25, జూన్ 2012, సోమవారం

తెలుగు విజ్ఞానం అనంతం

(ఆచార్య ఆర్వీయస్ సుందరం)

తెలుగువారి ప్రాచీనభాష హోదా అందరాని మ్రానిపండుగానే మిగిలిపోయింది. అది వచ్చినా తెలుగువారికేమైనా మంచి జరుగుతుందని, ఉపయోగకరమైన పరిశోధనలు జరుగుతాయనే ఆశలు కూడా అడుగంటిపోయాయి. ఎందుకంటే తెలుగువారిలో తమ జాతిని గురించి, సంస్కృతిని గురించి, సాహిత్యాన్ని గురించి స్పృహ అంతంత మాత్రమే. ప్రాచీన భాషా హోదా రాక ముందే దాని గురించి నిజంగా కృషిచేసిన వారిని వదలి నాటకాలాడేవారికి కొన్ని పురస్కారాలందజేసి చేతులు దులుపుకున్నప్పుడే మనవారికి ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది.

కర్నాటక రాష్ట్రం వైపు ఒక్కసారి దృష్టి సారించండి. కేంద్ర ప్రభుత్వం హోదాలో ఇచ్చినా ఇవ్వకున్నా కన్నడం విశిష్టభాష అని నిరూపించుకోవడానికి విస్తృత పరిశోధనలకు కర్నాటక ప్రభుత్వం కోట్ల రూపాయల ధన సహాయం చేస్తోంది. కర్నాటక రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఒక్కొక్క కన్నడ శాఖకూ రెండు కోట్ల రూపాయలిచ్చి పరిశోధన ప్రణాళికలు చేయవలసిందిగా పురమాయించింది. మన ప్రభుత్వానికి ఇలాంటి విషయాలపై ఇసుమంతయినా ఆసక్తి లేదని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు.

తెలుగు సాహిత్యంలో తెలుసుకోవలసిన విజ్ఞానాంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. నన్నయకు ముందు కాలం నుండి ఈనాటి వరకు తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞానప్రసారం ఎలా జరిగిందో తెలుసుకోవటానికి వంద రకాల పరిశోధనలు జరగాలి. వీటిని మనం తెలుసుకుంటే చాలదు, ప్రపంచానికి తెలియజెప్పాలి.

తెలుగు సాహిత్యమంటే కేవలం నన్నయ, తిక్కన, శ్రీనాథుడు మాత్రమే అనుకొంటే పొరబాటే. మన సాహిత్య చరిత్రలన్నీ కొంతమంది కవులకు, శాస్త్రకారులకు, గణితశాస్త్రజ్ఞులకు, కావ్య మీమాంసకారులకు అన్యాయం చేశాయి. తెలుగు సాహిత్య పరిధిని, శాస్త్ర పరిజ్ఞానాన్ని విస్తృతపరచిన విజ్ఞులకు గౌరవం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అప్పుడే రేచన, కేతన, పాల్కురికి సోమనాధుడు, భాస్కరుడు మొదలైనవారు తెలుగువారి విజ్ఞాన ప్రసారానికి ఎలా దోహదం చేశారో తెలుస్తుంది.


 కేతన తిక్కన కాలంనాటి విశిష్టకవి. తిక్కన చేతనే 'అభినవ దండి' అని ప్రశంసలందుకున్న కవి. దండి మహాకవి రాసిన 'దశకుమార చరిత్ర' అనే గద్యకావ్యాన్ని కేతన చంపూకావ్యంగా రాసి తెలుగులో కథాకావ్యాలనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలుగువారి కోసం తెలుగులో మొదటి వ్యాకరణాన్ని 'ఆంధ్ర భాషాభూషణం' అనే పేరుతో కేతన రాశాడు. అంతేకాదు 'విజ్ఞానేశ్వరం' అనే పేరుతో తెలుగువారికి మొదటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా కేతనే రాసి ఇచ్చాడు. ఇంత ప్రతిభావంతుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలదు.

భారతీయులకు న్యాయపద్ధతుల్ని పాశ్చాత్యులే నేర్పారని, బ్రిటీషువారు రూపొందించిన చట్టాన్నే భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. అంతకంటే దారుణం ఏమిటంటే న్యాయపద్ధతి అన్నదే భారతీయులకు తెలియదని పాశ్చాత్యుల నుంచే దాన్ని నేర్చుకున్నారని కొందరు భావిస్తుంటారు. కాని భారతీయ న్యాయపద్ధతులకు రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. హిందూ న్యాయ చట్టాలు చాలావరకు భారతీయ స్మృతుల మీదనే ఆధారపడి ఉన్నాయి. భారతీయులు నేటికీ అనుసరించే పద్ధతులు యాజ్ఞవల్క్య స్మృతి లాంటి సాంప్రదాయిక జ్ఞానానికి సంబంధించినవే.

యాజ్ఞవల్క్యుని పేరుతో అనేకులున్నారు. క్రీస్తుపూర్వం సుమారు వెయ్యి సంవత్సరాలనాడే శుక్ల యజుర్వేదాన్ని ప్రత్యక్షించుకున్న యాజ్ఞవల్క్యడున్నాడని శతపథ బ్రాహ్మణం చెప్తోంది. యాజ్ఞవల్క్య స్మృతిని రచించిన ఋషి క్రీస్తు శతాబ్ది ఆరంభ కాలానికి చెందినవాడని పండితుల అభిప్రాయం. యాజ్ఞవల్క్య స్మృతికి చాలా వ్యాఖ్యానాలున్నాయి. విజ్ఞానేశ్వరుడు రాసిన 'మితాక్షర' చాలా ప్రసిద్ధమైంది. హిందూ న్యాయశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలకు ఆధారం 'మితాక్షర' వ్యాఖ్యానంతో కూడిన యాజ్ఞవల్క్య స్మృతి.

'మితాక్షర' రాసిన విజ్ఞానేశ్వరుడు కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందినవాడు. ఇటీవలి కాలంలో కర్నాటక ప్రభుత్వం విజ్ఞానేశ్వరుని రచనని కన్నడానికి అనువదించాలని నిర్ణయించుకుంది. గుల్బర్గా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, మంత్రులు కలిసి విజ్ఞానేశ్వరుని గురించి లోకానికి తెలియజెప్పే ప్రణాళికను రూపొందించారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. విజ్ఞానేశ్వరుడి పుస్తకం విలువని ఈనాడు కన్నడిగులు గుర్తిస్తే తెలుగుకవి కేతన 13వ శతాబ్దిలోనే గుర్తించాడు. కేతన కాలానికి హిందువుల మీద, హిందూమతం మీద ఇస్లాం తాకిడి ప్రారంభమయింది. హిందూ ధర్మశాస్త్రాల సహాయంతో దాన్ని ఎదుర్కొనే బృహత్కార్యాన్ని ఎంతోమంది చేపట్టారు. కేతన ఇలాంటి ఆదర్శంతోనే 'విజ్ఞానేశ్వరం' రచించాడు. ఇది యాజ్ఞవల్క్య స్మృతికి, 'మితాక్షర'కు కేవలం అనువాదం కాదు. ఆనాటి తెలుగు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కేతన ఈ గ్రంథాన్ని రచించారు. అందువల్ల తెలుగువారి సాంఘిక మత పరిస్థితులు, ఆచార సంప్రదాయాలు, న్యాయ, శిక్షా, నేరాలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవాలంటే సుమారు ఏడు శతాబ్దాల క్రితమే తెలుగువాడు రచించిన విజ్ఞానేశ్వరాన్ని పరిశీలించాలి.


 ఇలా చెప్పినంత మాత్రాన కేతన రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి విషయాన్ని అనుసరించాలని అర్థం కాదు. ప్రాచీన కాలం నుండి వస్తున్న పద్ధతులన్నీ అనుసరణ యోగ్యాలు కావు. తరతరాల నుండి వస్తున్న మూఢాచారాలను, వ్యర్థ విశ్వాసాలను కూడా అవి ప్రతిబింబిస్తాయి. అయితే న్యాయవ్యవస్థను సక్రమంగా రూపొందించుకోవటానికి కొన్నివేల సంవత్సరాలుగా భారతీయులు అనుసరిస్తూ వస్తున్న పద్ధతుల్ని పరిశీలించి ప్రస్తుత కాలానికి వాటిని అన్వయించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ విధంగా తన కాలానికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ శాస్త్రగ్రంథం ద్వారా వెలుగులోకి తెచ్చిన కేతన అభినందనార్హుడు.

కేతన తన గ్రంథంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో తెలుగు పదాలను వాడాడు. నిత్య వ్యవహారంలో ఉన్న పదాలను పారిభాషిక పదాలుగా తీర్చిదిద్దాడు. సరైన తెలుగు పదం లేదనుకున్నప్పుడు మాత్రమే సంస్కృత పదాలను వాడాడు. శాస్త్ర గ్రంథాలను ఈ విధంగా రాయడం తేలికయిన పనికాదు. 'విజ్ఞానేశ్వరా'న్ని విలువైన పీఠికతో ప్రచురించి (1977) తెలుగువారికి మహోపకారం చేసిన డాక్టర్ సి.వి.రామచంద్రరావు 'సంస్కృత ధర్మశాస్త్రంలోని సాంకేతిక పదాలకు తెలుగులో పారిభాషిక పదకోశంగా విజ్ఞానేశ్వరాన్ని చెప్పుకోవచ్చు. తేట తెనుగు మాటలు వాడడంలో కేతనకు కేతనే సాటి. ఈ విషయంలో అతడు తిక్కనను అనుసరించి, అతనితో పోటీపడతాడు' అన్నారు. (విజ్ఞానేశ్వర పీఠిక)

'వాని తల్లి, తోబుట్టు, వానియాలు' ఇలా బూతు మాటలు మాట్లాడేవారికి ఇరవై అయిదు పణములు జుల్మానా విధించాలని కేతన న్యాయం చెప్తోంది. దేశభాషలను కులాలను పేర్కొని తిట్టేవారికి నూరు పణములు జుల్మానా వెయ్యాలనటం ఈనాటికీ అనుసరించదగిన న్యాయమే : 'మురికినాటివారు, మొరుకులు, పెనుపరులరవవారు ద్విజులకాస పెద్దయనుచు దేశభాషలను కులంబు దిట్టునతడు దండువచ్చు శతపణములు'. కాయగూరలతో సహా దేన్నయినా దొంగతనం చేసేవారికి వెయ్యవలసిన జుల్మానా విషయం కూడా అచ్చ తెలుగులో కేతన చెప్పాడు.

'కాయగూర కట్టె కసవు మంచము పీట
యినుమునుప్పు గడవలియు మొదలు
చవిలెలోని వెలల సరకు మ్రుచ్చితినవా
డారుపు పణము దండు వరువవలయు'

కేతన 'విజ్ఞానేశ్వరం'లో ఆచారకాండ, ప్రాయశ్చిత్తకాండ, వ్యవహారకాండ అనే మూడు భాగాలున్నాయి. భారతీయ శిక్షాస్మృతి, సాంప్రదాయిక న్యాయపద్ధతులు, తెలుగువారి సాంఘిక జీవనం, వారి ఆచార వ్యవహారాలు, శాస్త్ర పరిభాష మొదలైన ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి, మనకూ ఇలాంటి గ్రంథాలు కొన్ని శతాబ్దాల ముందు నుంచే ఉన్నాయని తెలియజెప్పటానికి కేతన గ్రంథం పనికివస్తుంది.


 http://www.telugupeople.com/content/content.asp?contentID=1011406&uid=20120624144706&Page=1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి