8, జులై 2012, ఆదివారం

మైనారిటీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు

మైనారిటీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయం. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి రంగాలలో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీసీలకు నిర్ధారించిన 27 శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 4.5 శాతం ఉప కోటా కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. 

భారత రాజ్యాంగం మతపరమైన, భాషా పరమైన మైనారిటీలకు కొన్ని రంగాలలో ప్రత్యేక రక్షణ కల్పించింది. విద్యా సంస్థల ఏర్పాటుకు మైనారిటీలకు ప్రత్యేక రక్షణ ఉంది. మన రాష్ట్రంలో కూడా మతపరమైన, భాషా పరమైన మైనారిటీ సంస్థలు అనేక ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కళాశాలలను ఏర్పాటు చేశాయి. ఈ విద్యా సంస్థలలో ఆయా మైనారిటీ వర్గాలకు 50 శాతం సీట్లు, ఇతరులకు 50 శాతం సీట్లు కేటాయించాలి. మన రాష్ట్రంలో మెజారిటీ వర్గానికి చెందిన అనేకమంది మైనారిటీ కోటాలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు పొంది వాటిని నిర్వహిస్తున్నారు. 

అయితే సాధారణ విద్యా సంస్థలలో మతపరమైన రిజర్వేషన్లకు ఆస్కారం లేదు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడా కారులు.. ఇలా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే విద్య, ఉపాధి రంగాలలో మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించలేదు. ముస్లింలు, క్రిస్తియన్లను ఓట్ బాంకులుగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా వారిని ఆకర్షించడానికి, మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

గత జనవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా ఇదే జరిగింది. ముస్లింలకు ఏకంగా 9 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. తన భార్య పోటీ చేస్తున్న నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఖుర్షీద్ చేసిన ప్రసంగాన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ కేంద్ర మంత్రిని అభిశంసించింది. ఎన్ని హామీలు ఇచ్చినా యూపీలో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే లభించాయి. స్వయంగా ఖుర్షీద్ భార్య ఓటమి పాలయ్యారు. అంటే యూపీ ప్రజలు ముస్లింల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్ని తిరస్కరించారన్న మాట. 

రాజ్యాంగ నిర్మాతలు దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించారు. అయితే అనేక శాతాభ్దాలుగా సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రం కొద్ది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.  
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_5468.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి