19, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఇస్లాంపై మారుతున్న ఐరోపా దృక్పథం


(సుధీంద్ర కులకర్ణి ఆంధ్రజ్యోతిలో వ్రాసిన వ్యాసం ఆధారంగా) 
 
 

జులై 22 న నార్వే రాజధాని "ఓస్లో" లో అండర్స్, బ్రాహింగ్ బ్రీవిక్ అనే క్రైస్తవమత అనుయాయి 77 మంది క్రైస్తవేతరులను  దారుణంగా కాల్చి చంపాడు. యూరోపియన్ సమాజం సాంస్కృతికంగా క్రైస్తవ వ్యవస్థగా ఉండిపోవాలని గట్టిగా కోరుకుంటున్న వారిలో బ్రీవిక్ ఒకరు. ఈ చర్య ప్రపంచ దేశాల సభ్య సమాజంలో ముఖ్యంగా ఐరోపా సమాజంలో దిగ్భ్రాంతి కలిగించింది. ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. ఎందుకిలా జరిగింది? యురోపియన్లలో అంతర్మధనం మొదలైంది. దేశంలోని పరిస్థితులు ఏమిటి? ఎలా ఉండాలి? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ఓస్లోలో బాంబు దాడులు, ఊచకోతలకు పాల్పడే ముందు బ్రీవిక్ ఒక మ్యానిఫెస్టోను విడుదల చేశాడు. ఐరోపాలో ముస్లిం జనాభా పెరిగిపోతున్నది. పెరిగిపోతున్న ముస్లిం వలసలను నిలువరించటానికి నార్వే వామపక్ష ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడాన్ని ఆ మ్యానిఫెస్టో ఖండించింది. వలస వచ్చిన ముస్లింలు యూరోపియన్ సమాజంలో అంతర్భాగం కావడం లేదు. స్థానిక జాతీయతా,  సంస్కృతితో కలిసిపోకుండా ఆక్రమణ మనస్తత్వంతో తమ సొంత సంస్కృతీ సంప్రదాయాల పరిధిలోనే ఉంటున్నారు. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండి. ఇది ఆధునిక సమాజంలో తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. 

బహు సంస్కృతీ పరత్వం : వలస వచ్చిన వారిని సంపూర్ణంగా సంలీనం చేసుకోవడానికి వారి వారి సొంత మత విశ్వాసాలను అనుసరించడానికి పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడమే ఉత్తమమన్న లౌకిక భావన - సత్ఫలితాలను ఇవ్వడం లేదని యూరోపియన్ ప్రజలు గుర్తిస్తున్నారు. ఏంజెలా మెర్కల్ (జర్మనీ ఛాన్స్ లర్) నికోలస్ సర్కోజీ (ఫ్రాన్సు అధ్యక్షులు) డేవిడ్ కేమెరాన్ (బ్రిటన్ ప్రధాని) మొదలైన ప్రభుత్వాధినేతలే కాక యూరపులోని పలువురు రాజకీయ నాయకులూ, మేధావులు బహు సంస్కృతీ పరత్వం విఫలమైందని అంగీకరించారు. భారత దేశంలో కూడా ఈ బహు సంస్కృతీ పరత్వం, జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని రాజకీయనాయకులు, మేధావులు ఈ దిశగా ఆలోచించ వలసి ఉంది. అలాగే మీడియాలో కూడా ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది.  

ఇంగ్లాండ్, అమెరికా వంటి ఇతర ఐరోపా దేశాలకు వలస వెళ్ళే ముస్లింలు మతస్వాతంత్ర్యం, సాంస్కృతిక హక్కులకై డిమాండ్ చేస్తున్నారు. మరి ముస్లిం దేశాలు తమ సమాజంలోని ముస్లిమేతరులకు ఆ హక్కులను కల్పించడానికి ఎందుకు అంగీకరించడం లేదు? ముస్లింలకు పరమ పవిత్రమైన క్షేత్రాలున్న సౌదీ అరేబియా బహు సంస్కృతీ పరత్వాన్ని అంగీకరిస్తుందా? భారతదేశం నుండి వలస వెళ్ళిన వేలాది శ్రామికులు సౌదీ అరేబియా దేశాభివృద్దికి ఎనలేని సంపదలు సృష్టిస్తున్నారు. ఐతే ఇంగ్లాండ్, అమెరికా, ఇతర ఐరోపా దేశాలలో వలెనె సౌదీ అరేబియాలోను, మరే ఇతర ముస్లిం దేశాలలోనైనా వలస కార్మికులు, ఉద్యోగులు తమ సొంత మత విశ్వాసాలను అనుసరించడానికి అనుమతిస్తారా? 

కనుక ఇస్లాం మతానుయాయులు ఇటువంటి ఆక్రమణ మనస్తత్వాన్ని వదలి, తాము వెళ్ళిన స్థానిక దేశాల జాతీయతపై విధేయత ప్రకటించి, ఆ స్థానిక సాంస్కృతిక సమాజంతో కలిసిపొతే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి