25, జూన్ 2012, సోమవారం

మన మతాన్ని కాపాడుదాం : కులవ్యవస్థ: ఒకటవ భాగం


కులవ్యవస్థగురించి మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి మరియు సమాజం (పత్రికలు) ఎన్ని రకాలుగా నిరాశపరిచినా తట్టుకోగలగాలి. ఈ వ్యాసం టైటిలు చూసి చాలామంది నేను ఒక కులపిశాచినని తిడతారు. నేను అన్నింటికీ సిద్దపడే వచ్చాను. కులవ్యవస్థగురించి పూర్తిగా చెప్పాలంటే ఒక టపా సరిపోదు కాబట్టి కాస్త పెద్దగానూ ఒకటి కంటే ఎక్కువగానూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెప్పాలంటే దయచేసి టపాలో నేను చెప్పినదాని గురించి చెప్తే నేను చెప్పగలుగుతాను.

మొదట కులవ్యవస్థ వర్ణవ్యవస్థ రూపంలో ఉందని మనకు అనేకులు చెబుతారు. కాని మనపురాణకాలంలో లేదని చెప్పలంటే దానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అన్నింటికన్నా ముందు ఈ కులవ్యవస్థ ఆర్యులు తెచ్చారని చెబుతున్నారు. ఆర్యసిద్దాంతం (Aryan Invasion Theory) ప్రకారం రామాయణ మహాభారతాలు అస్సలు జరుగలేదు, పూర్తిగా కల్పితాలు. అంబేద్కర్ గారు కూడా ఆర్యసిద్దాంతాన్ని అంగీకరించలేదు. కులవ్యవస్థగురించి మాట్లాడాలనుకునేవారు ఆర్యసిద్దాంతాన్ని నమ్మితే దాని ప్రకారం ఆర్యులు తమతో పాటు తీసుకువచ్చిన ఈ వ్యవస్థను మనమీద రుద్దారు. ఆర్యసిద్దాంతాన్ని గురించి తరువాతి టపాలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను చెప్పలనుకున్నదాని ప్రకారం ఆర్యసిద్దాంతం అంతా అబద్దం అని రామాయణ మహాభారతాలు మన చరిత్ర అని నేను నమ్ముతున్నాను, దాని ప్రకారం నేను చెబుతాను (2002లో ద్వారకలో బయల్పడిన నిజాల ద్వారా అర్యసిద్దాంతం అబద్దం అని వేరే చెప్పనవసరంలేదనుకుంటున్నాను).
 

మనకు సమాజాన్ని విభజించమని చేప్పే సూక్తి మొట్టమొదట ఋగ్వేదంలోని పురుషసూక్తిలో దర్శనమిస్తుంది. ఆ సూక్తి గురించి తరువాతి టపాలో చెబుతాను. ఈ టపాలో రామాయణ మహాభారతాలగురించి చెప్పదలచుకున్నాను. మొదట రామాయణం గురించి మాట్లాడుకుందాం. “Why I am not a hindu” పుస్తక రచయిత కంచ ఐలయ్యగారు తన పుస్తకంలో రాముడు ఆర్యుడని పేర్కొన్నారు. ఆర్యసిద్దాంతం ప్రకరం ఆర్యులు అందరూ తెలుపు శరీర వర్ణంగా కలవారు. కాని రాముడు నీలిమేఘశ్యాముడని, తెల్లగాఉండడనీ పాపం ఆయన మరిచారు. రామాయణం ఆర్యద్రావిడుల యుద్దమని చెప్పేవారు అనేకులు ఉన్నారు. వారందరికీ ఒకేఒక్క ప్రశ్న- రావణాసురుడు తెల్లగా ఉంటాడు కాని రాముడు నల్లగా ఉంటాడు. రావణాసురుడు ద్రావిడుడు అయితే ఇది ఎలా సాధ్యం? అంతేగాక రావణుడు బ్రాహ్మణుడని మనకు రామాయణం చెబుతోంది. కాని మనకు మేధావులమని చెప్పుకునే వారందరూ ఈ విషయాన్ని చెప్పరు.
 

రాముడి వ్యక్తిత్వం గురించి మనకు తెలిసే మరో చేదు విషయం రాముడు ఒక శూద్రుడిని చంపడం. ఇది ఉత్తరకాండలోనిది. ఉత్తరకాండ రామాయణంలో లేదనీ తరువాత ఎవరో ఉద్దేశపూర్వకంగా రామాయణంలో దీనిని కలిపారని మనకు అనేక మంది చరిత్రకారులు చెప్పారు. ఇది కాకపోయినా మరొక సంఘటనను గమనిస్తే ఉత్తరకాండ అబద్దమని తేలిపోతుంది. ఇది రాముడు సీతను వెదుకుతూ వెళుతున్న సమయం. అప్పుడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడని మనకందిరికీ తెలుసు. శబరి అంటే శబర జాతికి చెందినది అని అర్థం. శబరజాతి వాళ్ళు శూద్రులకు బ్రాహ్మణులకు పుట్టిన మిశ్రమజాతి. ఒక మిశ్రమజాతి స్త్రీ ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్న రాముడు ఒక శూద్రుడిని చంపాడంటే ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. దీనికి ఉత్తరకాండ తరువాత చేర్చినది అని మరోసారి నేను చెప్పనవసరం లేదనుకుంటాను.
 

ఇప్పుడు మహాభారతంలోకి వద్దాం. కులవ్యవస్థ గురించి మాట్లాడేవారు చెప్పే మరొక ఉదాహరణ ద్రోణాచార్యుడు. ఏకలవ్యునిపట్ల ద్రోణాచార్యుని ప్రవర్తన ఏ విధంగానూ సమంజసం సమర్థనీయం కాదు. కానీ ఒక్కసారి నేను అడగదలచుకున్న ప్రశ్న అప్పటి కాలం గురించి మనం చర్చించుకునేటప్పుడు ద్రోణాచార్యుని ప్రవర్తన ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేది. ఒక్కసారి ద్రోణాచార్యుని జీవితం మనం పరిశీలిద్దాం. (మహాభారతం మీద వ్రాస్తున్నాప్పుడు ద్రోణాచార్యుని గురించి వ్రాయాలి అనుకున్నాను, కానీ ఇంతకంటే మంచి సమయం లేదని నేను ఇప్పుడు ద్రోణాచార్యుని గురించి వ్రాస్తున్నాను). ద్రోణుడు భరద్వాజ మహర్షికి కుండలో పుట్టాడు. ద్రోణుడి బాల్యమిత్రులలో ఒకడు ద్రుపదుడు. ద్రుపదుడు ఆటలాడుకునే సమయంలో ఒకసారి మిత్రునికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని ప్రమాణం చేసాడు. చదువు ముగిసిన తరువాత ద్రోణుడు కృపని(కృపాచార్యుని సహోదరి) వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన ఏకైక సంతానం అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టుకతోనే తలమీద ఒక మణితో పుట్టాడు. దానివల్ల ఎటువంటి శత్రువునైనా, ఆయుధాన్నయినా అవలీలగా భయం లేకుండా ఎదుర్కొనగలడు. అశ్వత్థామ చిన్నతనంలో ద్రోణుడు చాలా పేదరికంలో ఉండేవాడు. అది ఎంతటి పేదరికం అంటే అశ్వత్థామకు పాలకీ గంజికీ తేడా తెలియనంత. ఇది చూసి తట్టుకోలేక తన బాల్యమిత్రుడైనటువంటి ద్రుపదుడిని ధనసహాయం అడగడానికి వెళ్ళాడు. ద్రోణుడు కూడా చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద కోరికలేమీ అడగలేదు, కేవలం ఒక ఇల్లు, ఒక పాడిఆవును మాత్రం సహాయంగా తన బాల్యమిత్రుడిని అర్థించాడు. హస్తినాపురాన్ని ఎదుర్కోగలరాజయినప్పటికీ తన పాతస్నేహితుని ఇంతచిన్న కోరికలను కూడా ద్రుపదుడు మన్నించకపోగా గేలి చేస్తాడు. ఆ అవమానం భరింపలేక ద్రోణుడు పరశురాముడు తనదగ్గర ఉన్నవన్నీ దానం చేస్తున్నాడని తెలిసి అతని దగ్గరకు వెళతాడు. కానీ ద్రోణుడు వెళ్ళేటప్పటికి ఎంతో ఆలస్యం అవడంవలన మరియు పరశురాముడు అప్పటికే తన వద్ద ఉన్న ధనం మొత్తం దానం చేయడం వలన తన అస్త్రాలను ద్రోణునికి దానం ఇస్తాడు.
 

ధనం ఏమీలేక బాధతో హస్తిన(తన భార్య వద్దకు)కు తిరిగివస్తున్న ద్రోణుడు అప్పుడు కురుపాండవులకు మంచి గురువుకోసం వెదుకుతున్న భీష్ముడి కంటపడతాడు. అప్పుడు భీష్ముని అభీష్టం మేరకు కురుపాండవులకు అస్త్రవిద్యనందించడానికి అంగీకరిస్తాడు. అప్పుడు మొదట పెట్టిన ముందు పరీక్షలలో(Preliminary tests) అర్జునుడు మంచి విలుకాడు అవుతాడని గ్రహించి అతనిని సాటిలేని మేటి విలుకాడిగా తయారుచేస్తానని అర్జునునికి ప్రమాణం చేస్తాడు. కేవలం అర్జునునికి ఇచ్చినమాటకోసమే భీష్ముడు ఏకలవ్యునికి విద్యను నిరాకరించాడు మరియు తన ప్రమేయం లేకుండా తన ప్రతిమను గురువుగా భావించి నేర్చుకున్నందుకు బొటనవ్రేలిని గురుదక్షిణగా అడిగాడు. ఇది కాకుండా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరోకటుంది. అర్జునునికిచ్చిన మాటను పక్కనపెడితే ఏకలవ్యుడు నిషధరాజకుమారుడు. నిషధులు జరాసంధునికి మిత్రరాజులు, జరాసంధుడు హస్తినకు శత్రువు అవడంవలన అప్పటి ప్రకారం హస్తినకు శత్రువులు (భానుమతీ స్వయంవరంలో కర్ణుడిచేతిలో ఓడినప్పటినుంచీ జరాసంధుడు హస్తినకు మిత్రుడు). నాకు తెలిసీ తనకు ఆశ్రయం ఇచ్చినవారి శత్రువులకు ఎవరూ యుధ్ధవిద్యలు నేర్పించరని నేను భావిస్తున్నాను.
 

మరొక్కసారి ద్రోణుని మనం పరిశీలిద్దాం. బ్రాహ్మణులు ఎవ్వరూ శత్రుత్వానికి తమ మనస్సులలో చోటు ఇవ్వరాదని మన వేదాలు చెబుతున్నాయి. కానీ ద్రోణుడు ఇక్కడ తప్పాడు. ద్రోణుడు అర్జునుని సంపూర్ణ విలుకానిగా, అస్త్రవిద్యలలో సాటిలేని మేటిగా చేస్తానని ప్రమాణం చేసాడు (దాని అర్థం తనకు తెలిసిన సకలఅస్త్రాలను నేర్పుతాను అని), కానీ నారాయణాస్త్రాన్ని తన కుమారుడైన అశ్వత్థామకు నేర్పించాడు కానీ అర్జునునికి నేర్పించలేదు. అదే విధంగా బ్రహ్మశిరాస్త్రాన్ని(http://sacred-texts.com/hin/m10/m10015.htm) అశ్వత్థామకు అర్జునునికీ నేర్పించినప్పటికీ అర్జునునికి మాత్రమే ఉపసంహరించుకోవడం నేర్పాడు. (ఉపసంహరణ వలన ఒక అస్త్రాన్ని అనేక పర్యాయాలు ప్రయోగించవచ్చు.) ఈ విధంగా చూస్తే ద్రోణుడు తన మాట నిలబెట్టుకోలేదని చెప్పవచ్చు. అటు కన్నప్రేమకు న్యాయం చేయలేదు, ఇటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, మరో పక్క బ్రాహ్మణునిగా విఫలం అయిన ఒక వ్యక్తిని చూపించా అప్పటి కాలంలో కులవ్యవస్థ ఉందని మనం చెబుతోంది? తన ప్రతినకోసం కర్ణునికి కూడా ద్రోణుడు ఈ అస్త్రాలను నేర్పించలేదు. కానీ దానిగురించి ఎవరూ మాట్లాడలేదు (అంబేద్కర్ తో సహా). పుట్టుకతో క్షత్రియుడయినంతమాత్రాన జీవితాంతం సూతుడిగానే గడిపిన కర్ణుని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కర్ణుడు రాజుగా ఉన్నప్పుడు ఎవ్వరూ (మిగతా రాజులు) అభ్యంతరపెట్టలేదు. ఏకలవ్యుడు యువరాజుగా, రాజుగా ఉన్నప్పుడు ఎవ్వరూ అభ్యంతరపెట్టలేదు, కానీ అదేంటో ఒక్క బ్రాహ్మణుడు తన ప్రతినకోసం, తనకు ఆశ్రయం ఇచ్చినవారి మేలుకోసం, తనకు కష్టకాలంలో అన్నం పెట్టి ఆదుకున్న రాజ్యం కోసం శత్రురాజ్యపురాజకుమారుడికి విద్య నిరాకరించడం కులవ్యవస్థయొక్క వేళ్ళూనుకుపోయినతత్వాన్ని ఎలా చూపిస్తుంది? అబ్బే, ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. ద్రోణుడు సాధారణ సైనికుల మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన ఒక మతిలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక కులం గురించి ఎలా మనకు పూర్తి అవగాహన కల్పిస్తుంది? అదే ద్రోణుడు ధుర్యోధనుడు పాండవపక్షపాతి అని పదే పదే తిట్టేసరికి సొంత యోధులకు సైతం అర్ధంకాని పద్మవ్యూహాన్ని రచించాడు. కాని తన కుమారుడు చనిపోయాడని తెలిసేసరికి ఆయుధాలు అన్నీ వదిలేసి తపస్సుకు సిద్దమయ్యాడు తీవ్రంగా పోరాడుతున్న యుద్దభూమిలో అదీ తను పోరాడుతున్న సైన్యాలకు న్యాయకత్వం వహించాలని మరచిపోయి. ఇంతటి మానసికస్థైర్యం లేని వ్యక్తి చేసిన పనులను చూపించా మనం మన పురాణకాలంలో కులవ్యవస్థ ఉందని మన పూర్వీకులను తిట్టుకుంటున్నది? ఈనాడు కులవ్యవస్థ గురించి మాట్లాడేవారు నాకు కనీసం ఒక్క విషయానికయినా సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను. మహాభారతం తవ్వే కొద్దీ ఊరే జలం వంటిది. కనీసం ఒక్క వ్యక్తి గురించయినా పూర్తిగా తెలుసుకోకుండా మనవాళ్ళు ఇలా అభాండాలు వేయడం తగదు. నాకు తెలిసీ ద్రోణుడు ఒక విఫలమయిన వ్యక్తి. తండ్రిగా, గురువుగా, బ్రాహ్మణుడిగా, మనిషిగా, సైన్యాధ్యక్షుడిగా, మిత్రునిగా (తన మిత్రుడు తప్పు చేసినప్పుడు క్షమించగలిగే ఉదారహృదయం ఉండాలి) విఫలమయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూసా మనం మన పూర్వీకులను అంచనా వేస్తున్నది? ఒక కాలంలో ఒక కులంకానీ ఒక దేశం కానీ ఎలా ప్రవర్తిస్తున్నదో తెలుసుకోవాలంటే ఆ సమాజంలో అధికసంఖ్యాకులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. కేవలం ఒక్క వ్యక్తి మీద ఆధారపడి మనం నిర్ణయం తీసుకోకూడదు.
 

అప్పటికాలంలో ఉన్న మరో ప్రముఖ బ్రాహ్మణుడు కృపాచార్యుడు, అటువంటిది ఏమీ చేయలేదే. కానీ అతని గురించి ఎందుకు మాట్లాడరు? వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, ఇంకా చెప్పలంటే మిశ్రమజాతి సంతానం కానీ అతను మహాభారతాన్ని రచించాడు. ఆ మహాభారతాన్ని తరతరాలుగా బ్రహ్మణులు ఇప్పటివరకు చెప్పుకుంటూవచ్చారు. వ్యాసునికి పుట్టిన కుమారులను రాజకుమారులుగా (క్షత్రియులుగా) అంగీకరించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి పూర్వాశ్రమంలో ఒక దొంగ, కానీ రామాయణాన్ని అందరూ చదువుతారు కదా. ముఖ్యంగా బ్రాహ్మణులు తరతరాలుగా తమ వారసులకు నేర్పించలేదా? హస్తినకు శత్రువులగురించి నేను మాట్లాడినదాని వల్ల ఎవరైనా ద్రోణుడు ద్రుష్టద్యుమ్నునికి నేర్పించినదానిగురించి చెప్పవచ్చు. ద్రోణుడు ద్రుష్టద్యుమ్నునికి నేర్పించేనాటికి ద్రుష్టద్యుమ్నుడు అర్జునుని బావమరిది. ఒక్కసారి అప్పటికాలంలో రకరకాల వ్యక్తులు వర్ణవ్యవస్థకు ఎలా స్పందించారో చూద్దాం. కర్ణున్ని రాజుగా అందరూ అంగీకరించారు. కృష్ణుడు యాదవుడని రాజుగా అంగీకరించని జరాసంధుడు కర్ణున్ని మాత్రం అంగీకరించి, తన మిత్రునిగా అంగీకరించాడు. నిషధుడని ద్రోణుడు విద్య నిరాకరించిన ఏకలవ్యున్ని జరాసంధుడు మిత్రునిగా అంగీకరించాడు. అప్పటి ప్రముఖ రాజులయిన భాగదత్తుడు, జయద్రదుడు, కృతవర్మ ఎవ్వరికీ కర్ణుడు రాజుగా ఉండటానికి అభ్యంతరం చెప్పలేదు. శల్యుడు యుద్దంలో కర్ణున్ని నీరసపరచడానికి అన్ని రకాలుగా మాట్లాడాడుకాని కులం గురించి మాత్రం మాట్లాడలేదు. కులం మీద ఇతర బ్రాహ్మణులయిన అశ్వత్థామ, కృపాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. అప్పటికాలం నాటి రాజకీయ సాంఘీక పరిస్థితులు ఏమీ అవగాహన చేసుకోకుండానే డవిలాగులు వదలడం మనవారికే చెల్లింది.

 http://vaidikadharmam.blogspot.in/2009/01/blog-post_31.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి