అశ్వమేధాది యాగాలు చేయటం కలియుగంలో కష్టసాధ్యం. చేయదగినది అతిరాత్రం మాత్రమేనని పెద్దలమాట. కలియుగం ప్రారంభమయిన తర్వాత ఈ యాగాన్ని కేరళలో మాత్రమే నిర్వర్తించినట్టు కనబడుతోంది. తెలుగునాట మహాభారత రచనకు ముందు తిక్కన చేశారని చెబుతారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రదేశానికి అటువంటి వైభోగం పట్టబోతోంది. తెలుగువారందరికీ… ఎన్నో శతాబ్దాల తరవాత జరుగబోయే అతిరాత్రం చూసే అదృష్టం లభించబోతోంది.
భారతీయులు చాలా అరుదుగా చేసిన యాగాలలో అతిరాత్రం ఒకటి. దీనికే సర్వస్తోమం, జ్యోతిష్టోమం, అగ్నిచయనం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అగ్నిచయనాన్ని ఉత్కృష్ట సోమయాగం అంటారు. ప్రతి యజ్ఞంలోనూ ప్రధానంగా వాడే హోమద్రవ్యం సోమరసం. సోమలతలోని అన్ని భాగాలను యజ్ఞంలో ఉపయోగిస్తారు. దాని రసాన్ని హోమద్రవ్యంగా ఉపయోగించటం మాత్రమే కాదు, యజ్ఞప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. సోమరసాన్ని తాగినవారిని అంటే యజ్ఞం చేసినవారిని సోమపాయి, సోమపీధి అంటారు. వీరు సోమయాజిగా వ్యవహరింపబడతారు.
అన్ని యాగాలలోనూ ప్రధానంగా ఆరాధించబడే ఇంద్రునికి ప్రీతిపాత్రమైనది సోమలత. ఇది హిమాలయాలలో మాత్రమే లభిస్తుంది. అయితే ఇది దక్కను కర్ణాటక, కొంకణ ప్రాంతాల్లోని ఎత్తయిన పర్వతాల మీద ఉంటుందంటారు. ఇది అసలైనది కాదని చాలామంది అభిప్రాయం. సోముడు అంటే చంద్రుడు. సోమలత అంటే చంద్రసంబంధమైన తీగ. చంద్రుని శక్తి గ్రహించి ప్రసాదించగలది. చంద్రుడు పాలసముద్రంలో అమృతంతో ఉద్భవించాడు. అమృతతత్త్వాన్ని తనలో కలిగి ఉన్నవాడు కనుక సోమలత సాక్షాత్తు భూమిపైకి దిగివచ్చిన అమృతమే! సోమలతకు, చంద్రునికి ఉన్న సంబంధం ప్రత్యక్షంగానే కనపడుతుంది.
ఈ తీగ ఎదుగుదల చంద్రుని కళలను అనుసరించి ఉంటుంది. అమావాస్యనాడు తీగలపై ఒక్క ఆకు కూడా లేకుండా అన్నీ రాలిపోతాయి. మరునాటి నుంచి చిగుళ్లు రావటం మొదలై పూర్ణిమనాటికి తీగంతా ఆకులతో కళకళలాడుతుంది. మరుసటి రోజు నుంచి ఆకులు రాలటం ప్రారంభమై, అమావాస్యనాటికి బోసిపోయి, తీగలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ సోమలతను సేకరించడానికి ఎన్నో నియమనిబంధనలు ఉన్నాయి.
సోమలత ప్రధాన ద్రవ్యంగా ఉన్న యాగం కనుక దీనికి ‘ఉత్కృష్ట సోమయాగం’ అనే పేరు సార్థకం. యజ్ఞమ్ అంటే పరహితార్థం చేసే పని అని అర్థం. అందరికీ మేలు జరిగినప్పుడు, చేసిన వారికి కూడా మేలు జరుగుతుంది కదా! అందుకే పూర్వం రాజులు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా చేసేవారు. వాటిలో శ్రేష్ఠమైనది అశ్వమేధయాగం. ఈ యాగంలో ప్రధానమైన మూడు రోజులలో మూడవనాడు అతిరాత్రం నిర్వహిస్తారు కనుక ఆ రోజును అతిరాత్రం పేరుతోనే పిలుస్తారు.
ప్రతియజ్ఞంలోనూ మొట్టమొదట చేయవలసింది అగ్నిష్టోమమ్. ఇది మొదటిమెట్టు వంటిది. ఇది చేస్తే సోమయాజి అయి, ఇతరయాగాలు చేసే అర్హత లభిస్తుంది. ఆరవస్థాయికి చెందింది అతిరాత్రం. ‘అతిశయతారాత్రిః ఇతి అతిరాత్రం’ అని నిర్వచనం. అంటే రాత్రిని జయించినది అని అర్థం. ఎందుకంటే ఈ అతిరాత్రంలో మాత్రమే అర్ధరాత్రి కొన్ని శస్త్రాలు పఠిస్తారు.
ఒక మంత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాక భిన్నంగా ప్రయోగించే రీతికి శస్త్రం అని పేరు. ఏ క్రతువైనా ఉదయం, సాయంత్రం మాత్రమే చేస్తారు. మిట్టమధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ దైవకార్యాలు చేయరు. చేయరాదు. అలా చేస్తే వైపరీత్యాలు కలుగుతాయి. కాని అతిరాత్రంలో మాత్రం అర్ధరాత్రి చేయటం, శస్త్రప్రయోగం అనే ప్రత్యేకతలు కనపడతాయి. కనుక ఈ యాగానికి రాత్రిని జయించింది అనే పేరు సార్థకం. రాత్రి… చీకటికి, అజ్ఞానానికి, బాధకి, దుఃఖానికి సంకేతం. ఇటువంటి ప్రతికూల భావాలన్నిటినీ జయించిందనే అర్థం కూడా సరిపోతుంది.
ఈ యాగానికి ఉపయోగించే సంబారాలన్నీ ప్రకృతి సిద్ధమైనవి. ఇవన్నీ పంచభూతాలలో త్వరగా కలిసిపోయేవి, పర్యావరణానికి హాని కలిగించనివి, కాలుష్యాన్ని పోగొట్టగలిగినవి మాత్రమే. వాటిని సేకరించడానికి కూడా తిథివారనక్షత్రాలను, ముహూర్తాన్ని చూడాలి.
అగ్నిని రాజేయడానికి ఆరణిని మాత్రమే ఉపయోగిస్తారు. యాగశాలను… వాసాలు, తాటాకులతో మాత్రమే నిర్మిస్తారు. పాత్రలు వీలైనంతవరకు మట్టితో చేసినవే వాడతారు. సృక్స్రువాలు కొయ్యతో చేసినవే ఉంటాయి. యాగం పూర్తయ్యాక యాగశాలను అగ్నికి ఆహుతి చేసేటప్పుడు పూర్తిగా ఆహుతి అయిపోవాలి. ఇది శ్రౌతక్రతువు. దీనిని ఆచరణలో పెట్టడానికి అభ్యాసం ఉండాలి.
పునీత స్థలం భద్రగిరి…
భద్రాచలం శ్రీరాముడు పాదచారియై నడయాడి పవిత్రమొనర్చిన దండకారణ్యసీమ. రెండవది పావన గోదావరీ తీరం. మూడవది భద్రుడు తపస్సు చేసి, రాముని మెప్పించి, ప్రసన్నం చేసుకున్న మహిమాన్విత క్షేత్రం. (భద్రాచలం అంటే స్థిరమైన, భద్రతగల కొండ అని అర్థం). నాలుగవది భద్రాచలం పంచారామ క్షేత్రం. (ఐదుచోట్ల ఐదు భిన్న భావాలను వ్యక్తీకరిస్తూ రాముడు వెలసిన పునీత స్థలం). ఇటువంటి ప్రదేశంలో చేసిన ఏ పని అయినా, ఎన్నోరెట్ల ఫలితాలను ఇస్తుంది.
ఈ యాగంలో మరొక విశిష్టత ఉంది. యాగం చేయబోయే చోటు… జటాయు మంటపానికి వెనుకభాగంలో ఉంది. జటాయువు గ్రద్దజాతికి చెందినది. రామునికి సహాయం చేయటంలో ప్రాణాలను కోల్పోయింది. అదేజాతికి చెందిన గరుత్మంతుడు యజ్ఞపురుషుడైన విష్ణుమూర్తి వాహనం.
అంటే విష్ణువు రావాలంటే గరుడుని ఆగమనం తప్పనిసరి. విష్ణువు గరుడారూఢుడు కనుక, ఈ యజ్ఞంలో యజ్ఞకుండానికి గరుత్మంతుని ఆకారం వచ్చే విధంగా ఇటుకలను పేర్చుతారు. దీనిని ‘శ్యేన చితి’ అంటారు. (శ్యేనమంటే గ్రద్ద). యజ్ఞం పూర్తయిన తరువాత యజ్ఞశాలను దగ్ధం చేసే సమయంలో, యజ్ఞం సఫలమయిందనటానికి నిదర్శనంగా ఒక్క గ్రద్ద ఆ మంటల మీద ప్రదక్షిణంగా తిరుగుతుంది. ఇలా జరగటం యజ్ఞం యొక్క ప్రామాణికతకు నిదర్శనం.
కొన్ని నంబూద్రి కుటుంబాల వారు కేరళలో అతిరాత్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని తరతరాలుగా రక్షించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడో శాలిశకం 1901లో అతిరాత్రం చేశా రట. తరువాత క్రీ.శ.1918లో , 1956లో, 1975లో, 2011 లో అతిరాత్రాన్ని నిర్వహించారు. మొదటిసారిగా తెలుగునేల మీద చెయ్యమని భద్రాద్రిరాముడి ఆజ్ఞ అయ్యింది.
ఏ యజ్ఞానికైనా ఫలం… విశ్వశాంతి, లోకకల్యాణం, వాటికి అద్భుతమైన అనుభూతులు, ఆత్మౌన్నత్యం కూడా చేరుతాయి. ఎన్నో శతాబ్దాల తరువాత ఆంధ్రదేశంలో అతిరాత్రం జరుగబోతోంది. తమ జీవితకాలంలో ఇటువంటి మంచి అవకాశం రావటం ఎన్నోజన్మల పుణ్యఫలం.
సర్వేజనాః సుఖినోభవంతు
- డా. పి. అనంతలక్ష్మి
http://pravasarajyam.com/1/devotional/2012/04/20/athirathram-starts-from-tomorrow/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి