18, ఫిబ్రవరి 2012, శనివారం

హైదరాబాదులో మతకలహాలు ఏనాటివి?


ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాదులో మతసామరస్యం వెల్లివిరిసేదంట. ఎప్పుడైతే ’ఆంద్రోళ్ళు’ ఇక్కడికి చేరుకున్నారో.. అప్పుడే ఇక్కడ మతకలహాలు మొదలయ్యాయని చెబుతున్నారు ఘనతవహించిన తె.వాదులు! చరిత్రను చాప కిందకు తోసేసి, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట ఓ టీవీలో ఘనత వహించిన విశ్లేషకుడొకరు, వెంటనే శనివారం నాడు కేసియారూ ఈ అబద్ధాన్ని చెప్పారు. 

వీళ్లు చెప్పుకుంటున్న మత సామరస్యం హైదరాబాదులో లేదు. ఇవ్వాళ కాదు, ఎప్పటినుండో లేదు. ఎప్పుడో ఇరవయ్యో శతాబ్దపు రెండవ మూడవ దశకాల నుండీ కూడా ఇక్కడ మతగొడవలు జరుగుతున్నాయి. ఒకర్నొకరు చంపుకున్నారు. జావీద్ ఆలమ్ అనే ప్రొఫెసరు, 19 వ శతాబ్దంలో మాత్రం ఇక్కడ హిందూ ముస్లిముల మధ్య గొడవలేమీ జరగలేదని అంటూ, అయితే 

“వాళ్ళు పక్కపక్కనే నివసించేవాళ్ళు, కానీ వాళ్ళ మధ్య అంత సామరస్యమేమీ ఉండేది కాదు” అని చెప్పారని ఒక వెబ్‍సైటులో చదివాను. రెందు మతాల ప్రజల మధ్య సామరస్యం ఇలా ఉందని ఓ ప్రొఫెసరు చెబుతోంటే ఇంకో వక్రవాణి ప్రొఫెసరు ’మేమూ చదువుకున్నామండీ..’ అంటూ కెమెరా ముందు చేరి, అబద్ధపు కథలు అల్లాడు. ఆయన చెప్పిన 

“హైదరాబాదులో మతకలహాలు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే మొదలయ్యాయి” అనే ముక్క ఎంత అబద్ధమో, అయనది వక్రవాణి ఎందుకయిందో చూద్దాం..

హైదరాబాదు నగరంలో మతకలహాలు 1938 లోనే జరిగాయి. 1938 ఏప్రిల్ 5న మొదలైన మతకలహాలు ఏప్రిల్ 9 దాకా కొనసాగాయి. ముస్లిములు తలపెట్టిన ఒక ఊరేగింపుపై హిందూ ’లోథా’లు దాడి చేస్తారనే అనుమానంతో పదివేల మంది ముస్లిములు కత్తులతో సహా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అనుకున్నట్టుగానే గొడవలు జరిగి నలుగురు చనిపోయారు. నాలుగైదు రోజుల పాటు ఏడెనిమిది ప్రాంతాల్లో గొడవలు జరిగాయి.


ఈ గొడవలు జరిగాయి సరే, దానికంటే దారుణమైనది.. ప్రజల మధ్య ఎంత హార్మొనీ ఉందో తెలియచెప్పే సంగతి ఒకటుంది.. ఆ గొడవల తరవాత పద్మజా నాయుడు గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో ’..హిందూ ముస్లిము మేధావులలోని పరస్పర అపనమ్మకాన్ని, ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుమానాలనూ చూసి నేను దిమ్మెరపోయాను’ అని రాసింది.
From autocracy to integration: political developments in Hyderabad State (By Lucien D. Benichou) పుస్తకంలో ఈ సంగతులను చదవొచ్చు.

అసలు దీనికంటే ముందే – 1923 లోనే- హై.లో ఆర్యసమాజ్ ఏర్పడి, ముస్లిములను పునర్మతాంతరీకరణ చెయ్యబూనినపుడే హైదరాబాదు సంస్థానంలో మతకలహాలు జరిగాయి. ఇదిగో, ఈ వ్యాసం కూడా అదే ముక్క చెబుతోంది. హైదరాబాదు సంస్థానంలో గిరిజనులను, దళితులను ఇస్లాములోకి మార్చే ధ్యేయంతో బహదూర్ యార్ జంగ్ అనేవాడు ఒక సంస్థను స్థాపించాడు. అలా మారినవాళ్ళను తిరిగి హిందూమతంలోకి మార్చే లక్ష్యంతో ఆర్యసమాజ్ ఏర్పడింది. ఒక్క హైదరాబాదులోనే ఆర్యసమాజ్ కు 20 శాఖలుండేవట. ఇదంతా 1938 నాటి లెక్కలు.

ఓ మూడేళ్ళ కిందట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో వరవరరావు ఇలా రాసాడు: “..కాబట్టి మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తాను స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాలనో లేదా పాకిస్తాన్‌లో కలపాలనో అనుకున్నప్పుడు ఒక రజాకారు సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయబుల్లాఖాన్ వంటి ఉత్తమ సంపాదకుణ్ని బర్కత్‌పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు“. రజాకార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాము వాళ్ళను పెంచి పోషించాడన్నదీ స్పష్టం. రజాకార్లు ఎప్పటివారు? ఈ ఆంధ్రప్రదేశు, ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రమూ ఇవేవీ ఏర్పడటానికి ముందే.. మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో ఏర్పరచిన సేన అది. ఇప్పుడు పాతబస్తీలో ఉన్న మతతత్వ పార్టీల వారసత్వం ఎక్కడిది? – 
ఆ రజాకార్లదే! రజాకార్ పార్టీ అసలు పేరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్!
మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో సేన ఏర్పాటు, మెజారిటీ మతస్తుల మతమార్పిడి కోసం ఒక సంస్థ, వాళ్ళను తిరిగి వెనక్కి తెచ్చేందుకు మరో సంస్థ -మతసామరస్యం ఎంత గొప్పగా ఏడిచిందో చెప్పేందుకు ఇది చాలు. తె.వాదులు చూపిస్తున్న హార్మనీ అనే మేడిపండును విప్పిచూస్తే కనబడ్ద పురుగులివి!
———————————–

ఈ తె.వాద ప్రొఫెసర్లు బళ్ళలో ఏం పాఠాలు చెబుతున్నారో ఏమోగానీ టీవీల వేదికలెక్కి మాత్రం ఇలా అబద్ధాలను అల్లేస్తూ ప్రచారంలో పెడుతూ ఉంటారు. మతకలహాల పట్ల అబద్ధాలు గుప్పించబడిన ఈ చర్చలో కూడా ప్రొఫెసరుగారు ఘంట కొట్టినట్టుగా వక్రవాణి వినిపించారు. (పక్కనే ఉన్న కోడెల శివప్రసాదరావు ప్రొఫెసరుగారి వక్రవాణిని అడ్డుకోలేదు.) దేరీజె మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్‍నెస్ అని అంటూంటారు. (మ్యాడ్‍నెస్సులో మెథడున్నా లేకున్నా మెదడు మాత్రం ఉండదనుకోండి.) ఈ వక్రవాది అబద్ధపు ప్రచారాల్లో కూడా మెథడేదో ఉన్నట్టుంది. 

టీవీ కెమెరాల ముందు చేరి లేనిపోని అబద్ధాలను వ్యాప్తి చేసే ఈ మేధావులు ఏ చరిత్రను చదువుకున్నారోగానీ, ప్రొఫెసర్లుగా బళ్ళో కుర్రాళ్ళకు కూడా ఇలాంటి అబద్ధపు చదువులే చెబుతున్నారేమో!

గత డిసెంబరులో విరజాజి బ్లాగులో ఇదే విషయమై ఒక చర్చ జరిగింది. ’అద్భుత మతసామరస్యానికి రాజధాని’ అయిన హైదరాబాదులో ఆంద్రోళ్ళొచ్చి మతకలహాలు రేపారు అంటూ ఒక వ్యాఖ్యాత వ్యాఖ్య రాస్తే, దానిపై జరిగిందా చర్చ.

http://chaduvari.wordpress.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి