తెలుగు వారి అచ్చ తెనుగు పండుగ 'ఉగాది' వచ్చింది. నందనానంద కరంగా
జరుపుకునే ఈ పండుగ సందర్భంగా మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని
ప్రత్యేకతలు, అవి చాలా ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుందామని...
అవధానం:
సాహితీ ప్రక్రియల్లో విశిష్టమైనది
అవధాన ప్రక్రియ. అష్టావధానం మొదలుకొని, సహస్రావధానం వరకు పృచ్ఛకులు అడిగిన
అన్ని రకాల సాహితీ ప్రశ్నలను, గుర్తుంచుకొని, ఏక కాలంలో, ఆశువుగా అవధాని
ఎవరి సమాధానం వారికి చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అవధాని యొక్క
మేధస్సు, ధారణా శక్తి, సాహిత్య పటిమ మీద అవధాన ప్రదర్శన, విజయం ఆధారపడి
ఉంటాయి. ఇంతటి క్లిష్టతరమైన ప్రక్రియ మరే భాషా సాహిత్యంలోను కనిపించదు.
ఆవకాయ:
ఆవకాయ పేరు చెప్పగానే నోరూరని తెలగు
వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరో కవి చెప్పినట్లు, చెట్టు మీద కాయని,
సముద్రంలో ఉప్పుని కలిపి చేసే ఈ పచ్చడి, దాని రుచి తెలుగు వారికి మాత్రమే
సొంతం. పెళ్ళిజరిగినా, పేరంటం జరిగినా ఆవకాయ ఘుమఘుమలు లేకుండా నిండుదనమే
ఉండదు కదండి.
బుర్ర కథ:
గ్రామీణ ప్రాంతాల్లో బుర్రకథని
మించిన కాలక్షేపం మరోటి ఉండదు. గ్రామీణుల జీవనం, జానపదుల సాహిత్యం, వారి
కథలు, పురాణాలు ఇలా ఒకటేమిటి? తందాన తాన అంటూ ముగ్గురు కలిసి ప్రదర్శిస్తూ,
పాటలు పాడుతూ, పద్యాలు ఆలపిస్తూ బుర్రకథ చెబుతుంటే, చెవి ఒగ్గని తెలుగు
వాడు ఉంటాడా?
నాటకాల్లో పద్యాలు:
తెలుగు వారి నాటకాల్లో
ప్రత్యేకత పద్యాలు. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని రాయబారం పద్యం ఆలపించినా,
'చెలియో చెల్లకో' అంటూ హరిశ్చంద్ర కాటిసీను పద్యం ఆలపించినా, తెలుగు వారు
మైమరచిపోతారు. ఒకసారి ఒకటో కృష్ణుడు పద్యం ఆలపించి, దాని చివర
ఆ..ఆ......ఆ........ఆ....... అంటూ రాగం ఆలపించడం మొదలు పెడితే ఇక నాటకం
పూర్తయే సరికి తెల్లారిపోవలసిందే. తెలుగు అజంత భాష అవ్వడం వలన పద్యం చివర
రాగం తీసినా మధురంగానే ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వరుడు / అన్నమయ్య కీర్తనలు :
తెలుగు వారికే ప్రత్యేకమైన ఇష్ట దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. అందరు
దేవతలకి అన్ని చోట్ల దేవాలయాలు ఉండొచ్చు గాని, సాక్షాత్తు విష్ణువు
వేంకటేశ్వరునిగా కొలువై వున్న తిరుమల గిరి తెలుగు వారి వరాల కొండ. 'ఎలమి
కోరిన వరాలిచ్చే దేవుడే' అంటూ ఆ స్వామిని నోరారా కీర్తించిన అన్నమయ్య
కీర్తనలు మనకు మాత్రమే సొంతం. 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ అచ్చ
తెలుగు సొగసులద్దిన అన్నమయ్య మన తెలుగు వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం
కాక మరేమిటి?
వేమన పద్యాలు:
చిన్న చిన్న పద్యాలలో కొండంత
భావాన్ని పొదిగిన వేమన పద్యాలు జీవిత సారాన్ని విశదీకరిస్తాయి. వేయి
మాటల్లో చెప్పలేని విషయాన్ని నాలుగు వరుసల్లో చెప్పగలగడం, అదీ అతి చిన్న
తెలుగు వాక్యాల్లో ఇమిడిపోవడం తెలుగు భాష గొప్పదనమైతే, అలా ఇమడ్చగలగడం
వేమనకే సాధ్యం. తెలుగు వారి హృదయాలలో వేమన స్థానం ఎప్పటికీ పదిలం.
గోరుముద్ద, ఉగ్గుపాలు:
మీరు ఎంత
గొప్పగా ఎన్ని భాషలు మాట్లాడగలిగినా, గోరుముద్దని, ఉగ్గుపాలుని ఏ భాషలోకైనా
అనువదించి చూడండి. తెల్ల ముఖం వేసారే? ఎందుకంటే ఈ పదాలకి సమానమైన పదాలు
వేరే భాషల్లో దొరకవు. చిన్న పిల్లలకి పెట్టే గోరు ముద్దలు, ఉగ్గుపాలు తల్లి
ప్రేమకు చిరునామాలు. తెలుగు తల్లులు ప్రేమకు ప్రతిరూపాలు.
వావి వరుసలు:
తెలుగు వారి వావి
వరుసలకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకు ఉన్నన్ని వరుసలు,
బాంధవ్యాలు మరే భాష వారికి లేవంటే అతిశయోక్తి కాదేమో? అక్క, చెల్లి,
అన్నయ్య, తమ్ముడు, వదిన, మరదలు, బావ, బావ మరిది, తోడికోడలు, తోడల్లుడు అంటూ
కనిపించిన ప్రతి ఒక్కరినీ ఒక్కొక్క వరుసతో పిలుస్తూ ఉంటే ఉండే ఆనందమే
వేరు. ఇప్పుడంటే కాన్వెంట్ చదువులు సోకయిపోయి, రిక్షా వాడి దగ్గర్నుండి,
పాలబ్బాయి దాకా కనబడ్డ ప్రతి మగాడిని ఆంకుల్, ఆడాళ్ళని ఆంటీ అని
పిలుస్తున్నారు, ఈ కాలం పిల్లలు. వారికి తెలుగు వారి వావి వరుసల్లో ఉండే
మధురమైన ఆనందాన్ని తెలియజేయాల్సిన అవసరం అందరి మీదా ఉంది.
చీర / పంచెకట్టు:
భారతదేశంలో
ఎక్కడికైనా వెళ్లండి, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళండి. అచ్చ
తెలుగు వాళ్ళని ఇట్టే పసిగట్టవచ్చు. తెలుగు వారి పంచెకట్టు, ఆడవారి
చీరకట్టు జగత్ ప్రసిద్ధమైనది. పంచె కట్టుకుని, నుదుటన బొట్టు పెట్టుకుని,
భుజాన ఉత్తీరీయం వేసుకుని తెలుగు పెద్దాయన నడిచి వెళుతుంటే, అప్రయత్నంగా
చేతులు జోడించ బుద్దేస్తుంది. అలాగే చీర కట్టులో మగువ అందాన్ని వర్ణించడం
మహాకవులకయినా సాధ్యం కాదేమో కదా..
తెలుగు భాష:
గొప్ప చెప్పుకోకూడదు
కానీ, అసలు తెలుగు భాషే తీయనైనది, కమ్మనైనది. అందుకే రాయల వారు 'దేశ
భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు విశిష్టతను చెప్పకనే చెప్పారు. గోదారి
గలగలలు, కృష్ణమ్మ ఉరవళ్ళు కలగలిపి, కొంచెం తేనె, కొంచెం పంచదార కలిపితే అది
తెలుగు భాష అవుతుందని ఒక కవి హృదయం. అది నిజమే కదా. 'నల్లని వాడు, పద్మ
నయనమ్ముల వాడు, కృపా రసంబు పై జల్లెడు వాడు' అని పోతన అచ్చ తెలుగులో
కృష్ణుడి వర్ణిస్తుంటే ఎంతటి అపురూపం... అసలు పోతన వల్ల తెలుగులో అన్ని
మంచి పద్యాలు వచ్చాయా, తెలుగు సొగసు వల్ల పోతన అన్ని మంచి పద్యాలు
రాయగలిగాడా అంటే... సమాధానం లేని ప్రశ్నే. 'విరులన్నియు జాలిగ నోళ్ళు
విప్పి, మా ప్రాణముల్ తీతువానని ప్రశ్నించె' అని కరుణ రసాన్ని పాపయ్య
శాస్త్రి ఒలికించినా, గోదారి అలలపై నాయుడు బావపై కన్నేసిన ఎంకి పాడిన పాటలు
నండూరి వారి కలం నుంచి జాలువారినా, 'వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాధ రథ
చక్రాలొస్తున్నాయ్' అని శ్రీశ్రీ కలం ఘర్జించినా, అన్నీ తెలుగు వారి
సంపదలుగానే మిగిలిపోయాయి. అంతటి అపురూప సంపదను జాగ్రత్తగా భావి తరాలకి
అందించే భారాన్ని మన భుజాల మీదే పెట్టుకునే అపురూప అదృష్టానికి నోచుకునే
తెలుగువారిగా పుట్టిన మనం ఎంతటి పుణ్యాత్ములమో కదా...
http://saradaa.blogspot.in/2012/03/blog-post_22.html