16, సెప్టెంబర్ 2013, సోమవారం

ఇది పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్న బీభత్సం ! - ముజఫర్ నగర్ ఘటనల పై హెబ్బార్ కలం

By : హెబ్బార్ నాగేశ్వర్ రావు
 
 
 
అన్యాయం చేసిన వారు, అన్యాయానికి బలైనవారు విభిన్నమతస్థులైన ప్రతి సందర్భంలోను, అన్యాయానికి ప్రతిక్రియాగా చెలరేగే హింసాకాండకు మతకల్లోలాలని పేరుపెట్టడం మనదేశంలో మామూలైపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న హింసాకాండకు నిజానికి మతపరమైన అంశాలతో కాని, వివాదాలతో కాని సంబంధం లేదు. అయినప్పటికీ రెండు మతాల వారికి కల్లోలాలతో సంబంధం ఉంది కాబట్టి వీటిని మతకల్లోలాలంటున్నారు. ఒక మతంవారు నిష్కారణంగా దాడి చేసినప్పటికీ మరో మతంవారు దాడులకు గురయినప్పటికీ మతకల్లోలాలు అనే పదజాలం ప్రచారం అవుతోంది. ముజఫర్ నగర్‌లో ఘోర హింసాకాండకు దారితీసిన ఘటనకు కారణం లైంగిక బీభత్స స్వభావం కలిగి ఓ దుండగుడు! దుండగుడి దుశ్చర్యను నిరోధించిన వారు మరో మతానికి చెందినవారు. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించడం తప్పని ఇరుమతాల వారు అంగీకరించి ఉంటే సమస్య లేదు. అంగీకరించని వారి వికృత మనఃప్రవృత్తి ఈ కల్లోలాలకు ప్రధాన కారణం. ఏది ఏమైనా ఒక మతంవారిని మాత్రమే తప్పు పట్టడం మరో మతం వారిని నిర్దోషులుగా నిలబెట్టడానికి యత్నించడం ఉత్తరప్రదేశ్‌ను పరిపాలిస్తున్న సమాజ్ పార్టీ విధానమైపోయింది. ఈ విధానం కారణంగా ఈ పార్టీ గుడ్డిగా సమర్థిస్తున్న మతం వారిని మరోమతం వారిపై దాడి చేయడానికి స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే ప్రవృత్తి మనదేశంలోని అన్ని రాష్ట్రాలలో అధికార యంత్రాంగాన్ని, పోలీసులను ఆవహించి ఉంది. అందువల్ల లైంగికంగా వేధించిన దుండగుని తప్పు పట్టి దండించవలసిన అతని మతవర్గంవారు మతం పేరుతో అతగాడిని సమర్ధించే దుస్థితి దాపురించింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలకు ఇదీ కారణం. అమ్మాయిని వేధించిన దుండగుని దుశ్చర్యతో సంబంధం లేని అనేకమంది అమాయకులు, అతని మతవర్గీయులు, భిన్న మతస్థులు కూడ కల్లోలాలకు ఆహుతైపోయారు. పోలీసులు తక్షణం రంగప్రవేశం చేసి ఆడపిల్లను వేధించిన లైంగిక బీభత్సకారుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టినట్టయితే, కల్లోలాలకు ఆహుతైపోయిన ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు నిలబడి ఉండేవి. అలా జరగకపోవడానికి కారణం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, అతగాడి ప్రభుత్వం, ఆయన నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ విధానాలు కారణం.
 
దేశమంతటా హిందువులు, ముస్లింలు కలిసిమెలసి ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. పరస్పర సహజీవన జాతీయ తత్వానికి మన దేశంలోని భిన్న మతాలవారు వారసులు! ఈ వారసత్వ స్పృహ ఉన్న ప్రతి పౌరుడూ మతంతో నిమిత్తం లేకుండా సర్వమత సహిష్ణుతా భావాన్ని కలిగి ఉన్నాడు. కానీ జిహాదీ బీభత్సకారులను ఇస్లాం మతానికి చెందిన సామాన్య ప్రజలతో ముడి పెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నం విషపరిణామాలకు దారి తీస్తోంది. అలాంటి విష పరిణామం, ముజఫర్ నగర్ ప్రాంతంలో అల్లర్లు. ఇటీవల భారత-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో యాసిన్ భత్కల్ అనే జిహాదీ బీభత్సకారుడు పట్టుబడ్డాడు. వందలాది మంది ప్రాణాలను తీసిన ఈ పాకిస్తానీ తొత్తును ఇస్లాం మతంతో ముడిపెట్టడానికి యత్నించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ నేత ఒకరు ముస్లింలలో అసంతృప్తిని రెచ్చగొట్టడానికి యత్నించాడు. అతగాడిని ఆ తరువాత పార్టీ పదవులనుండి తొలగించడం వేరే సంగతి. కానీ రాజకీయవేత్తలు ఇలా దేశద్రోహి, జిహాదీ బీభత్సకారుల అరెస్టును కూడా ముస్లింల సానుభూతిని సంపాదించుకొనడానికి ఉపయోగించడం ప్రమాదకరమైన పరిణామం...గతంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, స్వయంగా ‘సిమి’కి మద్దతు పలికిన సందర్భాలున్నాయి. ‘సిమి’ పాకిస్తాన్ ప్రభుత్వపు మద్దతుతో పనిచేసిన జిహాదీ, బీభత్స సంస్థ, ఇండియన్ ముజాహిద్దీన్ వంటిది. ఇలాంటి తమ దుశ్చర్యలను భారతదేశ భక్తులైన సామాన్య ముస్లింలు సమర్ధిస్థారని భావించడం..ఈ రాజకీయ నాయకుల వికృత చిత్తవృత్తికి నిదర్శం. ఈ చిత్తవృత్తి జిహాదీ బీభత్సకారులకు, వారి మద్దతుదారులకు బలం కలిగిస్తోంది. ముజఫర్ నగర్ కల్లోలాకు ఇలాంటి అనైతిక బలం ప్రధాన కారణం. జరిగినవి మతకల్లోలాలు కాదు. ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతులపై లైంగిక బీభత్సం సాగించ యత్నిస్తున్న పాకిస్తాన్ సమర్ధకుల పన్నాగంలో ఈ కల్లోలాలు భాగం.
 
‘ఇండియన్ ముజాహిదీన్’ బీభత్సకారులు దేశమంతటా విస్తరించి ఉన్నారు. సామాన్య ముస్లింలతో కలిసిపోయి చట్టబద్ధులైన పౌరుల వలె అభినయం సాగిస్తున్నారు. అమాయకులైన ముస్లింలు, ఈ జిహాదీ దుండగులు తమ వలెనే, సాధారణ పౌరులని విశ్వసిస్తూ ఉండవచ్చు. కానీ ఈ జిహాదీలు ఆన్యమతస్థులపై దాడులు జరపడం ద్వారా ప్రచ్ఛన్న బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. ఈ ప్రచ్ఛన్న బీభత్సకాండకు మతాల రంగు పులమడం, మతకల్లోలాల ముసుగు తొడగడం తగని పని. జమ్మూ లో ఇటీవల జరిగిన అల్లర్లు కాని, ముజాఫర్ నగర్‌లో ఇప్పుడు జరిగిన కల్లోలాలు కాని, పాకిస్తాన్ ప్రేరిత ఈ ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకాండలో భాగం. ఇస్లాం మతనిష్ఠాపరులైన భారత రాజ్యాంగ బద్ధులైన సామాన్య ముస్లింలకు ఈ పాకిస్తానీ ప్రచ్ఛ న్న బీభత్సంతో సంబం ధం లేదు. అందువల్ల ముజఫర్ నగర్ కల్లోలాలు పాకిస్తానీ ప్రచ్ఛన్న బీభత్సకాండ మాత్రమేనన్న వాస్తవాన్ని మన ప్రభుత్వం గుర్తించాలి. ముజఫర్ నగర్ జిల్లా కవాల్ గ్రామంలో జరిగింది లైంగిక బీభత్సకారుని విఫలయత్నం. ఇలాంటి లైంగిక బీభత్సం ‘లవ్ జిహాద్’ అన్న కుట్రలో భాగం. అంగీకరించిన హిందూ బాలికలను జిహాదీలు మతం మారుస్తున్నారు. అంగీకరించని వారిని, ప్రతిఘటించిన వారిని లైంగికంగా వేధించడానికి యత్నిస్తున్నారు. ఒక హిందూ బాలికను ఇలాంటి జిహాదీ వేధించడాన్ని ఆమె అన్నలిద్దరు ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన సంఘర్షణగా మారి దుండగునితోపాటు అన్నలిద్దరూ కూడ హతులయ్యారు. ఈ దశలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని అదుపు చేయలేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. బాధితురాలి అన్నలిద్దరూ హతులు కాగా, ఆమె తండ్రిని కూడ అరెస్టు చేసి ఆయనపై కేసు పెట్టారట...
 
ఇలా పరోక్ష బీభత్సకాండ ఫలితంగా, పాకిస్తాన్, ప్రభుత్వపు పంచమాంగదళమైన జిహాదీల కారణంగా భిన్న మతాల మధ్య విద్వేషాలు రాజుకుంటుండటం మిక్కిలి దురదృష్టకరం. రాజకీయ పార్టీలు మత వర్గాల మూక ఉమ్మడి వోట్లకోసం విద్వేషాలను మరింతగా రాజేస్తుండడం జాతీయ వైపరీత్యం. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు పదమూడు సార్లు ఇలా కథాకథిత మతఘర్షణలు చెలరేగాయి. దాదాపు ఇవన్నీ కూడ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ప్రచ్ఛన్న జిహాదీ బీభత్స ఘటనలే! మతనిష్ఠకు, మతాలకు ఈ కల్లోలాలతో నిజానికి సంబంధం లేదు. అన్నలు అడ్డుపడకపోయి ఉంటే ఆ బాలిక ఆ దుండగుని లైంగిక బీభత్సానికి బలయి ఉండేది. మతంతో ఏమి సంబంధం!?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి