16, ఫిబ్రవరి 2012, గురువారం

కాశ్మీర్‌ కాష్టం - సర్వ భ్రష్ఠం


 
మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌, కాంగ్రెస్‌ వారు తమ నిరాధార విశ్వాసాల ప్రకారం ఏం చెప్పినా భారతదేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది. భరతఖండంలో నివసిస్తున్న ముసల్మానులందరు (ఒక్క వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోని వారు మినహాయించి) మహమ్మదాలి జిన్నా, ముస్లిం లీగ్‌ ద్విజాతీయ వాదాన్ని 1946 లో జరిగిన ఎన్నికల్లో 98.6 శాతం ఓట్లతో అంగీకరించి, కాంగ్రెస్‌ నేషనలిస్ట్‌ ముస్లిం అభ్యర్థులను చిత్తుగా ఓడించి, ఇస్లామిక్‌ పాకిస్తాన్‌ రాష్ట్ర ఏర్పాటుకై, 1946 ఆగస్ట్‌ 16న విభజన వ్యతిరేకుల (హిందువుల)పై ప్రత్యక్ష చర్య (ఉస|-ష ఆ-షుn) ప్రారంభించారు. ప్రథమ దినంలోనే, ముస్లిం లీగ్‌ ప్రభుత్వ హయాంలో 10,000 హిందువులు చంపబడ్డారు. దేశంలో పలుచోట్ల మతకలహాలు చెలరేగాయి. భీషణమైన హింసకు భయపడి, కాంగ్రెస్‌ నాయకులు దేశ విభజనకు పాకిస్తాన్‌ స్థాపనకు సమ్మతించారు. 1947 జూన్‌లో ఆలిండియా కాంగ్రెస్‌ సదస్సులో విభజనామోద తీర్మానం, తీవ్ర వ్యతిరేకతకు గురి అవుతుంటే, నెహ్రూ అభ్యర్థనపై, అంతవరకూ నాశనం పైన మాత్రమే దేశ విభజన జరుగుతుందని చెబుతున్న మహాత్మాగాంధీ, కాంగ్రెస్‌ సభకు వచ్చి విభజనకు, పాకిస్తాన్‌ ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడి నిష్క్రమించారు. విభజనకు మతమే ఎంత ప్రాతిపదిక అయిందంటే, దేశాన్నే కాదు, పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాలను కూడా విభజించాలని, హిందూ మహాసభతో పాటు, కాంగ్రెస్‌ కూడా పట్టుబట్టి మాట నెగ్గించుకుంది.

1947 ఆగస్టుకు పూర్వం భరత ఖండంలో 600 పైన రాజా, నవాబ్‌, మహారాజాల సంస్థానాలుండేవి. ప్రజలు హిందువులు పాలకులు ముస్లింలైన ప్రముఖ సంస్థానాలు హైదరాబాద్‌, జునాగఢ్‌, భోపాల్‌లు. భోపాల్‌ నవాబు తెలివిగా భారత దేశంలో చేరాడు. జునాగఢ్‌ నవాబు తన సంస్థానాన్ని పాకిస్తాన్‌లో చేర్చాడు. హిందూ ప్రజలు ఉద్యమించి, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటూంటే, ఆ నవాబు పాకిస్తాన్‌కు పారిపోయాడు. (అతని కొడుకే భారత దేశపు బద్ధవిరోధి జుల్ఫికర్‌ అలీ భుట్టో ఇతడి కూతురే బెనజీర్‌ భుట్టో). జునాగఢ్‌ భారత భూభాగమైంది. ఇక మన హైదరాబాద్‌ నైజాం, 90 శాతం హిందూ ప్రజాభీష్ఠానికి విరుద్ధంగా, స్వతంత్ర ఇస్లామిక్‌ సార్వభౌమ దేశంగా ఉండాలని, రజాకర్ల సాయంతో బీభత్సం సృష్టించిది, పాకిస్తాన్‌ను మచ్చిక చేసుకోడానికి పది కోట్ల రూపాయలు దానికిచ్చి, భారతదేశం తన రాజ్యం మీద దురాక్రమణ చేస్తోందని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (సెక్యూరిటీ కౌన్సిల్‌కు) కి ఫిర్యాదు చేశాడు. ఇదంతా ఫలించే ముందు, నెహ్రూ అయిష్టాన్ని చూపినా, సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ సైన్యాల్ని పంపి, హైదరాబాద్‌ను ఇస్లాం పాలకుడి నుండి, అతని అరాచకపు మూకల నుండి విముక్తి చేసి, భారత భూభాగం చేశారు. ఈ విధంగా, పాలకుల అభీష్టం గాక, అధిక సంఖ్యాక ప్రజల శ్రేయస్సు, అభిమతం ప్రకారం సంస్థానాల విలీనం జరిగింది.

కాని జమ్ము -కాశ్మీర్‌ కథ వింతగా మారింది. జమ్ము ప్రాంతంలో హిందువులూ, లద్దాక్‌ ప్రాంతంలో బౌద్ధులు అధిక సంఖ్యాకులు. కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యాకులు, సంస్థానం మొత్తంలో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఆ సంస్థానం మహారాజు డోగ్రా హిందువు, హరిసింగ్‌. అతనికి నెహ్రూ అంటే ఇష్టంలేదు. జిన్నాలో నమ్మకం, గౌరవం లేదు. అత్యధికంగా ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (దీనిముందు పేరు ముస్లిం కాన్ఫరెన్స్‌) అధినేత షేక్‌ అబ్దుల్లా. అతను నెహ్రూ మిత్రుడు హరిసింగ్‌ను పదవీచ్యుతునిచేసి, రాజరికాన్ని అంతంజేసి, ప్రజాపాలనను ప్రవేశపెట్టాలనే ఉద్యమం నడుపుతుంటే, హరిసింగ్‌ అతణ్ణి జైల్లో పెట్టాడు. ఇండియాలోనూ, పాకిస్తాన్‌లోనూ చేరకుండా కాలయాపన చేస్తుంటే, పాకిస్తాన్‌ తన సాయుధ సైనికులను ట్రైబల్‌ రైడర్స్‌ అనే ముసుగులో కాశ్మీర్‌పై దండయాత్ర చేయించింది. హరిసింగ్‌ ముస్లిం పోలీసులూ, సంస్థాన ముస్లిం సైనికులు వాళ్లతో కలిసిపోయారు. శ్రీనగర్‌ పరిసరాల్లోకి పాకిస్తానీయులు చొచ్చుకువచ్చారు. ఆ విపత్కర పరిస్థితుల్లో, నెహ్రూ హుకుం మేరకు షేక్‌ అబ్దుల్లాను జైల్లో నుంచి వదలి, అతని అంగీకారంతో, తన సంస్థానాన్ని హరిసింగ్‌ భారత దేశంలో చేర్చాడు. నెహ్రూ అతణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి, అతని మైనర్‌ కొడుకు కరణ్‌ సింగ్‌ని మహారాజాగాను, షేక్‌ అబ్దుల్లాను ప్రధానమంత్రిగాను చేసి హరిసింగ్‌ను బొంబాయికి గెంటివేశాడు. భారత సైన్యాలు షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వపు కోరికపై కాశ్మీర్‌లో ప్రవేశించి, పాకిస్తాన్‌ మూకలను వెన్నాడి తరిమికొడ్తుండగా, నెహ్రూ గారి కోరికమీద మనకు గవర్నర్‌ జర్నల్‌గా ఉన్న లార్డ్‌ లూయీ మౌంట్‌ బాటన్‌ దుర్బుద్ధి పూర్వక సలహా విని, పాకిస్తాన్‌ మీద ఇండియా యుద్ధం చేస్తోందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేశారు. దాంతో కాశ్మీర్‌ సమస్య అంతర్జాతీయం చేయబడింది. ఇంకో వారంలో మన సైన్యం యావత్‌ కాశ్మీరాన్ని పాకిస్తాన్‌ సైన్యాల నుండి విముక్తి చేసే సమయంలో, ఐక్యరాజ్య సమితి యుద్ధ విరామం చేయాలని ఆదేశించింది. తత్ఫలితంగానే యుద్ధ విరామ రేఖకు పశ్చిమాన ఉన్న కాశ్మీరం పాకిస్తాన్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ముస్లిం మెజారిటీ కాశ్మీరు లోయ, హిందూ బుద్ధిస్ట్‌ మెజారిటీ జమ్ము, లఢక్‌ ప్రాంతాలు భారతదేశంలో ఉంటున్నాయ్‌.

మనం రాజ్యాంగ చట్టాన్ని ఏర్పరచుకున్నప్పుడు, 370 అధికరణం ప్రకారం కాశ్మీర్‌కు తాత్కాలికంగా కొంత స్వయం ప్రతిపత్తిని కల్పించాం. అంటే ఇతర సంస్థానాల విలీనంకు ఒక నీతి, అది ముస్లిం మెజారిటీ (ఒక ప్రాంతంలో మాత్రమే) సంస్థానం కాబట్టి మరో నీతి అయింది. సమస్య అంతర్జాతీయం చేయబడటం, 370 వ అధికరణం తీసుకురావడం భారతదేశానికి నెహ్రూగారు ఇచ్చిన వరప్రసాదం. సర్దార్‌ పటేల్‌ హైదరాబాద్‌ సమస్యను గోటితో అంతం చేస్తే, నెహ్రూగారు స్వయం నిర్ణయాలతో, కాశ్మీర్‌ సమస్య రావణకాష్టంగా తయారైంది.
-డా|| త్రిపురనేని హనుమాన్‌ చౌదరి

 http://www.prabhanews.com/specialstories/article-136656

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి