10, సెప్టెంబర్ 2012, సోమవారం

అస్సాంలో పెచ్చుమీరిపోయిన బంగ్లా అక్రమ వలసదారుల దౌర్జన్యాలు




అస్సాంలోని బోడోలాండ్ (బోడో టెరిటోరియల్ కౌన్సిల్) BTC పరిధిలోని కోక్రాఝాడ్, చిరాంగ్, బక్షా, ఉదల్ కుడి - ఈ నాలుగు జిల్లాల్లో బోడో గిరిజన జాతులకు చెందిన ప్రజలు అధిక సంఖ్యాకులు. వీరి సంస్కృతి అస్సాంలోని మైదాన ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఉంటుంది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడక ముందు తూర్పు పాకిస్తాన్ నుండి ఆపై బంగ్లాదేశ్ ఆవిర్భావం తరువాత అక్రమ చొరబాటుదారులు అస్సాంలోని సరిహద్దు జిల్లాల్లో ప్రవేశించి క్రమక్రమంగా అస్సాంలోని బోడో జిల్లాలకు వ్యాపించి స్థానిక గిరిజనుల భూములను, గృహాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. దీంతో 1980 నుండి బోడో గిరిజనులు ఉద్యమం బాట పట్టారు. నాటి నుండి అస్సాంలోని బోడో గిరిజన జాతులవారికి అక్రమ చొరబాటుదారులైన  ముస్లిం వర్గాల వారికి తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. దాని పర్యవసానంగానే ఇటీవల అస్సాంలోని బోడో జిల్లాల్లో గిరిజన జాతుల వారిపై అక్రమ చొరబాటుదారులు సాయుధులై 300 పల్లెలలోని గిరిజన ఆవాసాలపై దాడి చేశారు. అనేకమంది స్థానిక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.1,70,000 మంది గిరిజనులు వారి గ్రామాలను, ఆవాస ప్రాంతాలను, భూములను, గృహాలను వదలి ప్రభుత్వం నిర్వహిస్తున్న 125 సహాయ కేంద్రాలలో తలదాచుకుంటున్నారు.

అక్రమ చొరబాటు దారులను గుర్తించి తిప్పి పంపివేయడానికి ప్రభుత్వం 1983లో Illegal Migrants (Determination by Tribunal ) IMDT చట్టాన్ని తయారు చేశారు. కాని ముస్లిం ఓటు బ్యాంకుపై ఆధారపడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 22 సంవత్సరాలుగా ఈ చట్టం అమలును పట్టించుకోలేదు. అటు తరువాత సుప్రీం కోర్టు 2005లో ఈ చట్టం ప్రభావవంతంగా లేదని రద్దు చేసి కొత్త చట్టాన్ని వెంటనే రూపొందించాలని కోరింది. కాని ప్రభుత్వం స్పందించక పోవడంతో 2009జనవరి 15 నాడు సుప్రీం కోర్టు మరోసారి కొత్త చట్టాన్ని రూపొందించాలని మరోసారి కేంద్రాన్ని ఆదేశించింది. కానీ చొరబాటుదారుల ఓటు బ్యాంకుపై ఆధారపడిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చొరబాటుదారులు ఆధార కార్డులు, రేషన్ కార్డులు, ఓటు హక్కులను పొందగలుగుతున్నారు.  

కేంద్రంలోనూ, అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అల్లర్లను అణచటానికి కేంద్రం మిలటరీ బలగాలను సకాలంలో పంపలేదని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం చూస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో సమన్వయము, సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఎంతవరకు ఉందో స్పష్టం అవుతుంది. మిలటరీ బలగాలతో సమస్యను తాత్కాలికంగా అణచివేయగలరేమో కానీ, అక్రమ చొరబాటుదారులను గుర్తించి, తిరిగి బంగ్లాదేశ్ కు పంపించి, చొరబాట్లను నియంత్రించటానికి ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి పై చట్టాలను ఖచ్చితంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదు. 

సేవా భారతి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు 

అస్సాంలోని సహాయ కేంద్రాలలో తలదాచుకొన్నా వారికి సేవాభారతి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించబడుతున్నాయి. దానికోసం మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు. దానితో పాటు దోమతెరలు, ఆహారం, బట్టలు తదితరాలు అందచేశారు. సుమారు 20 రోజులకు అవసరమైన సామగ్రి సమకూర్చారు. 

- పతికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి