ఒక వ్యక్తి ఆదర్శవంతమయిన పుత్రునిగా,
సోదరునిగా, భర్తగా, రాజుగా, స్నేహితుడిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా
నడుచుకోవాలి, ఇంద్రియాలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలి వంటి విషయాలు రాముని
పాత్ర ద్వారా వివరించాడు వాల్మీకి. రామ అంటే "ఆత్మ సాక్షాత్కారం పొందిన
వ్యక్తి" అని అర్ధం. "రం" అనేది మణిపూర చక్రానికి సంబంధించిన బీజాక్షరం.
అలాగే "ర" అంటే సూర్యతత్వం, "మ" అంతే చంద్రతత్వం. ఇవే మనలోని ఇడ, పింగళ
నాడులు. రాముడంటే ఆత్మా రాముడే. దశరధునికి, కౌసల్యకి రాముడు జన్మించడమంటే
మనలోని "దశ" రధాలనే కర్మేంద్రియల, జ్ఞానేంద్రియాల మధ్య కుశలత ఉండి, ఆత్మను
చేరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందని. అన్నదమ్ములు నాలుగు
పురుషార్ధలు. వీరిని వరుసగా, ధర్మానికి, శ్రద్ధకు, భక్తికి, శక్తికి
ప్రతీకలుగా చెప్పవచ్చు. మనలోని సత్వ రజస్తమో గుణాలే దశరధుని భార్యలు. సీతను
స్వచ్చమయిన మనస్సుకు ప్రతీకగా చెప్పవచ్చు. ఆమెకు బంగారు లేడి కావాలనే
కోరిక కలగనంత వరకు రాముని చెంతనే ఉంది. లేడి కావాలనే కోరిక కలిగినప్పటి
నుండి రామునికి దూరమై అనేక బాధలు పడింది. మనస్సులో కోరికలు, వ్యామోహం,
రాగద్వేషాలు ఉన్నంతవరకు ఈ బాధలు ఉంటాయి. అలాగే మనిషి అన్ కాన్షస్‌గా
ఉండేటప్పుడు తప్పొప్పుల విచక్షణ పోతుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు
చెడు వైపునకు వెళ్ళిపోతాయి. రావణుడు తెలివిగలవాడే కాని ఆ తెలివి
అహంకారాన్ని పెంచి చెడువైపునకు తీసుకెళ్ళింది. అందుకే పదితలల వ్యక్తిగా
చూపిస్తారు.
హృదయాన్ని తెరిచి రాముణ్ణి చూపడమంటే మనిషి శిరస్సుతో
గాక హృదయంతో వుండాలని అర్ధం. అప్పుడే వానరుడు హనుమ కాగలడు. రావణుడు
అరిషడ్వర్గాలకు ప్రతీక అయితే, హనుమ హృదయానికి ప్రతీక. లంక అంటే మన శరీరం .
దానికున్న తొమ్మిది ద్వారాలే నవరంధ్రాలు. ఈ లంక చుట్టూ వున్న సముద్రమే మాయ.
ఈ మాయను దాటి అసుర గుణాలయిన రాగద్వేషాలను హరించివేయాలి.
సీత
జనకునికి పుడమిలోనే దొరికి, పుడమిలోకే వెళ్ళిపోతుంది. ధ్యానంలో సమాధి
స్థితిలో మైండ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికే వెళ్ళిపోతుంది. అయోధ్య అంటే
ఏ ఘర్షణ వుండదు. ఏ కోరికలు, రాగద్వేషాలు లేక ప్రశాంతత నెలకొని ఉంటుంది.
మనం మైండ్‌ను శుద్ధి చేసుకోక, మంచి హృదయంతో లేనంతవరకు ఆత్మారాముణ్ణి
చేరుకోలేం.
http://saradaa.blogspot.in/2010/03/blog-post_31.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి