20, ఫిబ్రవరి 2012, సోమవారం

కేయెమ్ మున్షీ మాస్టర్ పీస్


కె యెమ్ మున్షీ
కె యెమ్ మున్షీ

సోమనాథ దేవాలయ పునరుద్ధరణ స్వతంత్ర భారత దేశంలో జరిగిన మొదటి, బహుశా ఏకైక హిందూ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా ఈ పనిని చెయ్యాలని ముందు నిర్ణయించారు. అయితే ప్రజల సొమ్ముతో చేస్తే బాగుంటుందన్న మహాత్మా గాంధీ సూచన మేరకు ప్రజల వద్దనుండి విరాళాలు వసూలు చేసి ప్రభుత్వం ఈ పునరుద్ధరణ చేపట్టింది. కేయెమ్ మున్షీ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రధాని నెహ్రూకు ఈ కార్యక్రమం సుతరామూ ఇష్టం లేదు. సోమనాథ దేవాలయ పునరుద్ధరణ అంటే అది హిందూ పునరుద్ధరణ అని ఆయన అభిప్రాయంగా ఉంది. హిందూ పునరుద్ధరణ అనేది ఆయనకు ఎందుకు ఇష్టం లేదో తెలియదు. 

లౌకికవాదమంటే హిందూ వ్యతిరేకవాదమనేది బహుశా నెహ్రూతోటే మొదలైందేమో! ఈ విషయంపై నెహ్రూకు కేయెమ్ మున్షీకీ జరిగిన సంభాషణ చూడండి:

1951 ఏప్రిల్ 23న భారత ప్రభుత్వ కాబినెట్ సమావేశం జరిగింది. సమావేశపు ముగింపులో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కేయెమ్ మున్షీతో ఇలా అన్నారట -”మీరు సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చెయ్యడం నాకు నచ్చలేదు. అది హిందూ పునరుత్థానం”

దీనికి ప్రతిగా మరుసటి రోజున మున్షీ నెహ్రూకు ఉత్తరం రాసారు. ఆ ఉత్తరం ఇలా ఉంది:

“నిన్న మీరు హిందూ పునరుత్థానం గురించి మాట్టాడారు. సోమనాథ్ తో నన్ను జోడించి కాబినెట్లో మాట్టాడారు. మీరు అలా మాట్టాడ్డం నాకు సంతోషమే కలిగించింది; ఎంచేతంటే నా భావాలు, నా ఆచరణలు వేటినీ నేను దాచాలని అనుకోవడం లేదు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం పట్ల నేటి భారతదేశపు ’సంచిత అంతశ్చేతన’ ఎంతో సంతోషంగా ఉందని నేను మీకు దృఢంగా చెప్పగలను -మనం చేసిన, చేస్తున్న ఏ ఇతర కార్యక్రమం కూడా ప్రజలకు ఇంత ఆనందం కలిగించలేదు.”

“మన చరిత్ర పట్ల నాకున్న విశ్వాసమే వర్తమానంలో పనిచేసేందుకు, భవిష్యత్తుకై ఎదురుచూసేందుకు నాకు శక్తినిస్తోంది. మనం సాధించుకున్న ఈ స్వాతంత్ర్యం భగవద్గీతను మనకు దూరం చేసి, కోట్లాది ప్రజల విశ్వాసాలను పెకలించివేసి, మన జీవన సూత్రాల్ని నాశనం చేసేటట్లైతే, నేనీ స్వాతంత్ర్యానికి విలువ ఇవ్వలేను. నా చిరకాల స్వప్నమైన సోమనాథ్ దేవాలయ పునరుద్ధరణ నా కళ్ళముందే సాకారమవడం నా అదృష్టం.ఈ దేవాలయ పునరుద్ధరణ మతం పట్ల మరింత స్వచ్ఛమైన భావనను, మన శక్తి పట్ల మరింత అవగాహననూ మన ప్రజలకు ఇస్తుందని, స్వేచ్ఛావాయువులు వీస్తున్న ఈ తొలినాళ్ళలో, ఈ పరీక్షాసమయంలో, ఇది కీలకమైనదనీ నా భావన -కాదు నా విశ్వాసం”

సుప్రసిద్ధ ప్రభుత్వ అధికారి, సంస్థానాల విలీనంలో సర్దార్ పటేలుకు సహకరించిన వి.పి.మీనన్ ఈ ఉత్తరం చదివి, మున్షీకి ఇలా రాసాడు: “మీ మాస్టర్ పీస్ చూసాను.ఆ ఉత్తరంలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల కోసం జీవించడానికి, అవసరమైతే మరణించడానికీ కూడా నేను సిద్ధపడతాను” 

 http://mataraajakeeyaalu.wordpress.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి