26, జులై 2012, గురువారం

అస్సాంలో కాంగ్రెస్ మత రాజకీయాలు!

- నిర్మలా సీతారామన్

అస్సాం సామాజిక, రాజకీయ సంరచన ఎంతో సంక్లిష్టంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. స్వతంత్ర జిల్లా మండళ్ళ ఆలోచనకు చురుకైన మద్దతిచ్చిన అంబేద్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో పర్వతప్రాంత గిరిజనుల హక్కుల గురించి వివరించారు. 2001 జనాభాలెక్కల ప్రకారం అస్సాంలోని మొత్తం 20.33 మిలియన్ జనాభాలో, గిరిజనులు 15.64శాతం వరకు ఉన్నారు. ఈ గిరిజనుల్లో ముఖ్యమైన తెగలు బోడో, మిసింగ్, రభా, సోన్వాల్, లాలంగ్ (తివ), డియోరి మరియు ధెంగాల్ (మెక్).
 

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలును అనుసరించి అస్సాంలో మొత్తం మూడు స్వతంత్ర పాలక మండళ్ళు ఏర్పాటు చేశారు. మరికొన్ని ఏర్పాటుకోసం ఎదురుచూస్తున్నాయి. చాలా గ్రూపులవారు ఇదే షెడ్యూలు కింత తమకు కూడా స్వతంత్ర పాలక మండళ్ళను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆస్సాంలో ఈ మండళ్ళు చాలా పరిమితంగానే విజయం సాధించాయని చెప్పాలి. 2009లో ఒక మంత్రివర్యుని నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం, మండళ్ళ వల్ల ప్రయోజనాలపై తెలుసుకోవడానికి త్రిపుర వెళ్ళింది.
 

తమ భూమి ‘అపహరణ’కు గురయిందంటూ లాలంగ్ (తివ) జాతి గిరిజనులు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వినతిపత్రం అందజేసారు. 1983లో ‘తివ’తెగవారు, విదేశీయులకంటే చాలా ఎక్కువసంఖ్యలో ఉండేవారు. అప్పట్లో విదేశీయుల సంఖ్య కేవలం మూడువేలు మాత్రమే. అయితే మండలిలో తమను రక్షించేవారు ఎవరూ లేకపోవడంతో వీరు తమ భూములను స్వల్పకాలిక ప్రయోజనాలకోసం అమ్ముకున్నారు. దీనికంటే చాలా సంవత్సరాలక్రితం, అంటే 1937 నవంబర్ నెలలో జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ నాయకుడిగా, ప్రాంతీయ ఎన్నికల ప్రచారం కోసం అస్సాంను సందర్శించారు. అప్పుడుఅస్సామీయ సంరక్షణి సభ నెహ్రూకు ఒక వినతిపత్రం సమర్పిస్తూ, ‘క్షేత్ర వ్యవస్థను తొలగించవద్దు’ అని కోరింది. ముఖ్యంగా వలసలను నిరోధించే ఉద్దేశంతోనే వారు ఈ విధంగా కోరారనేది నిర్వివాదాంశం. మరి దీనికి ప్రతిస్పందనగా నెహ్రూ.. అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాస్తూ, ‘అస్సాం మరింత అభివృద్ధి చెందాలన్నా, సౌభాగ్యవంతం కావాలన్నా వలసలు అత్యవసరమ’ని పేర్కొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే వలసల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించింది. పైకి మాత్రం వలసలు వద్దంటూనే ఆంతరంగికంగా వాటివల్ల ప్రయోజనమున్నదని భావించింది. బంగ్లాదేశ్‌నుంచి అక్రమవలసలు విపరీతంగా కొనసాగుతున్నాయని, వీటివల్ల భవిష్యత్తులో అనవసర సమస్యలు ఉత్పన్నమవుతాయని తాను హెచ్చరించినట్టు 2008లో కెపిఎస్ గిల్ గుర్తు చేసుకున్నారు. ఈ వలసల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన మొట్టమొదటి ఎస్‌పి ఆయనే కావడం విశేషం. 1964 ప్రాంతంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్‌లు అక్రమంగా వలసలు వచ్చిన బంగ్లాదేశీయులను, మన దేశంనుంచి పంపించివేసాయని కూడా ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ స్వార్ధపూరితంగా తన ఓటుబ్యాంకును కోల్పోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
 

1980లో అస్సాంలో ఆందోళన ప్రారంభమైన తొలినాళ్ళలో కాంగ్రెస్ మరోకోణంలో దాన్ని చూసింది. అక్రమంగా ఓటర్ల లిస్టులో చొప్పించిన పేర్లన్నింటిని తొలగించాలని..ఆ విధంగా చేసిన తర్వాతనే 1983 ఎన్నికలు జరపాలనేది అప్పటి ఆందోళన ప్రధాన లక్ష్యం. కానీ కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు! అందువల్ల తర్వాతి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నవారిని, క్రమంగా క్రమబద్ధీకరించడానికే యత్నించింది. అస్సాంలో ఒకపక్క ఆందోళన కొనసాగుతున్నా, ఓటర్ల జాబితాలో మాత్రం అక్రమంగా కొత్త పేర్లు చొప్పించడం కొనసాగుతూనే ఉంది. అప్పట్లో మంగల్‌డోయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 45వేలమంది అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నట్టు తేలింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి లాలంగ్ (తివాస్)లు తమ భూములు అక్రమంగా ఆక్రమణకు గురికాకుండా రక్షించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో జరిగిన 1983 ఎన్నికల్లో జరిగిన హింసాకాండ చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని ముద్ర వేసింది. ముఖ్యంగా నెల్లి సామూహిక హత్యాంకాండ దీనికి పరాకాష్ఠ! మానవత్వం నశించిపోయిన క్రూర భయానక మారణకాండ అది! (వేద్ ప్రకాశ్ రచించిన ‘్భరత ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం: విస్తృతమవుతున్న తుపాను. వాల్యూమ్-1). ఈ ఎన్నికలు జరిగిన ఇరవైఐదు సంవత్సరాల తర్వాత కెపిఎస్ గిల్ మాట్లాడుతూ ‘1983 ఎన్నికలు చాలా తప్పిదం’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. నెల్లి జనాభాను పరిశీలిస్తే లాలంగ్(తివా)ల సంఖ్య చాలావరకు పడిపోవడాన్ని గమనించవచ్చు. కానీ ఏమైనా న్యాయం జరిగిందా? 1983 ఫిబ్రవరి 18, అధికారికంగా 2191మంది హత్యాకాండకు బలయిట్టు తేలింది. అనధికారికంగా ఐదువైలకు పైమాటే. హతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్న పిల్లలు. వీరంతా బంగ్లాదేశ్‌కు చెందినవారు. ఈ మారణకాండలో మొత్తం పదహారు గ్రామాలు విధ్వంసానికి గురయ్యాయి. 370 మంది పిల్లలు అనాధలయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన మారణకాండ దాదాపు ఆరుగంటలపాటు అప్రతిహతంగా కొనసాగింది. ఇంత జరుగుతున్నా మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక్క పోలీసు కూడా సంఘటనా స్థలానికి చేరుకోలేదు. ఇటువంటి దాడి జరుగుతుందన్న విషయంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ముందే హెచ్చరికలు అందాయి. ఈ దారుణ కాండపై పోలీసులు ఆరువందల ఎనబై ఎనిమిది కేసులను నమోదు చేసారు. అయితే ఎజిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులన్నింటిని ఎత్తి వేసింది. దీనిపై కాంగ్రెస్ ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు. 1983 జూలై నెలలో త్రిభువన్ ప్రసాద్ తివారీ నేతృత్వంలో ఒక కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటి 1984 జనవరిలో ఆరువందల పేజీల నివేదికను సమర్పించింది.
 

నాటి అస్సాం ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా ఈ నివేదికను అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇవ్వాల్టి వరకు ఆ నివేదికలోని అంశాలు వెల్లడికాకుండా రహస్యంగా దాచేసారు. మైనారిటీల పట్ల కాంగ్రెస్‌కున్న అభిమానం కారణంగా, వారి సానుభూతి కోల్పోవలసి వస్తుందన్న భయంతోనే ఈ నివేదిక వివరాలను బయటపెట్టలేదు. నెల్లి మారణకాండలో బతికి బట్టకట్టినవారికి ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు, మూడు బండిళ్ళ టిన్ రేకులను (ఇళ్ళపై కప్పుగా ఉపయోగించేందుకు) ప్రభుత్వం నష్టపరిహారంగా అందించింది. అప్పట్లో ఒక మ్యాగజైన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, నెల్లి మారణకాండలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి మాట్లాడుతూ, ‘ప్రధాని ఇందిరాగాంధీ వచ్చినప్పుడు, తాము ఇక్కడికి తిరిగిరావాలనుకోవడం లేదని చెప్పాం. అయితే ఆమె దీపం దగ్గరినుంచి అన్నీ అందిస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు వాటికోసం ఎదురుచూస్తూనే ఉన్నాం,’ అని చెప్పాడు. మరి 1984లో న్యూఢిల్లీ మరియు సమీప ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో బాధితులు ఒక్కొక్కరు రూ.7 లక్షల వంతున నష్టపరిహారాన్ని అందుకున్నారు.
 

నెల్లి సంఘటన జరిగిన పదేళ్ళ తర్వాత, 1993లో బోడో ఒప్పందం కుదిరింది. జరుగుతున్న అల్లర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. 2008లో హర్షమందిర్ మాట్లాడుతూ, ‘జాతుల ఏరివేతకు ప్రభుత్వం తనకు తానే పునాదిరాయిని వేసింది.’ బెంగాలీ ముస్లింలపై నిరంతర హత్యాకాండ కొనసాగింది. 1993లో వారి ఇళ్ళకు నిప్పు పెట్టారు. మరి ఇదే పరిస్థితి సంథాల్ మరియు ముండా గిరిజనులకు కూడా అనుభవంలోకి వచ్చింది. గత పదిహేనేళ్ళుగా వేలాది మంది గిరిజనులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. తిరికి ఇళ్లకు వెళ్ళాలంటే వారు తీవ్రంగా భయపడుతున్నారు. జాతుల మధ్య పరస్పర విద్వేషాలతో అస్సాం నేడు ఒక అగ్నిగుండంగా మారింది. బీహార్‌నుంచి ఇక్కడకు వచ్చిన కూలీలు, జార్ఖండ్ నుంచి వచ్చిన ఆందోళనకారులపై దాడులు జరుగుతున్నాయి. బోడోలు, బంగ్లాదేశ్ ముస్లింల మధ్య జరుగుతున్న ఘర్షణలవల్ల చాలామంది మరణించడం, పెద్దసంఖ్యలో సహాయక శిబిరాల్లో తలదాచుకోవడం జరుగుతోంది. జపాన్‌కు చెందిన మేధావి మకికొ కిమురను, నెల్లి మారణకాండపై మాట్లాడకుండా అస్సాం ప్రభుత్వం 2004లో ఆంక్షలు విధించింది.
 

ఇక తాజాగా అస్సాంలో కాంగ్రెస్ జరుపుతున్న మతరాజకీయాలను పరిశీలిస్తే.. ఎమ్మెల్యే డాక్టర్ రుమినాథ్ కథను చెప్పుకోవాలి. ఆమె తన ముస్లిం స్నేహితుడిని వివాహం చేసుకుంది. ఆమె పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే కాజీలను, నిక్కాకు ఏర్పాట్లు చేసారు. ఇక ఆమె పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే బహిరంగంగా ఈ వివాదాస్పద వివాహంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసాడు. డాక్టర్ రుమినాథ్‌ను, ఆమె సరికొత్త మొగుడిని తీవ్రంగా కొట్టడంతో మతపరంగా చాలా సున్నితమైన బారక్ లోయ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ రూమినాథ్ ఆమె రెండో భర్త, తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి, తమపై దాడికి పాల్పడ్డారన్న అనుమానంతో అతిథులపై దాడికి దిగారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు, పోలీసు కేసు పెట్టారు. ప్రస్తుతం ఆస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు సున్నితమైన మత సమస్యపై రాజకీయ చదరంగాన్ని నడుపుతున్నారు. కానీ ఈ ప్రయోగాలన్నీ ఎట్టకేలకు బెడిసికొట్టక తప్పదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి