24, ఫిబ్రవరి 2013, ఆదివారం

క్రైస్తవానికి కష్టం ! రానున్నది 'చివరి పోప్' !!

క్రైస్తవానికి కష్టం!
రానున్నది 'చివరి పోప్'.. ఆపై మతానికి పతన దశ
900 ఏళ్ల కిత్రమే సెయింట్ మలాచీ భవిష్య వాణి
112 మంది పోప్‌ల జాబితా ప్రకటన

'క్రైస్తవానికి కష్టం వస్తుంది! పతనం ప్రారంభమవుతుంది!'... ఎవరు చెప్పారీ మాట? ఎవరో చెబితే మాత్రం నిజమైపోతుందా? మూలమూలలకూ విస్తరిస్తున్న, ఇతర మతాల వారినీ ఆకట్టుకుంటున్న క్రైస్తవానికే కష్టమా? అసాధ్యం! అని కొట్టిపడేయవచ్చు! కానీ... ఇది సెయింట్ మలాచీ మాట! ఆయన చెప్పినవన్నీ నిజమవుతాయా అంటే... నిజమయ్యాయి! 'రాబోయే కాలంలో పోప్‌లు వీరే' నంటూ 900 ఏళ్ల క్రితమే 112 మంది జాబితా ప్రకటించేశారు! ఆయన చెప్పిందే జరిగింది. ఆయన లెక్క ప్రకారం... 112వ పోప్ తర్వాత క్రైస్తవానికి పతనదశ మొదలవుతుంది!

ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా... 'ఎపుడో చెప్పెను బ్రహ్మంగారు' అంటూ ఆయన ఖాతాలో వేస్తాం! 2012 తర్వాత ప్రపంచమే అంతమైపోతుందని మయాన్లు చెప్పేశారన్నాం! నోస్ట్ర డామస్ చెప్పినవెన్నో జరిగాయని అంటున్నాం! వీరబ్రహ్మం, మయాన్‌లు, నోస్ట్రడామస్... ఈ కోవకు చెందినవారే సెయింట్ మలాచీ. ఆయన 1094లో ఐర్లాండ్‌లో జన్మించారు. 1148లో మరణించాడు. 1139లో వాటికన్‌ను సందర్శించారు. ఆ సమయంలోనే అలౌకికావస్థలో భవిష్యవాణి వినిపించారు. దీన్ని ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు.

అందులోని వివరాలు బయటకు రాకుండా చర్చి అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే... 1590లో బెనెడిక్ట్ అర్నాల్డ్ డివైన్ అనే మతగురువు మలాచీ భవిష్యవాణిని గ్రంథరూపంలోకి తెచ్చాడు. అప్పుడు... తొలిసారి అది ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఆయన జాబితాలో 111వ పోప్ అవధి కూడా పూర్తి కావడం, 112వ పోప్ ఎవరనే ప్రశ్న తలెత్తడంతో మలాచీ భవిష్యవాణిపై క్రైస్తవ ప్రపంచంలో పెద్ద చర్చ జరుగుతోంది.

నమ్మాలా? వద్దా?
సెయింట్ మలాచీ భవిష్యవాణితో చర్చి ఎప్పుడూ ఏకీభవించలేదు. అయితే, ఇప్పటిదాకా మలాచీ పేర్కొన్న పోప్‌ల పేర్లు తప్పుకాకపోవడం గమనార్హం. కాకపోతే ఆ జాబితాలో పోప్‌ల అసలు పేర్లు కాకుండా, సంకేత నామాలను మాత్రమే పేర్కొన్నారు. ఉదాహరణకు... 1963నుంచి1978దాకా పోప్‌గా ఉన్న పాల్-6 పేరు ను 'ఫ్లావోస్ ఫ్లోరం' అన్నారు. ఫ్లావోస్ ఫ్లోరం అంటే పువ్వులకే పు వ్వు అని అర్థం. పాల్-6 పేరుకు, దీనికీ సంబంధం లేదు. కానీ, పాల్-6 తన పాలనావధికి ఐర్లాండ్‌లో దొరికే పువ్వులతో ఓ చిహ్నా న్ని రూపొందించాడు. అదే... 'ఫ్లావోస్ ఫ్లోరం'. సెయింట్ మలాచీ భవిష్యవాణి ప్రకారం పాల్-6 తర్వాత... 'డీ మెడిటేటీ ల్యూనా' అనే నామధేయుడు పోప్ కావాలి. ఈ పద బంధానికి 'అమావాస్య చంద్రుడు' అని అర్థం. సెయింట్ మలాచీ అంతరార్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.

అయితే, పాల్-6 తర్వాత పోప్ అయిన జాన్‌పాల్-1 నెల రోజుల్లోనే మరణించారు. ఆయన ఒక అమావాస్యకు పదవిని అధిరోహించారు. మరో అమావాస్యకు మరణించా రు. జాన్‌పాల్-1 తర్వాత 'జాన్‌పాల్-2' సుదీర్ఘకాలం పోప్‌గా ఉన్నారు. సెయింట్ మలాచీ ఆయన పేరును 'డీ లేబరీ సోలిస్' అని పేర్కొన్నాడు. లాటిన్‌లో ఈ పదానికి 'సూర్యగ్రహణ సమయం' అని అర్థం. విషయమేమిటంటే... పోప్ జాన్‌పాల్-2 సూర్యగ్రహణ సమయంలో జన్మించారు. 2005లో జాన్‌పాల్-2 మరణం తర్వాత 111వ పోప్ ఎంపికపై కసరత్తు జరుగుతున్నప్పు డు... అందరూ 'మలాచీ ఏం చెప్పారు?' అని ఆసక్తిగా వెదికారు. ఈ ప్రశ్నకు లభించిన సమాధానం... 'గ్లోరియా ఆలివా'. దీనికి 'ఆలివ్‌లాంటి అద్భుతమైన వ్యక్తి' అని అర్థం. దీంతో ఆలివ్ చిహ్నంగా ఉన్న చర్చికి సంబంధించిన వ్యక్తి పోప్ అవుతారని అం తా భావించారు.

బెనెడిక్ట్ చర్చి చిహ్నం ఆలివ్ ఆకులే. మలాచీ చెప్పినట్టే ఆ చర్చికి చెందిన కార్డినల్ జోసఫ్ రాట్జింగర్ పోప్‌గా ఎన్నికయ్యారు. పోప్ అయ్యాక ఆయన పేరును కూడా 'బెనెడిక్ట్- 16'గా మార్చుకోవడం మరో విశేషం. ఆయన రాజీనామా తర్వాత 112వ పోప్‌పై చర్చ మొదలైంది. మలాచీ జాబితాలో 112వ పోప్ పేరు 'పీటర్'. ఈ పదవికి పోటీపడుతున్న వారిలో ఘనాకు చెందిన కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ఒకరు. అయితే, మలాచీ ఎక్కడా పేర్లను ప్రస్తావించలేదు. పీటర్ అంటే 'కఠిన శిల' అనే అర్థంకూడా ఉంది. దీంతో 'పీటర్' పేరున్నవారే పోప్ అవుతారా? సంకేతనామం కలిసి వస్తుందా? అన్నదే ప్రస్తుతప్రశ్న!

వినాశం మాటేమిటి?
పోప్‌లు- వారి హయాంలో విపరిణామాలను మలాచీ తన భవిష్య వాణిలో వివరించారు. 1914లో పోప్ బెనెడిక్ట్-15 పదవి ని అధిష్ఠించిన సమయాన్ని 'రిలెజియో డిపాప్యూలేటా' అని రాశా రు. 'మతాన్ని నాశనం చేస్తారు' అని ఈ పదాలకర్థం. అప్పుడు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షల మంది క్రైస్తవులు మరణించారు. 112వ పోప్ విషయంలోనూ మలాచీ ఇలాంటి వ్యాఖ్య లే చేశారు.

'అతను తన గొర్రె పిల్లలను అనేక ఒడిదొడుకుల నుంచి తప్పిస్తాడు. అయితే, చివరకు ఏడు కొండలున్న నగరం నాశనమవుతుంది. భయంకరమైన న్యాయ నిర్ణేతే ప్రజల భవితను నిర్ణయిస్తాడు' అని చెప్పారు. వాటికన్‌ను 'సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్' (ఏడుకొండల నగరం) అని కూడా పిలుస్తారు. ఒకవేళ పీటర్ టర్క్‌సన్ పోప్ అయితే... ఆయనకు 65 ఏళ్లు. మరో 20 ఏళ్లు చురుగ్గా ఉండగలుగుతారు. అంటే 2033నాటికి ఏదో పెద్ద విపత్తు ముంచు కొస్తుందనేది మలాచీని విశ్వసించేవారి ఆందోళన!

- స్పెషల్ డెస్క్, ఆంధ్రజ్యోతి 

 http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/feb/24/main/24main28&more=2013/feb/24/main/main&date=2/24/2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి