27, నవంబర్ 2012, మంగళవారం

స్టేట్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టిన లెనిన్ - 1




20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. మార్క్సిజం పేరిట మనుషుల్ని మలచాలనే ప్రయత్నంలో ఆయన చేసిన కృషి నేడు చారిత్రక ఆధారాలతో అందుబాటులో వున్నది. శ్రీశ్రీ మహాహంతకుల జాబితాలో ఎందుకోగాని లెనిన్ పేరులేదు. స్టాలిన్ పేరు కావాలని చేర్చలేదు సిద్ధాంతాల పేరిట మనుషుల్ని హతమార్చడం ఏ దేశంలో జరిగినా, ఎవరు చేసినా ఒకటే. ఒక సిద్ధాంతం పేరిట చంపితే ఆదిమానవ కళ్యాణానికి దారితీస్తుందనీ, మరో ఇజం పేరిట హతమారిస్తే దారుణమనీ భాష్యం చెప్పడం దురుద్దేశ్యంతోనే. నిష్పాక్షికంగా చూస్తే నరహంతకుల జాబితాలో ఈ శతాబ్దంలో ప్రథమస్థానం, అగ్రతాంబూలం లెనిన్ కు ఇవ్వాల్సిందే. లెనిన్ అసలు పేరు బ్లాడిమిర్ ఇల్లిక్ ఉలియనోవ్ కాగా అమ్మ నాన్న పెట్టినపేరు మార్చుకొని కొత్త పేరుతో చలామణిగావడం ఒకసంప్రదాయం. అలాగే రహస్య పార్టీలో పనిచేసే వారు కూడా పేరు మార్చుకుంటుంటారు. 1870లో ఓల్గా నదీతీరాన గల సింబ్రిస్క్ లో లెనిన్ పుట్టాడు. తండ్రి ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అధికారి. లెనిన్ అన్నను జార్ ప్రభుత్వం ఉరితీసింది. ఒక నాటుబాంబుతో జారు చక్రవర్తిని చంపాలనే ప్రయత్నం చేయడంతో యీ శిక్షపడింది. అదిచూచి లెనిన్ మనస్సు రాయిచేసుకున్నాడు. 16 ఏళ్ళ వయస్సులో ఆరంభమైన యీ దృష్టి లెనిన్ లో రానురాను గట్టిపడింది. విప్లవ చర్యలకు ఉపక్రమించాడు. మాస్కో గ్రంథాలయంలో చాలా విషయ సేకరణ చేశాడు. ఒక సూట్ కేసు అడుగున మరో రహస్య అర ఏర్పరచి, నిషిద్ద గ్రంథాలు చేరవేస్తుండగా పట్టుబడి, సైబీరియా ప్రవాస జీవితార్ధం పంపబడిన లెనిన్ అక్కడే విప్లవ కారిణి క్రుపస్కయాను పెళ్ళాడాడు.


తన 31వ ఏట లెనిన్ మారుపేరు ధరించాడు (1901లో). తల్లిదండ్రులిరువురూ క్రైస్తవులు, కాని, లెనిన్ విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నాడు. లాటిన్ చదవడం, సంగీతం వినడం, చదరంగం ఆడడం, స్కేటింగ్ లెనిన్ అభిరుచులు, మతాన్ని తీవ్రంగా ద్వేషించాడు స్నేహాలు పెంచుకోలేదు. ఏకాగ్రతతో నిర్విరామంగా రాజకీయ విప్లవచర్యకై 24 గంటలూ పాటుబడిన వ్యక్తి లెనిన్. కొద్దిరోజులపాటు లాయర్ గా పనిచేసి వదిలేశాడు. పొలంపనులకు పొమ్మని తల్లి పురమాయిస్తే నిరాకరించాడు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు.


ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందాడు. లెనిన్ ను సన్నిహితంగా పార్టీలో చూచినవారు ఆయన నియంతృత్వ పోకడలపై దాడిచేశారు. ప్లెఖనోవ్, వేరా జెసూలిక్, ట్రాటస్కీ, మదాం క్రిజిజెనోవిస్కియా, చార్లస్ రాపాఫోర్ట్, వై ఛస్లావ్ మెంజిస్కీ మొదలైన వారంతా లెనిన్ను తెగిడారు. కాని ఇలాంటి తిట్లను, శాపనార్ధాలను, విమర్శలను లెనిన్ ఏనాడూ ఖాతరు చేయలేదు. ఎనుబోతుపై వర్షం పడ్డట్లే విమర్శల దారి విమర్శలదే, లెనిన్ గొడవ లెనిన్ దే. అదే ఆయన ఏకాగ్రత విశిష్టత.


1905లో రష్యా విప్లవం విఫలమైనప్పుడు లెనిన్ విస్తుబోయాడు. అయినా నిరాశ చెందలేదు. 1914లో మొదటి ప్రపంచయుద్దం లెనిన్ కు దిగ్ర్భాంతిని కలిగించింది. జార్ చక్రవర్తి పతనం చూచి లెనిన్ ఆశ్చర్యపోయాడు. అంతర్జాతీయంగా సోషలిస్టు ఉద్యమం విఫలం గావడం లెనిన్ కు అత్యంత నిరాశ కలిగించింది. చివరకు 1917లో బ్రతికుండగా విప్లవ విజయాన్ని చూస్తానా అని లెనిన్ నిరాశతో వాపోయాడు.


రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్దం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో వున్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు.


1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు.


జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.
1917జూన్ లో అఖిల రష్యా సోవియట్ కాంగ్రేస్ సమావేశాలు జరిగాయి. అందులో బోల్షివిక్ సంఖ్య 105 మాత్రమే. మొత్తం ప్రతినిధులు 822, యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శన కారణంగా లెనిన్ ఫిన్లండ్ పారిపోవలసి వచ్చింది. 1917 సెప్టెంబరు నాటికి మాస్కో, పెట్రోగ్రాడ్ సోవియట్లలో అధిక సంఖ్యాకులు బోల్షివిక్ లు. ఈ సోవియట్లకు అధికారం హస్తగతం కావాలనేదే లెనిన్ నినాదం. అక్టోబరులో రహస్యంగా లెనిన్ పెట్రోగ్రాడ్ చేరి, మొట్ట మొదటిసారిగా పోలిట్ బ్యూరో స్థాపించాడు. అక్టోబరు 25న సోవియట్ల సమావేశం జరిగింది. మరునాడు పెట్రోగ్రాడ్ లో కీలక స్థావరాలన్నీ బోల్షివిక్కులు ఆక్రమించారు. తరువాత రాజ్యాంగసభ నిమిత్తం ఎన్నికలు జరిగాయి. మొత్తం 707 స్థానాలలో బోల్షివిక్కులకు 175 వచ్చాయి. ఆ విధంగా బోల్షివిక్కులు ఏనాడూ అధిక సంఖ్యలో లేరు.


అధికారాన్ని హస్తగతం చేసుకున్న రెండు రోజులకే, లెనిన్ పత్రికా స్వేచ్ఛను అరికట్టాడు. లెనిన్ అధికారాన్ని పట్టుకున్న తరువాత ఒక రహస్య సైనిక సంస్ధను స్థాపించాడు. ఆల్ రష్యన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ కమిషన్ ను పొడిగా చేకా అంటారు. ఈ రహస్య సంస్థ లెనిన్ వున్నంతకాలం బయటవారికి తెలియలేదు. 1917 డిసెంబరులో మొదలు బెట్టి యీ చేకా సంస్థ చిలవలు పలవలుగా, నాగు జెముడువలె పెరిగి ప్రాకిపోయింది. స్థానిక సోవియట్లు సమాచారం అందిస్తుండగా, మూడేళ్ళలో చేకా రహస్యసంస్థ 2,50,000 మందిని చేర్చుకున్నది నెలకు సగటున వెయ్యిమందిని రష్యాలో లెనిన్ నాయకత్వాన, విప్లవ వ్యతిరేకుల పేరిట ఉరితీసినఖ్యాతి యీ రహస్య సంస్థకు దక్కింది.
చేకా అనే రహస్య సంస్థ విచారణకూడా రహస్యంగానే జరిపేది. చేకా సంస్థతో బాటు రష్యా అంతటా రహస్య నిర్బంధ శిబిరాలు, జైళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోగ్రాడ్ నుండి మాస్కోకు రాజధానిని మార్చిన లెనిన్ తక్షణమే క్రెమ్లిస్ లో ఒక రహస్య కేంద్రాన్ని, దీనికి తెలియకుండా జర్జినిస్కే నాయకత్వాన మరో రహస్య స్థావరాన్ని ఏర్పరచాడు. ఇదే చేకా అంటే. ఈ సంస్థ లెనిన్ కు మాత్రమే జవాబుదారి. దీని ఉనికి ఎవరికీ తెలియదు. తొలుత ఒక జీవితభీమా భవనంలో చేకా స్థావరాన్ని ఏర్పరచారు. ఊరికే తిరిగేవారిని వున్న పళంగా చంపేయమని లెనిన్ చేకాకు ఉత్తరువులిచ్చాడు. అనేక విధాలైన శత్రువులను సంహరించమని 1918 ఫిబ్రవరి 23న లెనిన్ మరో ఉత్తరువు చేకాకు యిచ్చాడు.  లెనిన్ -ఇంకా ఉంది. 


 http://naprapamcham.blogspot.in/2007/05/blog-post_13.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి