4, ఏప్రిల్ 2012, బుధవారం

తరతరాల బూజు... నిజాం నవాబు


దురంతాల నిజాం పిశాచపు దుర్మార్గాలు...
రజాకార్ల అరాచకం...అత్యాచారాలు..
అల్లాడిపోయిన హైదరాబాద్‌ సంస్థానం
విముక్తి కోసం విప్లవోద్యమం...
ఓ పక్క ఆర్యసమాజం, మరో పక్క వామపక్షాలు
సత్యాగ్రహం... సాయుధ పోరాటం...
నిజాంపై సమాంతరంగా సాగిన మహాయుద్ధం...
పోలీస్‌ యాక్షన్‌తో పిశాచం పరారీ..
 

జనారణ్యాన్ని వదిలి దెయ్యాల దేశానికి పరారైన శుభదినం...
రాజు ముసుగులో రాక్షసుడు నిజాం నుంచి విముక్తి పొందిన శుభదినం..సెప్టెంబర్‌ 17... హైదరాబాద్‌కు ముక్తి లభించిన సమయం... నిజాం నేలలో ఆలస్యంగా ఉదయించిన స్వతంత్ర సూర్యుడు...
 

....

భారత దేశ చరిత్రలో అదొక రక్తసిక్తమైన అధ్యాయం.... దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్‌ సంస్థానంలో రక్తపుటేర్లు పారాయి. దక్షిణ పాకిస్తాన్‌గా తన్ను తాను ప్రకటించుకోజూసిన నిజాం రక్కసిమూకలు రజాకార్ల పేరుతో మానవ మహా మారణకాండను యథేచ్చగా నిర్వహించాయి. నిజాం నుంచి విముక్తి కోసం వామపక్షాలు సాయుధ పోరాటం ఉద్దృతంగా చేశాయి... దీనికి సమాంతరంగా ఆర్యసమాజం నిజాం పై యుద్ధాన్ని చేసింది. భారత దేశం పదమూడు మాసాల పాటు స్వతంత్ర ఫలాలను అనుభవించిన తరువాత కానీ, నిజాం చెర నుంచి హైదరాబాద్‌ ముక్తి పొందలేదు.. పోలీసు చర్య ఒక పైశాచిక పాలనకు చరమగీతం పాడింది...
 

దేశం ముక్కలైనా స్వాతంత్య్రం వచ్చిందే పదివేలంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా సంబరాలు జరుపుకుంటున్నారు... పండిట్‌ నెహ్రూ జెండా ఎగరేసి భావి భారతం గురించి ఉపన్యసిస్తున్నారు.. కానీ, స్వాతంత్య్రం వెంటే దక్కను పీఠభూమిలో రక్తతర్పణమూ జరిగింది. నిజాం సంస్థానం రక్తసిక్తమైపోయింది. మతోన్మాద నియంత నిజాం దురంతాలు సంస్థానాన్ని ఎరుపుమయం చేసింది. మధ్యయుగపు ఆటవిక మూక... మహా మారణకాండకు ఒడిగట్టింది...
 

``బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్ల పోతవు కొడుకో... నైజాము సర్కరోడా...'' ఇది అందరికీ సుపరిచితమైన పాటే...
నాజీలను మించిన నిజాం కిరాతకం హైదరాబాద్‌ సంస్థానాన్ని అతలాకుతలం చేసిన తీరుకు విప్లవ వీరుడు బండి యాదగిరి రాసిన ఈ గీతం నిలువుటద్దం... ఓ పక్క భారత దేశం అంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితేలుతుంటే... నిజాం పాలనలో ఉన్న దాదాపు కోటిన్నర మంది ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.. ఏ క్షణంలో రజాకార్ల రక్షస మూక విరుచుకుపడుతుందో తెలియక భయంతో అల్లాడుతున్నారు.. ఎక్కడ చూసినా వేడిగా పారుతున్న రక్తపు మరకలే కనిపిస్తున్నాయి... సంస్థానంలోని పది జిల్లాల్లో రజాకార్లు విశృంఖలంగా వీర విహారం చేస్తున్నారు.. కనపడ్డ వాళ్లను కనపడ్డట్లు నరికి పారేశారు... కాల్చిపారేశారు.. చెట్లకు కట్టి చిత్రహింసలు చేశారు.. ఆడవాళ్లనైతే అమానుషంగా మానభంగం చేశారు.. సామూహికంగా చెరిచారు.. ముక్కలు ముక్కలు చేసి విసిరేశారు.. ఒక నరహంతక భూతం జడలు విప్పి నాట్యం చేసిన కాలం అది..
 

ప్రపంచ చరిత్రను రక్తసిక్తం చేసిన సందర్భాలు అనేకం ఉండవచ్చు.. వేలాది మందిని ఊచకోసిన నియంతలనూ మనం చూశాం... కానీ, వారందరినీ తలదన్నేలా అరాచకాన్ని సృష్టించిన నవాబు.. ఏడవ నిజాం... సంస్థానంలో 99శాతం ఉన్న హిందువులను మైనార్టీలోకి మార్చటానికి నిజాం చేయని అకృత్యమంటూ లేదు.. మతోన్మాదం ముదిరిన తీవ్రవాది నిజాం...రజాకార్ల పేరుతో ఓ ప్రైవేటు సైన్యాన్ని రూపొందించిన కాశిం రజ్వీకి తనతో సమానమైన అధికారాలు దఖలుపరచిన పాపం.. నిజాం సంస్థానంలోని సమస్త ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రజల్లో ఆత్మాభిమానం చచ్చిపోయి జీవచ్ఛవాల్లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ పడితే అక్కడ రజాకార్ల అరాచకం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోయింది. పూలదుకాణాల చాటున, గాజుల దుకాణాల చాటున సాగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు... 

బతుకుమీద ఆశ ఉన్నవాడెవ్వడూ ఆ దారుణాల గురించి గుసగుసలుగా కూడా మాట్లాడుకునే సాహసం చేయలేదు.. బలవంతపు మతమార్పిళు్ల జరిగాయి. పండిన పంటను ఊడ్చిపెట్టుకెళ్లారు... జనానికి తిండి లేదు.. నీళు్ల లేవు.. బట్ట లేదు.. బతుకే హేయమైపోయిన దుస్థితి... 

పారిపోదామన్నా ఎక్కడ పట్టుకుని చంపేస్తారేమోనన్న భయం.. కాశింరజ్వీ నాయకత్వంలో ఊళ్లకు ఊళు్ల దోచుకున్నా అడిగే నాథుడు లేడు.. అడ్డు చెప్తే... సామూహిక మారణకాండే...పదుల సంఖ్యలో చంపేసి బావుల్లో పూడ్డిపెట్టిన దుర్మార్గులు రజాకార్లు...
1

947లోనైతే... వాడీ నుంచి బయలుదేరిన ఓ రైలును గాండ్లాపూర్‌ స్టేషన్‌ వద్ద ఆపేసి అందులోనుంచి మహిళలను దింపి వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మను ఆడించిన క్రూరత్వం రజాకార్లది... వందలాది మందిని జైళ్లలో నిర్బంధించి ఏమయ్యారో కూడా తెలియకుండా చంపేసింది నిజాం ప్రభుత్వం... దీనికి మించి భూస్వామ్య వ్యవస్థ పల్లె జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం సంస్థానంలో ప్రజల జీవితం జంతువుల కంటే హీనంగా మారింది..
 

...............2...............
 

నాజీని మించిన నిజాం పరిపాలనపై నెమ్మదిగా ప్రారంభమైన ప్రతికూలత క్రమంగా ఉవ్వెత్తున ఎగసింది. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ పేరుతో కాశింరజ్వీ తొత్తులు రజాకార్ల దురంతాలను గ్రామాల్లో క్రమంగా ప్రజానీకం ఎదిరించటం ప్రారంభించారు... శాంతియుతంగా మొదలైన నిరసన క్రమంగా సాయుధ పోరాటంగా మారింది... ఓ పక్క కమూ్యనిస్టుల సాయుధ పోరాటం... మరో పక్క ఆర్యసమాజం సత్యాగ్రహోద్యమం, ఇంకో పక్క కాంగ్రెస్‌ పోరాటం... నిజాంకు వ్యతిరేకంగా ముప్పేట దాడిగా మారిపోయింది. గ్రామాల్లో యువకులతో బృందాలు ఏర్పడ్డాయి. నిజాంకు వ్యతిరేకంగాఆర్యసమాజం తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించింది. పండిత నరేంద్ర, విద్యాలంకార్‌ చంద్రపాల్‌, శ్యామలరావు, బన్సీలాల్‌ వంటి వారు తీవ్ర స్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేశారు.. ఆర్యసమాజ్‌ కార్యకలాపాలను నిజాం నిషేదించాడు.. కార్యకర్తలను అరెస్టు చేశాడు... నిజాం సంస్థానం అంతటా పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు చేశారు... ఇంకోవైపు వామపక్షాలు సాయుధ పోరాటం వైపు మళ్లాయి. నిజాం నిరంకుశ పాలనకు మూలస్తంభాలైన భూస్వాములను తరిమి కొట్టడం కోసం గ్రామాల్లో యువకులు ఆయుధాలు చేపట్టారు.. జైళ్లపాలయ్యారు..
 

ఇక నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో కాశిం రజ్వీ మూక మరింత ఘోరానికి ఒడిగట్టింది. నిజాంకు వ్యతిరేకంగా సమావేశమయ్యారని రెండు వందల మందిని ఊచకోత కోసింది. ఒక్కొక్కరికి ఒక్కో తూటా వేస్‌‌ట చేయటమెందుకని, పదిమందిని వరుసగా నిలబెట్టి గుండెల్లో తూటా పేల్చింది. రెండువందల శవాలను గుండ్రాంపల్లి బావిలో వేసి గ్రామస్థుల చేతితోనే పూడ్చిపెట్టింది...
 

పులిగిల్ల, కొలనుపాక, ఆలేరుల్లో కూడా నిజాం దాష్టీకానికి బలైన వాళ్ళెందరో... ఇక వరంగల్‌ జిల్లా పరకాల నిజాం దాష్టీకానికి మరో జలియన్‌ వాలాబాగ్‌గా మారిపోయింది. 1947 సెప్టెంబర్‌లో పట్టపగలు ఒకే చోట 23మందిని ఊచకోత కోసారు...
 

వరంగల్‌ జిల్లా బైరాన్‌పల్లిలో రజాకార్లపై తిరుగుబాటు చేసిన ఫలితం 86మంది యువకుల బలి... బైరాన్‌పల్లిలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన దొడ్డి కొమరయ్య అమరవీరుడు... ఇక తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ.... పాలకుర్తిలో నిజాం తొత్తుగా ఉన్న భూస్వామి రామచంద్రారెడ్డి అనుచరులను తరిమికొట్టింది..
నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మారింది. వామపక్షాలు దానికి నాయకత్వం వహించాయి. నిజాం పాలనలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది సాయుధ పోరాటం...
 

రజాకార్లతో పాటు, జమీన్‌ దార్ల ప్రైవేటు సైన్యాలతో కూడా పోరాటం జరపాల్సి వచ్చింది. 1947 నాటికి పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. గెరిల్లా యోధులు తయారయ్యారు... ఫలితం,. పది లక్షల ఎకరాలను పంచిపెట్టారు..
నిజాం దురంతానికి చెరమగీతం పాడుతూనే వ్యవసాయ విప్లవ సమస్యను తెరమీదకు తీసుకువచ్చిన ఘనత ప్రతిఘటనోద్యమానికే దక్కుతుంది....నిజాం తరువాత కూడా ప్రభుత్వాలు భూసంస్కరణలు చేపట్టాయంటే, తెలంగాణ సాయుధ పోరాటం ఫలితమే...
 

3
 

వీరోచిత రైతాంగ పోరాటంలో దాదాపు నాలుగువేల మంది అమరులయ్యారు... పది వేల మంది జైళ్లలో మగ్గారు.. వామపక్ష యోధులు ఒకవైపు.. ఆర్యసమాజ వీరులు మరోవైపు తీవ్రంగా అణచివేతకు గురైనా యుద్దం ఆగలేదు. దాదాపు సంవత్సరం పాటు భారత ప్రభుత్వం పట్టించుకోలేదు... కానీ, ఉద్యమం తీవ్రమైన కొద్దీ భారత యూనియన్‌ కదలక తప్పలేదు.. సర్దార్‌ పటేల్‌ పూనికతో ప్రారంభమైన సైనిక చర్య అయిదు రోజుల్లోనే నిజాంను కరాచీ దాకా తరిమికొట్టింది...
 

``భారత స్వాతంత్య్రం వల్ల ఏర్పడే సమస్యల గురించి, పేదల గురించి నేను 1947 జూన్‌ 12తేదీన్నే చెప్పాను... మళ్లీ 1947 జూలై 14న పబ్లిగ్గా ఉపన్యసించాను.. ఇప్పుడు మళ్లీ అదే చెప్తున్నా.. ఈ నా సంస్థానానికి సంబందించినంత వరకు నేను స్వతంత్ర ప్రభువును.. బ్రిటిష్‌ వారు ఇంటిదారి పట్టడంతో నేను సంపూర్ణంగా స్వతంత్రుడనైనట్లు ప్రకటిస్తున్నా..'' ఇది నిజాం నవాబు పలికిన బీరాలు.. ఓవైపు తనకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తూనే దక్షిణ పాకిస్తాన్‌గా హైదరాబాద్‌ను మార్చే దుష్ట పన్నాగం పన్నిన వాడు నిజాం... అతడి ఆగడాలను నిరోధించాలన్న ఆలోచన చేయటానికి భారత ప్రభుత్వానికి స్వతంత్రం వచ్చిన తరువాత 13 మాసాలు పట్టింది. వేలమంది అమరులైన సమాచారం అందినా మొదట్లో మీనమేషాలు లెక్కించిన నెహ్రూ సర్కారు.. చివరకు సర్దార్‌ పటేల్‌ చొరవతో సైనిక చర్యకు పూనుకుంది. 1948 సెప్టెంబర్‌ 13న నిజాంపై సైనిక చర్య ప్రారంభమైంది. మొదట్లో బీరాలు పలికిన నిజాం అయిదు రోజుల్లోనే తోకముడిచాడు...సెప్టెంబర్‌ 17న పటేల్‌ ముందు మోకరిల్లి, పాకిస్తాన్‌కు పారిపోయాడు..
 

హైదరాబాద్‌కు విమోచనం అలా లభించింది. భారత యూనియన్‌లో కలిసింది. జీవచ్ఛవాలుగా మారిన ప్రజల కళ్లల్లో మళ్లీ జీవం తొణికిసలాడింది. కానీ, ఇక్కడే తెలంగాణ సాయుధ పోరాటం కొత్త మలుపులు తిరిగింది. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఉద్యమం ఆర్జించిన లాభం ఎంతో నష్టమూ అంతే...వామపక్ష విప్లవయోధులు నిజాం తొత్తులపై ఎక్కుపెట్టిన తుపాకులను భారత సైన్యం వైపు తిప్పారు... హైదరాబాద్‌ను స్వతంత్రం చేయాలన్న నాటి కమూ్యనిస్టు నాయకుల తలంపు తెలంగాణ యోధులకు నేటికీ గుర్తింపు లేకుండా చేసింది. మిగతా స్వాతంత్య్ర యోధులకు ప్రభుత్వం వల్ల లభించిన ప్రయోజనాలు వీరికి దక్కకుండా పోయాయి. నిజాం పాలిత ప్రాంతాల్లో తాము సాధించిన విజయాలు, తెలంగాణాను భారతావనిలో భాగంగా కాకుండా, ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించేలా చేయాలన్న తలంపు వివాదాస్పదమైంది.
 

కమూ్యనిస్టు నేత నిర్ణయంతో దాదాపు రెండు వేల మంది గెరిల్లా యోధులు 50వేల మంది భారత సైనికులతో పోరాడాల్సి వచ్చింది. వేల మంది డిటెన్షన్‌ సెంటర్లలో, జైళ్లల్లో భారత సైన్యంపై పోరాటం చేయాల్సి రావటం ఎంతవరకు సమంజసమనే మీమాంస కమూ్యనిస్టుల్లోనే మొదలైంది. ఒక వర్గం పోరాటాన్ని కొనసాగించాలంటే, మరో వర్గం వద్దని వారించటం.. మొత్తం మీద ఉద్యమం నీరుగారిపోయింది.
 

ఈ కారణంగానే భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు, నిజాం నియంతకు వ్యతిరేకంగా చేసిన పోరాట యోధులు మాత్రం చీకటిమాటునే కనుమరుగు కావలసి వచ్చింది. కమూ్యనిస్టులు చీలిపోవటానికి కారణం ఏదైనప్పటికీ, సామూహిక జనహననానికి కారణమైన నిజాంను ఎదిరించిన వీరులు అన్యాయమైపోయారు.. 

http://kovela.blogspot.in/2009/09/blog-post_16.html

1 కామెంట్‌: