క్రైస్తవానికి సర్కారీ ప్రోత్సాహం
226 చర్చిల నిర్మాణానికి రూ.2.50 కోట్లు
ఎన్నికల ముందు ఒకే నెలలో నిధుల వర్షం
లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రాధాన్యం
ఓట్లను సంఘటితం చేయడమే వ్యూహం
'అల్లుడు' అనిల్‌కుమార్ వెలుగు
జగన్‌పై 'మనోడు'గా ముద్ర
సీఎం కావాలంటూ ప్రార్థనలు
ప్రార్థనాలయాల్లో రాజకీయ రచ్చ
క్రైస్తవుల్లోనే విమర్శలు
'ఒక్క మత మార్పిడి వల్ల ఒకరు హిందూ మతం నుంచి వెళ్లిపోవడమే కాదు.. హిందూ మతానికి ఒకరు వ్యతిరేకిగా మారినట్లు లెక్క'
- స్వామి వివేకానంద
క్రైస్తవం
తీసుకున్నంత మాత్రాన హైందవాన్ని శత్రువులుగా చూస్తుండక పోవచ్చు. కానీ...
అసలు, పుట్టుకతో వచ్చిన మతాన్ని ఎందుకు వీడుతున్నారు? సొంత మతం ఎందుకు
కానిదైంది? హైందవంలో లోపం ఎక్కడుంది? దీనిని గుర్తించేందుకు,
దిద్దుకునేందుకు హిందూ మత పెద్దలు సిద్ధంగా ఉన్నారా?
(ఆన్‌లైన్
న్యూస్‌నెట్‌వర్క్) జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఉచిత
విద్యుత్తు... ఇవన్నీ వైఎస్ ప్రకటించి, ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలు.
కానీ... ఆయన అమలు చేసిన పథకం మరొకటుంది! అది... 'క్రైస్తవ ఉద్ధరణ పథకం'.
ఇది అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ, ప్రభుత్వ నిధులతో అమలు చేసిన పథకం.
క్రైస్తవులకు రాయితీతో కూడిన 'జెరూసలెం యాత్ర' పథకాన్ని వైఎస్
ప్రకటించారు. రెండేళ్లపాటు అమలు చేశారు. దీనిపై కొందరు హైకోర్టుకు
వెళ్లడంతో... మతపరమైన యాత్రలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం కుదరదంటూ
న్యాయస్థానం స్టే ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా
చర్చిల నిర్మాణానికి వైఎస్ భారీ స్థాయిలో ప్రభుత్వ నిధులు కేటాయించారు.
మతపరమైన మైనారిటీల ప్రార్థనాలయాలకు అంతకు ముందు కూడా ప్రభుత్వం నుంచి
నిధులు అందేవి. కానీ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు, గురుద్వారాలు,
బౌద్ధాలయాలు, పార్సీల ప్రార్థనా మందిరాలకు మరమ్మతులు, నిర్వహణకు మాత్రమే
నిధులు కేటాయించే వారు. కానీ... వైఎస్ వచ్చాక పరిస్థితి మారిపోయింది.
జిల్లాల వారీగా గ్రామాలను ఎంచుకుని, అక్కడ చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం
నుంచి నిధులు మంజూరు చేసే పద్ధతి ఆయన హయాంలో జోరందుకుంది.
2008
సెప్టెంబర్ నెలలోనే... చిత్తూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా,
తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కడప,
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి,
మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 226 చర్చిల నిర్మాణానికి, కొన్ని చర్చిల
మరమ్మతులకు సుమారు రెండున్నర కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదంతా 2009
ఎన్నికలకు కొన్ని నెలల ముందు చోటు చేసుకోవడం గమనార్హం. జీవోల ద్వారానే ఈ
నిధులు విడుదల చేశారు.
మచ్చుకు
కొన్ని జీవోలు పరిశీలిస్తే... జీవో ఎంఎస్ నెంబర్ 421 (2.9.2008) ద్వారా
కర్నూలు జిల్లాలోని ఐరన్‌బండ, ఎనకండ్ల, పెద్దనేలటూరు (రెండు చర్చిలు),
చిందుకూరు, విల్లబండ, నన్నూరు, డోన్, ఓర్వకల్లు, మిట్నాల, జిల్లెల్ల,
యు.బొల్లవరం, ఉడుమాల్పురం, వెల్దుర్తి, మిడ్తూరు, కె.సింగవరం గ్రామాల్లో 18
చర్చిల నిర్మాణానికి రూ.18 లక్షలు విడుదల చేశారు.
అలాగే...
జీవో నెంబర్ 422 ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని రాపాక, గురుగుమిల్లి,
పంగిడిగూడెం, పెనుమర్రు, అంకోడేరు, అడమిల్లి గ్రామాల్లోని ఏడు చర్చిలకు
రూ.7 లక్షలు మంజూరు చేశారు. అప్పటికే ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్న
పట్టణాల్లోనూ కొత్తగా చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సహాయం చేశారు.
క్రైస్తవుల ఓట్లను సంఘటితం చేయడంలో భాగంగానే ఇదంతా జరిగినట్లు
అభిప్రాయాలున్నాయి.
అదే ఊపులో...
వైఎస్
క్రైస్తవానికి ఇచ్చిన ప్రోత్సాహం... మత మార్పిళ్లకూ ప్రోత్సాహాన్ని
ఇచ్చిందనే అభిప్రాయం ఉంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో మత మార్పిళ్లు మరింత
జోరందుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం నుంచి దీనికి ప్రత్యక్ష
ప్రోత్సాహం లభించింది. వైఎస్‌రాక మునుపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో
కె.ఎ.పాల్ ప్రధాన మత ప్రభోదకుడిగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయనను
రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. పాల్ తెర వెనక్కి వెళ్లి... వైఎస్
అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ (ఆయన క్రైస్తవంలోకి మారిన బ్రాహ్మణుడు) హవా
మొదలైంది.
ఆయన
రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల భారీ స్థాయిలో సభలు నిర్వహించారు. ఈ సభల్లో
స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనడం సర్వ సాధారణంగా
మారింది. ఇక... క్రైస్తవ అనుకూల నిర్ణయాలు తీసుకునేలా అధికారులపై బ్రదర్
అనిల్ ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ జిల్లాలోని
నర్సీపట్నంలో ఇతరులకు కేటాయించిన బంజరు భూమిని క్రైస్తవ మత సంస్థకు
అప్పగించాలంటూ రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ భజన...
తమ్ముడు
తన వాడైనా న్యాయం చెప్పాలంటారు! కానీ... జగన్ 'మన వాడు' కాబట్టి ఎన్ని
తప్పులు చేసినా క్షమించాలంటున్నారు కొందరు పాస్టర్లు! ఔను... రాష్ట్రంలోని
చాలా చర్చిల్లో ఇప్పుడు జగన్ భజన జరుగుతోంది. ఆయన చేసిన అక్రమాల సంగతి
పక్కన పెట్టి... కేవలం 'మన వాడనే' కారణంగా వెనకేసుకేసుకొస్తున్నారు. వైఎస్
కుటుంబం క్రైస్తవులను ఆ స్థాయిలో ప్రభావితం చేసింది మరి! జగన్‌ను
అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్న చర్చిలు కూడా ఉన్నాయి.
ఆయనకు
అన్యాయం జరుగుతోందంటూ ఆదివారం ప్రార్థనల్లో పాస్టర్లు భోదించడం పరిపాటిగా
మారింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని
రావిపాటివారిపాలెంలో సెప్టెంబర్ 30న ఓ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా
గాస్పెల్ మినిస్ట్రీస్ దైవ సేవకుడు రంజిత్ ఓపిల్ తన ప్రసంగంలో ఏసు
ప్రభువును పక్కన పెట్టి జగన్‌నే కొనియాడారు. "వైఎస్‌లాంటి బలమైన నాయకుడు
లేనందునే రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. జగన్ ముఖ్యమంత్రి కావాలి.
వచ్చే ఎన్నికల్లో ఇది జరుగుతుంది'' అని జోస్యం చెప్పారు.
ఇటీవల
కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో క్రైస్తవ మత పెద్దలు
నేరుగా ప్రచార బరిలోకి దిగారు. క్రిస్టియన్ మైనారిటీ అలయెన్స్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్
కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. క్రైస్తవులంతా ఏకమై
ప్రచారంలో పాల్గొనాలని, జగన్, విజయమ్మలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని
పిలుపునిచ్చారు.
ఈ
సమావేశంలో ఒక ఫాదర్ కూడా పాల్గొనడం గమనార్హం. విశాఖపట్నం జిల్లా
మాకవరంపాలెం మండలంలోని ఒక ప్రచార సంస్థ గ్రామ రాజకీయాలను శాసించే స్థాయికి
చేరుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం చర్చిల్లో సభలు,
సమావేశాలు, సన్మానాలు, ప్రార్థనలు జరిపించారు.
ఇలా
మతంలోకి రాజకీయాలను జొప్పించడాన్ని క్రైస్తవులే విమర్శిస్తున్నారు.
వైఎస్ అధికారంలో ఉండగా... 'ఈ ప్రభుత్వం మాదే' అని భావిస్తూ యథేచ్ఛగా మత
మార్పిళ్లకు పాల్పడిన ప్రచారకులు ఎందరో ఉన్నారు. దీనికి ప్రభుత్వ పథకాలనూ
ఉపయోగించుకున్నారు. 'మతం మారితే ప్రభుత్వ పథకాలను మంజూరు చేయిస్తాం' అని
మభ్యపెట్టి మరీ ఇతరులను ఆకర్షించిన సంఘటనలు కొన్ని జిల్లాల్లో జరిగాయి.
కొన్ని చోట్ల ప్రభుత్వ పథకాల్లో మతం మార్చుకున్న వారికే ప్రాధాన్యం
ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణకు...
తూర్పు గోదావరి జిల్లాలో బాలికా శిశుసంరక్షణ యోజన అమలులో ఇదే జరిగింది.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక తల్లి కు.ని. చేయించుకుంటే... ఒక ఆడ శిశువు పేరిట
ప్రభుత్వం రూ.5 వేలు బ్యాంకులో జమ చేస్తుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక
దీనిని వడ్డీతో సహా చెల్లిస్తారు. 1996లో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని
2005లో మార్చారు. డబ్బును డిపాజిట్ చేయడానికి బదులుగా బీమా సదుపాయాన్ని
కల్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో 2005 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు
58,152 మందికి బీమా చేశారు. లబ్ధిదారుల్లో 35 శాతం మంది దళిత క్రైస్తవులు,
మైనారిటీ క్రైస్తవులే కావడం గమనార్హం. ఒక్క పథకంలో, ఒక్క జిల్లాలోనే
ఇదీ పరిస్థితి!
ఏది ఒప్పు?
సాధారణంగా...
మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేయడం
సర్వసాధారణం. కానీ... ప్రార్థనా మందిరాల నిర్మాణానికి వైఎస్ భారీ స్థాయిలో
నిధులు విడుదల చేయడం విశేషం. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు.
కానీ... ఒకే నెలలో ఇంత స్థాయిలో ప్రార్థనా మందిరాలకు నిధులు విడుదల చేసిన
దాఖలాలు గతంలో లేవు. అదే స్థాయిలో వక్ఫ్ సంస్థలకూ నిధులు కేటాయించారు.
దీనిపై
హిందూత్వ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే...
రాష్ట్రంలోని ఏ ఆలయానికీ ప్రభుత్వ ఖజానా నుంచి పైసా అందదు. పైగా... ఆలయాల
నుంచే ప్రభుత్వం సొమ్ములు గుంజుతుంది. కంట్రిబ్యూషన్, ఆడిట్ ఫీజు, సర్వ
శ్రేయో నిధి (సీజీఎఫ్), ధూప దీప నైవేద్య పథకం అమలు, అర్చక సంక్షేమ నిధి...
ఇలా వివిధ రూపాల్లో ఆలయాల ఆదాయం నుంచి, అంటే భక్తులు కానుకల రూపంలో
సమర్పించుకున్న సొమ్ము నుంచి 26.5 శాతం నిధులను సేకరిస్తుంది.
ఇందులో
సీజీఎఫ్ రూపేణా సేకరించిన 3 శాతం సొమ్మును దేవాలయాల పునరుద్ధరణకు
కేటాయిస్తారు. ఆలయ సిబ్బందితోపాటు... దేవాదాయ శాఖకు చెందిన ప్రధాన
కార్యాలయంతోపాటు అన్ని ఆఫీసుల ఉద్యోగులకు భక్తుల ఇచ్చిన సొమ్ము నుంచే
జీతాలు చెల్లిస్తారు. 'వారికో న్యాయం, మాకో న్యాయమా? ఇదేం అన్యాయం?' అని
హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి