయోగపడే బోలెడు సంపదను చేకూర్చిన మేధావులు, పరమాచార్యులు పామరులని తేల్చేసారు. నా మత గ్రంథాలు పుక్కిట పురాణాలని సెలవిచ్చ్చారు. అయినా నేను ఏం మాట్లాడగలిగాను.
మీడియా లో నా మతాన్ని వెక్కిరిస్తూ, అవహేళన చేస్తూ రాతలు రాసినా, మాట్లాడినా నేను పట్టించుకోను .. కాదు పట్టించుకోనట్టు నటిస్తాను. నోటికొచ్చినట్టు నా మతం గురించి మాట్లాడితే కళ్ళప్పగించి చదువుతాను, గుడ్లప్పగించి చూస్తాను. కానీ నోరువిప్పి మాట్లాడను. అన్యాయమని చెప్పను. రోడ్డు మీద ...ఉహు.. కనీసం నా ఇంటి ముందు కూడా నా నిరసన వ్యక్తం చెయ్యను.
అంతర్జాలం లో నేను నమ్మిన దేవుళ్ళను, పురాణాలను హేళన చేస్తుంటే గుండె చివుక్కుమన్నా, కట్టెలు తెంచుకునే కోపం వచ్చినా, భరించలేని బాధ కలిగినా నేను బయట పడను. స్త్రీ వాదం, సామ్య వాదం, హేతు వాదం పేరుతో నా నోరేక్కడ నోక్కేస్తారో, నన్ను తిరోగమన వాది, ఛాందసవాది అని ఎక్కడ ముద్ర వేస్తారో అని. పురాణాల్లో ఏదో ఒక చిన్న వాక్యం తీసుకుని, వక్రీకరించి నా మత గ్రంథాల నెక్కడ తూలనాడుతారో అని నేను మాట్లాడను. ఆ సందర్భానికి,యుగకాల మాన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అర్థం చేసుకోవాలి, పోనీ అది ఇబ్బందికరమైతే కనీసం ఈ మేధావులు దానిలో ఉన్న మంచిని తీసుకోవచ్చు కదా అని నా మనసు గగ్గోలు పెడుతుంది. అయినా నేను దాన్ని గొంతు నోక్కేస్తాను. ఎందుకంటే నేను దేవుడున్నాడు, ఇవి పుక్కిట పురాణాలు కాదు అని ఆధారాలు చూపలేక కాదు. శ్రీ కృష్ణుడు ఉన్నాడని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా నిర్దారించారు. అంత మాత్రాన నేను వీరితో వాదించ గలిగానా. అయినా అది అనుభావించాలి నమ్మించ లేము.నమ్మించడం నా పనీ కాదు ఉద్దేశ్యం కాదు. నేను నా మతాన్ని కూడా ఎవడి మీదకీ రుద్దట్లేదు. కానీ నా మతాన్ని కించపరిచే అధికారం, నా sensitivities ని దెబ్బతీసే అధికారం వీరికి ఎవరిచ్చారు. ఈ స్వేచ్చ వీరికి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించాలని ఉంటుంది. కానీ నాది ఒంటరి గొంతు అయిపోతుందేమో అని భయం.అందుకే మౌనంగా బాధ పడతాను.

కనీసం నా అభ్యంతరం తెలియచేద్దమన్నా భయమే. ఏకాకి నైపోతానేమో అని. అందుకే నిశ్శబ్దంగా బాధ పడతా. ఎవరన్నా ఒక్కడయినా గొంతెత్తి దీన్ని ఖండిస్తాడేమో అని వేచి చూస్తా. రోజూ అలాటి వాడు ఒక్కడైనా ఉంటాడేమో అని వెతుకుతూ ఉంటా . అలాటి వాడు కనపడగానే సంబర పడతా కానీ అది కూడా మౌనంగానే, పబ్లిక్ గా సంతోషం వ్యక్తం చేస్తే so called intellectual society నన్ను ఎక్కడ వెలి వేస్తుందో, నా మీద ఏం ముద్ర వేస్తుందో అని భయం .
కొన్ని దేశాల లో ఐతే వాళ్ల మత విశ్వాసాలని , నమ్మకాలని దాడి చేస్తే ఖండిస్తారు, శిక్షిస్తారు కొందరైతే ఉరి తీస్తారు అని విన్నాను, చదివాను. ఎందుకంటే వారి మతం కాపాడుకోవడం వాళ్ళకి గౌరవం గా భావిస్తారు. మతం మీద దాడి తమ మీద దాడి గా భావిస్తారు. కానీ నా మతం అభిమతం వేరు. ఎవరన్నా దాడి చేస్తే వారిని మేధావులుగా గుర్తిస్తారు ఆకాశానికి ఎత్తేస్తారు, అవార్డులు ఇస్తారు. ఏమన్నా అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటారు. నాకు పెద్దగా లోక జ్ఞానం లేదు కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే ఇంకోడి మతం మీద నోటి కొచ్చినది రాయడమా,చేతికోచ్చినది గీయడమా అని ప్రశించాలని ఉంటుంది. కానీ భయం.. కాదు అసమర్థత.


తన వ్యాసం లో ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు (ఎమ్. ఎఫ్ హుస్సేన్ గారి బొమ్మలు నుద్దేశించి) మా దేవుళ్ళ చిత్రాలు ఇలా వేయడం సబబా? కొన్ని కోట్లమంది sensitivities ని దెబ్బకొట్టిన మీకు ముఖం చెల్లడంలేదంటే తప్పా? మా లక్ష్మీ దేవి, సరస్వతి మీ అమ్మపాటి మర్యాదకి నోచుకోలేదా?’అని ఆ సాయిబుగారి ఒక్క వెంట్రుకయినా పీకరేం?....................... ఏం దరిద్రం పట్టింది మన స్వాభిమానానికి? Intellectual hypocrisy is taken for granted as permissiveness to bigotry- in this country. నేను తెలుగు దేశంలో లేనందుకు ఇన్నాళ్ళూ ఆనందించాను. ఇప్పుడిప్పుడు ఇంకా భారత దేశంలో ఉండక తప్పనందుకు విచారిస్తున్నాను." అని వాపోయారు.
నా దేశంలో అన్ని మతాలూ సమానమే. కానీ నాది తప్ప మిగతావి కొంచం ఎక్కువ సమానం. అది అన్యాయం అనిపించినా సరే. నా దేవుళ్ళని, దేవతలని అవమానించి అయినా సరే , నా మతాన్ని పణంగా పెట్టయినా సరే కళాకారుల భావ స్వేచ్చ, సో కాల్డ్ మేధావుల వాక్స్వాతంత్ర్యాన్ని మాత్రం కాపాడాలి. ఇది అన్యాయం అని ప్రతిఘటించే శక్తి ఎప్పుడో కోల్పోయా, నా స్వాభిమానాన్ని ఎప్పుడో తాకట్టు పెట్టేసా, ఇప్పుడు కేవలం మౌనంగా బాధ పడడమే. అది కూడా తగ్గిపోతోంది. మెల్లాగా వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నాను. కొన్నాళ్ళయితే నా మతం కూడా మర్చిపోతానేమో.ఒక్కోసారి అదే మంచిదేమో అనిపిస్తుంది . అప్పుడు ఏ గొడవా ఉండదు. ఈ బాధ, నిస్సాహాయత కూడా ఉండవు.


గమనిక  - వ్యాఖ్యలు చేసేటప్పుడు బ్లాగర్లు తమ విజ్ఞ్యత ప్రదర్శించమని  మనవి. విపరీత వ్యాఖ్యలు , అభ్యంతరకరంగా ఉన్నవి ప్రచురించబడవని  మీకు తెలుసనీ, తదనుగుణంగా  వ్యాఖ్యలు చేస్తారని ఆశిస్తున్నాను. 



http://maanasasanchara.blogspot.in/2010/01/blog-post_26.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి