16, సెప్టెంబర్ 2013, సోమవారం

చైనా ప్రచ్ఛన్న దళాలు... మావోయిస్టులు - హెబ్బార్ నాగేశ్వరరావు


భారతదేశంలో అనాదిగా కొనసాగిన ఆర్థిక వ్యవస్థను అమలు జరపడం ద్వారా చైనా ప్రగతి సాధించింది. చైనా వదలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంకోసం చైనా ప్రేరితులైన మావోయిస్టు బీభత్సకారులు మన దేశంలో హత్యలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా ‘దర్భ’ ప్రాంతంలో ఈనెల ఇరవై ఐదవ తేదీన జరిగిన మారణకాండ మావోయిస్టుల ప్రస్థానంలో మరో బీభత్స పదం... దాదాపు ఏభయి ఏళ్లపాటు ‘కమ్యూనిజమ్’ పేరుతో కేంద్రీకృత ప్రభుత్వ ఆర్థిక స్వామ్య వ్యవస్థను అమలుజరిపిన చైనా 1990వ దశకం నుండి వ్యవసాయాన్ని వాణిజ్యాన్ని ఉత్పాదక వ్యవస్థను వికేంద్రీకృతం చేసింది. ఈ వికేంద్రీకృత అర్థిక వ్యవస్థ భారతదేశంలో లక్షల ఏళ్లు అమలు జరిగింది. విదేశీయులు ఈ వ్యవస్థను చెరిచారు. బ్రిటిష్‌వారు పూర్తిగా ధ్వంసం చేశారు! చైనా ప్రభుత్వం ‘కమ్యూనిజమ్’ అన్న మాటను వదలిపెట్టకుండానే ‘కమ్యూనిజమ్’ ప్రతిపాదించిన వౌలిక తత్వాన్ని వదిలివేసింది. చైనా వదలివేసిన దానిని చైనా ప్రేరిత మావోయిస్టులు మన దేశంలో ఇంకా ప్రచా రం చేస్తున్నారు. చైనా వదలి పెట్టినదానిని మన దేశంలో ప్రతిష్టాపించడానికి సంఘటిత బీభత్స వ్యవస్థను నెలకొల్పారు, విస్తరింపచేస్తున్నారు! ఈ విస్తరణకు అడ్డుతగిలే వారందరినీ నిర్దాక్షిణ్యంగా హత్యచేయడం మావోయిస్టుల కార్యాచరణ పద్ధతి! ఈ ‘విస్తరణ’ను అడ్డుకొనడానికై ఛత్తీస్‌గఢ్‌లో ‘సాల్వాజుడుమ్’అన్న ఉద్యమం మొదలైంది! అందువల్లనే ‘సాల్వాజుడుమ్’ సంస్థాపకుడు మహేంద్రకర్మను ఈనెల ఇరవై ఐదున మావోయిస్టులు మట్టుపెట్టారు!

మావోయిస్టు బీభత్సకాండను ప్రతిఘటించేందుకు సంఘటిత ప్రజాఉద్యమం ఆరంభంకావడం అద్భుత పరిణామం. ఈ ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమం ‘సాల్వాజుడుమ్’ రూపమెత్తింది! మావోయిస్టుల తుపాకీ గొట్టాల నుండి దూసుకువచ్చిన తూటాలకు ప్రభుత్వ దళాలు- పోలీసులు అనుబంధ సైనికులు- వందలువేలుగా బలైపోతుండిన తరుణంలో బస్తర్ ప్రాంతంలోని వనవాసీ ప్రజలు మావోయిస్టులను ప్రతిఘటించడానికి సమీకృతమయ్యారు. సంఘటితమయ్యారు. అలా సంఘటితం చేసినవాడు మహేంద్రకర్మ. బీభత్సం ముందు ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మోకరిల్లిన తరుణంలో, ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూడకుండా సామాన్య ప్రజలు నిరుపేద వనజనులు ప్రతిఘటించారు. ఇది మావోయిస్టులు ఊహించని పరిణామం. దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రతిఘటన ఉద్యమం ఆరంభంకాలేదు. 2005లో మహేంద్రకర్మ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు! మావోయిస్టులంటే నక్సలైట్లంటే భయవిభ్రాంతికి గురికావడం మాత్రమే దేశవ్యాప్తంగా అంతవరకు ప్రజల ప్రతిస్పందన! బెదిరిపారిపోవడం మాని ప్రజలు మావోయిస్టులకు ఎదురునిలవడం పేరు ‘సాల్వాజుడుమ్’. అందుకే ఎనిమిదేళ్లుగా పొంచి ఉన్న మావోయిస్టులు మహేంద్రకర్మను హత్యచేశారు. ఆయనతోపాటు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్‌ను ఆయన కుమారుడు దినేశ్‌పటేల్‌ను చంపేశారు. మొత్తం ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇలా ఒకేసారి మావోయిస్టుల మారణాగ్నికి ఆహుతి కావడం మావోయిస్టుల వికృత విస్తరణకు నిదర్శనం. ఇలా మావోయిస్టులు బలపడడానికి ప్రధాన కారణం ‘సాల్వాజుడుమ్’ను సుప్రీంకోర్టు చట్టవ్యతిరేకమైన సంస్థగా ప్రకటించడం కారణం కావచ్చు!!

చైనాలో విఫలమైన ‘కమ్యూనిజమ్’ వౌలిక సిద్ధాంతం 1991 నాటికి తూర్పు ఐరోపాలోను, సోవియట్ యూనియన్‌లోను విఫలమైపోయింది! ‘కమ్యూనిజమ్’ ప్రభుత్వపు పెట్టుబడిదారీ విధానంగా అవతరించడం ఇందుకు కారణం!! పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రధాన ప్రేరకం సంపద, వనరులు, ఉత్పాదక వ్యవస్థ! యాజమాన్యం ఒకేచోట భారీగా కేంద్రీకృతం కావడం! ప్రాచీన భారతీయ సమాజంలో ఈ కేంద్రీకరణ లేదు. అట్టడుగు స్థాయివరకు సంపద వనరులు ఉత్పాదక వ్యవస్థ యాజమాన్యం అత్యంత సహజంగా వికేంద్రీకృతమైనాయి. ఐరోపా నుండి బయలుదేరిన దోపిడీదారులు వ్యాపారుల రూపమెత్తి ఆ తరువాత పాలకుల రూపమెత్తి భారతీయ వ్యవస్థను భగ్నంచేశారు. భారతీయ వ్యవస్థ మన దేశానికి మాత్రమే పరిమితంకాలేదు. వికేంద్రీకరణకు ప్రతీక! వికేంద్రీకృత ఆర్థిక సమాజం అతి ప్రాచీన కాలంలో అన్ని దేశాలలో ఉండడానికి భారతీయ సంస్కారం కారణం! ఈ సంస్కారాన్ని ఐరోపా దోపిడీదారులు అంతంచేశారు. వాణిజ్య సంస్థలు పారిశ్రామిక సంస్థలు వందలువేలుగా పుట్టుకొచ్చి సంపదను వనరులను ఉత్పాదక వ్యవస్థను యాజమాన్యాన్ని కేంద్రీకృతం చేశారు. ఇదే పెట్టుబడిదారీ విధానమైంది. ఆంగ్లంలో కాపిటలిజమైంది!! ‘కమ్యూనిజమ్’ ‘కాపిటలిస్ట్’ వ్యవస్థకు మరో రూపం మాత్రమే! ఒక్కటే తేడా! ‘కాపిటలిస్ట్’ వ్యవస్థలో వందలాది లేదా వేలాది పెట్టుబడిదారులు ఉన్నారు. ‘కమ్యూనిస్టు వ్యవస్థ’లో ఒకే ఒక్క పెట్టుదారుడు ఉన్నాడు! ఆ పెట్టుదారుడు ప్రభుత్వం! అంటే ప్రభుత్వపు పెట్టుబడిదారీ వ్యవస్థ పేరు ‘కమ్యూనిజమ్’!

కమ్యూనిజమ్ అన్ని దేశాలలోను విఫలంకావడానికి కారణం పెట్టుబడిదారుడు- ప్రభుత్వం- ప్రభుత్వ నిర్వాహకులు- ప్రజలను పాశవికంగా రాక్షసంగా దోచుకొనడమేనన్న సత్యం 1989లో ఐరోపాలోను 1991లో సోవియట్ రష్యాలోను ధ్రువపడిన చారిత్రక వాస్తవం! కానీ మళ్లీ పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత భయంకరంగా ప్రపంచమంతా విస్తరించిపోతుండడం ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-వల్ల సంభవించిన వైపరీత్యం. పెట్టుబడిదారీ వ్యవస్థ- కాపిటలిజమ్- ఒక దోపిడీ వ్యవస్థ. కథాకథిత సామ్యవాదం - కమ్యూనిజమ్- రెండవ దోపిడీ వ్యవస్థ! ఈ రెండు మాత్రమే ప్రత్యామ్నాయాలనేది ప్రపంచ ప్రజలను ఆవహించి ఉన్న మాయ. మూడవ ప్రత్యామ్నాయం ఉంది. నిజానికి ఇది మొదటి ప్రత్యామ్నాయం, అనాదిగా భారతదేశంలో సహజంగా వికసించిన సనాతన- శాశ్వత- వ్యవస్థ ఆ ప్రత్యామ్నాయం!! వికేంద్రీకరణ దీని స్వరూపం, ఒకరు మరొకరిని దోపిడీ చేయడానికి అవకాశం లేకపోవడం దీని స్వభావం. చిన్న కమతాల రైతులు, చిన్న వ్యాపారులు, స్వతంత్ర వృత్తులను అవలంభించిన చిన్న యజమానులు ఈ సనాతన వ్యవస్థను పరిపుష్టం చేశారు!

క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలోకి చొరబడడానికి విఫలయత్నం చేసి చంద్రగుప్త, సముద్రగుప్తుల ప్రతిఘటనకు భయపడి పారిపోయిన గ్రీకు బీభత్సకారుడు అలెగ్జాండరు. అతని కాలంనాటికి ‘డమాస్కస్’ ఉక్కును ప్రసిద్ధం! ఈ ‘డమాస్కస్’ వ్యాపార కేంద్రం మాత్రమే! అక్కడికి సరఫరా అయిన ‘ఉక్కు’ భారతదేశంలో తయారయినది. వేలాది పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో ఈ ఉక్కును తయారుచేశారు. ఈ పారిశ్రామికవేత్తలు యజమానులైన కమ్మరులు. వారి పరిశ్రమలు కొలిమిబట్టీలు! ఉక్కు ఉత్పత్తి ఒకే బృహత్ ప్రాంగణంలో కేంద్రీకృతం కాలేదు. పల్లెపల్లెలో ‘ఉక్కు’ను తయారుచేసిన కమ్మరులు యజమానులు, పారిశ్రామికవేత్తలు! దోపిడీదారులు కాదు. ఇలా తయారయిన ఉక్కును బండ్లకెత్తుకొని వెళ్లి పంపిణీచేసిన చిట్టి వ్యాపారి కూడ దోపిడీ చేయలేదు! వ్యవసాయం చేసినవారు భూమికి యజమానులు, చేయించినవారు కాదు... ఈ వి‘కేంద్రీకరణ’ దోపిడీకి అవకాశం ఇవ్వలేదు. ఇది మొదటి కారణం, రెండవది ఈ భూమి పట్ల భూమినుండి వచ్చిన ప్రజలకు కల మమకారం. ఈ మాతృభూమి పట్ల మమకారమే జీవన విధానమైంది, ధర్మమైంది, భక్తి అయింది, జాతీయతగా మారింది!! పాశ్చాత్య దేశాలనుండి వచ్చి పడిన ‘కాపిటలిజమ్’ వీటిని వికృత పరిచింది. తోడేళ్లవలె దూకిన ‘కమ్యూనిజమ్’ వీటిని భగ్నం చేసింది!!

విచిత్రమైన పరిణామం చైనాలో జరిగింది. 1989లో పడమట ‘కమ్యూనిజమ్’ అంతరించిన తరువాత చైనా ప్రభుత్వం సంపదపై, వనరులపై, ఉత్పాదక వ్యవస్థపై, యాజమాన్యంపై తన భల్లూకపు పట్టు సడలించింది. కట్టుబానిసలుగా పడి ఉండిన కోట్లాది ‘ఉద్యోగుల’ను యజమానులుగా మార్చింది. ఒక ఎకరం, ఇంకా తక్కువ విస్తీర్ణంకల పొలానికి యజమానులు వెలిశారు. చిన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు తయారయ్యారు. వీరందరూ పదేళ్లలో చైనా ప్రగతి గతిని మార్చేశారు. భారతీయమైన వికేంద్రీకృత వ్యవసాయ పారిశ్రామిక వాణిజ్య పద్ధతులు చైనాలో వ్యవస్థీకృతం కావడం ప్రచారానికి నోచుకోని బృహత్ పరిణామం!! అందువల్ల కమ్యూనిజమ్ పేరుతో చెలామణి అయిన ప్రభుత్వపు పెట్టుబడిదారీ విధానాన్ని చైనా వదలి వేసింది. చైనా వదలివేసిన కమ్యూనిస్టు ఆర్థిక సిద్ధాంతాన్ని మన దేశంలో నెలకొల్పే నెపంతో మావో సేటుంగ్ స్ఫూర్తిని పొందిన మావోయిస్టులు మనదేశంలో ఎందుకని హత్యలు చేస్తున్నట్టు??

కారల్ మార్క్స్ ప్రపంచ ప్రజలందరూ సమాన ఆర్థిక ప్రగతి సాధించాలని కలలుకన్నాడు! కానీ ఆయనకంటె పూర్వం లక్షలాది ఏళ్లుగా భారతీయ ఋషులు ఈ సమాన ఆర్థిక ప్రగతి సాధించే పద్ధతిని సహజ జీవనంగా వ్యవస్థీకరించారు!! ‘‘యావత్ భ్రియేత జఠరం తావత్ స్వత్వం షిదేహినామ్, అధికం యోభిమనే్యత సస్తేనోదండమర్హతి’’ అని మనువు చెప్పిన ఆర్థిక నీతి ఒక అంశం మాత్రమే!! ‘‘ఆకలిని తీర్చుకొనడానికి అవసరమైన దానిని సంపాదించాలి. అధికంగా కూడబెట్టినవాడు దొంగ, వాడు శిక్షార్హుడు...’’ - ఇదంతా ఈ ‘ప్రగతి’అంతా సగం మాత్రమే. మరో సగం సుగతి. ఈ ‘సుగతి’ని నేర్పించినది భారతీయ సంస్కారం! ఈ ‘సుగతి’ ధ్యాసతో కూడిన ‘ప్రగతి’ దోపిడీ చేయాలన్న భావాన్ని అంకురింపచేయదు, అంకురింపనీయదు! ‘కాపిటలిజమ్’ ‘సుగతి’ని వికృతపరచింది, కమ్యూనిజమ్ ‘సుగతి’ని పరిమార్చింది...

మావోయిస్టులు ఈ చారిత్రక వాస్తవాన్ని గ్రహించినట్టయితే తుంచడంమాని సంస్కారాన్ని పెంచడం నేర్చుకుంటారు! అలా నేర్చుకోనట్టయితే వారిని ప్రతిఘటించడానికి ఏకైక మార్గం భారత ప్రభుత్వం సైనిక దళాలను వినియోగించడం! మావోయిస్టుల లక్ష్యం నిజానికి ఆర్థిక సమానత్వం కాదు! చైనా ప్రభుత్వం ప్రాబల్యాన్ని విస్తరింపచేయడమే మావోయిస్టుల ఏకైక లక్ష్యం. చైనా దురాక్రమణ వ్యూహంలో రెండు భంగిమలున్నాయి. భారత సరిహద్దులకు ఆవల చైనా సైనికులు పొంచి ఉన్నారు. ఇది మొదటిది. మన సరిహద్దుల లోపల మావోయిస్టులు విస్తరిస్తున్నారు. ఇది రెండవ భంగిమ. మావోయిస్టులు చైనా ప్రభుత్వం ప్రచ్ఛన్న దళాలు...
source: http://andhrabhoomi.net/content/c-261

1 కామెంట్‌: