తేజ్ పూర్.... మధ్య అసొంలోని ఒక అందమైన బుజ్జి పట్టణం.
తేజ్ పూర్ అప్పుడే నిద్ర మేల్కొని, డబుల్ బెడ్ మంచంపై అటూ ఇటూ బద్ధకంగా దొర్లే అందమైన అమ్మాయిలా ఉంటుంది.
తెల్లారగానే బిలబిల్లాడుతూ మేఖలా చాదర్ (అసొం మహిళల పరంపరాగత దుస్తులు) వేసుకుని స్కూలుకు వెళ్లే సీతాకోకచిలుకల్లాంటి ఆడపిల్లల్లా ఉంటుంది.
ఎటు చూసినా పచ్చదనం.....మధ్యలో పాకుతూ వెళ్తున్న పాముల్లాంటి రోడ్లు.
గిజిగాడు కట్టుకున్న గూళ్లలాంటి ఇళ్లు....
ఒక వైపు సుదూరంగా దిగంతరేఖపై వెండి వెలుగులతో మెరిసిపోయే హిమాలయాలు .
ఇంకో వైపు పరుచుకున్న మెత్తటి పచ్చిక తివాచీ.
అమొలా పట్టీ (ఉద్యోగుల కాలనీ) నుంచి బస్ స్టేషన్ కి వెళ్తూంటే కనిపిస్తుంది పదుమ్ పుఖురి. పదుమ్ అంటే
తామరపూలు. పుఖురి అంటే చెరువు.
తామర చెరువన్నమాట.
ఆ చెరువులో చిన్ని ద్వీపం.
ఆ ద్వీపానికి చెక్క వంతెన.
ఆ చెరువులోతుల్లోకి దూకి అట్టడుగున వెతికితే అదృష్టవంతులకు అప్పుడప్పుడూ చిల్లరనాణాలు దొరుకుతాయ్.
పాత ఒక్క నయాపైసా, రెండు పైసలు, అయిదు పైసలు, పది పైసలు దొరుకుతాయ్.
చెరువేమిటి? చిల్లరేమిటి?
ఇదే మనం చెప్పుకోబోయే కథ. ఆ కథ చెప్పుకోవాలంటే మన ఊహల్ని రివర్స్ గేర్ వేసి యాభై ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాలి.
* * *
1962, ఆక్టోబర్ 18.
తేజ్ పూర్ పట్టణంలో అల్లకల్లోలం......
ఎటు చూసినా హడావిడి.... ఎవరి ముఖంలో చూసినా ఆందోళన.
సైకిళ్లపై మూటలు కట్టుకుని, తోపుడు బళ్లలో దొరికినవి పెట్టుకుని, ఎడ్లబండి నుంచి లారీల దాకా ఏది దొరికితే అందులో దొరికినన్ని సర్దుకుని ప్రజలందరూ పరుగులు పెడ్తున్నారు.
కొందరు గువహటి వైపు....
ఇంకొందరు భొమురాగురి వైపు....
తేజ్ పూర్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది.
ఊరు ఊరంతా పలాయనం చేస్తోంది.
"చైనా వాళ్లు వచ్చేస్తున్నారు" ఇదే మాట ఊరు ఊరంతా వినిపిస్తోంది.
చైనా సైనికులు సరిహద్దు రేఖ దాటి జెమిథాంగ్, తవాంగ్, దిరాంగ్, బొమ్ డిలాల వరకూ వచ్చేశారు. ఎక్కడికక్కడ భారతీయ సైనికులను ఊచకోత కోసేస్తున్నారు. సైన్యం ప్రతిఘటించలేకపోతోంది. వందల సంఖ్యలో మన సైనికులు చైనా చేతిల్లో బందీలైపోయారు. చాలా మంది గాయపడ్డారు.
బొమ్ డిలా దాటితే నామెరి. నామెరి దాటితే భాలుక్ పుంగ్. భాలుక్ పుంగ్ దాటితే బిహుగురి, బిందుగురి, ఆ తరువాత మిషన్ చారాలి అంటే మిషన్ క్రాస్ రోడ్స్. ఆ రోడ్డుపై నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే తేజ్ పూర్.
అంతే...
చైనా సైనికులకి, తేజ్ పూర్ కి మధ్య కేవలం 40 కిలో మీటర్లే.
అందుకే ఊరు ఊరొదిలి పారిపోతోంది.
* * *
నిజానికి ప్రజలు నిన్నటి దాకా బింకంగానే ఉన్నారు. చైనావాళ్లతో పోరాడేందుకు కూడా తయారుగానే ఉన్నారు.
కానీ ...
చైనా సైనికులు బొమ్ డిలా ను ఆక్రమించుకున్నారన్న వార్త కార్చిచ్చులా వ్యాపించింది. బొమ్ డిలా తరువాత పెద్ద పట్టణం తేజ్ పూరే. తేజ్ పూర్ ని ఆక్రమిస్తే అప్పర్ అసొం, అరుణాచల్ ప్రదేశ్ లకు గువహటికి మధ్య లింకులు తెగిపోతాయి. బ్రహ్మపుత్రకి అటువైపున ఉన్న నగావ్ ని ఆక్రమించుకుంటే ఆ వైపు రాకపోకలు కూడా స్తంభించిపోతాయి. మొత్తం అసొం చైనా విషపు గుప్పిట్లో ఇరుక్కుని ఊపిరాడక చచ్చిపోతుంది.
మరో వైపు కమ్యూనిస్టులు "చైనా జిందాబాద్" నినాదాలు చేస్తున్నారు. చైనా సేనలకు వెల్కమ్ చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు ఛైర్మన్ మావో బొమ్మ ముద్రించిన కార్డులను పంచుతున్నారు. "చైనా సైనికులు వచ్చాక ఈ కార్డులు చూపించండి. మీకేం కాదు." అని ప్రచారం చేస్తున్నారు.
ప్రజల మనసులో ఏదో తెలియని గుబులు.
* * *
అంతలో మరో పిడుగుపాటు.....
ప్రజలందరినీ కాపాడాల్సిన డిస్ట్రిక్ట్ కమిషనర్ (జిల్లా కలెక్టర్) తన సామాను, సరంజామాలను లారీల్లో ఎక్కించుకుని, భార్యా పిల్లలతో సహా అఫీషియల్ కార్లలో ఊరొదిలి పారిపోయాడు. ఊరు ఖాళీ అవాల్సి వస్తే అందరికన్నా చిట్టచివర ఊరొదలాల్సిన వాడు ఊరందరికన్నా ముందే ఊరొదిలి పారిపోయాడు.
కమీషనరే పారిపోతే ఆఫీసర్లు, సిబ్బంది ఏం చేస్తారు?
వాళ్లూ పలాయన మంత్రి పఠించేశారు.
జైలర్ పోతూ పోతూ జైలు తలుపులు తెరిచేశాడు. ఖైదీలందరూ "చైనా జిందాబాద్" అంటూ బయటకు వచ్చేశారు. ఊరుమీద పడి దొరికింది దోచుకుంటున్నారు.
తేజ్ పూర్ పిచ్చాసుపత్రి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. వందలాది మంది పిచ్చివాళ్లు ఊరిమీద బడ్డారు. వాళ్ల నోటా "చైనా జిందాబాద్."
దీంతో ప్రజల గుండె చెదిరింది. వాళ్లూ తేజపూర్ ని వదిలేయడం మొదలుపెట్టారు.
* * *
పదుమ్ పుఖురీ కి ఒక వైపు ఎలక్ట్రికల్ ఆఫీసు ఉంది. అది పనిచేయడం మానేసింది.
ఊరంతా చీకటి.
మరో వైపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అప్పట్లో ఊరంతటికీ అదొక్కటి బ్యాంకు. చైనా వాళ్ల చేతుల్లోకి మన కరెన్సీ వెళ్లకుండా ఉండేందుకు బ్యాంకు అధికారులు కరెన్సీ కట్టలను కుప్పలు పోసి నిప్పంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
బాంకు రికార్డులను కూడా తగలబెట్టేశారు.
డబ్బాల కొద్దీ చిల్లరనాణాలు మిగిలిపోయాయి.
వాటినేం చేయాలి?
ఉద్యోగులు వాటిని పదుమ్ పుఖురీలోకి విసిరేయడం మొదలుపెట్టారు.
ముందు గుప్పిళ్లతో విసిరేశారు.
తరువాత డబ్బాలను గుమ్మరించేశారు.
ఇదంతా చూసిన పారిపోతున్న వాళ్లలో కొందరికి దింపుడు కళ్లం ఆశ మొదలైంది. తమ సామాన్లను రోడ్డుపైనే ఉంచి నీళ్లలోకి దూకారు.
చిల్లర దొరికింది చాలా తక్కువ.
ఉన్నది పోయిందే ఎక్కువ.
వాళ్లు బయటికి వచ్చే సరికి వాళ్ల సామాన్లు వాళ్లకన్నా ముందే ఊరొదిలేశాయి.
* * *
చైనా వాళ్లు తేజ్ పూర్ రాకుండానే యుద్ధవిరామం ప్రకటించారు. వెనక్కి వెళ్లిపోయారు.
అక్టోబర్ 18 వస్తే తేజ్ పూర్ పలాయనానికి యాభై ఏళ్లు పూర్తవుతాయి.
చరిత్రలో ఒక చీకటి ఘడియ అది. తేజ్ పూర్ లో ఇప్పటికీ ఆనాటి కథలు చెప్పేవారున్నారు.
చైనా దురాక్రమణకీ యాభై ఏళ్లు పూర్తవుతున్నాయి.
పదుమ్ పుఖురి చిల్లర శ్రీమహాలక్ష్మిలా కడుపులో కరెన్సీని దాచుకుంది.
అసొం నుంచే రాజ్యసభకి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ కి ఈ సంగతి తెలియదు లాగుంది.
తెలిసుంటే ........
"డబ్బులు చెట్లకు కాయవు.
చెరువులో దొరుకుతాయి....." అని ఉండేవాడు.
(నెక్స్ట్ స్టోరీ - తేజ్ పూర్ లో తేజాన్ని చూపించి నిలిచిన వాళ్లెవరు? బ్రేక్ కే బాద్)
(ఫోటోల్లో మొట్టమొదటిది పదుమ్ పుఖురి. ఇది ఇప్పటి ఫోటో. రెండవది చైనా సరిహద్దు నుంచి తేజపూర్ మార్గాన్ని చూపంచే మ్యాప్. మూడోది అరుణాచల్ లోని బొమ్ డిలా నుంచి తేజపూర్ ఘాట్ రోడ్. చివరిది చైనా యుద్ధం అనంతరం 1963 లో తేజపూర్ ఆర్మీ బేస్ ను సందర్శించిన కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ జయంతి నాథ్ చౌదరి (మన హైదరాబాద్ ను విముక్తం చేసిందీ ఈయనే), ఎయిర్ వైస్ మార్షల్ మీనూ ఇంజనీర్. కుడి వైపున తేజ్ పూర్ ఆర్మీ బేస్ కమాండెంట్ గ్రూప్ క్యాప్టెన్ ఎ.ఎస్.ఎం. భావనానీ)
http://rakalokam.blogspot.in/2012/10/50-1_7.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి