3, ఏప్రిల్ 2012, మంగళవారం

క్షీరారామం, పాలకొల్లు

క్షీరారామం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా

 

ఆలయ విమానం, ముందు మండపం
రాజ గోపురం
క్షీరారామం, పాలకొల్లు


తారకాసురుని సంహారానికి పూర్వంనుంచే ఇక్కడ శివారాధన జరుగుతూవుండేదని ప్రతీతి. సప్త మహర్షులలో కౌశిక మహర్షి ఒకరు. ఆయన కుమారుడు ఉపమన్యుడు ఇక్కడ శివారాధన చేస్తూ, శివునికి అభిషేకము చేయటానికి పాలు లభించకపోవటంతో ఆ పరమేశ్వరుడినే ప్రార్ధించాడు. ఫరమేశ్వరుడు భక్తునికోరిక తీర్చటానికి తన త్రిశూలంతో నేలపై గ్రుచ్చగా అక్కడ పాలకొలను ఏర్పడింది. అప్పటినుండీ ఆ వూరి పేరు పాలకొలను అయింది. వాడుకలో పాలకొల్లుగా మారింది.

ఐదు భాగాలయిన అమృత లింగంలో ప్రధాన భాగమైన శిరో భాగమిక్కడ పడ్డదని, శివలింగానికి కొప్పు భాగంలో వున్న ఆకారం దీనికి ఋజువంటారు. అంతేగాక అక్కడ లభించిన శాసనాలలో కూడా ఈ స్వామిని కొప్పు లింగేశ్వరుడిగా వర్ణించారు.

ఒక కధనం ప్రకారం మిగతా నాలుగు ఆరామాలలో అమృతలింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తానికి వివిధ దేవతలచే జరపబడినా, క్షీరారామంలో మటుకూ, శివాదేశంతో ఆ శకలము పెరగకుండా కాపాడబడి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడింది.

దేవస్ధాన ప్రచురణ దివ్య పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామం లో శ్రీ క్షీరారామలింగేశ్వరుడి ప్రతిష్ఠ శ్రీ మహా విష్ణువుచే కావింపబడిందని వ్రాశారు. ఆపుస్తకం ఆధారంగా శ్రీ మహా విష్ణువు శ్రీ క్షీరారామలింగేశ్వరుడిని త్రిపురసుందరి (పార్వతీదేవి) సమేతంగా ప్రతిష్ఠించి శివుని కోర్కెపై క్షేత్రపాలకుడిగా శ్రీ లక్ష్మీసమేతుడై, శ్రీ జనార్దనస్వామిగా ఈ క్షీరారామంలో కొలువైనాడు. అంతేగాక వివిధ క్షేత్రాలలో అక్కడి దేవతలను సంవత్సరాలతరబడి భక్తితో సేవిస్తే వచ్చే ఫలితం ఈ క్షేత్రంలో ఒక నిద్రతోనే లభిస్తుందని, ఈ స్వామి దర్శనంతో బ్రహ్మ హత్యాది సకల పాపాలూ పోతాయని శ్రీ మహావిష్ణువు క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠించినప్పుడు ఈ క్షేత్ర విశిష్టతను గూర్చి తెలిపారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ప్రయోగించి సర్వ పాప నాశనకరమైన రామగుండం పుష్కరిణిని ఏర్పరిచారు.

ఆలయ విశేషాలు


ఈ ఆలయ విశేషాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది రాజగోపురం, ప్రజల భాషలో పెద్ద గోపురం. దీనిని 1777 సంవత్సరంలో శ్రీ బచ్చు అమ్మయ్యగారు నిర్మింపచేశారని కొందరంటే రెడ్డి రాజుల కాలంనాటిదని ఇంకొందరి కధనం. దీని ఎత్తు షుమారు 120 అడుగులు. 9 అంతస్తుల నిర్మాణం ఇది. చివరి అంతస్తుదాకా వెళ్ళటానికి లోపలనుంచి మెట్లు వున్నాయి. ఆలయ గోపురాలలో మొదటి లేక రెండవ ఎత్తైన గోపురం ఇదని ఒక రికార్డు వున్నట్లు నేను విన్నాను. కానీ ఆలయంవారు ప్రచురించిన పుస్తకంలో ఈ విశేషాన్ని మరిచారు. ఈ గోపురం మీద అనేక సుందర శిల్పాలు చెక్కబడి వున్నవి. ఈ గోపురాన్ని 2000 సంవత్సరంలో స్ధానిక శాసన సభ్యులు శ్రీ అల్లు వెంకట సత్యనారాయణగారి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో పునరుధ్ధరించారు. ఫ్రాచీన కాల శిల్ప సంపదని కాపాడటానికి ప్రభుత్వం చేసిన కృషి కొనియాడదగింది. అలాగే చరిత్ర గురించి కూడా ఇలాంటి ప్రముఖ ఆలయాల కమిటీలు శ్రధ్ధ తీసుకుని తగు పరిశోధనల తర్వాత సరియైన విశేషాలను పుస్తక రూపంలో ప్రచురిస్తే మన పూర్వీకులు మనకందించిన అద్భుతమైన పౌరాణిక చారిత్రాత్మక కళాఖండాల వారసత్వాన్ని తర తరాలకు అందించగలరు.

ఇప్పుడు ఇక్కడ కొలువైన దేవతల గురించి తెలుసుకుందాము. ఫ్రధాన దైవం క్షీరా రామ లింగేశ్వరుడు తెల్లగా పాలలాగా అద్భుతమైన వర్ణంతో దర్శనమిచ్చే రెండున్నర అడుగుల ఎత్తైన లింగం. స్వామిని చూడగానే భక్తి ప్రపత్తులతో చేతులు జోడించకుండా వుండలేము. ఇంకొక విశేషం. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో సూర్యోదయ సమయంలో సూర్యని కిరణాలు పెద్ద గోపురం రెండవ అంతస్తునుండి శివలింగంపై పడటం.

స్వామి ఎదురుగా ప్రాకారమండపం మధ్యలో చిరు గంటల పట్టీతో, కాలి మువ్వలతో అందంగా వున్ననల్లరాతి నందీశ్వరుడున్నాడు.

అమ్మవారు పార్వతీ దేవి రామలింగేశ్వరునికు ఎదురుగా వున్న మండపంలో కుడివైపు కొలువు తీరింది. పూర్వం శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇదివరకు ఈవిడని త్రిపుర సుందరీదేవిగా కూడా వ్యవహరించేవారు. ఇక్కడ నిత్య కుంకుమార్చనలు జరుగుతాయి.

క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి అని చెప్పాను కదా. ఆయన చుట్టూవున్న వెండి మకర తోరణం మీద వున్న దశావతారాలనుకూడా చూడండి మరి. ఈయన దేవేరి లక్ష్మీదేవి మందిరంకూడా దర్శించండి.

ప్రధానాలయంలో పశ్చిమ ముఖంగా ఋణహర గణపతి వున్నాడు. ఈయన్ని పూజిస్తే ఋణ విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. కానివ్వండి మరి.

రావణ వధానంతరం శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషం పోగొట్టుకోవటానికి రామేశ్వరలింగంతోపాటు కాశీ నుంచి తెచ్చిన 106వ శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందుకే ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శిస్తే ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించినట్లేనని భక్తులు భావిస్తారు. ఇంకా ఈ ప్రాకారంలో వున్న ఆంజనేయస్వామి, వీరభద్రేశ్వరుడు వంటి అనేక దేవీ దేవతా మూర్తులనేకాక ఆలయ స్తంబాలపై చెక్కిన పురాణ ఘట్టాలను, చాళుక్య, రెడ్డి రాజుల, కాకతీయ రాజుల శాసనాలు కూడా వీక్షించండి
 
 http://harrik83.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి