18, ఫిబ్రవరి 2012, శనివారం

అయోధ్య తీర్పు న్యాయమైనదే!

 
"అయోధ్య తీర్పు న్యాయంగా లేదు, సాక్ష్యాలను బట్టి కాక, నమ్మకాలను బట్టి  ఇచ్చిన తీర్పు" అని విమర్శిస్తున్నారు ఉగ్ర లౌకికవాదులు.

నిజమే, ఇది సాక్ష్యాలను బట్టి ఇచ్చిన  తీర్పు కాదు, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పే!  సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పే అయితే, మూడోవంతు కాదు, మొత్తం వివాదాస్పద స్థలమంతా హిందువులకే దక్కి ఉండాల్సింది.  ఎందుకంటే..

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, బాబ్రీ మసీదు కింద హిందూ దేవాలయం ఉందని కోర్టుకు చెప్పారు.  "బాబ్రీ మసీదుకు సరిగ్గా కింద, బృహత్తరమైన ఒక నిర్మాణం యొక్క శిథిలాలు ఉన్నాయి.  ఇటుకలు, శిలలు, శిల్పాలు ఆ శిథిలాల్లో ఉన్నాయి.  యాభైకిపైగా స్థంభాల పీఠాలు కూడా ఉన్నాయి. ఈ శిథిలాలు ఉత్తర భారత  దేవాలయ నిర్మాణ శైలిలో ఉన్నాయి" కొద్దిగా అటూఇటూగా వాళ్ళు కోర్టుకు చెప్పినదిది.  అంటే ఏంటన్నమాటా.. మసీదును కట్టించినవాడెవుడోగానీ, దేవాలయాన్ని పడగొట్టి మరీ దాన్ని కట్టించాడన్నమాట.ఆ స్థలం మీద సున్నీ బోర్డు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసిందంటే కొట్టెయ్యదూ మరి!
అయినప్పటికీ, ప్రజల మనోభావాలను పరిగణన లోకి తీసుకుని, అందరినీ అనునయించేలా, అందరికీ వీలైనంత ఆమోదయోగ్యంగా ఉండేలా ఈ తీర్పు ఇచ్చింది కోర్టు.  నల్సార్ యూనివర్సిటీ  (లా యూనివర్సిటీ) ప్రొఫెసరు మాడభూషి శ్రీధర్ ఓ టీవీ చర్చలో చెప్పినట్టు "ఇది ఈ కేసుపై ఇవ్వదగ్గ అత్యుత్తమ తీర్పు"!

రామజన్మభూమిని వేరే మతస్తులకు పంచి ఇచ్చినప్పటికీ, హిందువులు ఈ తీర్పును స్వాగతించారు.   ఎంచేతంటే... హిందువులు శాంత స్వభావులు. ద్వేషం వారిలో లేదు. కారణం - వారికి "దొంగ లౌకికవాదం"  తెలీదు.

...............................................................
హిందూద్వేషం నరనరానా ప్రవహిస్తున్న హిందూ వ్యతిరేక ఉన్మాదులకు ఇది రుచించలేదు.  లౌకికవాదులమని చెప్పుకునే వీళ్ళు దీన్ని సాక్ష్యంగా భావించడం లేదు. అసలు దీని గురించే మాట్టాడ్డం లేదు. ఒకవేళ ఎవరైనా మాట్టాడినా..  వాళ్ళు మూర్ఖంగా వాదిస్తున్నారు. వాళ్ళ వాదనలు ఇలా ఉంటై:
  1. మసీదు కింద గుడి శిథిలాల్లేవు. 
  2. ఒకవేళ ఉన్నా అవి గుడి శిథిలాలని అనకూడదు. ఇస్లాము మతానికి ముందు ఉన్న ’మరొక మతం’ యొక్క శైలిలో ఉన్న నిర్మాణం అని అనాలి. హిందూ దేవాలయ శైలి అని అనకూడదు. 
  3. ఒకవేళ మసీదు కింద గుడి ఉందని అన్నా అది రామ జన్మభూమి అని అనకూడదు. ఎంచేతంటే రాముడు అక్కడే పుట్టాడని ఆధారాలు ఎలా చెప్పగలరు?
  4. ఈ శిథిలాల విషయంలో సైన్సు ఏం చెబుతోందో, దాన్ని సైంటిస్టులు బైటికి చెప్పకూడదు.  లౌకిక వాదులు ఏం చెప్పమని చెబుతారో అదే చెప్పాలి.
 ’గుడిశిథిలాల మీదే మసీదు కట్టారని ఎంత స్పష్టంగా సర్వేలో తేలిపోతే మాత్రం..  ఏకంగా హిందువులకు కొంత భాగాన్ని ఇచ్చెయ్యడమేనా? హన్నా? ఎంత హిందూ పక్షపాతం? ’ అని రగిలిపోయారీ లౌకికవాదులు. మందలుమందలుగా చేరి ప్రకటనలివ్వడం మొదలెట్టారు.  లౌకికవాదుల ఉగ్ర లౌకికత్వం, హిందూ వ్యతిరేక ఉన్మాదం, హిందువుల పట్ల అసహనం, కోర్టుల పట్ల చులకనభావం, తిరస్కారం - ఇవన్నీ కూడా తీర్పుపై వాళ్ళు ఇస్తున్న ప్రకటనల్లో నగ్నంగా ప్రదర్శితమౌతున్నాయి.

ఈ లౌకికవాదుల కంటే, మతం పేరిటో మతం మాటునో రాజకీయాలు చేసే మన రాజకీయ పార్టీలు ఎంతో నయమనిపిస్తోంది. రాజకీయుల తిప్పలన్నీ మన ఓట్ల కోసమేనని మనకు తెలుసు, ఆ ఓట్లేవో వాళ్ళ మొహాన కొడితే  పెద్దగా మన జోలికి రారు. కానీ ఈ (అ)లౌకికవాదులు అలాక్కాదు, హిందువులను అణగదొక్కాలనేది వీళ్ళ అప్రకటిత ఎజెండా. ఈ దేశానికి మొదటి శత్రువు దొంగ లౌకికవాదియే! 

.....................................................................

తీర్పు తరవాత వచ్చిన  స్పందనలను బట్టి, స్థూలంగా  ప్రజలంతా తీర్పును స్వాగతించారనే చెప్పుకోవాలి. హిందూ , ముస్లిము ధార్మిక సంస్థలు స్పందించిన తీరు ప్రశంసనీయం.  తీర్పు ఇద్దరికీ అంత సంతృప్తి కలిగించకపోయినా, చాలా బాధ్యతాయుతంగా స్పందించారు తప్ప, తీర్పును, న్యాయవ్యవస్థనీ తిట్టలేదు. చాల అభినందనీయంగా ఉంది వాళ్ళ స్పందన. మీడియా కూడా క్రమశిక్షణతో వ్యవహరించింది. తీర్పు తరవాత పరిస్థితి ప్రశాంతంగా ఉండడానికి మీడియా ప్రవర్తన ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు.

రాజకీయ పార్టీలు, నాయకులు కూడా చాలావరకు పద్ధతిగానే ఉన్నారు. ములాయం లాంటివాళ్ళు ముస్లిములకు అన్యాయం జరిగిందని రెచ్చగొట్టబోయారుగానీ, నోరుమూసుక్కూచ్చోమని ముస్లిములే అన్నారు. కొన్నికొన్ని పార్టీలు ఇప్పుడిప్పుడే వంకరమాటలు మాట్టాడ్డం మొదలెడుతున్నట్టుగా కనబడుతోంది.  ఉదాహరణకు, రాహులు గాంధీ ఈమధ్య మాట్టాడిన మాట - అరెస్సెస్సును ముస్లిము ఉగ్రవాద సంస్థ సిమితో పోల్చి రెండూ ఒకటే అనడం. హిందూ సంస్థను తిట్టి, ముస్లిములను  సంతృప్తిపరచేలా మాట్టాడి, తాము ముస్లిములకు అనుకూలమని ఆ అజ్ఞాని చేత చెప్పించడం కాంగ్రెసు పార్టీ  ఎత్తు.  (దగ్గర్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కూడాను). సూటిగా మాట్టాడే మాటల కంటే ఈ బాపతు వంకరమాటలే చేటు. 


 http://chaduvari.blogspot.in/2010/10/blog-post_11.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి